నివృత్తం: ముగ్గును ఎడమ చేతితో ఎందుకు వేయకూడదు?
ముగ్గును లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతున్నాయి శాస్త్రాలు. కాబట్టి ముగ్గును పవిత్రంగా చూడాలి. కాళ్లతో తొక్కకూడదు. అది మాత్రమే కాదు... ముగ్గును కుడిచేతితోనే వేయాలి. ఎడమ చేతితో పొరపాటున కూడా వేయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికో కారణం ఉంది. క్షుద్ర పూజలకు కూడా ముగ్గును వేస్తుంటారు. అలాంటప్పుడు తాంత్రికులు ఎడమచేతిని ఉపయోగిస్తారు. అందువల్ల వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు ఎడమ చేతితో అస్సలు వేయకూడదు. దానికి తోడు కుడిని మనం ఎప్పుడూ శుభ సూచకంగా భావిస్తాం. కాబట్టి కుడి చేతితో ముగ్గు వేస్తే, లక్ష్మీదేవి వచ్చి మన వాకిట్లో కొలువవుతుంది. కాబట్టి ఎడమచేతితో ముగ్గు వేసే అలవాటు ఉంటే మానుకోవాల్సిందే!
ఇల్లు ఇరకాటం... ఆలి మర్కటం...
పూర్వం ఒక ఊరిలో ఓ యువకుడు ఉండేవాడు. అతడు బాగా సంపాదించేవాడు. కానీ ఎప్పుడూ ఏమీ లేనట్టుగా కనిపించేవాడు. ఓ చిన్న ఇంటిలో నివాసముండేవాడు. కాస్త సదుపాయంగా ఉండే ఇంటిలో ఉండొచ్చు కదా అంటే... ఇల్లు పెద్దగా ఉంటే బంధువులొచ్చి తిష్ట వేస్తారు, ఇరుగ్గా ఉంటే ఎవరూ రారు అనేవాడు. ఓ రోజు అతడు పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ పీనాసివాడు ఎలాంటి పిల్లను చేసుకున్నాడో చూద్దామని అందరూ ఎగబడ్డారు. చూస్తే... ఆ పిల్ల అంద వికారంగా ఉంది. కాస్త అందమైన పిల్లను చేసుకోవచ్చు కదయ్యా అంటే... అందంగా ఉంటే అందరూ చూస్తారు, ఇలా ఉంటే ఏ టెన్షనూ ఉండదంటూ పళ్లికిలించాడు. ఊరి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది.