తన వెనుక అంత పెద్ద కుట్ర జరుగుతున్నా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కనిపెట్టలేకపోయారంటే కారణం, కుట్ర చేయడం అందరికీ సాధ్యం కాకపోవడమేనని సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ అన్నారు. వంశపారంపర్య రాజకీయాల్లో కేవలం నోటి మాటల ద్వారా, పుకార్ల ద్వారా ఎలా ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఫిరాయింపు చేయవచ్చో ఆనాడే బాబు తనకే సాధ్యమైన పద్ధతిలో చేసి చూపించారని ఎద్దేవా చేశారు. లక్ష్మీపార్వతిపై దుష్ప్రచారంలో రజనీకాంత్‌ను తోడు తెచ్చుకుని మరీ బాబు సాగించిన చర్య దారుణమన్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ, ఎప్పుడు నిలబడతాడో ఎవరికీ అర్థం కాని సమస్య అని, జన సమీకరణ విషయంలో వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్‌నే మించిపోయారంటున్న ఏబీకే ప్రసాద్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
నాటి సమాజం నాటి జర్నలిజం.. నేటి సమాజం నేటి జర్నలిజం ఎలా ఉంటున్నాయి?
జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. మంచివీ ఉన్నాయి. మనం అంగీకరించలేనివీ ఉన్నాయి. జాతీయోద్యమ కాలంలో నడిచిన జర్నలిజం పద్ధతి వేరు. చివరికి పెట్టుబడిదారుడైన గోయెంకాలో సైతం జాతీయోద్యమ స్ఫూర్తి అంతో ఇంతో ఉండింది కాబట్టే ఆయన ఉన్నంత వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెడిపోకుండా ఉండింది. రాన్రానూ జర్నలిజానికి లక్ష్యం లేకుండా పోయింది. ఎప్పుడైతే పౌర సమాజం పడుకుండిపోతుందో అప్పుడే పత్రికారంగం కూడా పడుకుండిపోతుంది. ఇప్పుడు పాలకపార్టీలన్నీ ధనిక వర్గానికే సంబంధించినవి కాబట్టి వాటికి జాతీయవాద పునాది, దాని విలువలతో పనిలేదు. గాలి ఎటువీస్తే అటు పోవడం. జర్నలిజంది కూడా గాలివాటమే.
పెట్టుబడిదారీ వ్యతిరేక భావజాలాన్నే ఇంకా నమ్ముతున్నారా?
ఈ ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం ఉన్నంతవరకు, సామ్రాజ్యవాద ధోరణులు కొనసాగినంతవరకు కారల్ మార్క్స్ చచ్చిపోడు. మార్క్సిజం పునాది నుంచి వచ్చినటువంటి వాళ్లం కాబట్టి దానికి మాత్రమే కట్టుబడి ఉంటాం. పైగా సమకాలీన పరిస్థితులను విశ్లేషించి చెప్పాలంటే తప్పనిసరిగా మార్క్సిస్ట్ ఆలోచనా విధానానికి, ప్రధానంగా దాని రాజ కీయ అర్థశాస్త్ర దృక్పథానికి మళ్లాల్సిందే.
చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌ని ఎలా దెబ్బగొట్టగలిగారు?
అధికారంలోకి రావాలనే యావలో చేసే పనులు చాలారకాలుగా ఉంటాయి. కుట్రలు చేయడం, రహస్య కలాపాలు చేయడం దానితోనే మొదలవుతుంది. ఎంతఘోరంగా ఎన్టీఆర్‌ని దెబ్బతీశారు అనేది అందరికీ తెలిసిందే. ఆగస్టు సంక్షోభంలో ప్రతిపక్ష నేత మైసూరారెడ్డి వద్దకే చంద్రబాబు వెళ్లి తనవైపు 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్యను ఎలా పెంచాలి అని అడిగారు. కేవలం 40 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్‌ని ఎలా తప్పిస్తావు అని మైసూరా అడిగారు. ఇది నా కల్పన కాదు. మైసూరారెడ్డే స్వయంగా నాతో చెప్పినమాట ఇది. ఆ తర్వాత రెండురోజుల లోపే పూటకో రీతిగా బాబుకు అనుకూలమైన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. వంశపారంపర్య రాజకీయాల్లో కేవలం నోటి మాటల ద్వారా, పుకార్ల ద్వారా ఎలా సమీకరణ చేయవచ్చనడానికి ఇదొక కొత్త తీరు. ఎన్టీఆర్ ప్రజలవద్దకు పాలన పథకం కోసం శ్రీకాకుళం వెళితే ఆయన కన్నా ముందు బాబు విశాఖపట్నం వెళ్లి ఫోన్ల రాజకీయాలు చేశారు. ఒకేరోజు దాదాపు 1200 మందికి చంద్రబాబు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఆ కాల్ లిస్టును తర్వాత నేను పనిగట్టుకుని సేకరించి తెప్పించాను. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.
మరి తన వెనుక ఇంత కుట్ర జరుగుతుంటే ఎన్టీఆర్ ఎందుకు కనిపెట్టలేకపోయారు?
ఎన్టీఆర్... చంద్రబాబు వంటి కుట్రదారుడు కాదు కాబట్టే కనిపెట్టలేకపోయారు. కుట్ర చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కదా. కుట్రచేయడం ఓ ప్రత్యేక లక్షణం. జన్యుపరంగా వచ్చినా తర్వాత నేర్చుకున్నా లేక తెచ్చిపెట్టుకున్నా సరే.. కుట్రలు కొందరికే సాధ్యం. ఇక లక్ష్మీపార్వతి విషయంలో బాబు చేసిన పని సామాన్యమైన పని కాదు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నువ్వు చేసే పనులు చాలక, రజనీకాంత్‌ను మద్రాసు నుంచి రప్పించి మరీ ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయించడం ఏమిటి?
వైఎస్‌ఆర్ పాలనలో మీకు నచ్చిందేమిటి?
అనుకున్నవి, అనుకోనివి కూడా చేయడమే ఆయన పాలనకు సంబంధించిన అద్భుతం. ఆరోగ్యశ్రీ. ఈ పథకం కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేసిందని అంటున్నారు. నిజమే. కానీ మనం అర్థం చేసుకోవలసింది ఇది సోషలిస్టు వ్యవస్థ కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ వ్యవస్థలోంచి పాలనకు వచ్చిన వాడు ఎంతో కొంత సామాజిక స్పృహ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలను తలపెడతాడు. 20 లక్షల మందికి వైఎస్సార్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు అందాయంటే, చంటిపిల్లలకు ఉన్న గుండె వ్యాధులను కూడా నయం చేశారంటే ఆలోచించండి. అదీ కార్పొరేట్ ఆస్పత్రుల యాజ మాన్యాలతో ఎన్నోసార్లు సంప్రదించి, వారిని ఒప్పించడం ఎంతో గొప్ప విషయం.
కేసీఆర్, చంద్రబాబు ఇద్దరిలో ఎవరి పాలన బాగుందంటారు?
కేంద్రాన్ని కూడా కలుపుకుని చెబితే ముగ్గురూ ముగ్గురే. మోదీ, బాబు, కేసీఆర్ ముగ్గురూ నిరంకుశమైన ఆలోచనా విధానం ఉన్నవారే. ఏ విషయంలో అయినా సరే వీరి వైఖరి అప్రజాస్వామికం. పాలకులు తమ ఉనికికోసం కొన్ని మంచిపనులు చేయడం తప్పదు. కానీ వాటిని ఆధారం చేసుకుని వారి పాలన మొత్తం గొప్పది అని చెప్పలేం. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇస్తున్నారు. దాంతో వీరేదో కొంత మేలు చేస్తున్నారు అనే భ్రమల్లోంచి జనం బయటపడటం లేదు.
ఓటుకు కోట్లు, ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చివరకు గవర్నర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. గవర్నర్‌కి సాధ్యం కాకపోతే, కేంద్రం రాజీ కుదిర్చింది. ఇక ఫిరాయింపులు మన ఎలక్టోరల్ సిస్టమ్‌కి సంబంధించిన దౌర్భాగ్యం. మనకు ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది. ఎలక్టోరల్ కాలేజి ఉంది. ఎన్నికల కమిషన్ ఉంది. ఈ అన్నింటినీ సుదీర్ఘకాలంలో పాలకులు నిర్వీర్యం చేసిపడేశారు. చివరకు రాష్ట్రాల్లో ఉండే ఏసీబీలు, ఈడీలు రెండూ కూడా పాలకులకు వందిమాగధుల్లానే తయారైపోయాయి.
పోలవరం ప్రాజెక్టు తాజా పరిణామాలు ఏపీకి మంచిదేనంటారా?
మొత్తం ప్రాజెక్టు విషయంలో ఒక ప్రాతిపదిక లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లాడు. ప్రత్యేక హోదాతో ముడిపడిన అన్ని అంశాలను ఆ ప్రత్యేక హోదా లేకుండా వస్తాయని అనుకోవడం పెద్ద భ్రమ. అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే అతి ప్రధాన కర్తవ్యమైపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదానే లేదు. విభజన చట్టంలో ప్రకటించిన 16 వేల కోట్ల రూపాయలనే ఇవ్వడానికి సిద్ధపడిన కేంద్రం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు పెంచిన 60 వేల కోట్లను ఇవ్వమంటే ఎందుకిస్తుంది?
వైఎస్ జగన్ పాదయాత్రపై మీ స్పందన? తండ్రికి మించి హామీలిస్తున్నారని విమర్శ?
పాదయాత్రలో తండ్రికి మించిన జనసమీకరణ చేస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రను క్రౌడ్ పుల్లింగ్‌గానే చెప్పొచ్చు. కానీ ఏ పాలకుడికైనా ఇచ్చిన హామీలను అమలు చేయడమే అసలైన పరీక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారన్నదే అసలు సమస్య.
పవన్ కల్యాణ్ తాజా పరిణామాలపై మీ స్పందన?
ఆ సెక్షన్ గురించి తడమడం అనవసరం. పవన్‌కల్యాణ్ ఎక్కడ నిలబడతాడో, ఎప్పుడు నిలబడతాడో ఎవరికీ అర్థం కాని సమస్య. కొంతమంది లేస్తే మనిషిని కాదంటారు. కానీ ఆ లేవడమే పవన్‌కి గగనమైపోతోంది కదా...!
( ఏబీకే ప్రసాద్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/v7EAAT
Comments
Please login to add a commentAdd a comment