
పొలిటికల్ డ్రామా జానర్లో వచ్చిన ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. తెలుగులో పొలిటికల్ డ్రామాల్లో ఈ సినిమాకు ఎప్పటికీ మంచి స్థానం ఉంటుంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న డైరెక్టర్ తీసిన ఈ సినిమాతో పరిచయమైన హీరో ఇప్పుడొక స్టార్. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...
‘‘అర్జున్ ప్రసాద్ అనే నేను..’’ అంటూ మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేస్తున్న అర్జున్‌కు, తానేం చేస్తున్నాడో, తన ముందు ఏముందో తెలీదు. తన అవసరం మాత్రం చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందని అతనికి తెలుసు. సీఎంగా ప్రమాణం చేశాడు అర్జున్. కోట్లాది మంది ఆకాంక్షలను తనవిగా చేసుకొని ఒక సమాజాన్ని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సీఎం ఆఫీస్‌లో ఉన్న ఆఫీసర్లంతా ‘ఈయన కొత్తగా చేసేది ఏముంటుంది?’ అన్నట్టు చూశారు. అర్జున్ అందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు. మొదటిరోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సీఎంగా ప్రమాణం చేసిన మూడోరోజే అర్జున్‌కు లైఫ్‌త్రెట్ ఉందని సెక్యూరిటీ కూడా పెంచారు. కానీ ఆ సెక్యూరిటీని దాటుకొని వచ్చి అతనికి రెండు బుల్లెట్లు తగిలాయి. బుల్లెట్‌ప్రూఫ్ ఉంది కాబట్టి చేతికి మాత్రమే గాయాలయ్యాయి.
అర్జున్ హాస్పిటల్లో ఉన్నాడు. గాయాలు చిన్నవే కాబట్టి వెంటనే కోలుకున్నాడు. హాస్పిటల్లో ఉన్న కొడుకును చూడటానికి వచ్చింది తల్లి. రావడమే.. ‘‘అయ్యో! ఏంట్రా ఇదీ..’’ అంటూ గట్టిగా ఏడ్చేసింది. ‘‘ఊర్కో అమ్మా! ఇప్పుడు ఏమైందని?’’ అన్నాడు అర్జున్. ‘‘హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి. నా మూలానే కదా?’’ ‘‘ఇప్పుడేమైందమ్మా!’’ ‘‘వెళ్లిపోరా! ఈ దేశంలో రాక్షసులు ఎక్కువైపోయారు. వీళ్ల మధ్యన ఉండే ఖర్మ నీకేం పట్టిందిరా..’’ ఆ తల్లి ఇంకా ఏడుస్తూనే ఉంది. ‘‘ఇది ఖర్మ కాదమ్మా! ఇది నా అదృష్టం..’’ అర్జున్‌కు ఇప్పుడిప్పుడే తాను చేయాల్సిన పనులేవో తెలుస్తున్నాయి. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్నవాడు, ఇలా రాజకీయాల్లోకి రావడానికి ఒకే ఒక్క కారణం అమ్మ. కానీ ఇప్పుడు ఆమే వద్దంటున్నా, అతను నవ్వి, రాజకీయాల్లోనే ఉంటానంటున్నాడు. అతనికిప్పుడు చావన్నా భయం పోయింది. అర్జున్ కోలుకున్నాడు. తాను చేయాల్సిన పనులన్నీ లిస్ట్ చేసి పెట్టుకున్నాడు. సొంత పార్టీ వాళ్లే గొడవ చేసినా అనుకున్నవన్నీ చేస్తూ పోతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. గొడవ పెద్దదైంది. అసమ్మతి పెరిగిపోయింది. తన సీఎం సీట్ ఉంటుందో పోతుందోనన్న భయం పట్టుకుంది అర్జున్‌కు. పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అసమ్మతి నేతలను దగ్గర చేసుకోవాలి. అవిశ్వాసం పెడితే సీఎం సీటునుంచి దిగాల్సి ఉంటుంది. అతనికి వేరే ఆప్షన్ కనబడలేదు, తాను ఇష్టపడ్డ అమ్మాయి అర్చనను ప్రేమించి, ఆ ప్రేమను వాడుకొని ఆమె తండ్రి సపోర్ట్ పొందడం తప్ప. అదే చేశాడు.
అర్చనకు నిజం తెలిసింది. ‘‘అన్నీ అబద్ధాలే కదా! మొత్తం అంతా అబద్ధమే కదా!!’’ అడిగింది. ‘‘అర్చనా! నేన్నిన్ను ప్రేమించడం మాత్రం అబద్ధం కాదు.’’ ‘‘పొలిటీషియన్స్‌ను నమ్మొద్దు.. నమ్మొద్దు అని బతికున్నన్నాళ్లూ చెప్పింది అమ్మ. ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన. ఇంత నటన అవసరమా? ఒక మామూలు అమ్మాయిని. గొప్ప సీఎంవి. మోసం చేయడం అవసరమా? ఒక మాట చెప్పుంటే నేనే నీకు సపోర్ట్ చేసేదాన్ని కదా..’’ ఏడుస్తూ కారు దిగింది అర్చన. ‘‘అర్చన నేను పోరాడుతున్నా. ఐయామ్ ఫైటింగ్. ఈ ఫైట్‌లో నేన్నిన్ను మోసం చేయడం కాదు, నన్ను నేనే మోసం చేసుకుంటున్నా..’’ బతిలాడుకున్నాడు అర్జున్. ‘‘వెళ్లిపో..’’ అంటూ చివరగా ఓ మాట చెప్పి అతణ్నుంచి దూరంగా వెళ్లిపోయింది అర్చన. అర్జున్ ఇప్పుడక్కడ ఒంటరివాడు. అమ్మ ముందు నిస్సహాయంగా కూర్చున్నాడు అర్జున్. ‘‘ఏంట్రా?’’ అనడిగింది అమ్మ.
‘‘అమ్మా ఇవ్వాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవాడిని వదిలేసానమ్మా! నాకు ఛాయిస్ లేదమ్మా!’’ అన్నాడు దీనంగా. ‘‘ఒక ఆడపిల్లకు అన్యాయం చేశావా?’’‘‘అన్యాయం చేసినవాడిని వదిలేసానమ్మా!’’ ‘‘అన్యాయం చేసినవాడిని వదిలేసానంటే ఫర్వాలేదనిపిస్తుందిరా.. అదే ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది.’’‘‘అమ్మా!’’‘‘బాధపడాలో, ఫర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో..’’ చెప్పింది అమ్మ. ‘రేపు మాట్లాడదాం. వెళ్లి పడుకోరా’ అంటూ అర్జున్ వైపు చూసి, ‘‘అర్జున్! నువ్వు లీడర్ అవ్వాలనుకున్నా కానీ, పొలిటీషియన్ అవ్వాలనుకోలేదురా..’’ అంది. అదే ఆమె అర్జున్‌తో చెప్పిన చివరిమాట. ఆ రాత్రి అలాగే నిద్రలోకి, అక్కణ్నుంచి మరణంలోకి జారుకుంది. అర్జున్ ఇప్పుడు అంతటా ఒంటరివాడు.
అమ్మ చనిపోతే ఆమె చివరిచూపు కోసం లక్షమంది ఆడవాళ్లు రావడం అర్జున్‌ను కంటతడి పెట్టించింది. ‘‘ఆవిడొక దేవత సార్!’’ అంది అర్జున్ ఇంట్లో పనిచేసే వ్యక్తి. ‘‘లక్షమంది ఆడవాళ్లా?’’ ఆ మాటన్నాక అర్జున్ దగ్గర ఇంకే మాటలూ లేవు. వాళ్లందరినీ దాటుకుంటూ వెళ్లి, అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవిని వదిలేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించే నిర్ణయం అది. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన వాడిని పదవిని కాపాడుకోవడం కోసం వదిలేసిన అర్జున్, అదే పదవిని లెక్కచెయ్యకుండా ఆ ఆడపిల్లకు న్యాయం చేశాడు. పదవిని వదిలేశాడు. ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఆ ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నాడు. అర్జున్‌కి ఇప్పుడు పదవి ముఖ్యం కాదు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం ముఖ్యం. రాష్ట్రంలోని చివరి ఊర్లో ఉన్న చివరి మనిషి వరకూ అందరినీ కలుసుకున్నాడు. అర్జున్ మళ్లీ గెలిచాడు. ఈసారి ఏ శక్తికీ భయపడని, ఏ ఒత్తిడికీ లొంగే అవసరం లేని గెలుపును గెలుచుకున్నాడు. అర్జున్ ఈసారి ధైర్యంగా ప్రమాణం చేశాడు – ‘‘అర్జున్ ప్రసాద్ అనే నేను...’’.
Comments
Please login to add a commentAdd a comment