ఈ బసవరాజు బయటికి వస్తే... ఇక అంతే!
ఉత్తమ విలన్
ఇతని పేరు బసవరాజు.
తను సహజంగా బయటికి రాడు.
వచ్చాడంటే ఏదో ఒక దారుణం జరుగుతుంది.
అతడి అన్న రామరాజు... లోకల్ ఎం.ఎల్.ఏ.
ఆలోచన అతనిది.
ఆచరణ ఇతనిది.
పై పరిచయ వాక్యాలు బసవరాజుగా నటించిన ‘రాహుల్ దేవ్’ గురించి ‘తులసి’ సినిమాలో వినిపిస్తాయి. విలన్ అంటే... డైలాగులతోనైనా భయపెట్టాలి. దేహదారుఢ్యంతోనైనా భయపెట్టాలి. హావభావాలతోనైనా భయపెట్టాలి. అలా అని... రాహుల్ దేవ్ వీర శూర భీకర... పంచ్ డైలాగులు వాడలేదు. అదే పనిగా తన ‘ప్యాక్’ బాడీని ప్రదర్శించలేదు. హావభావాలు కూడా అతిగా ప్రదర్శించలేదు. ‘ఎంత చేయాలో అంత’ అనే లెక్క ప్రకారమే నటిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప... ప్రేక్షకులను భయపెట్టడానికి నటనతో నానా తిప్పలు పడినట్లు కనిపించదు.
‘టక్కరి దొంగ’ సినిమాలో ‘రేయ్ నేను నీ తమ్ముడిని రా’ అని ఒకవైపు బంధం గుర్తు తెస్తూనే... మరోవైపు... నిజం చెప్పించడానికి పది ఛాన్సులు ఇవ్వగలడు. ఆ తరువాత... ఏ ఛాన్సూ ఉండదు. అడకత్తెరతో వేళ్లను ఒక్కటొక్కడిగా కట్ చేయగలడు.మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో ‘శాకా’గా తెలుగు తెరకు పరిచయం అయిన రాహుల్‌దేవ్... మొదటి సీన్‌తోనే ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. ఆ సినిమా బాగా ఆడి ఉంటే... తెలుగు తెరపై రాహుల్ దేవ్ మరింత బాగా పాపులరై ఉండేవాడేమో.
‘నా బెంగుళూరులో నన్ను కొట్టి బతుకుదామనే’ అని ‘బసరావజు’గా వార్నింగ్ ఇచ్చినా...‘నన్ను ఎదిరించాలంటే... ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలి’ అంటూ శ్రీశైలంగా ‘చిన్నోడు’ సినిమాలో తన శక్తి ఏమిటో చెప్పదలిచినా.... రాహుల్ దేవ్ అంటే విలన్. ఒక స్టైలిష్ విలన్. అతని విలనిజం నడకలో ఉందా, పల్చటి పొడవాటి తల వెంట్రుకలలో ఉందా, కండల్లో ఉందా... కళ్లలో ఉందా... కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే! హీరో పర్సనాలిటీ ఉన్న రాహుల్ ‘విలన్’ ఎలా అయ్యాడు?తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందట. డైరీలో మనమొకటి రాసుకుంటే... విధి మన నుదుట మరొకటి రాస్తుందట. రాహల్ దేవ్ మొదట మోడల్.
ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాడు.అయితే ‘మోడల్’ కావాలనిగానీ, ‘యాక్టర్’ కావాలనిగానీ ఎప్పుడూ అనుకోలేదు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ‘ఇలా కావాలనుకుంటున్నాను’ అని చెప్పే పరిస్థితి ఇంట్లో లేదు. ఒంట్లోనేమో ధైర్యం లేదు.నాన్న ఐపీఎస్ ఆఫీసర్, అమ్మ టీచర్. చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో తన డ్రీమ్ గురించి రాహుల్‌కు పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. కాలేజీ రోజుల్లో ఒక డిస్కోలో రాహుల్‌ను చూసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ ఖోల్సా రేమండ్స్ కోసం మోడలింగ్ చేయమని అడిగాడు. రాహుల్‌కు మోడలింగ్ గురించి ఏమీ తెలియదు, రోహిత్ ఖోల్సా గురించి కూడా ఎప్పుడూ విని ఉండలేదు.
‘ఒక్కసారి ట్రై చేసి చూద్దాం’ అని రంగంలోకి దూకాడు. అలా... మోడల్ అయ్యాడు.ఆ తరువాత... ‘దస్’ సినిమాతో వెండితెర మీదికి వచ్చాడు.సాధారణంగా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తరువాత... సినిమాల్లోకి వస్తారు. రాహుల్ మాత్రం... సినిమాల్లోకి వచ్చాక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘ఛాంపియన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ‘నసీర్ అహ్మద్’గా ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు.
‘‘మోడలింగ్‌లో పర్సనల్ స్టైల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. అయితే నటన ఇందుకు విరుద్ధం. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు పాత్రే కనిపించాలి తప్ప మనం కాదు’’ అంటాడు రాహుల్. అందుకే... తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తన పేరుతో కంటే... ‘సాధు’ ‘బసవరాజు’ ‘వీరుభాయి’ మొదలైన పాత్రలతోనే రాహుల్ దేవ్ ఫేమస్ అయ్యాడు.‘మోడల్స్ నటులుగా మారితే వారి నటన అంతంత మాత్రంగానే ఉంటుంది’ అనే విమర్శ తప్పని... రాహుల్ దేవ్ విలనిజాన్ని చూస్తే మరోసారి అర్థమవుతుంది. అందుకే... రాహుల్ కేవలం నటుడు మాత్రమే కాదు ‘ఉత్తమ విలన్’ కూడా.