సాయుధపోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య | Guest Column On Telangana Freedom Fighter Doddi Komaraiah | Sakshi
Sakshi News home page

సాయుధపోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

Published Sat, Jul 4 2020 1:25 AM | Last Updated on Sat, Jul 4 2020 1:25 AM

Guest Column On Telangana Freedom Fighter Doddi Komaraiah  - Sakshi

తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వం ప్రధాన కారణం. ఏడవ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ఖాన్‌ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నిజాం అండదండతో గ్రామాల్లో జాగీర్‌దారులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు, దొరలు పేట్రేగిపోయి ప్రజలను విపరీతంగా పీడించేవారు. అలాంటి వారిలో ఒకడు విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి. 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు, పద్దూ లేదు. పరమ కిరాతకుడు. భువనగిరిలో 1944 ఆంధ్రమహాసభ (సంఘం) సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా ఒక్కో ‘అణా’ చెల్లించి సంఘంలో జేరి, గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారు. సంఘం అండతో దొరసాని జానమ్మకు పన్ను కట్టడం మానేశారు. పన్ను చెల్లించని వారిపైనా ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమురయ్య కూడా అండగా నిలబడ్డాడు. 

ఈ సందర్భంగా దొరసానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా    రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశ్‌ముఖ్‌ అనుచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారు. సంఘం ఆర్గనైజర్‌ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ఆంధ్రమహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు.

దొడ్డి కొమురయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడు. గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గఢీని సమీపించగానే జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య పొట్టలోకి దూసుకుపోగా, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారు. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగి తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైంది. దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు. 
(నేడు దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా)అస్నాల శ్రీనివాస్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement