ఇదీ కుట్ర జరిగిన తీరు...
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఆయన సొంతవారే ఎలా కూలదోశారు? అన్నది ఆసక్తికరమైన అంశం. ఆనాడు చకచకా జరిగిపోయిన ఘటనలలో ఎన్టీఆర్ నిస్సహాయుడిగా మిగిలిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1994 శాసనసభ ఎన్నికలలో తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి అసాధారణమైన రీతిలో మిత్రపక్షాలతో కలిసి సుమారు 250కి పైగా సీట్లు గెలుచుకున్న ఎన్టీఆర్ చెప్పులు వేయించుకోవడమా? తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చరమాంకంలో కుటుంబ సభ్యుల చేతిలో ఆత్మాభిమానం కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం.
1995 ఆగస్టులో ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు అయిన చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు తరలివెళ్లారు. అది జరుగుతున్నప్పుడే చంద్రబాబు తన సొంత గ్రూప్‌తో విశాఖ డాల్ఫిన్ హోటల్‌లో ఒక సమావేశం నిర్వహించారు. తదుపరి సచివాలయంలో ఆయన తన ఛాంబర్‌లో ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు కలిసిన తీరు సంచలనం అయింది. ఎన్టీఆర్ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు.
చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టాలని అనుకున్నారు. వాళ్లు ఆయా జిల్లాలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను వైస్రాయికి రావాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తాను అసలు ఎందుకు వైస్రాయ్ హోటల్‌కు వెళ్లానో తెలియదనీ, జిల్లాకు చెందిన ఒక మంత్రి పిలవడంతో వెళ్లాననీ, ఆ తర్వాత కాని విషయం బోధపడలేదనీ అప్పట్లో నాకు చెప్పారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం కూడా చంద్రబాబు వర్గానికి కలిసి వచ్చింది. వైస్రాయ్ హోటల్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి.
లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందనీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా అయినా నియమిస్తారనీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎన్టీఆర్ మరో అల్లుడు, అప్పట్లో ఎంపీగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ రప్పించారు. ఉప ముఖ్యమంత్రి చేస్తామని నమ్మబలికారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని అన్నారు. తామేమీ తప్పు చేయలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ముగ్గురు నేతలు అశోక్ గజపతిరాజు, ఎస్వీ సుబ్బారెడ్డి, దేవేందర్ గౌడ్‌లను ఎన్టీఆర్ వద్దకు సంప్రతింపుల పేరుతో పంపించారు.
అప్పట్లో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడును తుని నుంచి హెలికాప్టర్‌లో రప్పించారు. ఎమ్మెల్యేలతో ఆయన అభిప్రాయ సేకరణ జరిపించినట్లు గవర్నర్‌కు ఒక నివేదిక ఇప్పించారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్‌కు ఒక ప్రముఖ న్యాయవాది అసెంబ్లీని రద్దు చేద్దామన్న సలహా ఇచ్చారు. నిజానికి అది కూడా కుట్రలో భాగమేనని ఆ తర్వాత వెల్లడైంది. అసెంబ్లీని రద్దు చేస్తారని చెబితే ఎమ్మెల్యేలంతా తమ పదవులు పోతాయన్న భయంతో తమ వద్దకు వచ్చేస్తారని చంద్రబాబు ప్లాన్ చేశారు. అది బాగా వర్కవుట్ అయింది.
మొత్తం పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు బయల్దేరారు. పరిటాల రవి, దేవినేని నెహ్రూ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన మైకు తీసుకుని ‘తమ్ముళ్లూ వచ్చేయండ’ని ఉపన్యాసం ఇస్తున్న సందర్భంలో హోటల్ గేటు లోపల నుంచి చెప్పులు పడ్డాయి. అది చూసినవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు చంద్రబాబు వర్గం ఎమ్మెల్యేలు ఒక సినిమా థియేటర్‌లో సమావేశమై ఎన్టీఆర్‌ను పార్టీ పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు, చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన గవర్నర్ కృష్ణకాంత్ అక్కడే రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబుతో సహా ఐదుగురు నేతలను మంత్రి పదవుల నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినా, ఆ కాపీని గవర్నర్‌కు పంపించినా, ఆయన దానిని విస్మరించి చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్నా స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించలేదు. చంద్రబాబుకు సహకరించిన దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి హుళక్కి అయితే, హరికృష్ణను ఆరు నెలల మంత్రిగా మార్చి పరువు తీశారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు టీడీపీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, బ్యాంక్‌లో ఉన్న నిధులను కూడా కైవసం చేసుకున్నారు. ఫలితంగా గుండెపోటుతో ఎన్టీఆర్ కాలం చేశారు. ఆ తర్వాత రోజులలో ఎన్టీఆర్‌ను పొగుడుతూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం ఆరంభించారు. ఎన్టీఆర్ పేరు చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్న చంద్రబాబు వర్గం అదే వ్యూహం అమలు చేస్తోంది. పాపం... ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంది!
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
అవమానాలకు ఆగిన గుండె!
చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ నుండి లాక్కున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీఆర్ ఆ అవమానాల్ని తట్టుకోలేకపోయారు. 1993 జూన్‌లో ఆయనకు పెరాలసిస్ వచ్చినప్పుడు నిమ్స్ డాక్టర్లు ఆయనకు బ్రెయిన్‌లో క్లాట్ ఏర్పడిందనీ ఏమాత్రం ఒత్తిడి ఉన్నా అది ఆయన మరణానికి దారి తీస్తుందనీ కుటుంబ సభ్యులందరినీ హెచ్చరించారు. అయినా వాళ్ళెవ్వరూ ఆ మాటలను పట్టించుకున్నట్లే లేరు. మాటిమాటికీ అవమానాలతో వేధించారు. అయినా ఆయన వెనక్కు తగ్గదలుచుకోలేదు. చంద్రబాబు మీద పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు చె΄్పాలనే ఉద్దేశ్యంతో మహారథి, వేల్చూరి వెంకట్రావులచే ‘జామాత దశమ గ్రహః’ అనే క్యాసెట్‌కు స్వయంగా తన పర్యవేక్షణలో రచన చేయించి డి.రామానాయుడు స్టూడియోలో తనే మాట్లాడుతూ ఆడియో రికార్డ్ చేయించారు. ‘తమ్ముళ్లూ ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను’ అని ్రపారంభించి రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన చంద్రబాబు కుట్రనూ మోసాన్నీ బయటపెట్టారు. ఈ క్యాసెట్‌ను విజయవాడలో ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహగర్జన’ సదస్సులో విడుదల చేయాలని సంకల్పించారు.
నేషనల్ ఫ్రంట్ నాయకులు ఎన్టీఆర్ లేకపోతే రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమని భావించారు. సంధి ప్రయత్నంలో వీపీ సింగ్, బొమ్మై, దేవెగౌడ, పాశ్వాన్, శరద్ యాదవ్‌లు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి చంద్రబాబుతో కలిసిపొమ్మని నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశారు. ఈ కలహం వలన నేషనల్ ఫ్రంట్‌కు నష్టం వస్తుందనీ, కొంచెం పెద్ద మనస్సుతో ఈ సంధికి అంగీకరించమనీ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి సలహాలివ్వమనీ సూచించారు. ఆయన ఏమాత్రం అంగీకరించలేదు.
చంద్రబాబు మీద పోరాటాన్ని కొనసాగించటానికి ఆయన కోర్టులను కూడా ఆశ్రయించారు. అదే సమయంలో ఆయనకు ఇంకో విషయం తెలిసింది. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి బంధువులు, మరికొంతమంది లిక్కర్ లాబీ వాళ్ళు కోట్లాది రూపాయలు చంద్రబాబుకు అందించారనీ, ఆ డబ్బుతో ఆయన మీడియాతో పాటు న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేసుకుని ఎన్టీఆర్‌ను పదవి నుండి దించేశాడనీ!
ఇక్కడ జరిగిందంతా గందరగోళమే. ప్రజలకు వాస్తవాలేంటో తెలియనీకుండా, తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇదే పచ్చ మీడియా ఆనాడు నిర్వహించిన పాత్ర కడు శోచనీయమైనది. ఇదంతా లక్ష్మీ పార్వతి వల్లనే జరుగుతోందని చెప్పటం ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినా అది ప్రజల్లో వ్యతిరేకత కలిగించదనేది వారి వ్యూహం. ఆ పెద్ద కుట్రలో ప్రధాన పాత్ర వారిదే! ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నది. ఒక కన్ను పని చేయటం లేదు. రానురాను మానసికంగానూ, శారీరకంగానూ బలహీనపడుతున్నారు.
1996 ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహ గర్జన’ సదస్సు గురించి చర్చించడానికి దేవినేని నెహ్రూ విజయవాడ నుండి వచ్చారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ఆ సదస్సుకు 30 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పేరుతో ఉన్న పార్టీ ఎకౌంట్ నుండి డబ్బు తీసుకురమ్మని చెక్ రాసి తన పీఏను పంపించారు ఎన్టీఆర్. వెంటనే బ్యాంక్ వాళ్ళు చంద్రబాబుకు మెసేజ్ ఇచ్చారు.
చంద్రబాబు మానవత్వాన్ని మర్చిపోయి ఆ డబ్బుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం తనే గనుక సొమ్ము తనకే చెందాలని హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేయించాడు. ఇది జనవరి 17వ తారీఖు జరిగిన సంఘటన. అప్పటికప్పుడే సీజే ప్రభాకర శంకర మిశ్రా ఆదేశం మేరకు హైకోర్టు జస్టిస్ బి. మోతీలాల్ నాయక్ స్టే ఆర్డర్ ఇచ్చేశారు. అంత ఎమర్జెన్సీగా వారు స్పందించారు!
సాయంత్రం 5 గంటలకు లాయర్లు వచ్చి విషయం చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన శరీరం అదుపు తప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడబోయి కిందపడబోయారు. అక్కడున్న వాళ్ళు పట్టుకుని ఆపారు. ముఖం, కాళ్లు ఎర్రగా అయిపోయాయి. పెద్దగా కేకలు వేశారు. నెహ్రూ సర్దిచెప్పినా ఆయన పట్టించుకోలేదు. డబ్బు లేకుండా పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన పడ్డారు.
ఇదంతా అయ్యేసరికి రాత్రి 7 గంటలయ్యింది. 10 గంటలకు రామానాయుడు ‘జామాత దశమగ్రహః’ క్యాసెట్ ఇచ్చి వెళ్లారు. అయితే సింహగర్జన సదస్సులో ఈ క్యాసెట్ రిలీజ్ చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని గురించి చె΄్పాలనుకున్న ఆయన నోరు శాశ్వతంగా మూగబోయింది. పార్టీ డబ్బు సీజ్ చేసిన 8 గంటల లోపే ఈ అవమానాలు తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది.
ప్రత్యర్థులను మట్టి కలపాలనుకునే సమయంలో విధి ఆయనను వెక్కిరించింది. కలల్నీ, కలతల్నీ తనలో కలుపుకొంటూ మృత్యువు ఆయనకు శాశ్వత విశ్రాంతి కల్పించింది. ఇప్పుడు చెప్పండి... దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడి అధికార దాహం వలనే కదా ఆయనకీ అకాల మృత్యువు ్రపాప్తించింది. తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ... అశ్రునయనాలతో సెలవు.
-నందమూరి లక్ష్మీపార్వతి,వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment