గెలుపు పాఠం | Win lesson! | Sakshi
Sakshi News home page

గెలుపు పాఠం

Published Sun, May 22 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

గెలుపు పాఠం

గెలుపు పాఠం

ఎన్నో శతాబ్దాలు వలస పాలనలో ఉన్న పోలాండ్ పడిన చోటే నిటారుగా నిల్చుంది. సొంత ఉనికిని కాపాడుకుంటూ వడివడిగా అడుగులు వేసింది. ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా అభివృద్ధి జెండాను ఎగురవేసింది.

14వ శతాబ్దంలో పోలాండ్ బలమైన ఏకీకృత రాజ్యంగా ఉనికిలో ఉంది. 16వ శతాబ్దంలో సంపన్న రాజ్యంగా విలసిల్లింది. 17వ శతాబ్దంలో మాత్రం శత్రురాజ్యాల వల్ల పోలాండ్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది. రకరకాల యుద్ధాలు పోలాండ్‌ను నిట్టనిలువునా కూల్చేశాయి. ఆస్తి నష్టమే కాదు ప్రాణనష్టం కూడా విపరీతంగా జరిగింది. ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాలు పోలాండ్‌ను పంచుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా పోల్స్ రెండు మూడుసార్లు తిరుగుబాటు చేసినా అవి విఫలం అయ్యాయి.
 
పరాయి పాలకుల పాలనలో అణచివేతకు గురైన పోలాండ్ సంస్కృతి 19వ శతాబ్దంలో మళ్లీ వికసించింది. రాజకీయశక్తిగా కూడా పోలాండ్ బలపడింది. 1918లో పునర్నిర్మాణమైన పోలాండ్ ‘కమ్యూనిస్ట్ పోలాండ్’ (8 ఏప్రిల్ 1945)గా 1989 నుంచి ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా ఉనికిలో ఉంది.bజర్మన్‌లు, ఉక్రేనియన్‌లు, లిథువేనియన్‌లు...మొదలైన జాతుల ప్రజలు ఉండడం వల్ల దేశమంతా భిన్నమైన సాంస్కృతిక వాతావరణం కనిపిస్తుంది.
 
పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 ప్రాంతాలుగా విభజించారు. వీటిని ‘వైవోడేషిప్’ అంటారు. వీటిని 379 పొవైట్స్‌గా విభజించారు. దేశంలో 20 పెద్ద నగరాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వ్రోక్సా నగరం గురించి. ఈ పురాతన నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒకొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక వంతెన చొప్పున వ్రోక్సాలో వందకు పైగా  వంతెనలు ఉన్నాయి. వ్రోక్సాలో 25 మ్యూజియమ్‌లు ఉన్నాయి. ఈ నగరానికి ఆనుకొని ఉన్న సుడెటెన్ కొండలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి.
 
పోలాండ్ రాజధాని వార్సా. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈ నగరం అభివృద్ధిపథంలో పయనించింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది యాత్రికులు వచ్చే ఈ నగరం యూరోపియన్ దేశాలలో ఆకర్షణీయమైన పర్యాటక నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పోలాండ్ ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన స్థితిలో ఉంది. దేశీయ విపణి బలంగా ఉండడమే దీనికి కారణం. విశేషం ఏమిటంటే 2000లలో వచ్చిన  ఆర్థికమాంద్యాన్ని కూడా తట్టుకొని నిలబడింది పోలాండ్.

అభివృద్ధికి అవకాశం ఉన్నా అభివృద్ధి చెందలేని దేశాలు, రాజకీయ సంక్షోభాలతో చావు దెబ్బతిని ‘ఇక కోలుకోవడం కష్టం’ అని నిరాశపడే దేశాలు...పొలాండ్ నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి.            
 
టాప్ 10
 1.    ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం పోలాండ్.
 2.     పోలాండ్‌కి పశ్చిమంలో జర్మనీ, దక్షిణంలో చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, తూర్పులో ఉక్రెయిన్, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి.
 3.    పోలాండ్ అధికారిక నామం: ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’
 4.    పోలాండ్ జాతీయచిహ్నం తెలుపు డేగ.
 5.    ‘పొలనై’ అనే తెగ పేరు నుంచి ‘పోలాండ్’ అనే పేరు వచ్చింది. దీని అర్థం...‘బహిరంగ ప్రదేశాల్లో నివసించే ప్రజలు’
 6.    ‘వరల్డ్స్ స్రాంగెస్ట్ మ్యాన్’ టైటిల్ గెలుచుకున్న విజేతల్లో ఎక్కువమంది పోలాండ్ వారే ఉన్నారు.
 7.    {పఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్... ధార్న్ పట్టణం (కింగ్‌డమ్ ఆఫ్ పోలాండ్)లో జన్మించారు.
 8.    పాపులర్ స్పోర్ట్: ఫుట్‌బాల్.
 9.    1999లో ‘నాటో’లో,  2004లో ‘యురోపియన్ యూనియన్’లో పోలాండ్ చేరింది.
 10.    పోలాండ్ కరెన్సీ ‘జోల్టీ’. పోలిష్‌లో దీని అర్థ్ధం బంగారం.
 
 
దేశం              పోలాండ్
రాజధాని         వార్సా
అధికార భాష    పోలిష్
కరెన్సీ          జోల్టీ
జనాభా        3 కోట్ల 84 లక్షల 84 వేలు (సుమారుగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement