తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్థానిక పద్మావతి అతిథిగృహం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి.. అర్చకులతో కలసి ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రం అందజేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీలను అందజేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ కుటుంబ సమేతంగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్‌కుమార్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. తిరుమల నుంచి సాయంత్రం రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి 5.30 గంటలకు వైమానికదళ విమానంలో అహ్మదాబాద్ వెళ్లారు.
రాష్ట్రపతి దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి
రేణిగుంటలో ఘనస్వాగతం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదనరెడ్డి, వెంకటేగౌడ్, ఎంఎస్ బాబు, ఆదిమూలం, శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతికి పరిచయం చేశారు. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతిరాణా టాటా, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమే‹Ùరెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను అడ్డగించిన విజిలెన్స్ అధికారులు
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ఆలయంలోకి వెళ్లిన అనంతరం కలెక్టర్‌ను, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ విజయారావును లోపలికి వెళ్లకుండా ఆపేశారు. తాను కలెక్టర్‌నని చెప్పినా.. ‘మీ పేర్లు నా వద్ద ఉన్న లిస్టులో లేవు’ అంటూ నిలువరించారు. దీంతో కలెక్టర్ వెనుదిరిగి తన వాహనం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అదనపు ఎస్పీ సుప్రజ కలెక్టర్ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
రేణిగుంట (చిత్తూరు జిల్లా): రాష్ట్రపతి కోవింద్‌కు స్వాగతం పలికేందుకు మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment