విహారం: జయ్‌పూర్ - ఎడారిలో పచ్చని కాంతి | Tourism: Jaipur desert, a beautiful place | Sakshi
Sakshi News home page

విహారం: జయ్‌పూర్ - ఎడారిలో పచ్చని కాంతి

Published Sun, Sep 8 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

విహారం: జయ్‌పూర్ - ఎడారిలో పచ్చని కాంతి

విహారం: జయ్‌పూర్ - ఎడారిలో పచ్చని కాంతి

రాచరికానికి చిహ్నం రాజస్థాన్. దానికి చక్కటి ఆనవాలు రాజస్థాన్ రాజధాని జయ్‌పూర్ నగరం. సవాయ్ రెండవ జయ్‌సింగ్ కట్టించిన నగరం కావడంతో జయ్‌పూర్‌గా నామకరణం అయింది. ఇండియన్ టూరిజం ప్రతిష్టాత్మకంగా చూపించుకునే బాందినీ ప్రింట్ చేసిన తలపాగాలు, కుందన్ ఆభరణాలు ధరించిన యువతులు, ఒంటెల సవారీల వంటి వాటికి పుట్టిల్లు ఇది. జయ్‌పూర్‌లో అడుగుపెట్టిన తర్వాత నగర పర్యటన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక పట్టాన అర్థం కాదు. హవామహల్, నహర్‌ఘర్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జయ్‌ఘర్ ఫోర్ట్, సిటీప్యాలెస్, జల్‌మహల్, రామ్‌బాఘ్ ప్యాలెస్, సిసోడియా రాణి కా బాఘ్, ఆల్బర్ట్ మ్యూజియం, జంతర్‌మంతర్... ఇలా ప్రధానమైన నిర్మాణాల జాబితా కూడా పది దాటుతుంది. నగరానికి అన్ని వైపులా స్వాగత ద్వారాలు ఉంటాయి. లోపలికి అడుగు పెడితే ఆధునికత సంతరించుకుంటున్న పాశ్చాత్యఛాయలు కనిపిస్తాయి, పర్యాటక శాఖ ఊరించే కోటలను చూడాలంటే ఓల్డ్‌సిటీకి వెళ్లాలి. పాత నగరం మొత్తానికి ప్రహరీ గోడ ఉంటుంది. లోపల మొత్తం గులాబీమయమే. బ్రిటిష్ యువరాజు ఎడ్వర్డ్ 1876లో భారత్‌లో పర్యటించాడు. ఆ యువరాజుకి ఘనస్వాగతం పలకడానికి జయ్‌పూర్ రాజు సవాయ్‌రామ్‌సింగ్ ప్రతి నిర్మాణానికీ గులాబీ రంగు వేయించాడు. పింక్‌సిటీ అనే పేరు అప్పటి నుంచే వచ్చిందంటారు. నగరం మొత్తం రాజస్థానీ, మొఘల్ నిర్మాణశైలుల సమ్మేళనం. ప్యాలెస్‌లలో తోటలు చక్కటి ప్రణాళికతో ఉంటాయి.
 
 వెల్‌కమ్ టు సిటీప్యాలెస్!
 సిటీప్యాలెస్‌కి స్వాగతమందిరం ముబారక్‌మహల్. ఇక్కడి నుంచి ముందుకెళ్తే రెండవ మాన్ సింగ్ మ్యూజియం కనిపిస్తుంది. రాజకుటుంబాల జీవనశైలికి ప్రతీక ఇది. ఎంబ్రాయిడరీ దుస్తులు, బెనారస్ పట్టుచీరలు, రాజులు ధరించిన పైజామాలు, ఛోగాలు(చొక్కాలు), జమావర్ శాలువాలు, వడ్డాణాలు... చూడడానికి ఓపిక నశిస్తుంది తప్ప అవి తరగవు. రాజపుత్రులు ఆజానుబాహులు అనడానికి నిదర్శనం మొదటి మాధోసింగ్ దుస్తులే. ఈ రాజు ఏడడుగుల పొడవు ఉండేవాడని నిర్ధారిస్తున్నట్లు ఉంటాయి ఇవి. మహారాణి ప్యాలెస్‌లోని ఆయుధాగారంలో ఐదు కిలోల బరువైన కత్తి  ఉంటుంది. రాజపుత్రులు... జానపద కథల్లో విన్నంతటి బలశాలులే అని రుజువుచేస్తున్నట్లుగా ఉంటుందీ ఈ భారీ ఖడ్గం. రాజులు వార్థక్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వాహ్యాళికెళ్లేప్పుడు ఉపయోగించే చేతికర్రలు కూడా ఉంటాయి.

మరో సెక్షన్‌లోకి అడుగుపెడితే ఫిరంగులు, డబుల్ బ్యారెల్‌గన్, పిస్టల్‌లు ఉంటాయి. ఇక్కడ కనిపించే నెమలిపిడికత్తులు, పర్షియా ఆయుధాలు, దక్కనులో వాడే చేతి విల్లంబులు, బాణాలు... ఒక ఎత్తయితే కెంపులు, మరకతాలు పొదిగిన కత్తి మరో ఎత్తు. ఇది మహారాజా సవాయ్ రామ్‌సింగ్‌కు బ్రిటిష్ రాణి విక్టోరియా బహూకరించిన కత్తి. మ్యూజియం దాటి బయటకు వస్తే... గైడ్ వెంటే పర్యాటకుల అడుగులు దివాన్ ఈ ఖాస్, దివాన్ ఇ ఆమ్ వైపు పడతాయి. ఇవి రాజు ఆంతరంగికులను, ప్రజలను కలిసే మందిరాలు. దివానీ ఆమ్ (ఆర్ట్ గ్యాలరీ) పై కప్పుకి ఉన్న చిత్రలేఖనాలలో పొదిగిన రంగురాళ్లు ఇప్పటికీ మెరుపులీనుతుంటాయి. పెద్ద క్రిస్టల్ షాండ్లియర్ చూపుతిప్పుకోనివ్వదు. గ్యాలరీలోని చిత్రలేఖనాలలో రామాయణ సన్నివేశాలే ప్రధానం. మరికొంచెం ముందుకుపోతే చంద్రమహల్... ఈ మందిరం నుంచి గోవింద్‌జీ ఆలయం కనిపిస్తుంది. కృష్ణుని భక్తులైన రాజపుత్రులు ఆలయం కనిపించేటట్లు ఈ మహల్‌ను కట్టించుకున్నారు.
 
 రికార్డుకెక్కిన వెండికూజాలు!
 సిటీప్యాలెస్‌లో అత్యంత ఆకర్షణీయమైనవి వెండికూజాలు. మహారాజా రెండవ మాధోసింగ్ యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు రెండు కూజాల్లో గంగనీరు తీసుకెళ్లాడు. ఒక్కో కూజా సామర్థ్యం తొమ్మిది వేల లీటర్లు. యూరప్ పర్యటన కోసమే ఈ కూజాలను చేయించారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద వెండి పాత్రలుగా గిన్నిస్ బుక్‌లో రికార్డుకెక్కాయి.
 
 జంతర్‌మంతర్!
 ఇది ఖగోళశాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీక. ఢిల్లీ జంతర్‌మంతర్‌కి మాతృక కూడ. సవాయ్ జయ్‌సింగ్ నిర్మించిన ఐదు అబ్జర్వేటరీల్లోకి ఇదే పెద్దది (మిగిలినవి వారణాసి, ఉజ్జయిని, మధురలలో). ఇక్కడి నుంచి బయటకు వెళ్తే స్వాగతం పలికే నిర్మాణం హవామహల్. జయ్‌పూర్‌కి చిహ్నంగా పరిగణించే హవామహల్ కృష్ణుని కిరీటాన్ని పోలి ఉంటుంది. గవాక్షాల మాటున ఉన్న గదుల్లోంచి రాణివాసపు స్త్రీలు నగరంలో జరిగే వేడుకలు చూసేవారు. ఇక్కడి నుంచి జయ్‌ఘర్ ఫోర్ట్‌లో అడుగుపెడితే రాజమందిరాలు, ఉద్యానవనాలు, రిజర్వాయర్‌లు, ధాన్యాగారం, ఆయుధారాగం, ఆలయాలు ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనడానికి వీల్లేనంత పకడ్బందీగా ఉంటాయి ఈ కోటలు. జగత్ శిరోమణి ఆలయంలో భక్తమీరా కొలుస్తున్న కృష్ణుని విగ్రహం ఉంటుంది.
 
 తొలి రాజధాని అంబర్!
 రామ్ నివాస్ గార్డెన్‌లో ఆల్బర్ట్ హాల్ ఉంది. ఈజిప్టు మమ్మీ, పర్షియాలో తయారైన బంగారు తివాచీ ప్రధాన ఆకర్షణలు. జయ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపుగా పదికిలోమీటర్లు ప్రయాణిస్తే అంబర్ కోట వస్తుంది. జయ్‌పూర్ నిర్మాణానికి ముందు పాలన ఈ కోట నుంచే జరిగేది. ఏనుగు అంబారీ ఎక్కి కోట మీదకు వెళ్లవచ్చు. ఈ పర్యటనలో సున్నితత్వం అంతా సిసోడియా రాణీకా బాఘ్‌లోనే కనిపిస్తుంది. ఈ గార్డెన్ జయ్‌పూర్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఆగ్రా రూట్‌లో వస్తుంది. సవాయ్ జయ్‌సింగ్... సిసోడియా యువరాణిని మనసు పడి వివాహమాడి, ఆమెకు ఇష్టమైనట్లు ఉద్యానవనాన్ని నిర్మించాడు. రాణి కాలు కింద పెట్టకుండా ఉద్యానవనంలో విహరించేటట్లు టై గార్డెన్ ఏర్పాటు చేశాడు. రాజుకు ప్రేమ ఎక్కువైతే ఇలాగే ఉంటుందేమో.
 
 ఎలా వెళ్లాలి?
 సమీప విమానాశ్రయం: జైపూర్. హైదరాబాద్ నుంచి జైపూర్‌కి ఎకానమీ క్లాస్ విమానం టిక్కెట్టు రూ5000.
 సమీప రైల్వేస్టేషన్: జైపూర్ జంక్షన్. కాచిగూడ నుంచి జైపూర్ జంక్షన్‌కి నార్త్‌వెస్టర్న్ రైల్వే రైళ్లు ఉన్నాయి. మైసూర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి జైపూర్‌కి టిక్కెట్టు ధరలు స్లీపర్‌లో రూ600, ఏసీ త్రీటైర్‌లో రూ 1500, ఫస్ట్‌క్లాస్‌లో రూ 4000 ఉంటాయి. సికింద్రాబాద్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దాదాపుగా ఇంతే. ప్రయాణం 30 గంటలు.
 
 రాజు యూరప్ పర్యటన
 ముగించుకుని జయ్‌పూర్ చేరే వరకు తాగడానికి కావలసిన నీటిని ఖండాంతరాలకు తరలించారు.
 
 ఎప్పుడు వెళ్లవచ్చు?
 అక్టోబర్, నవంబర్, మార్చి నెలలు సౌకర్యం.
 
 ఎక్కడ ఉండాలి?
 హోటల్ పెర్ల్ ప్యాలెస్... ఒక రోజు డబుల్ రూమ్ (షేరింగ్ బాత్‌రూమ్) అద్దె రూ350, ఏసీ డబుల్ రూమ్ రూ950, ఫ్యామిలీ రూమ్ (4-6 బస) రూ1,100. వీటిలో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండదు.
 అనురాగ్ విల్లా... నాన్‌ఏసీ డబుల్ రూమ్ రూ800, సూపర్ డీలక్స్ గార్డెన్ వ్యూ గదికి రూ2000.
 రామ్‌బాఘ్ ప్యాలెస్‌లో బస చేయాలంటే ఒక రోజుకి 19 వేలు. వీటితోపాటు ఒక రాత్రికి ఆరేడు వందలు చార్జ్ చేసే వినాయక్ గెస్ట్‌హౌస్ వంటివీ ఉన్నాయి.
 
 భోజనం ఎలా?
 రాజస్థాన్ సంప్రదాయ భోజనం రుచి చూడాలంటే జోరి బజార్‌లోని ఎల్‌ఎంబి రెస్టారెంట్‌కి, స్వీట్స్‌కి రావత్ మిస్థాన్ భండార్‌కి వెళ్లాలి. గుజరాతీ రుచుల కోసం అన్నపూర్ణ, పనీర్ బటర్ మసాలా కోసం ‘సూర్య మహల్’, విదేశీ రుచులకు ‘కాపర్ చిమ్నీ’, ఇటాలియన్ పిజ్జా తినాలంటే పిజ్జాహట్, చిరుతిళ్లకు ఇండియన్ కాఫీ హౌస్‌కు వెళ్లవచ్చు.
 
 వాతావరణం?
 ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయి. జూన్ - సెప్టెంబరు వర్షాకాలం. అక్టోబర్, నవంబరు ఆహ్లాదంగా ఉంటుంది. డిసెంబర్ - ఫిబ్రవరిఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోతాయి. మార్చిలో బావుంటుంది.
 
 ఇంకా ఏమేం చూడవచ్చు?
 విద్యాధర బాఘ్... రెండవ జయ్‌సింగ్ కొలువులో ప్రధాన వాస్తుశిల్పి విద్యాధరుడు. సిసోడియా రాణి కా బాఘ్ వంటి అద్భుత నిర్మాణాల రూపకర్త. అందుకే ఒక ఉద్యానవనానికి విద్యాధరుడి పేరు పెట్టారు.
 జల్‌మహల్... మన్‌సాగర్ మధ్యలో ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడికి వలస పక్షులు వస్తాయి.
 
 ఏమేమి కొనవచ్చు... ఎక్కడ కొనాలి?
 జైపూర్ చెప్పులకు (జూటీ) రామ్‌గంజ్ బజార్, టై అండ్ డై దుస్తులకు కృష్ణపాల్ బజార్, అలంకరణ వస్తువుల కు మనిహారన్ కా రాస్తా, తివాచీలకు సుభాష్ చౌక్, మార్బుల్ కళాకృతులకు ఖజనో కా రాస్తా, హస్తకళలు, నీలిరంగు పింగాణీ వస్తువుల కోసం సంగనెర్ గ్రామానికి వెళ్లాలి. ఒంటె చర్మంతో చేసిన బ్యాగ్‌లు, చెప్పులు, పర్సులకు విదేశాల్లో డిమాండ్. ఇక జయ్‌పూర్ కుందన్, జేడ్ ఆభరణాల దుకాణాలు ఇక్కడ చాలానే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement