‘బడిబాట’లో భాషా మాధ్యమం! | Article On YS Jagan Rajanna Badi Bata | Sakshi
Sakshi News home page

‘బడిబాట’లో భాషా మాధ్యమం!

Published Tue, Jun 18 2019 12:31 AM | Last Updated on Tue, Jun 18 2019 12:31 AM

Article On YS Jagan Rajanna Badi Bata - Sakshi

ఇంగ్లిష్‌ను పాఠశాలల్లో నిర్బంధ భాషా మాధ్యమం చేయాలని భారత్‌ విద్యా విధాన రూపకల్పనలో ప్రపంచబ్యాంకు ద్వారా అమెరికా ప్రతిపాదించి అమలులోకి తెప్పించుకుంది. మన గ్రామసీమల దాకా గుత్త పెట్టుబడి సంస్థల ఉత్పత్తులను చేర్చడానికి ఇంగ్లిష్‌ మాధ్యమం అవసరమైనా, కొనుగోలుదారులు మాత్రం తెలుగుభాషా ప్రజలేనన్న సంగతి మరవరాదు. విద్యావ్యవస్థలో తల్లిభాషకు స్థానం లేనంత దీనస్థితికి గత పాలకులు తెలుగును దిగజార్చివేశారు. దీనిపై ఏపీ నవ యువ సీఎం జగన్‌మోహన్‌ స్పష్టమైన అవగాహనతోనే అన్ని స్కూళ్లలో తెలుగును ఒక ‘సబ్జెక్టు’గా బోధించాలని ప్రతిపాదించారు. నీ తల్లిభాషను నీవు ‘శ్వాసించకపోతే గాలి లేనట్టే/ నీవు నడవకపోతే ఈ భూమి లేనట్టే/ నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచమూ లేనట్టే’నన్నది ‘యునెస్కో’ శాసనం. ఏ పాలకులైనా ఈ వాస్తవాన్ని మరవరాదు.

‘‘ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్ది, ఆంధ్రప్రదేశ్‌లో చదువుల విప్లవం తెస్తాం. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తాం. దేశవ్యాప్తంగా చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెడతాం. ప్రతి స్కూల్‌లోనూ తెలుగును పాఠ్యాంశంగా తప్పనిసరి చేస్తాం. చదువుల విప్లవం ద్వారా సర్కారు స్కూళ్లను మంచి పాఠశాల లుగా తీర్చిదిద్దుతాం’’ – ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘రాజన్న బడిబాట’ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చేసిన విధాన ప్రకటన (14.6.2019)

గత దశాబ్దన్నర కాలానికి పైగా, ముఖ్యంగా ప్రపంచబ్యాంక్‌ ‘ఆర్థిక సంస్కరణల’ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానంలో కూడా పెనుమార్పులు వచ్చాయి. ఈ ప్రజా వ్యతిరేక సంస్కరణలవల్ల దేశ సామాజిక, ఆర్థిక రంగాలను చుట్టుముట్టిన అనేక అనర్థాలలో ఒకటి.. విద్యావ్యవస్థలో తల్లి (మాతృ) భాషలు బోధనా మాధ్యమాలుగా దెబ్బ తింటూ ‘చదివేస్తే ఉన్న మతి’ కూడా పోతూ, ‘కాకరకాయ అనమంటే కీకరకాయ’ అని ఉచ్చరించే దశకు తెలుగు భాషను దిగజార్చివేశారు. ఉన్నవాడు ఉన్నవాడికే దోచబెట్టాడు, లేనివాడు కూడా ఉన్నవాడికే దోచ బెట్టాడన్నట్టు ఆచరణలో విద్యా వ్యవస్థ తీరుతెన్నులూ మారాయి. ప్రాథమిక మాధ్యమిక విద్యా వ్యవస్థలో బోధనా భాషా మాధ్యమం ఏది ఏ మోతాదుల్లో ఉండాలన్న సమస్యపై నేటికీ చర్చ ముగింపునకు రాక పోవడానికి ప్రధాన కారణం– ఆంగ్లో, అమెరికన్‌ వలస దోపిడీకి కొన సాగింపుగా, తమ అవసరాల కోసం ఏర్పరచుకున్న ప్రపంచ బ్యాంకు ద్వారా ఇండియా లాంటి వర్ధమాన దేశాల సంతలను (మార్కెట్లను) తమ సరుకులతో నింపేయడం అనివార్యమయింది. ఆధునిక టెక్నాలజీ మార్గాల ద్వారా తమ వస్తూత్పత్తులు అవసరానికి మించి గుట్టలుగా పేరుకుపోకుండా బడుగు వర్ధమాన దేశాల మార్కెట్లలో కుమ్మరించి తమ లాభాలను పెంచుకోవడం ద్వారా, ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని కొనసాగించుకోదలచాయి. ఈ లక్ష్యంతోనే ఇంగ్లిష్‌ను పాఠశాలల్లో నిర్బంధ భాషా మాధ్యమం చేయాలని భారత్‌ విద్యా విధాన రూప కల్పనలో అమెరికా ప్రతిపాదించి అమలులోకి తెప్పించుకుంది. 

మన గ్రామసీమల దాకా అమెరికా గుత్త పెట్టుబడి సంస్థల ఉత్ప త్తులను చేర్చడానికి ఇంగ్లిష్‌ మాధ్యమం అవసరమైనా కొనుగోలు దారులు మాత్రం తెలుగుభాషా ప్రజలేనన్న సంగతి మరవరాదు. ఈ విషయంలో యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌కు అవగాహన ఉండి ఉంటుంది. కనుకనే అన్ని స్కూళ్లలో తెలుగును ఒక ‘సబ్జెక్టు’గా బోధిం చాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సుమారు ఇరవై ఏళ్ల నాడే వర్ధమాన దేశాల మాతృభాషల ఉనికికి రానున్న ప్రమాదంపై  ఐక్యరాజ్యసమితి విద్యా, సాంస్కృతిక సంస్థ చేసిన హెచ్చరిక జగన్‌కు గుర్తుండే ఉండాలి. నీ తల్లిభాషను నీవు ‘శ్వాసించకపోతే గాలి లేనట్టే/ నీవు నడవకపోతే ఈ భూమి లేనట్టే/ నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచమూ లేనట్టే’నన్నది ‘యునెస్కో’ శాసనం. అంతేగాదు, నిత్యం అక్షరాలలో, పదాలలో, భావాల బట్వాడాలో ఆ భాష (తల్లి భాష) తాలూకు భాషీయులు తమ భాషను వాడకంలో పెట్టుకోన ప్పుడు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను వాడేవారి సంఖ్య అధికాధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ప్రమాదంలో పడిపోయినట్టే లెక్క’ అని రాగల దుర్ముహూర్తాలను గురించి ‘యునెస్కో’ హెచ్చరించిందని జగన్‌కు తెలిసే ఉండాలి. 

‘ఆధునిక అవసరాల దృష్ట్యా’ ఇంగ్లిష్‌ భాషా మాధ్యమాన్ని, దాని అధ్యయనాన్ని కాదనలేముగానీ, మన పాత తరాలలోని పెద్దలు తల్లి భాషలోనూ, ఆంగ్ల మాధ్యమంలోనూ స్కూల్‌ ఫైనల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) దశలోనే విద్యాభ్యాసం చాలించిన వారిలో పెక్కుమంది ఆ రోజుకే కాదు, ఈ రోజుకీ ఉభయ భాషలలోనూ అనర్గళంగా మాట్లాడి, నేటి ఉన్నత విద్యావంతుల్ని సహితం ‘గేలి’ చేస్తున్నవారు ఉన్నారని మరచిపోరాదు. అంతేగాదు, నేడు మనం ఇంతగా అవసరాలకు మించిన అత్యుత్సా హాన్ని ఇంగ్లిష్‌ భాషపై చూపుతున్నాం గానీ, తమ మాతృభాష అయిన ఇంగ్లిష్‌ భాషపైన శతాబ్దాలపాటు పెత్తనం చెలాయించిన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి వంటి వలస సామ్రాజ్య భాషలను వదిలించుకోడానికి ఇంగ్లండ్‌ ప్రజలకు సహితం 300 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోవాలి. ఈ పర భాషా దాష్టీకాన్ని వదిలించుకోవడానికి ఇంగ్లండ్‌ 16–17 శతాబ్దా లలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచి తమ తల్లి ఇంగ్లిష్‌ భాషను జాతీయ భాషగా తీర్మానం చేసుకోవలసిన గతి పట్టింది. కనుక మాతృ భాషా పరిరక్షణలో ఇంగ్లండ్‌ ప్రజల పోరాట స్ఫూర్తే తిరిగి తెలు గువారికి, పాలకులకు కూడా స్ఫూర్తి కావాలి. తమ ఇంగ్లిష్‌ పెత్తనం చిరకాలం వర్ధమాన దేశాల ప్రజలపైన, బడుగు దేశాల మార్కెట్లపైన కొనసాగించాలన్న వలసపాలకుల కుట్ర కారణంగానే రెండు దశా బ్దాలలోనే– మన పిల్లలు ‘అమ్మ, నాన్న’ పదాల నుంచి దూరమైపోయి ‘మమ్మీ, డాడీ’ పదాలకే అంటకాగిపోవడం చూస్తున్నాం.. 

అదేమంటే, ‘పోటీ ప్రపంచంలో, మన పిల్లలు తట్టుకుని నిలబడా లంటే ‘ఉనికి’ కోసం తన భాషను త్యజించి పరాయి భాషకే ‘అంటిల్లా’ కావాలనుకోవడం అత్యాశ. ఎందుకంటే, ఈ రోజుకీ ప్రపంచ భాషగా ‘ఇంగ్లిష్‌’ పెత్తనం చెలాయించవచ్చుగాక, కానీ మనం ఊహించని నవ చైనా భాష (చైనీస్‌), శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాలలో శరవేగాన తన ప్రభావాన్ని నిరూపించుకుని ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికాను తోసి రాజంటూ రేపో మాపో అగ్రస్థానంలోకి చైనా దూసుకువస్తున్నందున– అదే ఇంగ్లిష్‌నూ శాసించబోతోందని నిపుణులు భావిస్తున్నారు. కనుకనే యూరప్, అమెరికాలు రేపు అగ్రగామి ఆర్థిక శక్తిగా చైనా అవతరించ నున్నందున చైనీస్‌ భాషను (మండారిన్‌) తమ విద్యాలయాల్లో, విశ్వ విద్యాలయాల్లో నేర్పేందుకు సుమారు 500 చొప్పున ప్రత్యేక అభ్యాస కేంద్రాలను నడుపుతున్నారనిగుర్తించాలి. అలాగని చెప్పి, బలమైన ఆర్థిక శక్తిసంపన్న దేశానికి చెందిన భాషను అవసరమైన ఒక మాధ్యమంగా నేర్చుకుని, వాడుకుంటామే గానీ, ఎవరికి వారు తమ తల్లి భాషను తాకట్టు పెట్టుకోలేరు! 

ఇంగ్లిష్‌ గానీ, చైనీస్‌ గానీ, మరొకటి గానీ మన అవసరాల కొద్దీ అవి మన  చాకిరీలో తాకట్టుపదాలే గానీ, తల్లి భాషను కోలుకోలేని ‘రుణబాధ’ల్లోకి నెట్టుకోకూడదు. మొన్నటిదాకా ఈ భాషా‘రుణం’లోనే మన దేశీయుల్ని బాబింగ్టన్‌ మెకాలే బానిస విద్యావ్యవస్థ అనే ‘కట్టుగొయ్య’ కట్టిపడేసింది (1835)! భారత విద్యాలయాల్లో ఇంగ్లిష్‌ను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో మెకాలే చాలా బాహాటంగా ఇలా చాటాడు. ‘‘మన ఇంగ్లిష్‌ పాలకులకూ, భారత దేశంలోని కోట్లాదిమంది ప్రజలకూ మధ్య దుబాసీలుగా సంధానకర్తలుగా ఉపయోగపడగల ఒక వర్గాన్ని తయారు చేయడానికి మనం చేయగలదంతా చేయాలి. ఈ వర్గం ఎలాంటివారై ఉండాలి? రంగులో, రక్తసంబంధంలో భారతీయు లుగానూ, రుచులలో, వేషంలో, భావజాలంలో, నీతిలో, మేధస్సులో మాత్రం ఇంగ్లిష్‌ వాళ్లలా ఉండాలి అలా మన భాషకు, మన తిండికీ, మన వేషానికీ అలవాటు పడిన భారతీయుడు బ్రిటిష్‌ సామ్రాజ్యానికి శాశ్వతంగా బానిసై ఉంటాడు’’! 

ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఇంగ్లిష్‌ నేర్పండి గానీ ఇంగ్లిష్‌ విద్యాభ్యాసం అనేది దేశీయ మాతృభాషల బలమైన పునాదిమీదనే సాధ్యం అని ఇంగ్లిష్‌ వైస్రాయి లార్డ్‌ కర్జన్‌ (1898–1905) అంగీకరిం చక తప్పలేదు. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్‌ కమిషన్, కొఠారీ కమిషన్‌ నివేదికల సారాంశం కూడా ఇదేనని మరవరాదు. కనుకనే, గౌరవ యువనేత జగన్‌మోహన్‌ రెడ్డి భాషా మాధ్యమాల విషయంలో కడు జాగరూకతతో ముందుకు సాగాలి. ఎందుకంటే, తన సుదీర్ఘ పాద యాత్రలో జగన్‌ విన్న కోట్లాదిమంది కుల, వర్గ, మతాతీత సామాన్య ప్రజలనుంచి గుండె చప్పుళ్లన్నీ తల్లి భాషలోనే, తనకూ విజయమ్మ పేగు బంధంతో సంక్రమించిన తెలుగు తల్లి భాషే, జగన్‌ నోట అడుగడు గునా ప్రజలను ఉద్దేశించి మీ బాధలు విన్నాను, సమస్యలు తెలుసు కున్నాను, కష్టాలు కళ్లారా చూశాను, విన్నాను అని చెమ్మగిల్లిన ఆర్ద్రమైన కళ్లతో తన భారాన్ని దించుకున్నదీ ఆ తెలుగు తల్లి భాషలోనే సుమా! నా భాషలో బలమైన స్పర్శతో స్పందించాలనుకోవడం ఇతర భాషల్ని ద్వేషించడంగా భావించకూడదు. ఈ మర్మం తెలిసినవాడు కాబట్టే కవి ఛాయారాజ్‌ ఉత్తరోత్తరా ప్రాచీన చరిత్ర గల తెలుగు భాషా వినియోగా నికి చేటును పసిగట్టి తెలుగువాడికి, వాడి ‘వాడి’కి, వాడి ‘వేడి’కి కొల మానంగా ఇరవై ఏళ్లనాడే ముందస్తు హెచ్చరికగా ఇలా స్పందించాడు.

‘నా ప్రేమ, నా అభిమాన మిత్రులకు అర్థం కావాలి. నా ఆగ్రహం, నా ఆవేశం శత్రువులకు అర్థం కావాలి. నా శ్రమ, నా శక్తీ, నా భాషలోనే వ్యక్తం కావాలి. పుట్టుక దగ్గర, చావుదగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను!’. మన భాష, మన భావాలు ‘గ్రాంథికాలు’ కావు. ‘వ్యవహారి కాలు’ మాత్రమే. మన భాషా పండితుల నియామకాలు కూడా ఈ ప్రమాణాలపైనే సాగాలి.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement