సత్వం: సాంఘిక చరిత్రకారుడు | suravaram pratap reddy is a Social historian | Sakshi
Sakshi News home page

సత్వం: సాంఘిక చరిత్రకారుడు

Published Sun, May 25 2014 2:53 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

సత్వం: సాంఘిక చరిత్రకారుడు - Sakshi

సత్వం: సాంఘిక చరిత్రకారుడు

సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు.‘మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే’నంటూ చరిత్రను సామాన్యీకరించి, దానిలో ఆత్మమాంసాల్ని నింపారు సురవరం ప్రతాపరెడ్డి. ‘రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో,  ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే!’ అన్నారు సురవరం- ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పీఠికలో.
 
 ‘తెనుగు సారస్వతము, శాసనములు, కైఫీయత్తులు, నాణెములు, సామెతలు, దానపత్రములు, సుద్దులు, జంగమకథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు’ ఇలాంటి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములను సమగ్రదృష్టితో చూస్తూ, నిఘంటువులలో లేని పదాలకు అర్థనిర్ణయం చేస్తూ, ‘ఒక జీవితకాలపు ముక్తఫలం’ వంటి గ్రంథరాజాన్ని తెలుగునేలకు కానుక చేశారు.
 
 ఇంకెన్నో జీవితాలకు సరిపడిన సాఫల్యతను కూడా ఆయన అందుకున్నారు. ‘ప్రచారకుడుగా, పరిశోధకుడుగా, విద్యార్థి వసతిగృహ నిర్వాహకుడిగా, న్యాయవాదిగా, పత్రికా రచయితగా, పుస్తక ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అనేక ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రోత్సాహకుడిగా’ అనేక పాత్రల్లోకి పరిణమించిన ప్రతాపరెడ్డి... అప్పటి కాలం విసిరిన సవాలుకు ఒక దీటైన జవాబు.
 
 సాహిత్యమూ రాజకీయమూ విడదీయలేని కాలంలో, తెలంగాణను తట్టి మేల్కొల్పవలసిన సందర్భంలో ‘గోల్కొండ’ పత్రికను నడిపారు. సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు. తానూ మూడు నాలుగు కలంపేర్లతో రాశారు. అత్యధిక ప్రజానీకపు భాషకు మన్నన దక్కని వాస్తవాన్ని మ.ఘ.వ.(మహా ఘనత వహించిన) నిజాం ప్రభువువారికి మరాఠీలు, కన్నడిగులను కూడా కలుపుకొని ఇలా నివేదించారు: ‘తమ మాతృభాషలను ప్రేమించుట ఉర్దూవారికివలెనే ఇతర మూడు భాషల వారికిని సహజమనుట గమనించవలసియుండును’.
 
 ‘రెండు కోట్ల రూపాయీల’ పైబడిన వ్యయంతో భాగమతి కోసం ఖులీ కుతుబ్‌షా తలపెట్టిన భాగ్యనగరం నిర్మాణం గురించి పాదుషా ఆజ్ఞను ఇలా ప్రస్తావిస్తారు: ‘గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. ఆమిర్లకు ఇబ్బందిగావుంది. నదికి అవతలిభాగంలో నగరనిర్మాణం చేయవలసింది. నాలుగుబాటలు నాలుగువీధులుండవలెను. నాలుగుకమానులు నాలుగుదిక్కుల కట్టవలెను. 14,000 దుకాణాలుండవలెను. 12,000 మొహల్లాలు(వాడలు) ఉండవలెను’.
 
 తెలంగాణలో కవులే లేరన్న విమర్శకుగానూ 354 మంది కవుల కవితలతో కూడిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ద్వారా ఆరోగ్యకరమైన సమాధానమిచ్చారు. అశ్లీల కథలుగా ముద్రపడి తిరస్కరణకు గురవుతున్న చలం కథల్ని ధైర్యంగా ‘సుజాత’లో ప్రచురించారు.సంస్కృతం, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలు తెలిసిన ప్రతాపరెడ్డి ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషములు’, ‘హైందవ ధర్మవీరులు’, కథలు, వ్యాసాలు రాశారు. మతపరమైన అంశాలు రాసినప్పుడు, ఆయనలోని ఆస్తికుడిని హేతువాది త్రోసిరాజన్నాడు. ‘ఇట్టి విమర్శ పూరాచారాభిమానులకు సరిపడద’నీ, వారికి ఆగ్రహము కలుగునని ఎరిగినప్పటికీ... చారిత్రక విమర్శలలో ఆగ్రహానుగ్రహములకు తావులేదని కూడా ఆయన ఎరుగును.  హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన ఈ నిక్కమైన వైతాళికుడు, ‘ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నావంటివారు ఏమియును పనికిరారు’ అని బాధపడ్డారు. కానీ సాహిత్యపు వీధుల్లో ఆయన అధిరోహించిన పల్లకీకి భుజం ఆనడానికి సిద్ధపడేవాళ్లెందరో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement