భూమిలోకి దిగి పాతుకుపోయిన ఊడలమర్రి కింద తాడు ముడులు విప్పుతూ కూర్చున్నాడు యాదయ్య. కొమ్మల సందుల్లో నుండి పడుతున్న లేలేత కిరణాలు క్రమక్రమంగా పెరగసాగాయి. బతుకుముడులు విప్పుకునే అవకాశం లేని తను, తనకు ఆధారమైన తాళ్లకు ముడులిప్పడం ఆశ్చర్యంగా తోచి తనలో తనే నవ్వుకున్నాడు యాదయ్య. పుట్టినప్పటినుండీ తన బతుకు చిన్నచిన్న సాహసాల మధ్యే గడిచింది. గుండ్రంగా ఉన్న ఇనుపచువ్వల మధ్యలో నుండి అటూఇటూ దూకడం, ఇనుపరింగులలో తన దేహాన్ని దూర్చి బయటికి వచ్చాక అందరికీ ఆనందం కలిగించడం, ఒక్కోసారి అంటించిన మంటల్లో నుంచి దూకి అబ్బురపరచడం మొదట్లో భయంభయంగానే అనిపించినా రానురానూ అలవాటుగా మారిపోయింది.
పెళ్లయ్యాక పిల్లలు పుట్టాకా కూడా అదే తన బతుకుకు ఆదరువుగా మారిపోయింది. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు. ఒక ఊరి నుండి మరో ఊరికి, ఆ ఊరు నుండి ఇంకో ఊరికీ ప్రయాణం సాగుతూనే ఉంది. చేసిన విన్యాసాలు చూసి చప్పట్లు ఈలలతో హడావిడి చేసేవారే గానీ ఒక్కరు కూడా చిల్లర రాల్చేవారు కాదు. ఒళ్ళు గగుర్పొడిచే సాహస విన్యాసాలు చేస్తున్న తన చిన్నపిల్లల్ని చూసి ‘అయ్యబాబోయ్’ అని ఆశ్చర్యపడేవారే గానీ వాళ్లని పిల్చి అభినందించి అర్థరూపాయి బహుమతి ఇచ్చేవారు లేరు. తను ఒకప్పుడు తన తండ్రికి కొడుకు..ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి. విన్యాసాలు చేయకుండా విస్తర్లు లేవని తన జీవితాన్ని తల్చుకోగానే యాదయ్య మనసంతా విషాదం నిండిపోయింది. ‘నానా... అమ్మెప్పు డొస్తుంది..నాకు ఆకలవుతుంది’’ అన్న కూతురి మాటలతో ఆలోచనలను విదుల్చుకుంటూ ఈ లోకంలోకి వచ్చి ఆడుకుంటున్న కూతురివంక చూశాడు. మూడేళ్ల కూతురు లచ్చి... డ్రాయరు వేసుకుని అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లిమొగ్గలతో సంతోషపడుతోంది.
డప్పులు లయబద్ధంగా మోగుతున్నాయి. చుట్టుపక్కల రైతులంతా పొలం చుట్టూ చేరారు. ప్రొద్దున పూట ఎండే అయినా చురుక్కుమంటోంది. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న తాడుమీద నడుస్తోంది సాయవ్వ. చేతిలో ఆసరాగా గెడకర్రను పట్టుకుని తాడుమీద అటూఇటూ నడవసాగింది. ఒళ్లంతా చిరాగ్గా ఉంది. చెమట కారిపోతూ పాదాలలోకి తడి చేరుతోంది. ఆ తడికి కాలెక్కడ జారిపోతుందోనని భయపడింది సాయవ్వ. తనవైపు పైకి చూస్తున్న కొడుకు రాజాని చూడాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. కానీ ఎక్కడ అదుపు తప్పి కిందపడుతుందోనని ఆ ప్రయత్నం మానుకుంది. పంజాబీడ్రస్సు నడుముకు కట్టిన చున్నీముడి జారిపోతున్నట్లుగా అనిపించింది. వేపాకు, పసుపు కలిపిన బియ్యాన్ని తాడు మీద అటూ ఇటూ నడుస్తూ విన్యాసాలు చేస్తూ పొలంలోకి చల్లాలి. జారిపోతున్న మూట క్షణక్షణానికీ బరువుగా అనిపిస్తోంది.
రాత్రి సరిగా భోజనం లేకపోవడం, పొరుగూరి నుండి ఈ ఊరొచ్చేసరికి రాత్రికావడం, దానివల్ల నిద్రలేకపోవడం వల్ల నీరసంగా, ఆకలిగా ఉంది. కళ్లు మూతలు పడిపోతున్నాయి. పిల్లల్ని పస్తుపెట్టడం ఇష్టంలేక ఏవో కాసిని బియ్యం, డబ్బులు వస్తాయని ఆశపడి ఒప్పుకుంది. మామూలుగా తన నీడపడకుండా, తాకకుండా జాగ్రత్తపడే ఈ జనాలంతా తన చేతులతో పసుపుబియ్యాన్ని పొలాల్లో చల్లించాలని ఆశపడుతున్నారు. అలా చల్లితే పంటలు బాగా పండుతాయట! వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని బావుల దగ్గర కూడా బియ్యాన్ని చల్లించడంతో మనసులో నవ్వుకుంది సాయవ్వ. వాళ్ల నమ్మకాల మాటెలా ఉన్నా తనలాంటి వాళ్లకి అటూఇటుగా రోజు గడిచిపోతుంది. ఆలోచనలతోనే ఒకసారి ఆ చివరనుండి ఈ చివరివరకు నడిచి చేతిలోని గెడకర్రను కిందనున్న కొడుక్కి అందించింది. మళ్లీ తాడు మీద నడుస్తూ నడుముకు కట్టిన మూటవిప్పి బియ్యాన్ని గుప్పిట్లోకి తీసుకుని పొలాల్లోకి విసర సాగింది. విసిరేటప్పుడు ముందుకు తూలినట్లు అనిపించింది. డప్పు మోగుతూనే ఉంది. చివరి వరకూ నడిచి ఒడిలో ఉన్న బియ్యాన్ని పొలాల్లోకి సత్తువ కొలదీ విసిరింది. బియ్యం చల్లటం అయ్యాక నిలబెట్టిన గెడ నుండి జారుకుంటూ కిందికి వచ్చింది.చల్లనిగాలి ఒంటికి తగిలి ప్రాణం లేచివచ్చింది. అప్పటి వరకూ డప్పు కొడుతూ కిందనున్న రాజా ‘అమ్మా’ అంటూ చుట్టుకుపోయాడు. వాడినలా చూడగానే సాయవ్వ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బహుశా చిన్నపిల్లల సంపాదన మీద ఆధారపడే బతుకులు తమవే కాబోలు!
ఊరూరూ తిరగడం వల్ల ఒక స్థిరమైన ఇల్లంటూ లేకపోయింది. తాళ్లూ కర్రలూ ఇనపరింగులు, బిందెలు, దువ్వెనలు...వీటితోనే బతుకాట సాగిపోతోంది. తెగిన గాలిపటాల్లా ఒకచోటి నుండి ఇంకో చోటికి ఎక్కడెక్కడికో ఎగరాల్సి వస్తోంది. ఆ చెట్టుకిందా ఈ చెట్టు కిందా కాలం గడపాల్సి వస్తోంది. తాత్కాలికంగా వేసుకునే గుడారాలు చలికి ఆగవు. ఏదో ఎండనుండి కొంచెం నీడనిస్తాయి. అలాగని గుడారం బలంగా ఉన్నా రెండు మూడు రోజులకే అక్కడి నుండి వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఏపుగా పెరిగిన చెట్లే ఎంతో నీడనిస్తుంటాయి. కొడుకుని ముద్దుపెట్టుకుని నడుముకున్న చున్నీ విప్పి పొలాల రైతుల ముందు నిల్చుంది. చూపుల్లో ఏదో చులకన భావం, మాటల్లో వెకిలితనం సాయవ్వని వెక్కిరించాయి. తన కష్టానికి ప్రతిఫలం గుడ్డలో వేస్తూ అదోలా చూస్తున్న వాళ్లను ఏమీ అనలేక తలకిందకి దించుకుంది.
ఊరూరూ తిరుగుతూ పొట్టపోసుకుంటున్న తనలో కూడా ‘అందాన్ని’ ఆరాధిస్తున్న వారిపట్ల జాలి కలిగింది. అసలు తను ఆడదాన్ననే విషయమే ఎప్పుడో మర్చిపోయింది. గుంటలు పడిన కళ్లల్లోనూ, పీక్కుపోయిన బుగ్గల్లోనూ అందాన్ని వెదికి సొల్లుకారుస్తున్న వాళ్లను చూసినప్పుడల్లా తను ఆడదాన్ననే విషయం గుర్తొస్తుంటుంది. ఈ విన్యాసాలు చేయలేక ఒళ్లమ్ముకుని బతికిన వాళ్లు మనసులో కదలాడారు. చేదు తమ జీవితాల్లోనే ఉన్నప్పుడు చూసేవాళ్ల కళ్లల్లో ఎన్ని అర్థాలుంటే తనకెందుకు?
దొరికే గుప్పెడు గింజలు తన కడుపు నింపుతున్నాయా లేదా అనేదే తనకు అవసరం.
ఎండసూటిగా వీపుకి తగులుతుంటే తన దగ్గరున్న చున్నీ తీసుకుని కొడుకు చొక్కాలేని వీపుమీద కప్పి వాడిని దగ్గరగా పొదువుకుంది. నడుస్తుంటే దారిలో స్కూలుకెళ్లే పిల్లలు ఎదురుపడ్డారు. వాళ్లనలాగే చూస్తూ తల్లివైపు తిరిగి ‘‘అమ్మా..నేను కూడా వాళ్లతో కలిసి బడికెళ్లనా’’ అన్నాడు.
ఆశ ఆకాశానికి ఈడ్చుకుపోతుంటే వాస్తవం కటిక పేదరికంలా మారి కాళ్లకి అడ్డుపడుతున్నట్లనిపించింది. వాడి వంక విషాదంగా చూస్తూ ‘‘నువ్వు చదవాలంటే ఒకటో తరగతే వంద ఊళ్లల్లో చదవాలి’’ అంది నవ్వుతూ.
‘‘అంటే’’ అమాయకంగా అడిగాడు.
‘‘మన బతుకులు తెగిన గాలిపటాలు నాన్నా. ఎంతసేపు ఎగురుతామో, ఎక్కడ కూలబడిపోతామో తెలియదు. ఆడితేనే బతుకు గడవని బతుకాటలు మనవి. మనం ఇలా బతకాలనే ఆ భగవంతుడు మనల్ని పుట్టించాడు. మనకు తెలిసిన పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ కాలం గడపాలి తప్ప అనవసరంగా అందని వాటికోసం ఆశపడ కూడదు’’ అంది. చిట్టిబుర్రకేదో అర్థం అయినట్టూ ఉంది, కానట్టూ ఉంది. అడ్డంగా తలూపాడు. కొడుకుతో మాట్లాడుతుండగా తనకు చిన్నప్పుడు ఎదురైన అనుభవం గుర్తొచ్చింది సాయవ్వకి. బడికెళ్తానని మారాం చేస్తున్న తనకి పలకా బలపం కొనిచ్చి పంపించాడు తండ్రి. అవి తీసుకుని ఉత్సాహంగా వెళ్తున్న తను చూసుకోకుండా ఎదురొచ్చిన మోతుబరి రైతును గుద్దింది.
కోపంతో ఏం చేయాలో తెలియక చేతిలోని పలక లాక్కుని నేలకేసి కొట్టి ‘‘ఊరూరూ తిరిగే నీకెందుకే చదువు, ఇప్పుడేలుతున్న ఊళ్ళు చాలవా? ఇంకే ఊళ్ళు ఏలాలంటా?’’ అన్నాడు వెటకారంగా. ముక్కలైన పలకవంక చూస్తూ గుండెలు పగిలేలా వెక్కివెక్కి ఏడ్చింది తను. పలక పగలగొట్టుకుని స్కూలుకెళ్ల లేదని ఇంటికెళ్లాక తండ్రి కొట్టాడు. దెబ్బలకి ఒళ్లంతా పులిసిపోయి రెండురోజులు ఒకటే జ్వరం. అప్పటినుండీ బడిని తల్చుకోగానే చేతికందని చందమామను చూసినట్టుంటుంది సాయవ్వకి. ఎంతైనా తన రక్తం కదూ... వీడికీ అనిపిస్తుందనుకుంటా కొడుకు వైపు చుసి నవ్వుకుంటూ ముందుకు సాగింది.
మర్రిఊడల్ని పట్టుకుని ఉయ్యాలలూగుతున్న నాలుగేళ్ల కూతురు లచ్చి పిల్లిమొగ్గలేసుకుంటూ వచ్చి తల్లిని వాటేసు కుంది. జుట్టు రేగిపోయి, చిరిగిన గౌనుతో తనను అల్లుకుపోయిన కూతుర్ని కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది. ‘‘తొందరగా పని తెముల్చు. ఈరోజన్నా ఎక్కడో ఒకచోట ఆటాడితేగానీ కడుపులు నిండవు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్టా’’ అంటున్న యాదయ్యకు సమాధానంగా ‘‘ఆ..ఆ’’ అంటూ పొయ్యిదగ్గర కూర్చుంది. కాసేపటి తర్వాత ‘‘తాడు గట్టిగా ముడెయ్యి. మొన్న పైకెక్కినప్పుడు సాగిపోయి నడవడానికి ఇబ్బందయింది. పైకెక్కి నడవాలంటే ప్రాణాలమీదకొస్తంది. ఏంబతుకులో ఏంటో? కడుపూ నిండదు, గుడ్డా దొరకదు. ప్రాణాలు పణంగా పెట్టి గాల్లో ఎగిరితే రోజులు గడుస్తున్నాయి. లేదంటే దువ్వెనలూ అవీ అమ్మాలి. అవి కూడా సరిగా అమ్ముడు పోవట్లేదు’’ అంది దిగులుగా.
యాదయ్య ఆలోచనలో పడ్డాడు. తాడుముడి జారిపోయి నడుముకి దెబ్బతగిలిన తండ్రి చివరిరోజుల్లో ఎంత నరక యాతన పడ్డాడో గుర్తొచ్చి కన్ను చెమ్మగిల్లింది. తన పరిస్థితి కూడా అలాగే అయితే తన భార్యాపిల్లలకి దిక్కెవరు? అని తల్చుకోగానే మనసంతా దిగులుపడి పోయింది. కొడుకూ కూతురూ ఫీట్లు చేసే ఇనుపరింగులు తుప్పుపట్టిపోతే తుడిచి ఒక పక్కన పెట్టాడు. తాడుముడి గట్టిగా బిగించాడు. కూర్చుని ముడేస్తే గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ రెండు గెడకర్రలకీ ముడేసినప్పుడే ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఆలోచిస్తూనే పని పూర్తిచేశాడు.
మిట్టమధ్యాహ్నం ఎండ శరీరాన్ని కుంపట్లో పెట్టి వేపుతున్నట్లుంది. తెచ్చిన సామానంతా ఒక పక్కన పెట్టి రోడ్డు వారగా ఉన్న ఖాళీస్థలంలో గెడకర్రలు నిలబెట్టి దానికి తాడు బిగించి కట్టే పనిలో ఉన్నాడు యాదయ్య. సాయవ్వ అవసర మైనప్పుడల్లా సాయం అందిస్తోంది. రాజా తన చేతిలో ఉన్న డప్పు మీద ఆగకుండా దరువేస్తూ దారినపోయే అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పల్టీలు కొట్టడం నేర్చుకుంటున్న లచ్చి అటునుండి ఇటు ఇటు నుండి పల్టీలు కొడుతూ దానినొక ఆటలాగా భావించి ఆనందపడసాగింది.
డప్పు చప్పుడు విని అక్కడక్కడా ఉన్నవాళ్లంతా దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి చేరారు. తాడును అటూఇటూ బలంగా లాగి కడుతున్న యాదయ్య సాయవ్వలకు అక్కడకు వస్తున్న వాళ్లను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఎలాగైనా మంచి విన్యాసాలు చేసి అందరిచేతా చప్పట్లు కొట్టించుకుని వాళ్ళిచ్చే డబ్బులతో మంచి కూర వండించుకుని తినాలి. కూర గురించి తల్చుకోగానే యాదయ్య నోట్లో నీళ్ళూరాయి. రోజూ పచ్చడిమెతుకులు, నీళ్ళు కలిసిన అన్నం తినీతినీ విసుగొచ్చింది. ఈ రోజైనా నోట్లోకి చుక్కా, పంటికిందకి ముక్కా తగలాల్సిందే అనుకుంటూ ఆనందపడుతున్నాడు. మూటలో కట్టిన బిందెలు తీసుకొచ్చి వరసగా పేర్చాడు యాదయ్య. వాటితో రాజా విన్యాసాలు చేస్తాడు. వయసుకి మించిన పనే అయినా ‘చేయను’ అనకుండా చేసే కొడుకుని చూసి ముచ్చటపడ్డాడు యాదయ్య.
బిందెమీద బిందె పెట్టి పడిపోకుండా నడుచుకుంటూ అందరి దగ్గరకూ వెళ్ళి వాళ్లిచ్చే చిల్లర దోసిట్లో పోసుకుంటాడు. లచ్చి బుజ్జికుక్కపిల్లలా పల్టీలు కొట్టసాగింది. చేతుల్ని కిందకీ, కాళ్లని పైకీ లేపి అటూఇటూ నడుస్తున్న ఆ పిల్లను చూసి చప్పట్లు మారుమోగిపోయాయి. చెల్లి అలా నడుస్తుంటే ఆపకుండా డప్పు కొడుతున్నాడు రాజా. జారిపోతున్న నిక్కరును సరిచేసుకుంటూ పల్టీలు కొట్టసాగింది. కాసేపు చుట్టూ నుంచున్న వాళ్ల దగ్గర పల్టీలు కొట్టి ఆ తర్వాత ఇనుపరింగుల్లోంచి బయటికి రావడం చేసింది. చేతులకి మెడకీ, కాళ్లకీ మెడకీ ఇనుపరింగు తగిలించుకుని చాకచక్యంగా బయటికి వస్తున్న పిల్లను చూసి అందరూ రెట్టించిన ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు.
ఫీట్లు చేయడం అయ్యాక అందరి దగ్గరకీ వెళ్ళి డబ్బులడిగింది. ఎవరికి తోచినంత వాళ్లు ఇవ్వసాగారు. ఎండ ఎక్కువవుతోంది. సాయవ్వకి ఊపిరి తీసుకోవడానికి వీలుకానంత ఆయాసంగా అనిపించసాగింది. అలా అని కూర్చుంటే రోజు గడవదు. పిల్లలతో పాటు ఏదో ఒక విన్యాసం చేస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయనుకుంది. పొడుగ్గా ఉన్న ఇనుపఊచను తీసుకుని ఒకసారి అందరికీ చూపించింది. తర్వాత దాన్ని భూమిలోకి గుచ్చి పైకి కనిపిస్తున్న ఊచకి తన కంఠాన్ని ఆనించి మెల్లమెల్లగా వంచసాగింది. చూస్తున్న అందరికీ ఒళ్ళు గగుర్పొడవసాగింది. కంఠంలో ఊచ దిగిపోతుందేమో నన్నంత ఉత్కంఠ చుట్టూ చేరిన వారిలో కదలాడసాగింది. అలవాటైన పనే కాబట్టి మెల్లగా వంచడం పూర్తిచేసి ఆ వంగిన ఊచ పైకిలేపి అందరికీ చూపించింది.
ఎండ ఎక్కువవసాగింది. ఊచ వంచడం అయిపోయాక నిలువునా పాతిన గెడకర్ర పైకెక్కి వెళ్లసాగింది. రెండుసార్లు పట్టుతప్పి కిందకి జారింది. మళ్ళీ ప్రయత్నించి పైకెక్కసాగింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారికి పెద్ద కొండ చిలువేదో చెట్టుమీదకి పాకుతున్నట్లుగా అనిపించింది. తాడుమీద నుంచుని భర్త అందించిన గెడకర్ర పట్టుకుంది. పంజాబీ డ్రస్సు ఒళ్లంతా కప్పినా అరికాళ్లలో చెమటలు పట్టసాగాయి. చుట్టూ చూసింది. కిందనున్నవాళ్లు తలలు పైకెత్తి తను చేసే విన్యాసాన్ని చూడడానికి ఆరాట పడుతున్నారు. అడ్డంగా పట్టుకున్న గెడకర్ర సాయంతో తాడు మీద ఒక్కో అడుగూ తీసి నడవసాగింది.
ఒకసారి నడవడం పూర్తయింది. కాళ్లనేదో నిస్సత్తువ ఆవరిస్తున్నట్లుగా అనిపించింది. శరీరం తేలికైపోతున్నట్లూ, తననెవరో బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్లూ అనిపించింది. డప్పు మారుమోగిపోతోంది. పిల్లవాడు శక్తినంతా ఉపయోగించి డప్పు వాయిస్తున్నాడు. తన పేగుల్ని డప్పుకొట్టడానికి కర్రల్లాగా వాడుతున్నట్లనిపించింది. ముఖానికి చేయి అడ్డంపెట్టుకుని పైకి చూస్తున్నాడు యాదయ్య. చప్పట్లు కొట్టి సాయవ్వను మరింత ఉత్సాహపరుస్తున్నారు చుట్టూ చేరినవాళ్ళు. ఊతగా ఉన్న గెడకర్రను పట్టుకుని ముందుకి అడుగేసింది సాయవ్వ. రెండువేళ్లకీ మధ్య చిక్కాల్సిన తాడు పట్టు తప్పిపోయింది. బిగించి కట్టిన తాడు ఊడి పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి అందరూ బిత్తరపోయారు. నేలకూలిపోతున్న ఒక మహావృక్షంలా పడుతున్న సాయవ్వను చూస్తూ దిగ్భ్రాంతి చెందారు. ఒక్కసారిగా చప్పట్లు ఆగిపోయాయి. బలంగా వీచిన గాలికి చెట్టుకొమ్మల్లో చిక్కుకున్న గాలిపటం ఆకాశానికి ఎగరసాగింది. బతుకే ఒక ఆటగా బతికి చివరికి బతుకాటలోనే ఓడిపోయిన సాయవ్వను చూస్తూ ముందుకు కదిలారు.
Comments
Please login to add a commentAdd a comment