రిసరెక్షన్ | Resurrection | Sakshi
Sakshi News home page

రిసరెక్షన్

Published Sat, Apr 23 2016 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

రిసరెక్షన్

రిసరెక్షన్

కథ
రాత్రి పదకొండవుతోంది. భారతి లైబ్రరీలో కూర్చుని చదువుకుంటోంది. అడుగుల శబ్దం వినిపించి తల పెకైత్తి చూసింది. దాదాపు పాతికేళ్ల వయసుంటుంది అతనికి. డెనిమ్ జీన్స్ మీద రౌండ్ నెక్ బ్లూ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతనికి లైబ్రరీ అంతా పరిచయమున్నట్టుగా ఉంది. తనకేం కావాలో బాగా తెలిసినట్టుగా తటపటాయింపు లేకుండా సైన్స్ సెక్షన్‌లోకి వెళ్లిపోయాడు. అతను ఏదో పాట పాడుతూ సైన్స్ సెక్షన్‌లోని ర్యాక్స్‌లో ఉన్న ఒక్కొక్క పుస్తకాన్ని చూస్తూ ముందుకి వెళ్తున్నాడు. ర్యాక్ చివర్లో ఉన్న సెలైన్స్ ప్లీజ్ అన్న బోర్డ్ చూశాడు. పాట ఆపి, ష్... అనుకుని, తనలో తానే నవ్వుకుంటూ మరొక ర్యాక్ దగ్గరికి వెళ్లిపోయాడు.
 
అతను వెళ్లిపోయేంతవరకూ అతన్నే ఆశ్చర్యంగా చూసిన భారతి తను చదువుతున్న పుస్తకం మూసి కవర్‌పేజీ చూసింది. పోస్ట్‌మార్టం. భారతి చదువుతున్న బుక్ టైటిల్ అది. తెలుగులో ఇక ఎవరి పుస్తకాలు వాళ్లే ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి, రచయిత సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్న పుస్తకం. చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలను మర్చిపోతే అప్పటి తప్పులే పునరావృత్తం అవుతూ ఉంటాయి. అందుకే మరణించిన నా మిత్రుడి జ్ఞాపకంగా ఈ పుస్తకం రాస్తున్నానని పరిచయ వాక్యాల్లో చెప్పుకొచ్చాడు రచయిత.
 
భారతికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని, పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని, పిల్లల్ని కని - ఇలా పద్ధతి ప్రకారం జీవితం సాగిపోవాలని ఆమె కోరిక. అయితే తన సబ్జెక్ట్‌కి సంబంధం లేని పుస్తకాలు చదవడమంటే భారతికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా ఆమె ఆసక్తిగా పుస్తకం తెరిచి ఆపిన చోటు నుంచి చదవడం మొదలుపెట్టింది.
 
ఈ పోస్ట్‌మార్టం పుస్తకాన్ని ఈ మధ్య అందరూ చదువుతున్నారు. ఫేస్‌బుక్‌లో చాలామంది ఈ పుస్తకం గురించి రివ్యూలు రాస్తున్నారు. ఆ రివ్యూల్లో చాలామంది - పోస్ట్‌మార్టం పుస్తకం చదివాక నిద్రపట్టలేదనీ, తమని బాగా డిస్టర్బ్ చేసిందనీ, చదువుతున్నంతసేపూ కన్నీళ్లు పెట్టుకున్నామని రాశారు.
 
పోస్ట్‌మార్టం పుస్తకం ఒక ఫ్రెండ్ ద్వారా భారతికి చేరింది. నువ్వు బోర్ కొట్టి బుక్స్ చదువుతావు. నాకు బుక్ చదవడమే బోర్. అది కూడా బయోగ్రఫీలు నావల్ల కాదు అని తన ఫ్రెండ్‌కి చెప్పి తప్పించుకుందామని చూసింది భారతి. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ బుక్ చదవకపోతే నీ లైఫ్ వేస్ట్ అన్నాడు. ‘ఇది మన స్టూడెంట్స్ తప్పక చదవాల్సిన పుస్తకం. నీ కోసం బుక్ ఎగ్జిబిషన్ నుంచి ఒక కాపీ తెచ్చాను. చదవాల్సిందే’ అనడంతో ఇష్టం లేకున్నా ఆ పుస్తకాన్ని తీసుకుంది. కానీ చాలా రోజుల వరకూ ఆ పుస్తకాన్ని తెరవనైనా లేదు భారతి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి లైబ్రరీకి వచ్చి చదువుకుందామనుకుంది. వస్తూ వస్తూ తెచ్చుకున్న క్లాస్ పుస్తకాలతో పోస్ట్‌మార్టం కూడా కలిసిపోయింది.
 
సాయంత్రం నుంచీ సబ్జెక్ట్ పుస్తకాలు చదివి బోర్ కొడుతుంటే సరేలే అని పోస్ట్‌మార్టం తెరిచింది. పదిహేను పేజీలకు పైగానే చదివింది. ఏదో బోరింగ్ డాక్యుమెంటరీ సినిమా చూసినట్టుగా ఉంది భారతికి. అబ్బా, ఇంక చదివింది చాల్లే అని మూసేద్దామనుకుంది. కానీ అదే సమయానికి లైబ్రరీలోకి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే భారతి ఆశ్చర్యపోయింది.
 
ఆ వచ్చిన అతను, పోస్ట్‌మార్టం పుస్తకంలో నుంచి నడిచొచ్చినట్టుగా ఉన్నాడు. అంతే వయసు. అదే హైట్. అదే వెయిట్. డ్రెస్ చేసుకునే తీరు, నడిచే విధానం, పెరిగిన గెడ్డం. సేమ్ టు సేమ్ ఆ పుస్తకంలోని క్యారెక్టర్‌లానే ఉన్నాడు అతను.
 
పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ఫ్యాన్స్ ఆ హీరో స్టైల్‌ని కాపీ కొట్టి అభిమానం చాటుకోవడం సహజం. కానీ మరణించిన ఒక సామాన్యుడికి కూడా అభిమానులుంటారా? అనుకుంది భారతి. చదివిన కొన్ని పేజీల్లో అతని గురించి భారతికి తెలిసిందేమిటంటే అతను అందరిలాంటివాడే. కానీ కళ్లల్లో వెలుగుల్ని నింపుకుని కొత్త ఆశలవైపు ప్రయాణించినవాడు. అతను కవి, రచయిత. రీసెర్చ్ స్కాలర్. యువకుడు, పోరాట పటిమ ఉన్నవాడు. చనిపోయినప్పుడు అతను సామాన్యుడే. కానీ అతని మరణం అతన్ని ప్రపంచానికి అసామాన్యుడిగా పరిచయం చేసింది. కాబట్టి అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంలో ఆశ్చర్యమేముందిలే అనుకుంది భారతి.
 
ఆ రోజు తర్వాత చాలాసార్లు అతన్ని చూసింది భారతి. ప్రతిరోజూ తన సబ్జెక్ట్ పుస్తకాలు చదివి అలసిపోయాక అలవాటుగా పోస్ట్‌మార్టం బుక్ చదువుతుండగా అతను వస్తాడు. అదే పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్‌కి వెళతాడు.
 లైబ్రరీలో అతన్ని చూడడం - తన రొటీన్ జీవితంలో ఒక చిన్నపాటి ఆనందం భారతికి. ఏ రోజైనా లైబ్రరీకి వెళ్లడం వీలుకాకపోతే భారతికి ఇబ్బందిగా ఉండేది.

అటు తన సబ్జెక్ట్ పుస్తకాలకు అన్యాయం చెయ్యకుండా, కొత్తగా ఆసక్తి పెంచుకున్న పోస్ట్‌మార్టంకీ అన్యాయం చేయకుండా రోజుకి పది పేజీలు చదువుతూ అతని గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంది. చాలా కష్ట నష్టాలతో కూడిన అతని బాల్యం. తల్లిదండ్రుల మధ్య వైరం, సొంత ఇంటిలోనూ పరాయి వాడిగా పెరగాల్సి రావడం, పేదరికం.
 
అతని జీవితంలో ఉన్నన్ని కష్టాలు లేకున్నా పేదరికం విషయంలో భారతికి తన జీవితంతో పోలికలు కనిపించాయి. అందుకే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నప్పటికీ, రోజూ పోస్ట్‌మార్టంలోని కొన్ని పేజీలైనా చదివితే గానీ నిద్రపట్టేది కాదు భారతికి.
   
 ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే భారతి లైబ్రరీలో ఉండగా అతను వచ్చాడు. తన స్టైల్‌లో పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్ వైపు వెళ్తుంటే, భారతి లేచి అతని దగ్గరకు వెళ్లింది. హలో అని పలకరించింది. అతను గోడ మీదున్న సెలైన్స్ ప్లీజ్ బోర్డ్ వైపు చూపించి, ష్ అని ముందుకు వెళ్లిపోయాడు.
 ఆ రోజు అతనితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది భారతి. అతని వెంటే నడిచింది. అతను మరొక ర్యాక్‌లో ఏదో పుస్తకం కోసం వెడుతున్నాడు. అతని పక్కనే నిలబడి చూస్తున్నప్పటికీ, భారతిని అతను పట్టించుకోలేదు. భారతి అతని భుజం మీద చెయ్యేసి, తన చేతిలో ఉన్న పుస్తకం చూపించి, ‘ఈ పుస్తకం కోసమేనా వెతుకుతున్నావ్’ అంది. భారతి చేతిలో ఉన్న కార్ల్ సాగన్ పుస్తకం చూడగానే అతను లాక్కున్నంత పనిచేశాడు.
 
‘ఇది నాకిస్తావా? అని అడిగాడు. అది నీదే!’ అంది భారతి, అతను దగ్గరకొచ్చి నీకెలా తెలుసు అన్నాడు.
 ‘నేను కూడా పోస్ట్‌మార్టం చదువుతున్నాలే’ అంది భారతి. ‘పోస్ట్‌మార్టమా? అదేంటి?’ అని కార్ల్ సాగన్ పుస్తకం తెరిచాడు. ఎప్పటినుంచో వెంటాడుతున్న ప్రశ్నలకు అందులోనైనా సమాధానాలు దొరుకుతాయేమో అని ఆత్రంగా పేజీలు తిరగేశాడు అతను.
 ‘నీకు నిజంగానే పోస్ట్‌మార్టం బుక్ తెలియదా?’ అడిగింది భారతి. తల పెకైత్తకుండానే తెలియదన్నట్టుగా తలూపాడు. ‘ఒక్క నిమిషం ఆగు’ అని భారతి తను కూర్చున్న టేబుల్ వైపు నడిచింది.
 
పోస్ట్‌మార్టం బుక్ పట్టుకుని భారతి అక్కడికొచ్చేసరికి అతను లేడు. అతనలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాక అతని మీద మరింత ఆసక్తి కలిగింది భారతికి. ఆ రోజు ఎప్పటిలా పది పేజీలు కాకుండా, పుస్తకంలో ఇంకొన్ని పేజీలు చదివింది. పేజీ నంబర్ 114లో అతను ఎన్నో రోజులుగా వెతుకుతున్న ఒక పుస్తకం అతనికి ఎలా దొరికిందో - రచయిత చాలా వివరంగా రాసిన విషయం చదివి - భారతికి ఆ పుస్తకం మీద మరింత ఆసక్తి కలిగింది. కొంచెం వింతగా కూడా అనిపించింది. చదువుతున్నకొద్దీ ఆమెకి ఆ పుస్తకం మరింత చదవాలని అనిపించింది. కానీ లైబ్రరీ క్లోజ్ చేసే టైమ్ అవ్వడంతో హాస్టల్‌కి బయల్దేరింది.
   
ఆ తర్వాత రోజు లైబ్రరీలో ఎప్పటిలానే పోస్ట్‌మార్టం చదవడం మొదలుపెట్టింది భారతి. చదువుతున్నంతసేపూ అతనెప్పుడు లైబ్రరీకి వస్తాడా అని ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ రోజు అతను రాలేదు. లైబ్రరీ మూసేంతవరకూ అతని కోసం ఎదురుచూసింది. అయినా అతను రాలేదు. అసలే పద్ధతి ప్రకారం నడిచే ఆమె జీవితంలో అతను రాకపోవడం కొంత వయొలెన్స్‌ని సృష్టించింది. తనేమైనా తప్పు చేసిందా? లేదంటే అతనికి కావాల్సిన పుస్తకం దొరికింది కాబట్టి అతను ఏ మూలో కూర్చుని చదువుకుంటున్నాడా? - ఇలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ లైబ్రరీ బయటకు నడిచింది.
 
కొంచెం దూరం నడవగానే అతను ఎదురయ్యాడు. ఒక చేతిలో మడత పెట్టిన పరుపు, దుప్పటి... మరొక చేతిలో పెద్ద అంబేద్కర్ ఫొటో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.
 ‘హలో’ అంది. ఎవరు నువ్వు అన్నట్టుగా భారతి వైపు చూశాడు అతను. లైబ్రరీ, కార్ల్ సాగన్ పుస్తకం - అని ఇంకా ఏదో చెప్పి అతనికి గుర్తు తెప్పించాలనుకుంది. కానీ అతను ఇబ్బందిగా మోస్తున్న అంబేద్కర్ ఫొటో చేతిలోకి తీసుకుని అతనితో నడిచింది.
 
‘ఎక్కడికి?’ అని అడిగింది. ‘ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి’ అన్నాడతను. మౌనంగా అతని వెంటే నడిచింది. కొంచెం దూరం నడిచాక అతను ఆగి ఫుట్‌పాత్ మీద పరుపు పరిచి కూర్చున్నాడు. భారతి కూడా అతని పక్కనే కూర్చుంది. ‘నక్షత్రాలు చూడ్డానికొస్తూ అంబేద్కర్‌ని ఎందుకు తోడు తెచ్చుకున్నావ్?’ అడిగింది భారతి. ‘వుయ్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్స్. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ నక్షత్రాలపై తయారైన కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే మనందరిలోనూ ఉన్నాయి.

కానీ మానవత్వం వికసించిన ఇన్నేళ్లకు కూడా రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టక ఆధారంగా మనుషులను అంచనా వేసి అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. మనుషుల మధ్య జాతి, కులం, మతం అని గోడలు కట్టి విడదీశారు. వంతెనలు కట్టాల్సిన చోట మనిషి గోడలు కడుతున్నాడు. అసలు గొడవంతా ఇదే! అందుకే నాకు మనుషుల కంటే నక్షత్రాలే ఇష్టం.’
 
అతనితో పాటు అంబేద్కర్ ఫొటో మాత్రమే కాదు. అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ ఆఫ్ కేస్ట్ పుస్తకం కూడా ఉంది. ఆ రాత్రి చాలాసేపు వాళ్లు ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ కూర్చుండిపోయారు. లైబ్రరీ నుంచి వచ్చేవాళ్లు, పరీక్షల కోసం రాత్రంతా చదివి కాసేపు రిలాక్స్ అవ్వడానికి  రోడ్ మీద తిరిగేవాళ్లు - కొంత మంది వారి పక్క నుంచి పట్టించుకోకుండా నడుచుకుని వెళ్లిపోయారు. కొంతమంది వాళ్లతో పాటే ఫుట్‌పాత్ మీద కూర్చుని నక్షత్రాలను చూస్తుండిపోయారు. భారతి జీవితంలోనే - ఆ రాత్రి నక్షత్రాలను చూడడం, అతను చెప్పింది వినడం - ఒక అద్భుతమైన అనుభవం.
   
ఎప్పుడు తను హాస్టల్ రూమ్‌కి చేరుకుందో, ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. భారతి నిద్ర లేచేసరికి సాయంత్రమైంది. అంతసేపు నిద్రపోయినందుకు తనని తాను తిట్టుకుని పుస్తకాలు పట్టుకుని లైబ్రరీకి బయల్దేరింది. ముందు రోజు రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది ఆమెకు. వెంటనే చదువుతున్న పుస్తకాలు మూసేసి పోస్ట్‌మార్టం పుస్తకం తెరిచింది.
 
క్యాంపస్‌లో జరిగిన ఒక ఘటన, దాని పర్యవసానంగా అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు రచయిత. అతనిలోని ఒక గుణాన్ని తెలుపుతూ, ఎంతో క్లిష్టమైన విషయాన్ని కూడా చాలా సింపుల్‌గా తన స్నేహితులకు వివరించి చెప్పడం గురించి చెప్పుకొచ్చాడు రచయిత. ఒక ఉదాహరణగా, ఒక రాత్రిపూట ఆరుబయట పడుకుని నక్షత్రాల గురించి ఒక అమ్మాయికి చెప్పడం గురించి రాశాడు. ఆ పేజీ చదవడం అవ్వగానే భారతికి ఆశ్చర్యం వేసింది. ఆ పేజీని మళ్లీ మళ్లీ చదివింది. భారతికి భయం వేసింది. పుస్తకాన్ని దూరంగా తోసేసింది. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్‌కి డయల్ చేసింది.
 
‘పుస్తకంలో నేనెలా ఉన్నాను?’ అడిగింది. ‘నువ్వు పుస్తకంలో ఉండటమేంటి? అసలే పుస్తకం?’ అన్నాడతను. ‘అదే మొన్న నువ్విచ్చిన పోస్ట్‌మార్టం పుస్తకం. అందులో నా గురించి కూడా ఉంది.’
  ‘అందులో నీ గురించి ఉండడమేంటి? ఏం మాట్లాడుతున్నావు?’
  ‘నేనతన్ని రోజూ లైబ్రరీలో కలుస్తున్నాను.’
 ‘ఎవర్ని?’
 ‘అదే ఆ బుక్‌లోని క్యారెక్టర్‌ని.’
 ‘నీకు పిచ్చెక్కిందా? అతను చనిపోయి చాలా రోజులైంది.’
 ‘మరి అతను రోజూ నాకెలా కనిపిస్తున్నాడు?’
 ‘భారతీ ఏమైంది నీకు? ఏదో అతని గురించి తెలుసుకుంటావని బుక్ చదవమన్నాను. చదవకపోతే వదిలెయ్. ఎందుకు జోక్ చేస్తావు?’
 భారతి ఏదో చెప్దామనుకునే లోపలే అతను ఫోన్ కట్ చేశాడు.
   
భారతి లైబ్రరీ నుంచి బయటికొచ్చేసరికి అతను దూరంగా ఒక రాయిమీద కూర్చుని ఉన్నాడు. భారతి వెళ్లి అతని పక్కనే కూర్చుంది. ‘ఏమాలోచిస్తున్నావ్?’ అడిగింది. ‘అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? లైఫ్ షుడ్ బి గ్రేట్ రేదర్ దెన్ లాంగ్. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. ‘నీ కష్టాలు నాకు తెలుసు. కానీ చనిపోతే కష్టాలు పోవు. వంద రెట్లవుతాయి. నిన్ను ఇష్టపడినవారందరినీ అవి బాధపెడతాయి’ అంది భారతి. ‘నేనేం చావనులే’ అన్నాడు. ‘గుడ్ బాయ్. గుడ్ నైట్’ అని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరింది భారతి.
 
భారతికి అంతా అర్థమైంది. ఈ పుస్తకం ఒక టైం మెషీన్. తను పుస్తకం చదివిన ప్రతిసారీ అతను బతికొస్తాడు. తర్వాతి రోజు భారతి లైబ్రరీలో కొంచెం భయంగానే పోస్ట్‌మార్టం తెరిచింది. దాదాపుగా పుస్తకం మొత్తం అయిపోయింది. చివరి కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి. చదవడం పూర్తయితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అందుకే పుస్తకం తెరిచి ఒక్కొక్క పదమే మెల్లిగా చదువుతోంది. ఎక్కడో అతను మళ్లీ రక్తమాంసాలను తనలో నింపుకుంటున్నాడు.     

ఒక పేజీ మాత్రమే చదివి లైబ్రరీ నుంచి బయటికొచ్చింది భారతి. అతను మరికొంతమందితో కలిసి నేలమీద పరుపులేసుకుని కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి అతన్నే చూస్తోంది భారతి.  అతను లేచాడు. ఇప్పుడే వస్తానని అతని మిత్రులతో చెప్పి అక్కడ్నుంచి ముందుకు నడిచాడు. భారతి అక్కడ్నుంచి పరిగెత్తింది. ‘ఎక్కడికి పరిగెడ్తున్నావు?’ అడిగాడు. ‘నిన్ను కాపాడ్డానికి’ అంది భారతి.
 ‘నన్ను కాపాడలేవు.’ ‘కాపాడతాను. నువ్వు నా బిడ్డవి. నేనే నీకు మళ్లీ జన్మనిచ్చాను. నిన్ను నేను మాత్రమే కాపాడగలను.’
 ‘ఎలా?’
 
భారతికి ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్లిద్దరూ అలా పరిగెట్టుకుంటూ హాస్టల్ వైపు వెళ్తున్నారు. వాళ్లిద్దరూ అలసిపోయి హాస్టల్ ముందు ఆగి చూస్తుండగానే అతను హాస్టల్‌లోకి అడుగుపెట్టాడు.
 ‘చూశావా వాడు ఎలా ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడో? చావడాని కంటే బతికుండడానికే ఎక్కువ ధైర్యం కావాలన్నాడు ఒక పెద్దమనిషి. కొటేషన్స్ మనిషిని బతికించవు. వాడు రూంలోకి వెళ్లిపోతున్నాడు. మనం వాడిని అందుకోలేం. ఆపలేము. ది ఎండ్ ఈజ్ వెరీ నియర్’ - అన్నాడు.
 ‘లేదు నిన్ను కాపాడతాను’ అంది భారతి. ‘ఎలా?’ అన్నాడతను.
 
‘పాతికేళ్లు వెనక్కి వెళ్లి అప్పటి బర్త్ సర్టిఫికెట్స్‌లో క్యాస్ట్ అనే కాలమ్ లేకుండా చేస్తే?’ అంది. ‘కులం అనేది మనసుల్లో నుంచి పోవాలి అప్లికేషన్ ఫామ్స్ నుంచి కాదు’ అన్నాడతను.
 ‘ఒకవేళ మనం 1936కి వెళ్లి జాత్‌పాత్ తోడక్ మండల్ వాళ్లని ఒప్పించి అంబేద్కర్ చేత అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ స్పీచ్ ఇప్పించేలా చేస్తే? అది విని ప్రజలు మారిపోతే?’ అడిగింది భారతి. ‘ఆయన ఒక్కడి వల్ల అయ్యే పని అయ్యుంటే, ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు’ అన్నాడు అతను.  ‘మరెలా?’
 
‘ఈ సమస్య ఇప్పటిది కాదు, మనం ఇంకా వెనక్కి వెళ్లాలి. వేదాలు, స్మృతులు, సదాచారాలు - అప్పటిలోకి వెళ్లాలి.’ ‘వెళ్తాను.’ ‘వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదేమో! ఎంత వెనక్కి వెళ్లినా, మారాల్సింది ఇప్పుడు మన ముందున్న జనాలు. అప్పుడే సమస్యకి పరిష్కారం. కానీ వీళ్లు మారరు. అందుకే నేను వెళ్తున్నా. నా టైం వచ్చేసింది’ అని అతను బయల్దేరాడు.
 ‘నో, ఈ కథకి ఈ ముగింపు సరికాదు’ అంది భారతి.
 ‘నాది కథ కాదు. జీవితం’ అన్నాడతను.
- వెంకట సిధారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement