
సందర్భం
తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కేంద్రమైన జనగామ నుంచి అక్టోబర్ 6న సీపీఐ ప్రారంభించిన పోరుబాట జనగామ, భువనగిరి యాదాద్రి, సూర్యాపేట, మేడ్చల్, హైదరాబాద్ మీదుగా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. డిసెంబర్ 3 వరకు కొనసాగనున్న పోరుబాటలో రోడ్‌షో, బహిరంగసభలలో వేలాది మంది విద్యార్థి, యువజనులు, బడుగు బలహీనవర్గాల ప్రజలు స్పందిస్తూ, మద్దతి వ్వడం విశేషం. ప్రధానంగా నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదనే ఆవేదనలు ప్రతి రోడ్‌షో, బహిరంగసభలలో వ్యక్తమవుతున్నాయి.
పోరుబాట రోడ్‌షోలలో, బహిరంగసభలలో.. కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీ అమలైందో చెప్పమని ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడటం గమనార్హం. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్తదనమేమీ కానరావడం లేదని, మార్పులు చోటు చేసుకోలేదని, అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, నిరుపేదలు నిరసిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలకు పేరు మార్చి, వాటికి ముద్దు పేర్లు పెట్టి ముచ్చటగా ప్రజలను నమ్మించగలిగారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాల ప్రచారం ఆకాశాన్ని అంటింది. నీళ్లు, నిధులు, నియామకాలు, భూ పంపిణీ, ఆత్మగౌరవ పరిపాలన వంటి ప్రధానమైన హామీల అమలు నిర్వీర్యం కావడంతో ప్రజల్లో నిరాశ అలుముకుంటోంది. కొలువులు 2 లక్షలు ఖాళీగా ఉన్నా 16వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించడంతో కొలువుల కొట్లాట తీవ్రతరమవుతోంది.
సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏకపక్ష, నియంతృత్వ పోకడలకు అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టుల అంచనాల వ్యయం రూ.94 వేల కోట్లు, ఇప్పుడది 1 లక్ష 91 వేల కోట్లకు చేరుకోవడంతో ప్రాజెక్టుల అమలు తీరు ప్రశ్నార్థకమైంది. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న వాగ్దానం గాల్లో కలిసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలుకు అప్పులు పాపం లాగా పెరిగిపోతున్నాయి. ఆఖరుకు ప్రభుత్వ భూములను ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయడం కేసీఆర్ మార్క్ పరిపాలనకు అద్దంపడుతోంది. కోకాపేటలోనున్న 623 ఎకరాలు ప్రభుత్వ భూమే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వాల కాలంలో చెరువుశిఖాలు, ప్రభుత్వ భూములు రియల్‌ఎస్టేట్ పరమయ్యాయనే చర్చ ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన జంప్ జలానీలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు విశృంఖలంగా భూములను ఆక్రమించుకుంటుంటే, అడ్డుపడుతున్న కలెక్టర్‌లను నిలదీస్తూ కించపరుస్తున్న తీరు గర్హనీయం.
దళితులకు మూడెకరాల భూమి ప్రహసనంగా మారి బెజ్జెంకి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన దళిత యువకుడు శ్రీనివాసును బలిగొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రకటనలకే పరిమితమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుబాటులోకి వస్తుంది? కార్మిక సంఘాల మధ్య కూడా చిచ్చుపెట్టి సింగరేణి ఎన్నికలో ‘‘ఆపరేషన్ ఆకర్‡్ష’’కు ప్రయత్నించడం దిగజారుడుతనమే. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఎనిమిది రకాల వస్తువులు అందిస్తే, ఈ ప్రభుత్వం ఒక్క బియ్యాన్నే సరఫరా చేయడం వలన చౌకధరల దుకాణాలను నడపలేమని డీలర్లు సమ్మెకు పూనుకొంటున్నారు. పత్తిరైతులు మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 2,000 లకు కొనుగోలు చేయడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.
ఆసరా పెన్షన్లలో భార్యాభర్తల్లో ఒక్కరికే ఇవ్వడం పట్ల కూడా అసహనం పెరుగుతోంది. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ గురించి అర్జీలు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితమవడంతో సచివాలయం మూగబోయింది. ఆత్మగౌరవ పరిపాలన అనుకుంటే ఆత్మవంచనా పాలన సాగుతోంది. ప్రజా ప్రాతినిధ్యానికి కేసీఆర్ పాలనలో స్థానం లేదు. పోరుబాటలో భాగంగా ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వెల్లువలా వినతిపత్రాలు అందుతున్నాయి. అందులో సింహభాగం అంటే 70–80 శాతం డబుల్ బెడ్‌రూమ్‌లు, నివాస స్థలాల గురించే ఉండటం గమనార్హం. లక్షలలో ఇళ్లు కడతామని చెప్పి మూడున్నర ఏళ్లలో మూడున్నర వేల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోవడంతో ప్రజలలో ఉద్యమనేతపై విశ్వాసం సన్నగిల్లుతోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తామని, కొన్ని చోట్ల శంఖుస్థాపన చేశారని, ఇప్పుడేమో అవి ప్రైవేట్ భూములని తప్పించుకుంటున్నారని పలువురు వాపోయారు. ఇలాంటి తరుణంలో సీపీఐ చేపట్టిన పోరుబాట ప్రజలకు ఒకింత భరోసా, విశ్వాసాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిం చడం, ప్రజల ఆదరణ పోరుబాటకు లభించడంతో మాపై గురుతరమైన బాధ్యత పెరుగుతున్నది. తెలంగాణలో సాయుధ పోరా టం ద్వారా నైజాంను గద్దెదించడంలో ప్రధానపాత్ర పోషించిన సీపీఐ నేడు పోరుబాటతో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత పునరంకితం కానున్నది.
- చాడ వెంకటరెడ్డి
వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
మొబైల్ : 94909 52301