
12 న్యూ ఇయర్ విషెస్
ఇంటర్వ్యూ
ఆల్చిప్పల్లాంటి కళ్లు, శిల్పం లాంటి శరీరాకృతి ఉన్న ఏ అమ్మాయినైనా ‘బాపు బొమ్మ’ అంటారు. ప్రణీత అలా ఉంటుంది కాబట్టే ‘అత్తారింటికి దారేది’లో ‘అమ్మో బాపుగారి బొమ్మో...’ అంటూ ఆమెను ఉద్దేశించి పాట రాసి ఉంటారు. బాపు కుంచె నుంచి జాలువారకపోయినా బాపూ బొమ్మ అనిపించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో బ్రహ్మోత్సవం, చుట్టాలబ్బాయ్ చిత్రాలతో పాటు కన్నడంలోనూ ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో ప్లాన్స్ ఏంటని అడిగితే...
కొత్త సంవత్సరాన్ని నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలంటే అందరూ ఇవి పాటించాలంటూ 12 సూత్రాలు చెప్పింది. అవే తను ఇచ్చే న్యూ ఇయర్ విషెస్ అంది. అవే ఇవి...
1. దేశంలో ఉన్న అందరికీ మనం సహాయం చేయాలన్నా చేయలేం. కానీ, మన కంటి ఎదురుగా ఉన్నవాళ్లకి చేయగలం కదా! అలా అయినా కొందరికి ఓ దారి చూపించాలి.
2. విద్యాదానం ఎంతో గొప్పదంటారు. అందుకే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి చదువుకోలేనివారిని చదివించాలి.
3. ఎటువంటి పరిస్థితుల్లోనూ రూల్స్‌ని వయొలేట్ చేయకూడదు. ఉదాహరణకు.. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం. ఇలాంటివన్నీ జాగ్రత్తగా పాటించాలి.
4. మన ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలనుకుంటాం. కానీ రోడ్డు మీద అడ్డమైన చెత్తనూ పడేస్తాం. అలా చేయకూడదు. చెత్త పడేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్‌ని ఉపయోగించుకోవాలి.
5. రోడ్లు మీద వెళుతున్నప్పుడు ఎవరైనా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయినా, యాక్సిడెంట్‌కి గురైనా ఆంబులెన్స్‌కి కాల్ చేయాలి. మనకెందుకులే అని మన దారిన మనం వెళ్లిపోతే... రేపు మనకే ఆ పరిస్థితి రావచ్చేమో ఎవరు చెప్పగలరు!
6. నలుగురూ ఇబ్బందిపడే పనులు అస్సలు చేయకూడదు. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చకూడదని తెలిసినా కాల్చేస్తారు. అలాగే కొందరు మద్యం తాగి రచ్చ చేస్తుంటారు. అలాంటివి చేయకూడదు.
7. హోటల్స్‌లో సర్వర్స్‌ని కొంతమంది చాలా చీప్‌గా చూస్తారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. మనలాగే వాళ్లూ మనుషులే అన్న విషయం గుర్తించాలి.
8. పరాయి సొత్తు కొల్లగొట్టాలనుకోవడం చాలా తప్పు. ఎప్పుడైనా కానీ, కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నిజమైన ఆనందాన్నిస్తుంది.
9. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యసాధన కోసం పాటు పడటంలో ఓ మజా ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది.
10. ఆత్మస్థయిర్యం కోల్పోకూడదు. చెడు జరిగినప్పుడు ముందున్నవి మంచి రోజులే అనుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి.
11. అసూయ, అసహనం, ఆగ్రహం వంటివన్నీ జీవితానికి శత్రువుల్లాంటివి. వాటిని దగ్గరకు రానివ్వకూడదు.
12. జీవితం చాలా చిన్నది. అందుకే ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా బతకాలి.
ఎప్పుడూ బెంగళూరులో మా ఇంట్లోనే జరుపుకోవడం అలవాటు. విదేశాల్లో షూటింగ్స్ ఉంటే తప్పదనుకోండి. షూటింగ్ లేకపోతే మాత్రం మంచి ఫుడ్ తింటూ, మ్యూజిక్ వింటూ ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలెబ్రేట్ చేసుకుంటా. ఆ రోజు బయటకు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఒకవేళ వెళ్లినా మా కుటుంబ సభ్యులతోనే వెళ్తాను. వాళ్లతోనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను. అయినవాళ్లతో గడపడంలో ఉండే ఆనందమే వేరు!