అద్దంలో చూసుకుని మురిసే స్వామి | Sri Venkateswara swami used to show his face in mirror | Sakshi
Sakshi News home page

అద్దంలో చూసుకుని మురిసే స్వామి

Published Sun, Sep 28 2014 12:37 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

అద్దంలో చూసుకుని మురిసే స్వామి - Sakshi

అద్దంలో చూసుకుని మురిసే స్వామి

శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల కింద దేదీప్యమైన దివ్యకాంతులతో వెలిగే భుజములు (కోణాలు) ఉన్న చిత్రం ఉన్నదని ... నమ్మాళ్వారు తన పాశురం ‘తిరుమాల్ - ఇరబ్- సోలై’ ద్వారా తెలియజేశారు. స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో  గర్భాలయ మూలమూర్తికి  ఆదర్శము (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు... ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం.

8వ శతాబ్దంలో వైఖానస మహా పండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.  ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు.
  గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం  ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది.

లేగదూడతో సహా గోవును స్వామి వారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు.  ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు  ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాల ధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది... అటువంటి ధారోష్ణం కలిగిన పాలను  నివేదనగా సమర్పించేవారు.  ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడను ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది.

 గజముఖాన్ని దర్శించే స్వామి
  స్వామివారు ప్రథమ వీక్షణ (తొలి చూపు)కై గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు.  గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు.  శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో  రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలా స్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది.  శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు.
 
 శ్రీవారి పద్మపీఠం:  దివ్యతేజో రహస్య యంత్రం
  శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధృవమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాద పద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది.
 
  క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజిత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాద పద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది.
 మా చిరునామా: ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement