
సెలబస్: పాదముద్రలు
గోదావరి నీళ్లు తాగినవారికి కవిత్వం అలవోకగా వచ్చేస్తుందంటారు. భాస్కరభట్ల రవికుమార్‌ని చూస్తే అది నిజమేననిపిస్తుంది.
గోదావరి నీళ్లు తాగినవారికి కవిత్వం అలవోకగా వచ్చేస్తుందంటారు. భాస్కరభట్ల రవికుమార్‌ని చూస్తే అది నిజమేననిపిస్తుంది. రాజమండ్రిలో అప్పట్లో ఏ కవి సమ్మేళనం జరిగినా... భాస్కరభట్ల ముందుండి తీరాల్సిందే! ‘యువస్వరం’ పేరుతో ఓ సాంస్కృతిక సంస్థను కూడా నడిపారు. ‘స్టార్ లిరిక్ రైటర్’గా ఉన్నా కూడా... మనసులో పొంగే భావాలను ఇప్పటికీ ఇలా కవితలుగా రాసుకుని, మానసిక సంతృప్తి పొందుతుంటారు. ఈ ‘కవి’కుమార్ రాసిన కొన్ని మినీ కవితలు ‘సాక్షి’కి ప్రత్యేకం...
పాతచీర
మొహం దాచేసుకుంది...
బొంతలో!
శీతాకాలం
తెలవారుఝాము
మంచు కురుస్తోంది...
అప్పుడే వాయతీసిన
వేడి వేడి ఇడ్లీల మీద పొగలా!
ఊరెళ్లిన
మా ఆవిడని
పదే పదే గుర్తుచేస్తూ
వెక్కిరిస్తోంది...
అద్దం మీద బొట్టుబిళ్ల!!
ఇప్పుడంటే రెండే గానీ...
చిన్నప్పుడు నాకు
మూడు కళ్లు...
పుస్తకంలో
దాచుకున్న
నెమలికన్నుతో కలిపి!!
నా గుండెనే గుడిలా చేసి
నిన్ను కొలువుండమంటే...
నువ్వేమో
ఊపిరాడటం లేదనీ
ఉక్కబోస్తోందనీ
నన్ను తిట్టుకుంటున్నావ్!
లైఫ్‌బాయ్ సబ్బు
రెండు ముక్కలయ్యింది...
ఒక మధ్యతరగతి జ్ఞాపకం!
ఎప్పుడో టూరింగ్ టాకీస్‌లో
చూసిన సినిమా...
ఇప్పుడు మళ్లీ
నా హోమ్‌థియేటర్‌లో..!
ప్చ్...
ఒళ్లో కూచోబెట్టుకున్న తాతయ్యే లేడు!
నాలుక మీద రుచిమొగ్గలు
పువ్వులవుతున్నాయ్...
వంటింట్లోంచి కమ్మని వాసన!!
- భాస్కరభట్ల రవికుమార్