
అశేష జనం కొలిచే ‘విశేష’ జగన్నాథుడు
ప్రస్తుత పూరీని ఒకప్పుడు శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అనీ, పురుషోత్తమ పురి అనీ, జగన్నాథపురి అని పిలిచేవారు. ఈయనకు నీలమాధవుడని పేరు. ఈ నీలమాధవునికి తొలి పూజలు చేసింది విశ్వవసు అనే శబర నాయకుడు. జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించింది గంగవంశస్థులు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలిసిపోగా, ఇంద్రద్యుమ్నుడనే మహారాజు తనకు కలలో కనపడిన దారువు (కొయ్యదుంగ)ను విగ్రహాలుగా చెక్కించి, వాటినే ప్రతిష్టించి, పూజలు జరిపాడు. ముగ్ధమనోహర రూపంలో ఉండే ఈ మూర్తులను శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇక్కడ తమ మఠాలను ఏర్పాటు చేసుకుని మరీ కొలిచారు, తరించారు.
సుందరం... సువిశాలం: ఎల్తైన గోడలతో, చక్కటి పనితనం ఉట్టిపడే ద్వారాలతో పూరీ జగన్నాథుడు కొలువైన ఈ దివ్యధామం అత్యంత సుందరమైనదే కాదు, సువిశాలమైనది కూడా. నాలుగు ప్రవేశద్వారాలున్న ఈ ఆలయంలో అసంఖ్యాకమైన ఉపాలయాలు, ఇతర దేవతా సన్నిధానాలు కూడా ఉన్నాయి. సుమారు లక్షమంది ఒకేసారి కూచుని భోజనం చేసేంత పెద్ద భోజనశాల, దానికి ఏమాత్రం తీసిపోని విధమైన వంటగది ఈ ఆలయ ప్రత్యేకత.
నిత్యం 56 రకాల పిండివంటలతో అత్యంత నియమ నిష్ఠలతో జగన్నాథుడికి నివేదన చేస్తారు ఆలయ పూజారులు. స్వామికి చేసే నివేదన అంతా మట్టికుండలలోనే తయారవడం విశేషం. ఆ రూపమే అపురూపం... పూరీ జగన్నాథునిది చాలా విచిత్రరూపం. దారుమూర్తిగా పెద్ద పెద్ద కళ్లతో, కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించినట్లుగా ఉండే ఆటవిక రూపం.
అయితేనేం, ఈ సువిశాల ప్రపంచాన్నంతటినీ చూడడం కోసమే అన్నట్లు ఇంతింతలావున ఉండే గుండ్రని కన్నులతో, త్రికోణాకారంలో ఉండే ముఖం జగన్నాథునిది కాగా, గుండ్రని ముఖారవిందంతో బలభద్రుడు కనువిందు చేస్తాడు, సుభద్రాదేవి పసుపుపచ్చని వర్ణంతో దర్శనమిస్తుంది. ఈ మూడు మూర్తులూ కూడా కేవలం నడుము భాగం వరకే ఉంటాయి. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని విగ్రహాలను తయారు చేస్తారు. అంటే కొత్తమూర్తులను తయారు చేసి, పాతమూర్తులలోని ‘బ్రహ్మపదార్థాన్ని’ వాటిలో ప్రవేశపెడతారు. దీనినే నవకళేబర (శక్తి ఆవాహన) ఉత్సవమంటారు. పాతమూర్తులను కొయిలి వైకుంఠమనే ప్రదేశంలో భూస్థాపితం చేస్తారు.
జగన్నాథ రథం: విశ్వజనీనమైన పండుగగా జరుపుకునే ఈ రథయాత్రలో నిర్ణీతమైన పూజావిధానమే కనిపించదు. వేదమంత్రోచ్చారణ అసలే వినిపించదు. అయితేనేం, భాష, కులం, లింగ, సంస్కృతి, సంప్రదాయం తదితర భేదాలన్నింటినీ పక్కకు తోసి మరీ ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి కన్నులపండువైన ఈ ఉత్సవంలో పాల్గొంటారు. పేద, ధనిక, స్త్రీ, పురుష, వృద్ధ, యువక భేదం లేకుండా అందరూ రథయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు. అందుకే ‘సర్వం జగన్నాథం’ అంటారు.
ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి పూరీకి నేరుగా రైళ్లున్నాయి. రైల్వేస్టేషన్ లేదా బస్ స్టాండ్‌నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల జగన్నాథాలయానికి ఆటోలు, లోకల్ బస్సులలో చేరుకోవచ్చు. ఆకాశమార్గంలో వెళ్లాలనుకునేవారికి దగ్గరలోని విమానాశ్రయం భువనేశ్వర్. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని పూరీకి వెళ్లడానికి బస్సులు, రైళ్లు ఉన్నాయి. పూరీలో అన్ని తరగతుల వారికీ వారి వారి స్థోమతకు సరిపడా లాడ్జీలు, హోటళ్లు ఉన్నాయి. ఇతర సందర్శనీయ స్థలాలు: పూరీలో జగన్నాథాలయం తర్వాత పూరీ బీచ్, కోణార్క్ బీచ్, చిల్కా సరస్సు, స్వర్గద్వార్ బీచ్, రఘురాజ్‌పూర్ ఆర్టిస్ట్ విలేజ్, సాక్షి గోపాలుడి గుడి, అలర్నాథాలయం, గుండిచా గుడి, విమలాలయం, లక్ష్మీ ఆలయం, కంచి గణేశాలయం, పూరీ లైట్ హౌస్‌లు చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్.భాస్కర్