
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో అఖండవిజయం సాధించిన బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కలిగించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ధాటికి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు బి. వినోద్‌కుమార్ మాత్రమే కాకుండా కేసీఆర్ తనయ కవిత సైతం ఓడిపోవడం దిగ్భ్రాంతికరం. పైగా తెలంగాణలో 2023లో తామే అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ చెప్పడం కేసీఆర్‌కి మింగుడుపడని విషయమే. ఇక ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అక్కడ అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే.
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా ఒక్క కర్ణాటక రాష్ట్రం మీదనే ఆశలు ఉండేవి. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన కారణంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిందే తప్ప బీజేపీకి మంచి స్థానాలే వచ్చాయి. నిజానికి అక్కడ అప్పటి దాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోయి సంకీర్ణానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాదు మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి సంపూర్ణ ఆధిక్యత లభించింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉంటే గత పార్లమెంట్‌లో బీజేపీ 17 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తే మొన్నటి ఎన్నికల్లో సొంతంగా 25 స్థానాలు గెలిచి తాము బలపరిచిన మరో స్థానంలో సినీనటి సుమలతను గెలిపించుకున్నది. అంటే ఇప్పుడు కర్ణాటకలో 28కి 26 స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయన్న మాట. ఇదే ఊపులో రేపో మాపో అక్కడి సంకీర్ణ సర్కారును పడగొట్టి తామే తిరిగి అధికారాన్ని చేపట్టే ప్రయత్నాల్లో అప్పుడే పడిపోయారు కమలనాధులు. మరో ముఖ్య దక్షిణ రాష్ట్రం తమిళనాడులో బీజేపీ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇవ్వలేదు, తాను నిలబెట్టదల్చుకున్న ఏఐడీఎంకే చతికిల పడటంతో ఇప్పుడప్పుడే తమిళనాట సమయం వృథా చెయ్యడానికి సిద్ధంగా లేదని చెప్పాలి. మొన్నటి లోక్‌సభ ఫలితాలు చూసిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో అక్కడ స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మరో రాష్ట్రం కేరళ బీజేపీకి నెరవేరని కోరికగానే నిలిచిపోయింది.
ఇక బీజేపీ ముఖ్య నాయకుడు రాం మాధవ్ రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ తెలంగాణలో 2023లో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం 2029 దాకా ఆగాల్సి ఉంటుం దని చెప్పారు. బీజేపీలో రాం మాధవ్ ఒక ముఖ్య నాయకుడు. అల్లా టప్పా మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్ విషయం కాసేపు అట్లా పెడదాం. తెలంగాణాలో 2023లో అధికారంలోకి వస్తామని అంత గట్టిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆయన అన్నది మాట్లాడుకుందాం. ఇటీవల జరి గిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలలో గెలిచింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో బలంగా ఉన్న తెలుగుదేశంతో పొత్తుల కారణంగా ఒకసారి, ఒంటరిగా ఒకసారి రెండు స్థానాలు గెలిచినా సొంతంగా నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవడం బీజేపీకి ఇదే ప్రథమం.
చిత్రంగా గత డిసెంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయిదు నుండి ఒక స్థానానికి పడిపోయి 119 స్థానాలకుగాను నూటికి పైగా స్థానాల్లో డిపాజిట్‌లు కూడా దక్కించుకోలేక పోయిన బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు చోట్ల అందునా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మూడుచోట్ల కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో గెలవడంతో అందరి దృష్టి బీజేపీ వైపు మళ్ళింది. ఇందులో నిజామా బాద్ స్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఓడిపోవడం ఒకటయితే, గతంలో కేసీఆర్ తాను ముమ్మారు ప్రాతి నిధ్యం వహించి అద్భుత ఆధిక్యతలతో గెలిచిన తరువాత తనకు అత్యంత సన్నిహితుడయిన బోయినపల్లి వినోద్ కుమార్‌కు అప్పగిస్తే ఆయనా ఓటమి పాలు కావడం మరొకటి.
ఆదిలాబాద్‌లో సోయం బాపురావు గెలుపు కేసీఆర్ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టబోయి చేతులు కాల్చుకోవడానికి నిదర్శనంగా చూడాలి. సికింద్రాబాద్‌లో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయిన కిషన్ రెడ్డి అదృష్టవంతుడు అని చెప్పాలి. శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అయిదు మాసాల్లోనే లోక్‌సభకు ఎన్నిక కావడం కేంద్రంలో పదవి దక్కడం అదృష్టమే కదా. 1980 దశకంలో మావోయిస్ట్ ఉద్యమం ఉధృతంగా ఉండి వామపక్ష ఉద్యమాలకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికీ గుండెకాయగా నిలిచిన ఉత్తర తెలంగాణలో మూడు లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఆషామాషీగా చూడాల్సిన విషయం కాదు. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న రాజ కీయ ఎత్తుగడలే కారణం.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఉద్యమ కాలంలో ఫిరాయింపుల మీద విరుచుకుపడే వారు. అప్పట్లో ఆయన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్లోనే ‘‘ఇతర పార్టీల నుండి గెలిచినోణ్ని పార్టీ ఫిరాయింప చేస్తే ప్రజలు చీరి చింతకు కడతారు, ఇంత కిర్కిరి, ఇంత హరాకిరి ఉంటదా, ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాల్లో, నీతి ఉండొద్దా రాజకీయాల్లో’’ ఇట్లా సాగింది ఆయన ప్రవచనం. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కేసీఆర్ చేస్తున్న పనే ఎడాపెడా ఫిరాయింపులు చేయించడం. 2014లో 119కి గాను 62 స్థానాలే లభించాయి అసెంబ్లీలో, ఏ ముగ్గురిని చంద్రబాబునాయుడు టీడీపీలోకి లాగేసినా తన ప్రభుత్వం పడిపోవడం ఖాయం (చంద్రబాబు అటువంటి పిచ్చి ప్రయత్నం ఒకటి మొదలుపెట్టి రెడ్ హండెడ్‌గా దొరికిపోయి రాత్రికి రాత్రి విజయవాడకు మకాం మార్చిన విషయం తెలిసిందే) కాబట్టి అప్పట్లో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని ఖాళీచేసి ఇద్దరు ముగ్గురు మినహా ఎమ్మెల్యేలందరినీ కొనేశారు కేసీఆర్, అప్పట్లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ చివరికి సీపీఐ సభ్యులను వదలకుండా తన పార్టీలో కలుపుకున్నప్పుడు ఉద్యమ సమయంలో తానే∙తిట్టిన తిట్లు ఇప్పుడు తనకే వర్తిస్తాయని మరిచిపోయారు.
ఆయనకు ఇంకో ఆలోచన కూడా ఉండింది, ఏనాటికయినా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తెలుగుదేశం లాగానే దాన్ని కూడా తుడిచిపెట్టేస్తే ఇక తిరుగు ఉండదు అన్నది ఆ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదిపారు. 2018లో గడువుకంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలు గెల్చుకుని మంచి మెజారిటీ సాధించినా ఆగకుండా కాంగ్రెస్ శాసన సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే పని కొనసాగించారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది తెలంగాణలో తన పార్టీకి తిరుగులేదు అన్నది ఆయన ధీమా. కానీ పరిస్థితులు అట్లా లేవు. శాసనసభకూ లోక్‌సభకు వేర్వేరుగా ఎన్నికలొస్తే గెలుపు సులభం అవుతుందన్నది ఆయన ఆలో చన కాగా అసదుద్దీన్ ఒవైసీ స్థానం మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలూ తన పార్టీవే అని ఎంత గొంతు చించుకుని చెప్పినా ప్రజలు తొమ్మిది స్థానాల దగ్గరే టీఆర్‌ఎస్‌ను ఆపేశారు.
కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చెయ్యడం కోసం కేసీఆర్ చేసిన కార్యకమాలన్నిటికీ బీజేపీ మౌన సమర్థన ఉంది. ఎందుకంటే ఆ తరువాత తెలంగాణాలో ఏర్పడే శూన్యంలోకి తాము ప్రవేశించి అధికారం చేజిక్కించు కోవాలన్నది కమలనాధుల ఆలోచన. మోదీ మద్దతు తనకు ఉందని మురిసిపోయిన కేసీఆర్‌కు బీజేపీ అసలు ఆలోచన అర్ధం కాలేదు. ముస్లిం మైనారిటీల పట్ల సానుకూలంగా ఉండ టానికీ మజ్లిస్ పార్టీతో అతిగా పూసుకోడానికీ మధ్య తేడాను కేసీఆర్ మరిచిపోయిన కారణంగా కూడా తెలంగాణలో బీజేపీ బలపడటానికి తానే కారణం అయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సమాధి అయి నట్టేననీ టీఆర్‌ఎస్‌కు తిరుగులేదనీ సంబరపడినంతసేపు పట్టలేదు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మూడు చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించడానికి. అందు లోనూ ఎవరి రాజకీయ జీవితాన్ని సమాప్తం చెయ్యాలని కేసీఆర్ అను కున్నారో ఆ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి లోక్‌సభకు వెళ్లడం ఇంకో షాక్. కేసీఆర్ కోరిక నెరవేరి తెలంగాణలో కాంగ్రెస్ పతనం అవుతుందో లేదో తెలియదు కానీ మరో బలమయిన ప్రత్యర్ధి బీజేపీ తెలంగాణలో ప్రవేశించింది అనడంలో సందేహం లేదు. పైగా ఏ ఫలితంలేని ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ముందుకు తెచ్చి ఆయన కమలనాధుల కటాక్షాన్ని కూడా కోల్పోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడి నూతన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ది కనీసం తెలం గాణ పరిస్థితి కూడా కాదు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగు దేశం భవిష్యత్తు ఆ పార్టీ నాయకత్వమే గందరగోళంలో పడేసుకుంది కాబట్టి బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలో సంపూర్ణ అధికారంలో ఉన్న బీజేపీ పెద్దఎత్తున చేయూత ఇస్తేనే ప్రజలు హర్షిస్తారు.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment