ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ ((2017) 1 ఎస్‌సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిసెస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకుర్, కురియన్ జోసెఫ్ కలసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు రెండు మాసాల క్రితం రాసిన లేఖ పూర్తి పాఠం.
అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన న్యాయ సంబంధమైన కొన్ని ఆదేశాలు ‘న్యాయ వ్యవస్థ నిర్వహణ మీద ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించాయి’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులలో పైన పేర్కొన్న ఆ నలుగురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ ఆ లేఖ–
గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగారికి!
అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న కొన్ని ఆదేశాలు మొత్తం న్యాయ వ్యవస్థ పని తీరు మీద, హైకోర్టుల స్వాతంత్య్రం మీద, వీటితో పాటు గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థ నిర్వహణ మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ అంశాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకు రావడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆందోళనతో, తీవ్ర క్షోభతో ఈ లేఖ రాశాం.
కలకత్తా, బొంబాయి, మద్రాసు హైకోర్టులు మూడింటిని ప్రత్యేక అధికారాలతో నెలకొల్పిన నాటి నుంచి న్యాయ వ్యవస్థలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఆ మూడు హైకోర్టులు ఆవిర్భవించిన తరువాత దాదాపు వందేళ్లకు రూపుదిద్దుకున్న ఈ అత్యున్నత న్యాయస్థానం ఆ ఆచారాలూ, సంప్రదాయాలనే స్వీకరించింది. ఈ సంప్రదాయాలన్నీ ఆంగ్లో– సాక్సన్ న్యాయ సిద్ధాంత అధ్యయనం, అమలు ద్వారానే నెలకొన్నాయి.
ఒకసారి స్థిరపడిన ఈ సిద్ధాంతాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ (జాబితా)లో, ఆ రోస్టర్‌ను నిర్ణయించడంలో అధికారం కలిగిన పెద్ద అనే హోదా దక్కించుకున్నారు. లావాదేవీలు జరిపేందుకు అవసరమైన కోర్టుల సంఖ్య, కోర్టులు నడిచేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఏర్పాట్లు, సుప్రీంకోర్టులో ధర్మాసనం/సభ్యుని నిర్ణయం వంటివాటికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యులు. రోస్టర్‌ను రూపొందించడంలో, వ్యాజ్యాన్ని సభ్యులకు/ధర్మాసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక హక్కును గుర్తించడమనేది కూడా సంప్రదాయమే. ఇది కోర్టు లావాదేవీలు సమర్థంగా, క్రమపద్ధతిలో సాగేందుకు ప్రవేశపెట్టిన సంప్రదాయమే కానీ, దీనితో ప్రధాన న్యాయమూర్తి న్యాయ నిర్వహణ పరంగా, వాస్తవంగా మిగిలిన తన సహచరుల కంటే అధికునిగా గుర్తించడానికి కాదు.
న్యాయ శాస్త్ర వ్యవహారాలలో స్థిరపడిన సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అంటే, తనతో సమ స్థాయిలో ఉన్నవారిలో మొదటివారు మాత్రమే అవుతారు. అంతకు మించి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే రోస్టర్ నిర్ధారణలో కూడా ప్రధాన న్యాయమూర్తికి మార్గదర్శకంగా ఉండే విధంగా బాగా స్థిరపడిన, కాల పరీక్షకు నిలిచిన సంప్రదాయాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ వ్యాజ్యానికి సంబంధించిన ధర్మాసనాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన సంప్రదాయాలను పాటించాలి.
పైన పేర్కొన్న ఈ సిద్ధాంతం సహజ పరిణామం ఏమిటంటే బహుళ సభ్యులు కలిగిన ఒక చట్ట బద్ధ వ్యవస్థలో ఉన్నవారు, ఈ ఉన్నత న్యాయస్థానం సభ్యులతో సహా– ఒక ప్రత్యేక వ్యాజ్యం కోసం నియమించిన ధర్మాసనం మీద తమకు తాము ఆధిపత్యం తెచ్చుకోకూడదు. ధర్మాసనం కూర్పులో గానీ, సంఖ్య విషయంలో గాని నిర్ధారించిన రోస్టర్ మేరకు జరిగిన నిర్ణయం మీద వారు ఆధిపత్యం చేయలేరు.
ఈ రెండు నియమాలను అధిగమించినట్టయితే వికృతమైన, అవాంఛనీయమైన పరిణామాలు ఎదురవుతాయి. వ్యవస్థ పరిపూర్ణత గురించి సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి సంక్షోభం గురించి మౌనం వహించడం కూడా అలాంటి పలాయనం ఫలితమే కాగలదు. ఇటీవలి కాలంలో ఈ రెండు నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండే పరిస్థితి లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తి అప్పగించిన వ్యాజ్యం ద్వారా జాతికి, వ్యవస్థకి విస్తృత స్థాయి పరిణామాలు ఎదురైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఆ కేసుల కోసం ధర్మాసనాలలో నియమించిన ‘వారి సమక్షం’గురించి ఎలాంటి హేతుబద్ధత కనిపించదు. ఎంత మూల్యం చెల్లించి అయినా ఇలాంటి దాని నుంచి రక్షణ కల్పించాలి.
వ్యవస్థను ఇబ్బందికి గురి చేయరాదన్న ఉద్దేశంతోనే మేం పూర్తి వివరాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘన కారణంగా వ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొంతమేర దెబ్బతిన్నది. పైన పేర్కొన్న ఈ నేపథ్యంలోనే ఆర్.బి. లూథ్రా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అక్టోబర్ 27, 2017న ఇచ్చిన ఆదేశాలను గురించి కూడా మీ దృష్టికి తీసుకురావడం తప్పనిసరి అని భావించాం. ఈ న్యాయస్థానంలో అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్–ఇతరులు వర్సెస్ భారత ప్రభుత్వం కేసులలో (2016)5 ఎస్‌సీసీ1) రాజ్యాంగ ధర్మాసనం అదే విధాన క్రమపత్రం గురించి విచారిస్తున్నది. ఆ కేసుపై ఇచ్చిన ఆదేశంలో ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించవలసిన పద్ధతికి సంబంధించిన విధాన పత్ర రూపకల్పనలో మరింత జాప్యం నివారించాలని చెప్పారు. అయితే అదే విధాన క్రమపత్రం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుండగా జాప్యం జరగరాదని ఇతర బెంచ్ ఎలా చెప్పగలుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం.
ఇదే కాకుండా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం దరిమిలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన (మీతో సహా) కొలీజియం క్షుణ్ణంగా చర్చించి విధాన క్రమపత్రానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. దీనినే మార్చి నెల 2017లో గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కానీ ఈ సమాచారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం మౌనం నేపథ్యంలో కోలీజియం ఆమోదించి తుది రూపం ఇచ్చిన విధాన క్రమపత్రానికి సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (సుప్ర) కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా భావించవలసి వచ్చింది. ఆ విధంగా విధాన క్రమపత్రం తుది రూపానికి సంబంధించి పరిశీలించడానికి ధర్మాసనానికి ఎలాంటి అవకాశం కూడా లేకపోయింది. ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు.
ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ (2017)1 ఎస్‌సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు.
విధాన క్రమపత్రం విషయంలో ఏ అంశాన్నయినా ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనే, అది కూడా అందరు న్యాయమూర్తులు కలసి చర్చించాలి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆ అంశంలో చట్టపరిధికి సంబంధించిన నిర్ణయం తీసుకోవలసి వస్తే అది ఒక్క రాజ్యాంగ ధర్మాసనమే తీసుకోవాలి. పైన పరిణామాన్ని ఇంత తీవ్రమైన అంశం అన్న స్థాయిలోనే పరిశీలించాలి. విధి నిర్వహణలో నిబద్ధంగా వ్యవహరించే గౌరవ ప్రధాన న్యాయమూర్తి కొలీజియంతో పూర్తి స్థాయి చర్చలు జరిపి పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. అలాగే తరువాతి దశలో ఇందుకు అసవరమైతే ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించాలి. పైన ఉదహరించిన, అంటే ఆర్‌పీ లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం వాజ్యంలో అక్టోబర్ 27, 2017న కోర్టులో వెలువడిన ఆదేశాల విషయంలో మీరు మళ్లీ ఒకసారి దృష్టి సారించగలిగితే, ఈ న్యాయస్థానం ఇచ్చిన అలాంటి ఇతర ఆదేశాలను కూడా మీ ముందుకు తీసుకువస్తాం. వాటిని కూడా అదే తీరులో పరిశీలించవలసి ఉంది.
గౌరవాభినందనలతో...
జె. చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బి లోకుర్, కురియన్ జోసెఫ్
Comments
Please login to add a commentAdd a comment