నెత్తుటి జ్ఞాపకం | Texas police get complaints for large 'In God We Trust | Sakshi
Sakshi News home page

నెత్తుటి జ్ఞాపకం

Published Sun, Sep 13 2015 2:47 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

నెత్తుటి జ్ఞాపకం - Sakshi

నెత్తుటి జ్ఞాపకం

నిజాలు దేవుడికెరుక
ఫిబ్రవరి 4, 1986... ఆస్ట్రేలియా... ‘‘ఊరుకో గ్రేస్. అనీటాకేమీ కాదు’’... గుమ్మం దగ్గరే నిలబడి కన్నీళ్లు పెట్టుకుం టోన్న భార్యకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు గ్యారీ లిన్ష్. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. గ్రేస్ కన్నీళ్లు ఆగలేదు. ‘‘ఎలా ఊరుకోమంటావు గ్యారీ? ఒకటా రెండా... నలభై ఎనిమిది గంటలయ్యింది అనీటా జాడ తెలియక. తనకి ఏమయ్యిందో ఎలా ఉందో తెలీక ఈ తల్లి ప్రాణం ఎంతగా కొట్టుకుంటోందో నీకు అర్థం కాదు.’’
 
గ్యారీ మాట్లాడలేదు. ఏం మాట్లాడ తాడు! పాపం అతని పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. రెండు రోజుల య్యింది అనీటా ఇంటికి రాక. చుట్టు పక్కలంతా వెతికారు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కానీ తన జాడ మాత్రం తెలియ లేదు. కూతుర్ని తలచుకుంటూ గ్రేస్ కుమిలిపోతోంది. ఆమెను ఓదార్చలేక, తనను తాను సంభాళించుకోలేక గ్యారీ అవస్థ పడుతున్నాడు. అంతలో వచ్చింది వాళ్ల చిన్న కూతురు క్యాథరీన్.
 ‘‘అమ్మా... నాన్నా... ఇలా దిగాలు పడిపోతే ఎలా? పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం కదా? ధైర్యంగా ఉం....
 
క్యాథరీన్ మాట పూర్తి కాకముందే ఏదో వాహనం వచ్చి గేటు ముందు ఆగింది. చూస్తే పోలీస్ జీప్. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కెనడీ జీపు దిగి వస్తున్నాడు.
  అనీటా గురించి ఏమైనా తెలిసిందే మోనన్న ఆశ ఓపక్క, అది తాము విని తట్టుకోలేని వార్త అవుతుందేమోనన్న భయం మరోపక్క ఆ ముగ్గురినీ ఉక్కిరి బిక్కిరి చేయసాగింది.
 ‘‘ఎలా ఉన్నారు మిస్టర్ గ్యారీ’’ అన్నాడు కెనడీ, వాళ్ల దగ్గరకు వచ్చి. గ్యారీ సమాధానం చెప్పేలోపే గ్రేస్ ఆతృతగా అడిగింది... ‘‘అనీటా గురించి ఏమైనా తెలిసిందా?’’
 
ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు కెనడీ. తర్వాత జేబులోంచి ఓ ఉంగరాన్ని బయటకు తీశాడు. ‘‘ఇక్కడికి కొన్ని కిలో మీటర్ల దూరంలో పొలాలు ఉన్నాయి. వాటిలో ఓ యువతి మృతదేహం దొరి కింది. గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. తన చేతికి ఒక ఉంగరం ఉంది. అది మీ అమ్మాయిదేమో చూస్తారని...’’
 ‘‘నో’’... పరిసరాలు దద్దరిల్లేలా అరిచింది గ్రేస్. ‘‘అలా అనొద్దు ఇన్‌స్పెక్టర్. నా బిడ్డకి ఏమీ కాదు. తను ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటుంది.’’
 జాలేసింది కెనడీకి.

ఆ అమ్మాయి అనీటాయో కాదో తనకీ తెలియదు. కన్‌ఫామ్ చేసుకోవాలని వచ్చాడు. కానీ గ్రేస్ పరిస్థితి చూశాక ఆమెను కదిలించ డానికే బాధనిపిస్తోంది. అందుకే ఆ ఉంగరాన్ని గ్యారీకి అందించాడు. ‘‘మీరైనా చెప్పండి. ఇది మీ అమ్మాయి అనీటదా?’’
 ఆ ఉంగరాన్ని గబుక్కున లాక్కుంది గ్రేస్. అటూ ఇటూ తిప్పి చూసింది. ‘‘ఏంటి సర్ ఇది? దీన్నిండా మట్టి పేరుకు పోయి ఉంది. ఇది అనీటాది ఎందుకవు తుంది? తనది కాదు’’ అంది తిరిగిచ్చేస్తూ.
 
కెనడీ ఉంగరాన్ని అందుకోలేదు. ‘‘అది మట్టి కాదు మిసెస్ గ్యారీ... రక్తం. ఎండిపోయి అలా కనిపిస్తోంది.’’
 ఉలిక్కిపడింది గ్రేస్. ఠక్కున ఆ ఉంగ రాన్ని వదిలేసింది. ‘‘రక్తమా?’’ అంది కంగారుగా. అవునన్నట్టు తలూపాడు కెనడీ. క్యాథరీన్ ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని చూస్తూనే ఆమె కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. ‘‘అక్కా’’ అంటూ బావురుమంది.
 కెనడీకి అర్థమైంది. ఆ ఉంగరం అనీటాదే. ‘‘సారీ... బాడీ మార్చురీలో ఉంది. ఓసారి వచ్చి చూస్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం’’ అంటూ గేటువైపు నడిచాడు.
     
‘‘అనీటా... నా తల్లీ... నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’’... కూతురి మృతదేహం మీద పడి గ్రేస్ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆమెని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. గ్యారీ అయితే ప్రాణమున్న బొమ్మలా నిలబడ్డాడు.  తన బిడ్డకు పట్టిన గతికి కుమిలిపోతున్నాడు.
 కానీ క్యాథరీన్ ఏడవడం లేదు. కూర్చుని కుమిలిపోవడం లేదు. తన అక్కకి ఎందుకా పరిస్థితి ఏర్పడిందా అని యోచిస్తోంది. అంతలో కెనడీ వచ్చాడు.
 ‘‘మిస్ క్యాథరీన్... ఇది అనీటా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్. మీరిక బాడీని తీసుకెళ్లవచ్చు.’’
 రిపోర్ట్ అందుకోలేదు క్యాథరీన్. కెనడీ వైపు తీక్షణంగా చూసింది. ‘‘మా అక్కకి ఏం జరిగింది సర్?’’ అంది సూటిగా.
 
కెనడీ మాట్లాడలేదు. తన అక్కకి ఏం జరిగిందో తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకో గలదా? ఎంత దారుణంగా తమ కూతురు మరణించిందో, కన్ను మూసేముందు ఎంత నరకం అనుభవించిందో తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోవా? అని ఆలోచిస్తున్నాడు.
 ‘‘చెప్పండి సర్. మా అక్కని ఎవరు చంపారు?’’
 
పెదవి విప్పక తప్పలేదు కెనడీకి. ‘‘తనమీద గ్యాంగ్‌రేప్ జరిగింది క్యాథరీన్. వాళ్లు కొట్టిన దెబ్బలకి మీ అక్క ఒంట్లో ఎముకలు చాలావరకూ విరిగిపోయాయి. నరాలు చిట్లిపోయాయి. ఒళ్లంతా పదునైన ఆయుధాలతో గాట్లు పెట్టారు. చివరికి తన చేతివేళ్లు కూడా కోసేశారు. ఇంత ఘోరమైన రేప్‌ని నేనెప్పుడూ చూడలేదు.’’
 
మౌనంగా వింటోంది క్యాథరీన్. అప్పుడు కూడా ఆమె కళ్లు వర్షించడం లేదు. నిప్పులు కురుస్తున్నాయి. ‘‘నేను వాళ్లని చూడాలి సర్’’ అంది నిశ్చలంగా.
 ‘‘ఇంకా దొరకలేదు. ఆ ప్రయత్నం లోనే ఉన్నాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. ఐ ప్రామిస్’’ అన్నాడు కెనడీ.
 అన్న మాటను నిలబెట్టుకోవడానికి అతనికి దాదాపు నెల రోజులు పట్టింది. అనీటా మృతదేహం దొరికిన చోట ఎటు వంటి ఆధారాలూ దొరకలేదు. కానీ పోస్ట్ మార్టమ్ రిపోర్టును బట్టి ఆమెను రేప్ చేసింది ఐదుగురు వ్యక్తులని తెలిసింది.

ఆధారాలు దొరకనప్పుడు ఒక్క నిందితు డిని పట్టుకోవడమే కష్టం. అలాంటిది ఐదుగురిని పట్టుకోవాలి. అయినా అతడు టెన్షన్ పడలేదు. తన తెలివిని, అనుభ వాన్ని ఉపయోగించి ఇన్వెస్టిగేట్ చేశాడు.
 అనీటా నర్స్‌గా పని చేస్తోన్న హాస్పి టల్ దగ్గర మొదలైంది వేట. రెండో తేదీ సాయంత్రం ఎనిమిది గంటలకు అనీటా డ్యూటీ ముగిసింది. తర్వాత చిన్న పార్టీ ఉంటే స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లి భోంచేసింది. ఆపైన ఇంటికెళ్లేందుకు రోజూలాగే లోకల్ ట్రైన్ ఎక్కింది. స్టేషన్లో రైలు దిగింది. బయటకు వచ్చి, ట్యాక్సీ కోసం వెతికింది. కానీ అక్కడ ఒక్క ట్యాక్సీ కూడా లేదు. దాంతో నడక అందుకుంది.
 
హాస్పిటల్ డ్యూటీ రికార్డులు, రెస్టా రెంట్, రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల ద్వారా ఇంతవరకూ తెలిసింది. అప్పటి వరకూ అనీటా క్షేమంగానే ఉంది. కానీ స్టేషన్ నుంచి ఇంటికి నడక ప్రారంభించిన తర్వాతే ఏదో జరిగింది. అదే అర్థం కాలేదు పోలీసులకి. అనీటా ఫొటోలతో పోస్టర్లు తయారు చేశారు. ఆమె రోజూ ప్రయాణించే లోకల్ రైళ్లలో, స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనీటా ఇంటి వరకూ ఉన్న ప్రతి వీధిలో అంటించారు. ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పమన్నారు. వారి ప్రయత్నం ఫలించింది.

అనీటా పోస్టర్లు చూసిన ఓ పదిహే నేళ్ల పిల్లాడు తల్లిదండ్రుల్ని తీసుకుని పోలీ సుల దగ్గరకు వచ్చాడు. ఆ రోజు జరిగిం దంతా పోలీసులకు వివరించాడు. రోడ్డు మీద నడుస్తోన్న అనీటా దగ్గరకు ఓ కారు వచ్చి ఆగింది. ఐదుగురు యువకులు దిగారు. అనీటాని అసభ్యమైన మాటలతో వేధించారు. ఆమె తప్పించుకు వెళ్లాలని చూసింది. కానీ వాళ్లు వదిలి పెట్టలేదు. లాక్కెళ్లి కారులో పడేశారు. ఏడుస్తున్నా కనికరించలేదు. ఇదంతా తాను చూశానని ఆ పిల్లాడు పోలీసులకు చెప్పాడు. అతను చెప్పిన కారు వివరాలను బట్టి ఇన్వెస్టిగేషన్ మొదలైంది. చివరికి ఆ కారే ఐదుగురు నిందితులనూ పట్టించింది. ఆ ఐదుగురిలో ముగ్గురు అన్నదమ్ములే కావడం విచిత్రం!
     
‘‘మానవత్వమన్నదే మర్చిపోయి రాక్షసుల్లా ప్రవర్తించిన వీరికి మనుషుల మధ్య బతికే హక్కు లేదు. అందుకే వీరు జీవితాంతం జైలు గోడల మధ్యే మగ్గాలని తీర్పు ఇస్తున్నాను.’’
 న్యాయమూర్తి ఈ తీర్పు చెబుతున్న ప్పుడు క్యాథరీన్ కళ్లు తొలిసారి వర్షిం చాయి. అవి ఆనంద బాష్పాలు కాదు. తన అక్కను క్రూరంగా చంపిన కామాంధులను చంపేయకుండా జైలులో పెట్టమన్నందుకు బాధతో వచ్చిన కన్నీళ్లు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకే మాట అంది. ‘‘మా అక్కకి నరకం చూపించి చంపిన వాళ్లను సుఖంగా జైలులో విశ్రాంతి తీసుకొమ్మని తీర్పు ఇచ్చారు.

వాళ్లకంటే న్యాయస్థానమే మా అక్కకు ఎక్కువ అన్యాయం చేసింది.’’
 క్యాథరీన్ మాటలతో కొన్ని లక్షల మంది ఏకీభవించారు. వాళ్లంతా నేటికీ అనీటాకి న్యాయం జరగలేదని బాధపడు తున్నారు. యేటా ఫిబ్రవరి 2న ఆమె వర్థంతి సందర్భంగా రోడ్ల మీదకు వచ్చి సంతాపం తెల్పుతూనే ఉన్నారు. ఆమె ఆత్మశాంతికై ప్రార్థనలూ చేస్తున్నారు. ఆ ప్రార్థనలు అనీటా ఆత్మకు శాంతిని కలిగిస్తున్నాయా? లేక ఆమె కూడా తనకు న్యాయం జరగలేదని ఘోషిస్తోందా?!
 
అనీటా మరణం ఆస్ట్రేలియా దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం మహిళల భద్రత కోసం అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టింది. కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టింది. వాటిని సక్రమంగా అమలయ్యేలా అధికారులు చూస్తున్నారు. అది అనీటాకు తాము ఇచ్చే గౌరవం అంటున్నారు. వాళ్లు ప్రతియేటా అనీటా వర్థంతి రోజున, ఆమె పేరుమీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కులో జరిగే సంతాప సభల్లో పాల్గొంటు న్నారు. పోలీసులైతే ఆరోజున మహిళల రక్షణ గురించి క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. మరణించి ఇరవై తొమ్మిదేళ్లయినా అనీటా ఎవ్వరి మనసుల నుంచీ వెళ్లలేదు అనడానికి అనడానికి ఇదే సాక్ష్యం. ఆమె... తుడిచివేద్దామన్నా తుడవలేని ఓ నెత్తుటి జ్ఞాపకం!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement