వీళ్లకు అవంటే యమక్రేజ్!
పంచామృతం
ప్రతి మనిషికీ ఒక పిచ్చి ఉంటుంది. హాబీ రూపంలో కావొచ్చు, ఆసక్తిగా కావొచ్చు. ఆ పని ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి పిచ్చితో ప్రపంచంతో పనిలేదన్నట్టుగా బతికేయొచ్చనిపిస్తుంది. ఆ పిచ్చిలో ఉన్నప్పుడు మనకు మనమే ముద్దొస్తాం, మనకు మనమే గ్రేటనిపిస్తాం. మరి ఇదే విషయం గురించి కొంతమంది సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారి వ్యక్తిగత ఆసక్తులను గురించి వాకబు చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి...
పేరుకైతే ‘దబాంగ్ ఖాన్’ కానీ సల్మాన్‌ది కళాహృదయం. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రసిద్ధ పెయింటర్లు గీసిన వాటిని సేకరిస్తూ ఉంటాడు. అలాగే మనసు స్పందించినప్పుడు తను కూడా బ్రష్‌కు పని చెబుతూ ఉంటాడు.
కింగ్‌ఖాన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే మహా ఇష్టం. మార్కెట్‌లోకి వచ్చే అధునాతన స్మార్ట్‌ఫోన్స్, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్‌ను కొనేయడం అంటే షారూఖ్‌కు తెగ సంబరమట. ఏదైనా కొత్త గాడ్జెట్ కనిపిస్తే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడు. కొనే సామర్థ్యం ఉంది కాబట్టి ఎంచక్కా కొనేసుకొంటాడు. అలాగే ఆయన కార్ల పిచ్చి కూడా ఉంది. షారూఖ్ గ్యారేజ్‌లో కనీసం ఏడు కార్లు అయినా పార్కింగ్‌లో ఉండాల్సిందే!
నటనకు పరిపూర్ణ నిర్వచనంలా కనిపించే విద్యాబాలన్ ఆఫ్ ద రికార్డ్‌లో అచ్చమైన అతివ. ఆమెకు చీరలు సేకరించడం అంటే యమ క్రేజ్! పట్టు చీరలంటే పిచ్చి. విద్యను బాగా ఎరిగిన వారు ఇచ్చే సమాచారం ప్రకారం ఆమె వద్ద వెయ్యికిపైగా వెరైటీ వెరైటీ చీరలున్నాయి!
తండ్రి హీరోగా ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తాను హీరోయిన్‌గా అంతే స్టార్‌డమ్‌ను సంపాదించడం అనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్న సోనమ్ కపూర్ ఒక స్టైల్ దివా. ఆమె వార్డ్‌రోబ్ బ్రాండెండ్ వేర్‌తో నిండి ఉంటుంది. అలాగే సోనమ్‌కు హ్యాండ్‌బ్యాగ్స్ అంటే కూడా క్రేజే.
ఈమెకు సరికొత్త వంటకాల గురించి తెలుసుకొని వండటం అంటే తెగ ఆసక్తి. వంటల పుస్తకాలను సేకరించి అందులోని థియరీని ప్రాక్టికల్ చేసి తనకు తెలిసిన వారికి వండిపెట్టడం అంటే కంగనకు చాలా ఇష్టమట. వంట గురించి మంచి మొబైల్ అప్లికేషన్లు ఉంటే చెప్పరా? అంటూ తన సహచర నటీనటులను అడుగుతూ ఉంటుందట.