ఆపత్కాలంలో ‘అనివార్యత’ ముసుగు | Chandrababu Is Criminal Mentality Person Says Amar | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో ‘అనివార్యత’ ముసుగు

Published Wed, Nov 7 2018 12:18 AM | Last Updated on Wed, Nov 7 2018 12:18 AM

Chandrababu Is Criminal Mentality Person Says Amar - Sakshi

బలమైన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించడానికి ప్రయత్నించే నేరబుద్ధి చంద్రబాబుకు ముందునుంచీ ఉందని వంగవీటి రంగా హత్యోదంతం తేల్చి చెప్పింది. అలాగే వైఎస్‌ జగన్‌ని హత్య చెయ్యడానికి జరిపిన కుట్ర.. కాస్తలో విఫలమైందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో కాంగ్రెస్‌తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్‌ చేశారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన బాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి, ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వంసాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పనిచేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగవు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఒక కొత్త పదం దొరికింది. అది ‘‘ప్రజాస్వామ్య అనివార్యత’’ (democratic compulsion. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో జత కట్టడానికి బాబు ఎన్నుకున్న పదం ఈ ప్రజాస్వామ్య అనివార్యత. ఈ అనివార్యత ఏమై ఉంటుంది అని అందరూ చర్చించుకుంటున్నారు. దానితోపాటు ఇంకో మాట చెప్పాడాయన. వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నారు, వాటిని కాపాడటమే ఆ ప్రజాస్వామ్య అనివార్యత అని. ఈ గొప్ప లక్ష్య సాధన కోసమే గతాన్ని మరిచి పోయి కాంగ్రెస్‌తో చెలిమికి సిద్ధపడ్డామని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు ఏ ప్రజాస్వామ్య అని వార్యతలో భాగంగా ఏయే వ్యవస్థలను రక్షించడానికి నడుము కట్టారో, అసలు ఆ వ్యవస్థలను సమూలంగా నాశనం చెయ్యబూనుకున్నది ఎవరో దేశానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్పిందేమిటి ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ వంటి వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ద్వారా వాటిని ధ్వంసం చేస్తున్నదని కదా. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తాను  ముఖ్యమంత్రిగా ఉన్నా, మామ పంచన జీవి స్తున్నా ఈ వ్యవస్థలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అనడానికి బోలెడు నిదర్శనాలు ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం.

ఆదినుంచీ అవకాశవాదమే...
కాంగ్రెస్‌తో చంద్రబాబు బహిరంగంగా కలవాల్సిన అనివార్యత గురించి చెప్పుకుని అప్పుడు ఆ విషయాల్లోకి వెళ్దాం. బహిరంగంగా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన కాంగ్రెస్‌లో పుట్టి రాజకీయ అవకాశవాదంతో మామ పంచన చేరిన దగ్గరి నుంచీ కాంగ్రెస్‌తో రహస్య స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాడు. పాపం రాజకీయ ఎత్తుగడలు తెలియని ఎన్టీరామారావు ఇది గమనించలేదు. 1995లో మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడు ఆ అధికారాన్ని నిలబెట్టుకోడానికి అప్పటి కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం శరణు జొచ్చాడు. ఎన్టీరామారావు చేసిన విజ్ఞప్తిని ఆనాడు పీవీ నరసింహారావు పట్టించుకుని ఉంటే, ఇవాళ చంద్రబాబు రాజకీయాల్లో ఉండేవాడు కాదు. ఆ తరువాత కొద్ది మాసాలకే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల తరువాత చంద్రబాబు చక్రం తిప్పిన యునైటెడ్‌ ఫ్రంట్‌ కాకుండా ఎన్టీఆర్‌ నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చి ఆయన ప్రధాన మంత్రి కూడా అయ్యేవారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ కంటే తక్కువ స్థాయి నాయకుడేమీ కాదు ఎన్టీఆర్‌.

అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే ప్రధాని అయి చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పేవి కాదు. తాను చక్రం తిప్పానని చెపుతున్న యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం నడపడానికి కూడా కాంగ్రెస్‌ మద్దతు తీసుకోడానికి చంద్రబాబు వెనకాడలేదు. ఇక కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న తాను కేసుల నుంచి తప్పించుకోడానికి చక్కగా వీలుంటుంది. గతంలో చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌ మంత్రి చిదంబరాన్ని కలసిన విషయం ఆ మంత్రే చెప్పారు, చంద్రబాబు దాన్ని ఖండించలేదు. యువనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని నిలువరించడానికి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా వోటింగ్‌ నుంచి చంద్రబాబు గైర్‌హాజర్‌ కావడం కూడా చూశాం. ఆ తరువాత అదే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కయి ‘‘వ్యవస్థలను వాడుకుని‘‘ జగన్‌మోహన్‌ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు బెయిల్‌ కూడా రాకుండా చూసిన ఘనత చంద్రబాబుదే. ఇవీ ఆయన ప్రజాస్వామ్య అనివార్యతలు.

వెంటాడుతున్న ఓటుకు కోట్లు కేసు
కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి స్నేహాన్ని, ఇప్పుడు వెలుగులోకి తెచ్చేసిన కొత్త ప్రజాస్వామ్య అనివార్యత ఏమిటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ మళ్ళీ కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వోటుకు కోట్లు కేసులో శిక్ష అనుభవించక తప్పని ‘‘అనివార్యత’’ చంద్రబాబును కాంగ్రెస్‌ పంచన చేర్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేసు నీరు గార్చేయ్యవచ్చునన్న ధీమా ఆయనది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని నిధులయినా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఛీ కొడితే కాంగ్రెస్‌తో అక్కడ ఎట్లా కలిసి వెళతారు అనే సందేహం ఎవరికయినా సహజంగానే వస్తుంది. అది కూడా ఒక అనివార్యతే. ఆ అనివార్యత పేరు జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన నాయకత్వంలోని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. బీజీపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నాడు పొలిట్‌ బ్యూరోతో సంప్రతిం పులు, సీనియర్‌ నాయకులతో చర్చలు అని ప్రదర్శిం చిన నాటకానికి కూడా తావులేకుండా ఇప్పుడు చటుక్కున ప్రత్యేక విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించడం వెనక ఉన్న తక్షణ అనివార్యత జగన్‌ మోహన్‌రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి. ఈ దాడి జరిగిన కొద్ది సేపట్లోనే రాష్ట్ర డీజీపీ ఆయన వెనకే బాబు మీడియా గోష్టి ఏర్పాటు చేసి, జగన్‌ అభిమానే దాడి చేశాడనీ, జగన్‌కు సానుభూతి పెరగడానికే ఈ దాడి చేయించుకున్నారనీ స్థాయి మరిచి దిగజారుడు ప్రకటనలు చేసి నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు. నిజమే, జగన్‌ మీద జరిగిన దాడికి చంద్రబాబునాయుడు ఇదే రంగు పూయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తాను చేసినట్టే అందరూ చేస్తారని నమ్మించజూస్తారు ఆయన.

ప్రత్యర్థుల నిర్మూలన అలవాటే
ఒక్కసారి మల్లెల బాబ్జీని జ్ఞాపకం చేసుకుందాం. 34 ఏళ్ళ కిందట ఎన్టీ రామారావు మీద బాబ్జీ అనే యువకుడితో దాడి చేయించి తద్వారా సానుభూతి పొందడానికి స్కెచ్‌ వేసింది చంద్రబాబేనని తర్వాతికాలంలో మల్లెల బాబ్జీ ఆత్మహత్య తరువాత బయటపడింది. ఆ విషయం ఇండియాటుడే వంటి ప్రతిష్టాత్మక జాతీయ ఆంగ్ల వారపత్రిక రాసిన విషయం తెలిసిందే. విషయంలోకి వస్తే, మల్లెల బాబ్జీ అనే వ్యక్తి హఠాత్తుగా ఎన్టీఆర్‌ వద్దకు వచ్చి ఆయన బొట నవేలిపై బ్లేడుతో గాయం చేశాడు. దీంతో సభలో కలకలం చెలరేగింది. ఎన్టీఆర్‌ కూడా బొటనవేలికి పెద్ద కట్టు కట్టుకుని కొద్ది రోజులు తిరిగారు. అయితే ‘అదంతా డ్రామా..’ అని అప్పట్లోనే ప్రజలు భావిం చారు. వాస్తవం ఏమిటంటే ప్రజల్లో ఎన్టీఆర్‌ ప్రభ తగ్గుతున్నవేళ మల్లెల బాబ్జి (పేద కాపు కులస్థుడు)తో ఆయన మీద ఉత్తుత్తి హత్య ప్రయత్నం చేయించి అందుకు బదులుగా మూడు లక్షల రూపాయలు ఇస్తానని  చెప్పి తరువాత మాట తప్పి చంద్రబాబు బాబ్జీ చేతిలో 30 వేలే పెట్టాడని ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధి రాశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు మల్లెల బాబ్జీ రాసిన రెండు లేఖలు దొరికితే వాటిలో ఈ నిజాలు బయటపడ్డాయని ఇండియా టుడే రాసింది. అప్పట్లో ఆ లేఖలు బయటపడితే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఆనాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ రామారావు (ఆయన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు) ఇబ్బందుల్లో పడతారని పోలీసులూ, ఆ నాటి విజయవాడ ఎగ్జిక్యూటివ్‌ మేజి స్ట్రేట్‌ టీబీ బెనర్జీ దాచేశారని కూడా ఇండియా టుడే రాసింది. బాబ్జీ ఆత్మహత్య చేసుకున్న తరువాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంఘం ఎదుట ఈ లేఖలు బయట పడ్డాయని కూడా ఆ పత్రిక రాసింది. ఇంతకూ మల్లెల బాబ్జీది ఆత్మహత్యేనా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడుకు ఇటువంటి నేర బుద్ధి ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తూనే ఉంది. అది జగన్‌మోహన్‌ రెడ్డి మీద దాడి తరువాత తాము మల్లెల బాబ్జీ చేత చేయించిన పనిని ఈ సంఘటనకు కూడా అంటగట్టి తప్పించుకోవచ్చనే నేర బుద్ధి కావచ్చు. అందుకోసం చాలా ప్రయత్నాలే చేశారు. ఫ్లెక్సీలు సృష్టించారు, పార్టీ నాయకులతో అడ్డగోలుగా మాట్లాడించారు, నెపం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. జగన్‌మోహన్‌ రెడ్డిని హత్య చెయ్యడానికి జరిగిన కుట్రలో భాగంగానే ఈ విఫలయత్నం జరిగిందని జనం గట్టిగా నమ్మడంతో దిక్కుతోచక కాంగ్రెస్తో దోస్తీ ప్రహసనాన్ని అడ్వాన్స్‌ చేశారు చంద్రబాబు. తన మీద తానే దాడి చేయించుకోవలసిన అవసరం జగన్‌కు ఏముంది? ఆనాడు ఎన్టీఆర్‌ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది కాబట్టి సానుభూతి కోసం చంద్రబాబు మల్లెల బాబ్జీని ప్రయోగించారు. ఏడాది పొడుగునా పాదయాత్ర చేస్తూ రోజురోజుకూ జనాభిమానం పెంచుకుంటున్న జగన్‌కి ఆ అవసరం లేదు. నిజంగా ఆయనే చేయించుకుంటే ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రుజువు చెయ్యడం క్షణాల్లో జరిగే పని. దర్యాప్తు క్షుణ్ణంగా చేయించి నిజాలు నిగ్గు తేల్చండని జగన్‌ మోహన్‌రెడ్డి పట్టుబడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా జరిపించి మూసెయ్యాలని చూస్తోంది అంటేనే నేరం వెనక ఉన్నదెవరో, అది బయటపడుతుందని భయపడుతున్నదెవరో అర్థం అవుతున్నది. తానే దాడి చేయించుకుంటే నిందితుడు శ్రీనివాస్‌ దగ్గర దొరికిన 11 పేజీల లేఖలో ఈ దాడి చంద్రబాబు చేయించాడు అని రాసుకుంటారు కానీ, నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభిమానిని అని రాసుకోరు కదా. ఇంత చిన్న లాజిక్‌ ఎట్లా మిస్‌ అయ్యారు? అయినా ఆత్మహత్య చేసుకునే వారు కారణాలు తెలుపుతూ లేఖలు రాస్తారు (మల్లెల బాబ్జీ లాగా).

వంగవీటి రంగా హంతకులెవరు?
హత్యలు చేసేవారు ఆధారాలు తెలిపే లేఖలు రాసి వెంటపెట్టుకున్న చోద్యం మొదటిసారి చూస్తున్నాం. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవడం, అందుకోసం ప్రజాభిమానాన్ని చూరగొనడం కాకుండా కుట్ర పద్ధతుల్లో, అవసరం అయితే భౌతికంగా అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఉందని ఆ పార్టీలో చాలా కాలం ఉన్న సీనియర్‌ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన మాటల్లోనే ‘‘రంగాను హత్యచేయడానికి జరిగిన కుట్ర వెనక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్‌ సుబ్బరాజుల హస్తాలు ఉన్నాయని శివరామరాజు నాతో చెప్పిన మాట నేను నమ్మాను. తెలుగుదేశం పార్టీ వారు ఒక కాపు నాయకుడిని తమకు వ్యతిరేక పార్టీలో ఉండి జనాదరణ పొందుతున్నాడన్న కారణంతో పాశవికంగా హతమార్చడం నన్ను కలచి వేసింది‘. హరిరామ జోగయ్య మాటలు విన్నాక రోజురోజుకూ పెరిగిపోతున్న జనాదరణ కారణంగా జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన ఎవరికి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. రంగా హత్యకు ముందు ఎన్టీ రామారావు హరిరామ జోగయ్యను పిలిచి మీ కులస్తులు ఎందుకు మన పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అని అడిగితే, రంగా భద్రతను తగ్గించడం కూడా ఒక కారణం అని జోగయ్య చెప్పారట. రంగా భద్రత పెంచడానికి అంగీకరించిన ఎన్టీఆర్‌ మరునాడు జోగయ్యను పిలిచి చంద్రబాబు తదితర నాయకులు ఇప్పుడు య«థాస్థితి కొనసాగించమని అంటున్నారు కాబట్టి భద్రత పెంచే వీలులేదని చెప్పారట, ఆ తరువాత కొద్ది కాలానికే రంగా దారుణ హత్యకు గురయ్యారు.
ఇక చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ కేసులు తరుముకొస్తాయన్న భయం పట్టుకున్నట్టు స్పష్టం అవుతున్నది. నన్ను మీరే కాపాడాలి అని ప్రజలతో పదేపదే చెప్పుకోవడం, ఎవరో వ్యాపారుల మీద ఆదాయపు పన్ను దాడులు జరిగితే హాహాకారాలు చేస్తూ రాష్ట్రం మీద, ప్రభుత్వం మీదా దాడి జరిగినట్టు యాగీ చెయ్యడం ఆయనలో రోజురోజుకూ పెరుగుతున్న అభద్రతాభావానికి నిదర్శనం. వీటితో బాటు ప్రజా వ్యతిరేకత కారణంగా ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించాలి, రేపు ఏమయినా జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్నందువల్లనే కక్ష సాధిస్తున్నారని చెప్పుకోవాలి. ఇదీ చంద్రబాబు అనివార్యత.

బాబు నోట విలువల విధ్వంసమా?
ప్రజాస్వామ్య అనివార్యతలో భాగంగా వ్యవస్థలను రక్షించడానికి బయలుదేరానని చెపుతున్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలనూ తాను ఎలా ధ్వంసం చేసిందీ కనిపించక పోవడం ఆశ్చర్యకరం. ఈ విషయం శరద్‌ పవార్‌కో, ఫరూక్‌ అబ్దుల్లాకో తెలియదంటే అర్థం చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో రోజూ చంద్రబాబు దుష్పరిపాలన మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వానికీ, కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులకూ ఎట్లా తెలియకుండా పోయింది? ముందు మీ రాష్ట్రంలో వ్యవస్థలను పునరుద్ధరించి అప్పుడు జాతీయ స్థాయి మాటలు మాట్లాడండి అని ఎందుకు అడగరు? నాలుగేళ్ళు బీజేపీ ఒళ్ళో కూర్చుని ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం దాన్ని వదిలేస్తే సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి నాయకుడు చంద్రబాబును భేష్‌ అని ఎట్లా వెన్నుతడతారు? బీజేపీని వ్యతిరేకిస్తే అన్నీ మాఫ్‌ చేసేస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ధ్వంసం చెయ్యని  వ్యవస్థ ఏదయినా ఉందా? ప్రతి పక్ష శాసన సభ్యులను, ఎంపీలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ఒడిగట్టి శాసన వ్యవస్థను, శాసన సభాపతి స్థానాన్ని భ్రష్టుపట్టించింది ఎవరు? శాసనసభను పార్టీ కార్యాలయంగా మార్చేసింది ఎవరు? అధికార యంత్రాం గాన్ని మొత్తం తన అదుపులో పెట్టుకున్నది ఎవరు? రాష్ట్రంలో చెలరేగిపోతున్న రకరకాల మాఫియాలకు అండగా నిలుస్తున్నది ఎవరు? బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నిటినీ కూడగడతానని బయలుదేరిన చంద్రబాబును ఈ జాతీయ పార్టీలన్నీ నిలదీసి ముందు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వం సాన్ని ఆపి, వాటిని స్వతంత్రంగా పని చేయనిచ్చి అప్పుడు జాతీయ స్థాయిలో ప్రక్షాళనకు రమ్మని ఎందుకు అడగరు? తన మీద వచ్చిన నేరారోపణల మీద స్టేలు తెచ్చుకుని అధికారంలో కొనసాగుతున్న నాయకుడికి విలువల గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?

datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement