జెండా వెంకయ్య | special story on Jenda Venkaiah | Sakshi
Sakshi News home page

జెండా వెంకయ్య

Published Sun, Mar 4 2018 8:08 AM | Last Updated on Sun, Mar 4 2018 8:08 AM

special story on Jenda Venkaiah - Sakshi

జెండా అంటే ఒక గుడ్డ పేలిక కాదు. ఒక గుర్తును చిత్రించుకున్న గుడ్డ ముక్క కాదు. కొన్ని రంగులు పులిమిన వస్త్రం కూడా కాదు. ఒక దేశ పోరాటాన్నీ, రక్తతర్పరణలనీ, త్యాగాలనీ జ్ఞప్తికి తెచ్చేది పతాకం. వాటికి ఆ జాతి ఇస్తున్న విలువని ఆకాశంలో రెపరెపలాడుతూ వెల్లడించేదే జెండా. ఒక జాతి చరిత్ర సారానికీ, తాత్వికతకూ పతాకమే ప్రతీక. 125 కోట్ల భారతీయుల వందనాన్ని స్వీకరించే మువ్వన్నెల జెండాలో ఇవన్నీ ప్రతిఫలిస్తాయి. అలాంటి పతాకాన్ని రూపొందించిన వారు తెలుగువారు కావడం గర్వ కారణమే. ఆయన పింగళి వెంకయ్య. భిన్న సంస్కృతుల భారతావనికి తగినట్టు, ప్రతి తరానికి స్వాతంత్య్రోద్యమాన్ని స్ఫురణకు తెచ్చేటట్టు గాంధీజీ ఊహ మేరకు పింగళి త్రివర్ణ పతాకాన్ని జాతికి అందించారు.

 రెండో బోయర్‌ యుద్ధంలో వెంకయ్యకీ, గాంధీజీకీ  స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్య్రోద్యమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్‌సాండ్‌ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్‌లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్‌ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌లు బ్రిటిష్‌ జాతితో చేసిన యుద్ధమిది. ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్‌ ఇండియన్‌ అంబులెన్స్‌ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్‌ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు.

 శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భార త జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు. ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు. వెంకయ్య ఆగస్టు 2,1878న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు. తల్లి వెంకటరత్నమ్మ. పెదకళ్లేపల్లితో కూడా వెంకయ్యగారికి అనుబంధం ఉంది. ఆయన మచిలీపట్నంలో ఉన్న హిందూ హైస్కూలులో చదివారు. ఆయన అభిరుచి ఏడురంగుల జెండాలా రెపరెపలాడుతూ ఉంటుంది. 1906లో కలకత్తాలో జరిగిన 22వ భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సభలకు హాజరు కావడం వెంకయ్యగారి జీవితంలో ఒక మలుపు. బెంగాల్‌ విభజన, వందేమాతరం ఉద్యమం నేపథ్యంలో జరిగిన ఈ సభలు జాతీయ చైతన్యాన్ని తట్టి లేపాయి. స్వదేశీయత, విదేశీ వస్త్ర బహిష్కరణ, జాతీయ విద్య, స్వరాజ్‌ అనే నాలుగు తీర్మానాలను ఆమోదించడం ద్వారా కాంగ్రెస్‌ సమావేశాలు భారతీయుల జాతీయ చైతన్యాన్ని మరో దిశకు మలిచాయి. ఈ సభలకు అధ్యక్షులు దాదాబాయ్‌ నౌరోజీ.

ఆ నాలుగు అంశాలే వెంకయ్యగారి భావి జీవితాన్ని శాసించాయి.  1906 నుంచి 1911 వరకు వెంకయ్య కేవలం పత్తి పంట మీద పరిశోధనలు చేశారు. అప్పుడే ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అన్న బిరుదు వచ్చేసింది. అమెరికా నుంచి కంబోడియా రకం విత్తనాలు తెప్పించి, వాటిని దేశవాళీ పత్తి విత్తులతో కలిపి ఒక కొత్త సంకర పత్తిని తయారు చేశారు. ఈ ప్రయోగాలన్నీ చల్లపల్లి దగ్గరగా ఒక గ్రామంలోనే చేశారు. అందులోని నాణ్యతని గుర్తించిన ది రాయల్‌ అగ్రికల్చరల్‌ సొసైటీ (లండన్‌) ఆయనను ఫెలోషిప్‌తో గౌరవించింది. ఈ ప్రయోగాలు అయిన తరువాత వెంకయ్య కొద్దికాలం రైల్వేలలో కూడా పనిచేశారు. ఆ శాఖలో ఉండి బెంగళూరు, బళ్లారిలలో పనిచేసినప్పుడే మద్రాస్‌లో ప్లేగు వ్యాధి విజృభించింది. రోగులకు సేవ చేయడం కోసం వెంకయ్య తన ఉద్యోగం వదిలిపెట్టారు. సుభాష్‌చంద్రబోస్‌ పిలుపు మేరకు సైన్యంలో చేరి బోయర్‌ యుద్ధానికి వెళ్లారు.

యుద్ధం, సైన్యంలో చేరడం  ఆయన జీవితంలో ఒక చిరు ఘట్టమే. ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత మొదట తీవ్ర జాతీయవాదులతో కలసి బ్రిటిష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అప్పుడు ఆయన ఏలూరులో ఉండేవారు. చదువు మీద ఆసక్తితో లాహోర్‌ వెళ్లి, అక్కడి ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌లో సంస్కృతం, ఉర్దూ, జపనీస్‌ భాషలు నేర్చుకుని వచ్చారు. 1913లో ఒక సందర్భంలో ఆయన బాపట్లలో జరిగిన సభలో జపాన్‌ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. పూర్తి స్థాయిలో ఆయన ఆ భాషలో ప్రసంగించి ‘జపాన్‌ వెంకయ్య’ అని కీర్తి గడించారు. విద్యార్జన వెంకయ్యగారిలో ఒక తీరని దాహంలా కనిపిస్తుంది. ఆయన కొలంబో వెళ్లి సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ పూర్తి చేసుకుని వచ్చారు. భూగర్భశాస్త్రం అంటే ఆయనకు అపారమైన ప్రేమ. ఆ అంశంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. దీనితో పాటు నవరత్నాల మీద కూడా ఆయన అధ్యయనం చేశారు. దీనితో ఆయనకు డైమండ్‌ వెంకయ్య అన్న బిరుదు కూడా వచ్చింది. మచిలీపట్నంలో కొద్దికాలం తన సొంత విద్యాలయాన్ని కూడా నిర్వహించారు.

ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలిగిందని అనవచ్చు. కారణం కలకత్తా కాంగ్రెస్‌ సభలు. ఆయన 1916లో ’ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అన్న పుస్తకం రాశారు. 1916 నుంచి 1921 వరకు ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను ఆయన సేకరించారు.  1918 సంవత్సరం మొదలు, 1921 వరకు జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు (మార్చి 31, 1921) తొలిసారి ఆయన ఆశ నెరవేరింది. అంతకు ముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారయింది. దానిని ఆ నగరంలో బగాన్‌ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు. అందుకే దానిని కలకత్తా జెండా అనేవారు. మేడమ్‌ బైకాజీ కామా, అనిబీసెంట్, సిస్టర్‌ నివేదిత కూడా భారత దేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ అవకాశం వెంకయ్యగారికి లభించింది. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు.

జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్‌ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్‌ ధర్మచక్రాన్ని సూచించారు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్‌ వాళ్లు వారి జెండా యూనియన్‌ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. అందుకే ఆయన జెండా వెంకయ్య.

‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న (అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడు) పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్‌ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు. తరువాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్య సంధతకీ, అహింసకీ ప్రతీకగా ఉంటుంది.’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశారు. ఈ విషయంలో ఆయన భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని ఆయన చెప్పేవారు. ఆయన రాజకీయాల జోలికి వెళ్లలేదు. రాజకీయ నాయకులు ఈ జెండా నిర్మాత దగ్గరకు రాలేదు. దీపం చుట్టూనే చీకటి ఉంటుంది. మన జెండాకూ అది కొంత వర్తిస్తుంది. మన మువ్వన్నెల జెండా స్వాతంత్య్రోద్యోమ ప్రస్థానంలో ఉద్భవించింది. ఆ ఉద్యమంలోని తాత్వికతను రెపరెపలాడించింది. కానీ ఆ జెండా అందరి త్యాగాలను గుర్తించినట్టేనా? ఇందులో చిన్న మినహాయింపు పెద్ద చేదునిజమనే చెప్పాలి. పింగళి వెంకయ్యగారి త్యాగమే ఆ మినహాయింపు. ఆయన త్యాగం దేశానికి గుర్తులేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆ గుర్తుంపును ఆయన కోరుకోలేదు కానీ, తన విల్లులో చివరి కోరిక ఒకటి వెలిబుచ్చారు. తన పార్థివదేహం మీద(జూలై 4,1963లో బెజవాడలో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు) జాతీయ పతాకాన్ని కప్పాలని కోరుకున్నారు. అది మాత్రం భారత జాతి తీర్చింది. కానీ ఆ జెండా ఆయన భౌతికదేహాన్నే కాదు, ఆయన త్యాగ నిరతినీ, ఆయన చరిత్రనీ కూడా కప్పేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement