అభిమానుల అండతో...!
పంచామృతం: ట్విటర్‌లో గణంకాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇంటర్నెట్ విస్తృతమవుతున్న కొద్దీ సెలబ్రిటీల ట్విటర్ అకౌంట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత సెలబ్రిటీలు కూడా వేల, లక్షల సంఖ్యలను దాటేసి ఇప్పుడు కోటి స్థాయికి చేరుకొంటున్నారు. ఇటీవలే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. మరి ఇలాంటి సందర్భంలో భారతీయ సెలబ్రిటీల్లో ట్విటర్‌లో ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఐదుగురు ఎవరో చూస్తే...
షారూక్ ఖాన్
‘ఐ యామ్ ఎస్‌ఆర్‌కే..’ అంటూ ట్వీట్లను ఇచ్చే ఈ బాలీవుడ్‌స్టార్ హీరో అమితాబ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. తన సినిమా షూటింగ్ వివరాలను, వ్యక్తిగత అభిప్రాయాలను ట్విటర్ ద్వారా పంచుకొనే షారూక్ ఫాలోవర్ల సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉన్నాడు. షారూక్ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 90 లక్షలు.
సల్మాన్‌ఖాన్
సల్మాన్ ఖాన్‌కు ఉన్న మొత్తం ఫాలోవర్ల సంఖ్య 82 లక్షలు. ఆమిర్ కన్నా కొంచెం వెనుకబడి ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ట్విటర్ అకౌంట్‌లో ఎక్కువగా అప్‌డేట్స్ ఉండవు. ఈయన అప్పుడప్పుడు మాత్రమే తన ఫాలోవర్లను పలకరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ తన చరిష్మాతో అనునిత్యం ట్విటర్‌ను అప్‌డేట్ చేసే స్టార్ హీరోలకు పోటీనిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్
భారతీయ సెలబ్రిటీల్లో తొలితొలిగా ట్విటర్‌లో యాక్టివ్ అయిన అమితాబ్ మరొకరెవరికీ అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు. ఇతర సినిమా స్టార్లు, క్రికెటర్లు, రాజకీయా నేతలందరినీ క్రాస్ చేసి తొలి స్థానాన్ని దక్కించుకొన్నారు. కోటీ రెండులక్షల మంది ఫాలోవర్లతో తొలి స్థానంలో నిలుస్తున్నారు.
ఆమిర్ ఖాన్
మొదట్లో ఆమిర్ ట్విటర్‌లో అంత యాక్టివ్‌గా ఉండేవాడు కాదు. అయితే తర్వాత ఈ లోటును భర్తీ చేశాడు, అమాంతం ఫాలోవర్ల సంఖ్యను పెంచుకొన్నాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్‌ను దాటేసి మూడో స్థానంలోకి చేరుకొన్నాడు. మొత్తం 83 లక్షల పాలోవర్లతో ఆమీర్‌ఖాన్ దూసుకుపోతున్నాడు. పెరుగుదల రేటు ప్రకారం చూస్తే త్వరలోనే ఈ ఫర్ఫెక్షనిస్టు షారూక్‌కు పోటీగా మారే అవకాశాలున్నాయి.
ప్రియాంక చోప్రా
ఒకానొక దశలో భారతదేశం నుంచి ఆపరేట్ అవుతున్న అన్ని ట్విటర్ అకౌంట్లలోకెల్లా ఎక్కువమంది అభిమానులున్నది ప్రియాంక చోప్రా అకౌంట్‌కే. అమితాబ్, షారూక్ లాంటి హీరోల కన్నా ప్రియాంకకే ఎక్కువమంది ఫాలోవర్లు ఉండేవాళ్లు. తర్వాత ఆ హీరోలు విజృంభించడంతో ఈ హీరోయిన్ వెనుకబడింది. ప్రస్తుతం దాదాపు 70 లక్షల మంది అభిమానులతో ప్రియాంక ఐదో స్థానంలో ఉంది.