
ఒక్కసారి ఓడిపోయి చూడు!
‘గెలుపుదేముందిరా మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.ఒక్కసారి ఓడిపోయి చూడు...ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం అవుతుంది’ (పిల్లజమీందారు) అని నీతులు చెప్పగలడు.‘మీ అబ్బాయి బాగున్నాడు.హైటు, ఆ పద్ధతీ అది... నా దృష్టిలో పడ్డాడు’ (ముకుందా) అని కూడా అనగలడు.‘దృష్టిలో పడ్డాడు’ అనే మాటకు అర్థం ‘వాడి అంతు తేలుస్తా’ అనే విషయం ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ గొంతులోని మెలిక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాదు ‘విలన్’ గా కూడా ప్రేక్షకులకు చేరువైన రావు రమేష్ ఈ వారం మన ‘ఉత్తమ విలన్’తెలుగు సినిమాలో విలనిజానికి రావుగోపాల్‌రావు ఎన్‌సైక్లోపీడియాలాంటి వారు.
దర్పం నుంచి డైలాగు డెలివరీ వరకు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. రావుగోపాల్‌రావు కుమారుడిగా తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారో తెలియదుగానీ విలనిజంలో తనదైన సై్టల్‌ను క్రియేట్ చేసుకొని ప్రత్యేకతను చాటుకుంటున్నారు రావురమేష్. నిజానికి నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు రమేష్. స్టిల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చెన్నైలోని బ్రిటీష్, అమెరికన్ లైబ్రరీలలో గంటలతరబడి ఫొటోగ్రఫీ పుస్తకాలను అధ్యయనం చేసేవారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కాలిఫోర్నియాలో యాక్షన్, యానిమేషన్ కోర్సు చేయాలనుకున్నా, కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.
తండ్రి చనిపోయిన తరువాత తన గమ్యం ఏమిటో తేల్చుకోలేకపోయారు రమేష్.
ఏడు సంవత్సరాలు అలా గడిచిపోయాయి!
రమేష్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు... ఒక రచయిత కూడా ఉన్నాడు. సొంత కథతో డైరెక్షన్ చేయాలనుకున్నారు. ‘‘దర్శకత్వం కాదు... ముందు నటుడవ్వు’’ అంటూ వాళ్ల అమ్మగారు బ్రెయిన్‌వాష్ చేయడంతో ఎట్టకేలకు టీవీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు. సీరియల్స్‌లో నటిస్తున్న టైమ్‌లో ‘సీమసింహం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ సిమ్రాన్ సోదరుడిగా డైలాగ్‌లేని చిన్న క్యారెక్టర్.‘రావుగోపాల్‌రావుగారి అబ్బాయి’ అనే గుర్తింపుతో తనకు సినిమాల్లో అవకాశాలు పరుగెత్తుకుంటూ వస్తాయి అనుకున్నారు రమేష్. కాని తాను ఊహించింది తప్పని ఆ తరువాతగానీ తెలిసిరాలేదు! బ్యాక్ టు చెన్నై... మళ్లీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు.
చిత్రసీమలో దేనికైనా టైమ్ రావాలంటారు.మూడు సంవత్సరాలు ఆలస్యంగా ‘గమ్యం’ రూపంలో ఆ టైమ్ రానేవచ్చింది. ఆ సినిమాలో రమేష్ పోషించిన నక్సలైట్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి ‘ఒక్కడున్నాడు’ సినిమాలో చిన్న వేషం వేశారు. ఆ తరువాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.‘మగధీర’ ‘కొత్త బంగారు లోకం’ ‘ఆవకాయ బిర్యానీ’... మొదలైన సినిమాలతో రమేష్ కెరీర్ స్పీడందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాదు... విలన్‌గా కూడా తన సత్తా చాటి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు రమేష్.
రావు రమేష్ నటుడు మాత్రమే కాదు...మంచి చదువరి... రచయిత.ఫొటోగ్రíఫీ ప్రేమికుడు.పుస్తకాల్లో చదివిన అపార విషయాలు ఆయనలో ‘రచయిత’కు ఉపకరించవచ్చు. రచయితగా ‘భావుకత’ ‘ఊహాశక్తి’ తనలోని ‘ఫొటోగ్రాఫర్’కు ఉపకరించవచ్చు. ఇవన్నీ కలసి ఆయన నటనలో పరిణతి తీసుకువచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చనిపోవడానికి సంవత్సరం ముందు మహానటుడు రావుగోపాల్‌రావు తన కుమారుడిని పిలిచి... ‘‘ఏం కావాలనుకుంటున్నావు?’’ అని అడిగారు.షేర్‌మార్కెట్ గురించి ఆసక్తి ఉన్నట్లు చెప్పారు రమేష్.‘‘షేర్‌మార్కెట్ అంటే నీకోసం నువ్వే బతకాలి. నలుగురితో బ్రతికే ప్రొఫెషన్ ఎంచుకో’’ అని సలహా ఇచ్చారు రావుగోపాలరావు.నలుగురితో బ్రతికే వృత్తినే కాదు, నలుగురి చేత ప్రశంసలు అందుకునే వృత్తిని ఎంచుకొని ‘రావు రమేష్’గా వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకొని ‘శబ్బాష్’ అనిపించుకుంటున్నారు.