ఈ ప్రపంచం  అంతులేని చెరసాల! | This was one of the films released after the independence of the country | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచం  అంతులేని చెరసాల!

Published Sun, Jan 20 2019 12:08 AM | Last Updated on Sun, Jan 20 2019 12:08 AM

This was one of the films released after the independence of the country - Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విడుదలైన సినిమాల్లో ఇది ఒకటి. రక్తి నుంచి విరక్తి వైపు పయనించి... జీవితసత్యాలను సామాన్యులు కూడా పాడుకునేలా చేసిన ప్రజాకవి గురించి తీసిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

అప్పుడే ఇంట్లోకి వచ్చారు రెడ్డిగారు.వదినగారు దిగులుగా కనిపించడం చూసి...‘‘ఏమైంది వదినా?’’ అని అడిగారు నెమ్మదిగా.‘‘నాగహారం కనిపించడం లేదు. నిన్న పొద్దున కూడా పూజ చేశాను. ఈ పూట పూజ చేద్దామని తెరిస్తే లేదు’’ అన్నది ఆమె బాధగా.‘‘నేను తీసుకుపోయిన వదినా’’ అన్నారు ఆయన తలవంచుకొని.‘‘ఆ... దానితో నీకేం పనివచ్చింది?’’ ఆశ్చర్యంగా అడిగింది వదిన.‘‘మోహనాంగి కావాలంటేనూ...’’ అన్నారు ఆయన  వినీవినిపించనట్లుగా.ఆమె గుండెలో రాయిపడ్డట్లయింది...‘‘ఎంత పనిచేశావయ్యా! ఆ హారాన్ని ఎవరో మహాశక్తులు ఇచ్చారని తెలుసునే. మనగౌరవం,మన సిరిసంపదలు దాని ప్రసాదమేనని తరతరాలుగా నమ్ముతున్నాము. నా మాంగల్యంతో సమానంగా భావించి పూజిస్తున్నానే. ఆ హారాన్ని ఇంత చులకన చేస్తారా? ఈ సంగతి మీ అన్నగారు వింటే ఎంత బాధపడతారో ఆలోచించావా? ఏ అనర్థాలు రాకముందే హారం మన ఇంటికి చేర్చు’’ అన్నది ఆమె ఆందోళనగా.చేసిందంతా చేసి...‘‘నా చేతుల్లో ఏముంది?’’ అన్నట్లుగా చూశారు రెడ్డిగారు.

అభిరామయ్య రెడ్డిగారి మనసు మార్చే ప్రయత్నంలో ఉన్నాడు...‘‘ఇప్పటికైనా మేలుకో. ఎంతసేపూ ఇదితే అదితే అని పీల్చిపిప్పి చేయడమేగానీ వాళ్లు నీ కష్టనష్టాలు విచారిస్తారా? సమ్మోహనంలో పడి నీ కుటుంబ గౌరవానికి ఎంత అపకారం చేస్తున్నావు? ఇంగితం లేని వాళ్లు తెమ్మంటే మాత్రం మీరైనా వెనకా ముందు ఆలోచించవద్దా? మీరు పెళ్లీపేరంటం చేసుకొని సుఖంగా ఉండండి’’ తనకు తోచిన రీతిలో హితబోధ చేశాడు అభిరామయ్య.‘‘ఆ సావాసం చాలించడం నువ్వు చెప్పినంత సులభం కాదు. ఇది వేదాంతులకు అర్థం కాదు. ఆలోచిద్దాం’’ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు రెడ్డిగారు.‘‘ఆలోచించడానికి ఏముంది! ఇచ్చినట్లే తీసుకురావచ్చు కదా!’’ అన్నాడు అభిరామయ్య.మళ్లీ ఏదో సాకు చెప్పారు రెడ్డిగారు!‘‘తీతువు కూసింది!  నరుడు తప్పులు చేస్తుంటేనారాయణుడు ఇట్లాగు అడ్డుపడుతుంటే...సరే మన ప్రయత్నం మనం చేద్దాం. పైన జై సీతారామ్‌’’ వేదాంత ధోరణిలో అన్నాడు అభిరామయ్య.

రెడ్డిగారు ఇంట్లో కనిపించడం లేదనే వార్త చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. ‘‘చిన్నరెడ్డిగారు వారి ఇంట్లో కనిపించడం లేదు. చెప్పులైనా వేసుకుపోలేదు. ఎప్పుడు పోయినారో ఎక్కడికి పోయినారో’’ ‘‘అమ్మాయిగారు పోయింది మొదలు మాటా పలుకూ లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దగ్గరకు పోదామని పలకరిద్దామన్నా భయమేసింది. ఉన్నట్టుండి తెల్లవారే వరకు ఇంట్లో లేరు.’’అంటూ బాధ పడింది రెడ్డిగారి వదిన.‘‘అభిరామయ్య దగ్గర ఉన్నారేమో...’’ అన్నారెవరో.కానీ అక్కడ కూడా లేరు.అభిరామయ్య రెడ్డిగారిని వెదుక్కుంటూ వెళ్లాడు.ఒకచోట ఆశ్చర్యంగా ఆగాడు.... రెడ్డిగారు కనిపించారు!‘‘ఇదేమిటంటీ రెడ్డిగారు ఈ కసువులో ఈ మట్టిలో కూర్చున్నారే!’’ అన్నాడు అభిరామయ్య.‘‘ఏనాటికైనా మట్టిలో కలిసిపోయేదేగా ఈ శరీరం. ఇక్కడ కూర్చుంటే అవమానమా అభిరామయ్యా’’ నిర్వేదంగా అన్నారు రెడ్డిగారు.‘‘ఏంమాటలండీ ఇవి. మీరు కనబడటం లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఇంటికి పోదం రండి’’ అని బతిమిలాడాడు అభిరామయ్య.‘‘ఇల్లు ఎవరిది? వాకిలి ఎవరిది అభిరామా? నా ఇల్లు... నా చిన్నాయన అని కలవరించిన జ్యోతి చివరికి నన్ను, నా ఇంటిని విడిచిపోలేదా? ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలుసునా అభిరామా?’’ తారస్థాయికి చేరిన వైరాగ్యంలోనుంచి మాట్లాడుతున్నారు రెడ్డిగారు.‘‘ఇది వరకు పోయిన వాళ్లందరూ ఎక్కడికి పోయినారో ఆమె అక్కడికే పోయింది. కాలం తీరితే అందరం పోవాల్సిన వాళ్లమేగా. అన్నీ తెలిసి కూడా మీరుపామరత్వంలో పడితే...’’ రెడ్డిగారికి జీవితసత్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు అభిరామయ్య.‘‘పామరత్వంలో పడటం లేదు అభిరామా... దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను’’శూన్యంలోకి చూస్తూ అన్నారు రెడ్డిగారు.

మళ్లీ ఏం గుర్తొచ్చిందో...‘‘తమను కన్నవారు తాము కన్నవారు తమ కళ్ల ముందే చచ్చి మాయమవుతుంటే  తాను మాత్రం శాశ్వతం అని పాతర్లాడుతున్నాడు. ఏదో నాటికి చావు తప్పదని తెలిసి కూడా పామరత్వంలో పడి ఆ విషయాన్ని మరిచిపోతున్నాడు. కానీ నేను ఎంత ప్రయత్నించినా చావు మరుపు రావడం లేదు అభిరామా’’ అన్నారు కళ్లనీళ్లతో రెడ్డిగారు.‘‘ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరికితనమే కాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలుజేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవడం ధర్మమా?’’ కాస్త గట్టిగాఅన్నాడు అభిరామయ్య.‘‘నేను బందిని కాకపోతే కదా ఇతరులను విడిపించడానికి! ఈ ప్రపంచం అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవాల్సిందేగానీ ఇతరులు ఇస్తారనుకోవడం వెర్రి కాదా అభిరామా!’’ మళ్లీ వేదాంతంలోకి దిగారు రెడ్డిగారు.‘‘అహోరాత్రాలు కష్టపడి సాధించిన ఆ బంగారం ఈనగాచి నక్కలపాలు జేసినట్లు అనుభవించే సమయానికి ఈ ఖర్మ ఏమిటండీ!’’ బాధగా అన్నాడు అభిరామయ్య.‘‘అనుభవించడానికి ఇంకేముంది అభిరామా! ప్రపంచంలో ఉన్న ఈ బంగారమంతా చనిపోయిన నా జ్యోతిని తేగలదా!’’ కన్నీటి సముద్రంలో నుంచి మాట్లాడుతున్నారు రెడ్డిగారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement