
సందర్భం
ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు మణిపూర్‌లో జరుగనున్న చిల్డ్రన్స్ నేషనల్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం బీసీ గురుకులాల నుంచి 21 మంది పిల్లలు ఎంపికయ్యారు. వీళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు.
తెలంగాణ రాష్ట్రం అవతరించాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల నుంచి వందలు, వేల సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యార్థులు వస్తున్నారు. ప్రోత్సహిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కి జెండా ఎగుర వేయగలరని తెలంగాణ దళిత వర్గాల సోషల్ వెల్ఫేర్ పిల్లలు నిరూపించారు. బీసీ సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలలో చదువుతున్న పిల్లలు కొన్నేళ్లుగా 10వ తరగతి, ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సంపాదిస్తున్నారు.
ఇటీవల గ్రామీణ ప్రాంతం నుంచి మహా నగరాలలో విద్యాలయాల వరకు స్కూళ్లలో సైన్స్ ఫెయిర్‌లు నిర్వహించారు. ఆ చిన్నారి చేతులతో చేసిన ప్రయోగాలు చూస్తుంటే భవిష్యత్తును వాళ్లెంత గొప్పగా ఆవిష్కరించగలరో ఊహించవచ్చు. అట్టడుగున కన్పించకుండా పోయిన సంచార జాతులు, బాగా వెనుకబడిన ఎంబీసీ కులాల, వెనుకబడిన కులాల పిల్లలు అద్భుతాలు సృష్టించగలరని సైన్స్‌ఫెయిర్‌లు నిరూపిస్తున్నాయి.
చేతివృత్తుల కులాల నుంచి వచ్చిన చిన్నారులు నడిచే యంత్రాల వెనుక ఉన్న సైన్స్‌ను వివరిస్తున్నారు. చేతులకు వేసుకునే అల్లికల గాజుల దగ్గర నుంచి ఖగోళ శాస్త్రం రహస్యాల వరకు చేసి చూపిస్తున్నారు. ఆడపిల్ల లను చూస్తుంటే వాళ్లు మొత్తం ప్రపంచానికే వెలుగులు పంచే దివ్వెలని తేటతెల్లమవుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని వసతులతో గురుకుల విద్యాలయాలను అత్యాధునికంగా నిర్మించే పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మంచి భవనాలు, విశాలమైన స్థలాలు, క్రీడా మైదానాలుంటే కొన్ని చోట్ల మౌలిక వసతుల లేమి సమస్య కూడా ఉంది. వీటి వయసు 9 నెలలు మాత్రమే. స్వంత భవనాల కోసం ప్రత్యేకంగా స్థలాలను చూస్తున్నారు. కొన్నిచోట్ల ఇంజనీరింగ్ కాలేజీల భవనాలలోనే గురుకులాలు ప్రారంభమయ్యాయి.
కొన్ని నెలల క్రితం వరంగల్ నిట్‌లో స్పేస్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌కు బీసీ గురుకులాల నుంచి 7, 9 తరగతులు చదువుతున్న 21 మంది బాలి కలు ఎంపికయ్యారు. ఆ చిన్నారుల సమాధానాలు విని శ్రీహరికోట స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆశ్చ ర్యపోయారు.
ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు మణిపూర్‌లో జరుగనున్న చిల్డ్రన్స్ నేషనల్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం బీసీ గురుకులాల నుంచి 21 మంది పిల్లలు ఎంపికయ్యారు.
వీళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు. అమెరికాలోని నాసాలో అడుగు పెట్టేందుకు వీరిని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో వారు నాసాలో అడుగు పెట్టడం ఖాయమన్న ధీమాను గురుకుల విద్యా సంస్థ అడిషనల్ డైరెక్టర్ మల్లయ్యభట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో వారు దూసుకుపోగలుగుతారు. ఆ పిల్లల ఆత్మస్థైర్యం చూస్తే ఐఐటి, ఎయిమ్స్, ఆర్మ్‌డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీ (పుణే) లాంటి సంస్థలలో అత్యధిక సీట్లు ఈ పిల్లలు దక్కించుకోవడం ఖాయమని అనిపిస్తుంది.
ఇటీవల మిర్యాలగూడెంలో జరిగిన బీసీ గురుకుల మహిళా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను చూస్తే క్రీడారంగంలో కూడా ఈ పిల్లలు ఎంతటి ప్రతిభను చూపగలరో అర్థం చేసుకోవచ్చు. 5వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు బాలికలకు జరిగిన క్రీడా పోటీలు ఆ పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారని, ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటమే గాకుండా ఆచరణాత్మకంగా 540 గురుకుల పాఠశాలలను కూడా నెలకొల్పారు. ఇప్పటివరకు బడికిరాని అట్టడుగు కులాల పిల్లలను బడిలోకి తెచ్చే పని తెలంగాణలో మొదలయ్యింది.
ఈసారి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ముఖ్యమంత్రి కేసీఆర్ దస్తూరితో ఉన్న అభినందన పత్రాన్ని అందించి బహుజన మైనార్టీ వర్గాల పిల్లలను ప్రోత్సహించే పనికి శ్రీకారం చుట్టబోతున్నారు. బీసీ కులాల నుంచి వచ్చిన మానవ వనరులే ఈ దేశ మానవ వనరుల్లో సగ భాగం కాబట్టి ఈ దేశం అభివృద్ధి ఈ వర్గాల పిల్లల చేతుల్లోనే ఉంది.
బీసీల నుంచి సంపాదనలో ఎదిగిన బీసీ పారిశ్రామికవేత్తలు, బీసీ ఉన్నతాధికారులు ఈ సంస్థలు సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. తెలంగాణలో గురుకులాలు ఒక నిశ్శబ్ద విప్లవం. దీని ఫలితాలు రాబోయే పదేళ్లలో కనిపిస్తాయి. తెలంగాణలోని 31 జిల్లాల్లో మొత్తం 119 బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 37,155 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 19,583 మంది, బాలికలు 17,572 మంది. వీరంతా 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు.
ఈ ఏడాది జనవరి 20న ‘షార్’ ఆహ్వానం మేరకు శ్రీహరికోటకు రాష్ట్రవ్యాప్తంగా 50 మంది విద్యార్థులు ఎంపికైతే అందులో 22 మంది బీసీ గురుకుల చిన్నారులే. రాష్ట్రంలోని 119 గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది సైన్స్‌ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రూపకల్పన చేసే పనిలో ఉన్నారు.
జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment