చెట్టుకూ మెదడు ఉంది!
‘చెట్టు నా ఆదర్శం’ అన్నారు కవి ఇస్మాయిల్.
ఆయన కవితల్లో చెట్టు ఇంతై, అంతై...భువనమంతై... తన విశ్వరూపాన్ని చూపుతుంది.
ఒక కవితలో ఆయన ఇలా అంటారు...
‘మనిషీ మనిషీ
పిట్టలకు ఎగరడం నేర్పిన
చెట్టుని చూడు
ఏ భాషలో పుష్పిస్తుందది?
ఊడల నీడల్లో మాపటి వేళల్లో
ఊడల్లా కావలించుకునే
ప్రియుల హస్తాలు
ఏ భాషలో తడుముకుంటాయి?’
‘చెట్టు ఉన్నచోటు నుంచి కదలదు. కానీ దానిలోని స్పందనలు మాత్రం స్థిరంగా ఉండవు. గాలితో పాటు భావాలు ప్రయాణిస్తాయి. వాటి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే...ఎన్నో భావాలు అర్థమవుతాయి’ ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచిస్తే... అది ‘భావుకత’ కేటగిరీలోకి పోతుందేగానీ ‘వాస్తవం’లోకి పోదు.
అయితే మన ‘భావుకత’లో అతిశయోక్తి, అవాస్తవం ఏవీ లేవంటున్నాయి తాజా పరిశోధనలు.
యూనివర్సిటీ ఆఫ్ టురిన్, ఇటలీకి చెందిన ప్రొఫెసర్ మాసిమో, ఇంకా కొద్ది మంది పరిశోధకులు చెట్టు చెట్టు తిరిగి, వేరు వేరుని పలకరించి ఎంతో పరిశోధన చేశారు.
వీరు చెప్పేదాని ప్రకారం...
చెట్లకు మెదడు ఉంటుంది. జ్ఞానం ఉంటుంది.
చెట్లు ఒకదానితో ఒకటి మౌనంగా సంభాషించుకుంటాయి.
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.
ఒక చెట్టు యోగక్షేమం గురించి మరొకటి ఆలోచిస్తుంది.
వాటికి జ్ఞానమే కాదు... బాధ కూడా ఉంటుంది.
ఇక ఒకే జాతి చెట్ల మధ్య చాల గట్టి బంధం ఉంటుందట. వాటి బంధం వేర్ల సహాయంతో బలపడుతుందట.
కొన్ని సందర్భాల్లోనైతే... అవి కలిసికట్టుగా చనిపోతాయట!
ఎంత చిత్రం!!