మస్కా!
పట్టుకోండి చూద్దాం
హరి, యమునలు చిలకా గోరింకల్లా కనిపించి కనువిందు చేస్తారు.
కొన్నిసార్లు మాత్రం...
పాము, ముంగిసల్లా పోట్లాడుకొని చుట్టుపక్కల వాళ్లను భయపెడతారు. అందుకే వారి సంసారం చాలామందికి ఒక పజిల్‌లా అనిపిస్తుంటుంది. ‘వాళ్లు కలిసి ఉంటారా?
కలిసి ఉన్నట్లు నటిస్తుంటారా?’ అనేది చాలామంది సందేహం.
ఒక రోజు ఊరి నుంచి హరి నాన్నగారు నారాయణరావు వచ్చాడు. వారం రోజుల పాటు ఉన్నాడు. మామగారు రావడం, ఇంట్లో వారం రోజుల పాటు ఉండడం యమునకు నచ్చలేదు. అలా అని ముఖం మూడ్చుకొని కూర్చోలేదు. మామగారిని చాలా మర్యాదగా చూసుకుంది. అందుకేనేమో...
నారాయణరావు వెళుతూ వెళుతూ కోడలితో అన్నాడు...‘‘నాకు కూతురు లేని లోటును తీర్చావు’’
యమున చిన్నగా నవ్వుతూ...
‘‘నా మామయ్యకు ఈ మాత్రం సేవ చేయాలేనా...’’ అంది.
నారాయణరావు వెళ్లిపోయిన తరువాత ఇల్లు యుద్ధరంగంగా మారింది.
‘‘మీ ఇంట్లో వాళ్లకు సేవ చేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా?’’ అని గట్టిగా అడిగింది యమున. ‘‘నీ బుద్ధ్ది మారదా? వచ్చిన వ్యక్తి మా నాన్నగారు... పరాయి వ్యక్తి కాదు... సొంత మామనే అవమానిస్తున్నావు. నువ్వు మనిషివా? రాక్షసివా!’’
ఆ రోజంతా తగాదా పడుతూనే ఉన్నారు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మాటలు లేవు.
మరుసటి రోజు జ్వరంతో హరి ఆఫీసుకు వెళ్లలేదు. మంచంలో నిద్రపోయి దగ్గుతున్న హరి దగ్గరికి యమున వచ్చింది...
‘‘లేవండీ... హాస్పిటల్‌కు వెళదాం’’ అన్నది.
ఈ మాటకు హరి చలించిపోయాడు.
మరోమాట మాట్లాడకుండా భార్యతో పాటు హాస్పిటల్‌కు వెళ్లాడు.
‘‘నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గొడవ పడ్డారు. ఇప్పుడు చూడు... ఎలా నవ్వుతూ వెళుతున్నారో’’ అనుకున్నారు ఇరుగు పొరుగు.
హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు... ‘థ్యాంక్స్’ అన్నాడు హరి.
‘‘థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా?’’ అంది యమున.
‘‘అమ్మో... నీతో ఎలా మాట్లాడినా సమస్యే’’ అన్నాడు అభయ్ నవ్వుతూ యమున భుజం మీద చేయివేస్తూ. ‘‘రేపు ఆదివారం కదా... ఎప్పటిలాగే ఇంట్లో వంటావార్పు బంద్. యస్‌ఆర్‌నగర్‌లో రుచులు అనే కొత్త రెస్టారెంట్ పెట్టారు. రేపు అక్కడ భోజనం చేద్దాం’’ అంది యమున. ‘‘ఓకే’’ అని బదులిచ్చాడు హరి.
ఆ తరువాత మూడు వారాల్లో... గోపి విషయంలో మాత్రం ఒకసారి తగాదా జరిగింది. గోపి, యమున కోలిగ్. గోపితో సన్నిహితంగా ఉండడం హరికి నచ్చలేదు.
‘‘అతడు నా అన్నలాంటి వాడు... ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకు’’ అని యమున వివరణ ఇవ్వడంతో తగాదా అక్కడికక్కడే ముగిసింది.
ఆ తరువాత మూడు వారాలకు...
ఆ రోజు ఆదివారం.
యమున ఎవరినో కూరలు తరిగే కత్తితో పొడిచి చంపిందనే వార్త ఫోన్‌లో విని పరుగు పరుగునా పోలిస్‌స్టేషన్‌కు వెళ్లాడు హరి. ఇంట్లోకి దూరిన అగంతకున్ని ఆత్మరక్షణ కోసమే యమున హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
‘‘అసలు ఏం జరిగింది?’’ యమునను ప్రశ్నించాడు హరి.
‘‘డోర్‌బెల్ మోగగానే మీరేమో అనుకొని తీశాను. తలకు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి నా మీదికి రాబోయాడు. ఏం చేయాలో తోచక... చేతిలో ఉన్న కూరగాయల కత్తితో పొడిచాను...’’ అని ఏడుస్తూ చెప్పింది యమున.
‘‘ఇందులో ఏదో తిరకాసు ఉంది. మీతో కొద్దిసేపు మాట్లాడాలి’’ అని తన గదిలోకి తీసుకెళ్లి యమునను ఎంక్వైరీ చేశాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. ఆమె చెప్పిన విషయం విని ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ... యమున ఇన్‌స్పెక్టర్‌తో ఏం చెప్పింది? అసలు ఇన్‌స్పెక్టర్ యమునను ఎందుకు అనుమానించాడు?
Ans:-
‘డోరు బెల్ మోగగానే మీరేమో అనుకొని తలుపు తీశాను’ అని చెప్పింది యమున. వచ్చింది భర్తే అని తెలిసినప్పుడు చేతిలో కత్తి పట్టుకొని ఎందుకు వెళ్లింది? ప్రతి ఆదివారం ఇంట్లో వంట చేయరు. మరి కూరలు తరిగే కత్తి ఆమె చేతిలో ఎందుకు ఉన్నట్లు?..’ ఈ కారణాలతోనే యమునను అనుమానించాడు ఇన్‌స్పెక్టర్. భర్తను చంపడానికే యమున కత్తితో వెళ్లింది. డోర్ తీసీతీయగానే... ఎదుటి వ్యక్తి ఎవరా? అనేది కూడా ఆలోచించకుండా ఆవేశంగా అగంతుకుడిని కత్తితో పొడిచింది.