అప్పుడు ఎన్టీఆర్‌కు విలువలు లేవన్నారు.. ఇప్పుడు ఎనలేని ప్రేమ | KSR Comment On Chandrababu Naidu Dual Role Over NTR | Sakshi
Sakshi News home page

అప్పుడు ఎన్టీఆర్‌కు విలువలు లేవన్నారు.. ఇప్పుడు ఎనలేని ప్రేమ

Published Mon, May 22 2023 9:02 AM | Last Updated on Mon, May 22 2023 10:41 AM

KSR Comment On Chandrababu Naidu Dual Role Over NTR - Sakshi

మహానాయకుడు ఎన్.టి. రామారావుకు భారతరత్న సాధించి తీరుతామని, అంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హైదరాబాద్ కుకట్ పల్లి లో జరిగిన ఎన్టీఆర్‌శత జయంతి సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అలాగే మరో మాట చెప్పారు. ఎన్టీఆర్‌ జన్మదినం అయిన మే 28 వ తేదీన ప్రతి ఇంటిలో ఎన్టీఆర్‌ ఫోటో పెట్టి నివాళి అర్పించాలని అన్నారు. చంద్రబాబు ప్రతి ఆలోచనలో రాజకీయం ఇమిడి ఉంటుంది. ఆయన లక్ష్యం వేరు. అందుకోసం ఆయన ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలరు. అది ఆయన నేర్పరితనం, ఎన్టీఆర్‌ శత జయంతి పేరుతో తెలుగుదేశం నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సభలు నిర్వహించి పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు.

దీనికి తెలుగు జాతి అంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మీడియా ఈనాడు కు ఎన్టీఆర్‌పై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్‌ అంటూ భారీ హెడింగ్ లు పెడుతోంది. నిజంగా చంద్రబాబుకు గాని, ఈనాడు మీడియాకు గాని ఎన్టీఆర్‌పై అభిమానం ఉందా అన్నది పరిశీలిస్తే అదంతా ఉత్తదే అని అనేక దృష్టాంతాలు చెబుతాయి. చంద్రబాబు ఏకంగా తన మామ అయిన ఎన్.టి.రామారావును పదవీచ్యుతుడిని చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు విలువలు లేవని అన్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాలకు పనికిరారని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతిని దారుణంగా అవమానించారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న రోజులలో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆలోచన చేశారు. కాని సాంకేతికంగా ఆ అవార్డును లక్ష్మీపార్వతి అందుకునే అవకాశం ఉంటుంది. అది గిట్టక చంద్రబాబుతో సహా ఎన్టీఆర్‌కుటుంబ సభ్యులు ఆ ఆలోచనను విరమింప చేశారని అప్పట్లో ప్రచారం జరుగుతుండేది.

ఆర్ .నారాయణమూర్తి వంటి అమాయక సినీ ప్రముఖుడు ఆ విషయం తెలియకో , గుర్తు లేకో చంద్రబాబు దేశ రాజకీయాలను శాసించారని, 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు దానిని సాధించి ఉండాల్సిందని అన్నారు. ఇప్పుడైనా కేసీఆర్‌, జగన్ లతో సహా అందరితో సంతకాలు తీసుకుని భారతరత్న సాదించాలని ఆవేశంగా అన్నారు. అందుకు చంద్రబాబు ఇష్టపడతారో,లేదో ఆయన తెలుసుకుని ఉండవలసింది. అధికారం కోల్పోయిన తర్వాత ఎన్.టి.రామారావు పేరు,ప్రఖ్యాతులను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని ,తిరిగి పవర్ లోకి రావడానికి చంద్రబాబు ఆయన సహచరులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఎన్టీఆర్‌శతజయంతి సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్టీఆర్‌పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతిని ఈ సభలకు పిలిచి ఉండేవారు కదా!

ఎన్టీఆర్‌ జీవిత చరమాంకంలో ప్రేమించిన వ్యక్తిని, ఆయనకు సేవలందించిన మనిషిని ఆదరించలేని వారు మంచి కుటుంబ సభ్యులు ఎలా అవుతారు? లక్ష్మీ పార్వతిని ఎన్ .టి.రామారావు రెండో పెళ్లి చేసుకోవడమే తప్పని కదా వీరంతా ప్రచారం చేసింది.మరి రెండో వివాహం చేసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు కొందరు అదే వేదికపైన ఉన్నారు కదా!వారిలో పలువురిని చంద్రబాబు పలకరించారు కదా! రాజకీయంగా విబేధాలు ఉండవచ్చు. అయినా రాజకీయాలకు అతీతంగా ఈ సభలు జరుగుతుంటే ఎన్టీఆర్‌కు ఇష్టమైనవారిని కూడా ఆహ్వానించి ఉండేవారు కదా! ఎన్టీఆర్‌చివరి రోజులలో ఈనాడు దినపత్రిక ఎంతటి దారుణమైన కార్టూన్లు వేసిందో గుర్తుకు తెచ్చుకుంటేనే బాధ కలుగుతుంది. ఎన్టీఆర్‌కు బట్టలు లేనట్లుగా , ఆయనను చెత్తబుట్టలో వేసినట్లు కార్టూన్లు వేయడం చేసిన ఆ పత్రిక ఇప్పుడు తెలుగు జాతి గుండె చప్పుడు అని హెడింగ్ లు పెట్టి ఎవరిని మోసం చేయాలని అనుకుంటోంది?ఆ మాట నిజమని నమ్మితే ఎన్టీఆర్‌శత జయంతి సందర్భంగా తాము ఆ రోజుల్లో చేసింది తప్పు అని ఈనాడు చెంపలు వేసుకోవాలి.

అలాగే మామ అని కూడా చూడకుండా ఆయనను పదవి నుంచి దించినందుకు తెలుగు జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఆ పని చేయడానికి వారు సిద్దం అవుతారా? అవ్వరు.ఎందుకంటే వారికి ఎన్.టి.రామారావు అంటే అభిమానం కాదు. రాజకీయం కోసం వాడుకోవడమే వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు. ఒక్క చంద్రబాబేకాదు. ఎన్టీఆర్‌కుటుంబ సభ్యులు దాదాపు అంతా ఆయనను అవమానించినవారే. ఆయన ఆస్తులతో పాటు అధికారాన్ని గుంజుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో ఒక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కొంత మినహాయింపు. ఎన్టీఆర్‌ను దించడంలో చంద్రబాబుకు సహాయ సహకారాలు అందించినా, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన రియలైజ్ అయి మళ్లీ ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లిపోయారు.

కాకపోతే అప్పటికి జరగవలసిన డామేజీ జరిగిపోయింది. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్‌కుటుంబ సభ్యులంతా తన వెనుకే ఉన్నారని చెప్పుకోవడానికి ఇలాంటి సభలు పెట్టిస్తున్నారనిపిస్తుంది. అప్పట్లో దగ్గుబాటి దంపతులను చంద్రబాబు ఎలా అవమానించింది తెలియదా! చివరికి వారిద్దరూ ఎన్టీఆర్‌ పూర్తిగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? చంద్రబాబు గురించి దగ్గుబాటి తన పుస్తకంలో ఏమి రాసింది తెలియదా! దానికి మించి చంద్రబాబు గురించి స్వయంగా ఎన్టీఆర్‌ విడుదల చేసిన వీడియోని మర్చిపోగలమా! కాకపోతే రాజకీయం చిత్రమైనది. అధికారం ఎలాంటి వారి తప్పులనైనా మర్చిపోయేలా చేస్తుంది.అందువల్లే సిపిఐ, సిపిఎం, బిజెపి మొదలైన పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు. వారు రావడం తప్పని అనడం లేదు. కాని ఇందులో ఉన్న రాజకీయ ఉద్దేశాలను కూడా వారు గమనించి ఉండవలసింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎవరినైనా మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉంది.అందువల్లే సిపిఐ, సిపిఎం అగ్రనేతలను, అలాగే బిజెపి ప్రముఖుడిని ఒక వేదికపైకి తీసుకు వచ్చారు. వచ్చే ఎన్నికలలో బిజెపితో పొత్తుకోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు,ఒకవేళ అది కుదరకపోతే సిపిఐ,సిపిఎం లతో కలిసి వెళ్లడానికి యత్నిస్తారేమో చూడాల్సి ఉంటుంది. అలాగే సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు వెంకటేష్,రామ్ చరణ్, అల్లు అరవింద్, జయసుధ, జయప్రద ,ఆర్.నారాయణమూర్తి ,ఆదిశేషగిరిరావు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూశారు. తద్వారా జన సమీకరణకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డారన్నమాట.అయితే జూనియర్ ఎన్టీఆర్‌ ఏ కారణం వల్లనైతేనేమీ ఈ సభకు రాలేదు. ఈయన కూడా ఎన్టీఆర్‌కుటుంబ సభ్యుల చేతిలో పలుమార్లు అవమానాలకు గురైనవారే. ఎన్.టి.రామారావు ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి.. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ఉంటారు..ఇలాంటి పడికట్టు పదాలను చంద్రబాబు వాడుతుంటారు.

మరి అలాంటి శక్తిని, అంత మేధావిని,గొప్ప పరిపాలన చేసిన వ్యక్తిని ఎందుకు అధికారం నుంచి కూలదోశారంటే జవాబు ఇవ్వరు. పోని సభకు హాజరైన ఎవరూ చంద్రబాబును ఆ మాట అడిగి వివరణ పొందరు. ఎందుకంటే ఇవన్ని ఒక రకంగా మాచ్ ఫిక్సింగ్ సభలే కనుక. ఎన్టీఆర్‌కు ముందు తెలుగుజాతిలో ఎవరూ ప్రముఖులు లేరన్నట్లుగా చంద్రబాబు  మాట్లాడడాన్ని అంతా తప్పు పడుతున్నారు. పొట్టి శ్రీరాములు, పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, ఇలా ఒకరేమిటి? అనేక మంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంపొందించినవారేనని గుర్తు చేస్తున్నారు. ఇక ప్రముఖ నటుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌గురించి మాట్లాడుతూ రాజకీయాలలో కూడా హీరో అని అన్నారు. ప్రతి తెలుగువాడి ఆత్మాభిమానాన్ని తన భుజంపై మోసిన వ్యక్తి ఎన్టీఆర్‌అని అన్నారు.

మరి అలాంటి గొప్ప ఎన్టీఆర్‌ను రాజకీయాలలో జీరో చేయడంలో తన పాత్ర ఏమిటి? అన్నదానికి బదులు ఇవ్వగలరా? అందరి ఆత్మాభిమానం మోసిన ఎన్టీఆర్‌కు చివరికి ఎందుకు తానే ఆత్మగౌరవం కోల్పోవలసి వచ్చింది. తన కుటుంబ సభ్యులే తనను మోసం చేశారని మీడియా ముందు ఎందుకు కంటతడిపెట్టింది చెప్పగలరా? వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అవమానాలపాలు చేసి,చనిపోయిన తర్వాత అంత గొప్పవాడు..ఇంత గొప్పవాడు అని చెబితే ఎవరు నమ్ముతారు? వినేవాళ్లు వెర్రివాళ్లు అయితే తప్ప.ఒకప్పుడు ఎన్టీఆర్‌పోటోనే లేకుండా టీడీపీ సభ్యత్వ పుస్తకాలు వేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటిలో ఎన్టీఆర్‌పోటోలు పెట్టాలని కోరుతున్నారు.దేని కోసం . తన రాజకీయ లబ్ది కోసమే కదా! జనం వీటిని నమ్ముతారా?విజయవాడలో జరిపిన సభలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను తీసుకువచ్చి చంద్రబాబు తనను పొగిడించుకున్నారు.దానిపై రజనీకాంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

ఆ అనుభవాన్ని గుర్తుకు ఉంచుకుని వచ్చిన అతిధులు కేవలం ఎన్టీఆర్‌ గురించి మాత్రమే మాట్లాడి, చంద్రబాబు ప్రస్తావన తేకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారనుకోవాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్‌కు తెలుగుజాతి పై అభిమానం ఉండవచ్చు. కాని ఆ అభిమానం ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీపైన కాదన్నది పచ్చి నిజం. టీడీపీ నుంచి తనను బయటకు పంపిచడమే కాకుండా చెప్పులేసి ఘోరంగా అవమానించిన ఘట్టాలను ఎన్టీఆర్‌ జీవించి ఉంటే మర్చిపోయేవారా? తాను సొంతంగా మరో రాజకీయ పార్టీని స్థాపించుకుని ఎన్నికలకు సిద్దం అయ్యేవారా? ఆ క్రమంలోనే ఆయన గుండె పగిలి కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన సమాధి తమకే చెందుతుందని వాదిస్తున్నారు. అదే రాజకీయ క్రూరత్వం. చిత్తం చెప్పులమీద అన్నట్లుగా తెలుగుదేశం ఎన్టీఆర్‌ నామస్మరణ చేస్తున్నది అధికారం కోసం అన్న విషయం ప్రజలు గుర్తించరా?


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement