ఉత్తరం: ఆ ఒక్కటి... అన్ని నాశనాలకు నాంది! | Tension leads to all evils | Sakshi
Sakshi News home page

ఉత్తరం: ఆ ఒక్కటి... అన్ని నాశనాలకు నాంది!

Published Sun, Sep 8 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

ఉత్తరం: ఆ ఒక్కటి... అన్ని నాశనాలకు నాంది!

ఉత్తరం: ఆ ఒక్కటి... అన్ని నాశనాలకు నాంది!

ఆరోగ్యంగా ఉండాలంటే... ఏం చేయాలి. ఎందుకో ఈ ప్రశ్న విలువ రోజురోజుకు పెరుగుతోంది. కొందరు చక్కగా తింటే ఆరోగ్యం అంటారు. ఇంకొందరు శారీరక శ్రమ ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటారు. మరికొందరు తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం అంటారు... అయితే, ఇవన్నీ  ఆరోగ్యవంతమైన దేహానికి అవసరమే గాని అంతకంటే ప్రాధాన్యమైన విషయం ఒకటుంది. మీరు వ్యాయామం చేసినా, సరిగా నిద్రపోయినా, పౌష్టికాహారం తీసుకున్నా కలిగే లాభం ‘ఒత్తిడి’ వల్ల మాయమవుతుంది. చిల్లు పడిన కుండలో ఎంతసేపు నీరు పోసినా అది నిండదు. కాబట్టి ఒత్తిడితో కూడుతున్న జీవితానికి మిగతా ఎన్ని ఉపశమన చర్యలు తీసుకున్నా నిష్ఫలమే. కాబట్టి... ముందు ఆ ఒత్తిడిని తరిమేయాలి. అసలు ఒత్తిడి ఉంటే కలిగే నష్టాలేంటో తెలుసా... దాంపత్యంలో శృంగార సుఖం తగ్గుతుంది. ఇంకా.. పీరియడ్స్ సమస్యలు, జుట్టురాలడం, మొహంలో కళ తగ్గడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, నిద్రలేమి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగడం వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. మరి ఆ ఒత్తిడిని ఎలా తొలగించాలి?
 
 మొట్టమొదట చేయాల్సిన పని అపరిష్కృత సమస్యలు, మీ చేతుల్లో పరిష్కారం లేని సమస్యలు గురించి ఆలోచించడం మానేయండి. పనులన్నీ క్రమపద్ధతిన చేయడం అలవరచుకోండి. చేయగలిగినంత చేయండి, చేయలేనిది వదిలేయండి ఇక మళ్లీ దాని గురించి ఆలోచించకండి. ఆర్గుమెంట్లు మానేయండి. మీ పరిధి దాటి సమస్యలను పట్టించుకోకండి. ఇష్టమైన పనులు చేయండి. ఊపునిచ్చే సంగీతం వినండి. కుదరితే మసాజ్ చేయించుకోండి. ఒక సరదా వ్యాపకం అలవాటు చేసుకోండి. టెన్షన్ పెంచే టీవీ సీరియళ్లు మానేయండి. బద్ధకం బాడీకి ఉండదు, మనసుకే ఉంటుంది. మీ పనులు మీరే చేసుకోవడం అలవరుచుకోండి. చక్కటి ప్రసంగాలు వినండి, పుస్తకాలు చదవండి... చివరగా ఒక్క విషయం. మీరెన్ని చేసినా హాయిగా బతకడానికే కదా. దాన్ని నాశనం చేసే పనులు ఏవైనా, ఎంత విలువైనవైనా మానేయండి. అంతే!
 
 చీర కట్టు నేర్పించే పాఠాలు!
 వండటం, చీర కట్టడం... చేపపిల్లకు ఈతలాగా, ఆడపిల్లకు డిఫాల్ట్‌గా వచ్చే లక్షణాలు. కాలం మారింది. ఆడపిల్ల మారింది. అందుకే... అవి నేర్పించడమే వ్యాపారం అయ్యింది కొందరికి. అది సరదా వ్యాపారం ఇంకొందరికి. కానీ... అవి నేర్చుకునే వారికి మాత్రం అది ఎంతో ఆసక్తికరం. వంటయినా టీవీల్లోనూ, పేపర్లోనూ వీడియోలుగా, వ్యాసాలుగా వస్తాయి కాబట్టి... ఎలాగోలా నేర్చుకుంటున్నారు... కానీ, చీరకట్టడం నేర్చుకునే అవకాశాలు కాస్త తక్కువే అనే భ్రమలుండే అవకాశం ఉంది కొందరికి... సర్వసమస్యలకు పరిష్కారం వెతికిపెట్టే ఇంటర్‌నెట్ ఆ పని కూడా చేస్తోంది.
 
 దాసి... అనే ఓ బ్లాగర్ మీకు చీర ఎలా కట్టాలో నేను నేర్పుతా అంటున్నారు. ఓ మోడల్‌ను ముందుపెట్టుకుని ఎలా కట్టాలో కట్టి... చక్కగా చూపిస్తున్నారు. అవి యూట్యూబ్ వీడియోలే కావడం వల్ల మీరు ఎంచక్కా రివైండ్ చేస్తూ అలా కట్టడం వచ్చేదాకా చూసుకోవచ్చు. మీకు నచ్చితే వేరేవారికీ చూపొచ్చు. ఇదీ ఆ బ్లాగ్ అడ్రెస్: www.wearasari.wordpress.com ఇప్పటివరకు నలభై రకాలుగా చీర కట్టే ఆధునిక, సంప్రదాయ విధానాల చీరకట్టు విధానాలు ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ఎలాగైనా మీకు 108 మార్గాలు చెబుతానని ఆ బ్లాగరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ నలభై రకాలు నేర్చుకుని రోజుకో రకంగా చీరకట్టి అందర్నీ ఆశ్చర్య పరచండి మరి! ఇంకా గూగుల్‌ను ‘హౌ టు వియర్ శారీ’ అని అడిగితే బోలెడు రకాల వీడియోలు చూపిస్తుంది. ఎంతోమంది నిపుణులు ఈ వీడియోలు అందుబాటులో పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement