గుజరాత్‌ నమూనా నిజరూపం | Mallepalli Lakshmaiah Writes on Gujarat Model | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ నమూనా నిజరూపం

Published Thu, Mar 1 2018 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM

Mallepalli Lakshmaiah Writes on Gujarat Model - Sakshi

కొత్తకోణం
గత ఇరవై సంవత్సరాల బీజేపీ పాలనలో దళితులు మరింత అభద్రతా భావంలో మునిగిపోయారు. ఆధిపత్య కులాల దాడులను, అత్యాచారాలను కొన్ని రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. కానీ గుజరాత్‌లో మంత్రులు, అధికారులు ఆధిపత్య కులాలకు వంతపాడుతున్నారు. దానికి తోడు గోసంరక్షణ పేరుతో ప్రతి గ్రామంలో దళితులను, ముస్లింలను నేరస్తులుగా చూస్తున్న పరిస్థితి.

భానూ భాయి వంకార్‌ ఆరుపదులు దాటిన రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగి. విశ్రాంత జీవితాన్ని మనవలూ మనవరాళ్లతో సంతోషంగా, సుఖంగా గడిపేస్తారని అంతా భావించారు. వీలైతే ఏ ప్రైవేటు ఆఫీసులోనో పనిచేసి భవిష్యత్‌ని మరింత భద్రంగా మార్చుకునే వీలు కూడా లేకపోలేదు. కానీ ఆయన తన చుట్టూ ఉన్నవారి కోసం ఆలోచించారు. వాళ్లందరికీ మేలు జరిగితేనే తనలాంటి ఎందరో నిరుపేద దళితులకు న్యాయం జరిగినట్టుగా భావించాడు.

అన్యాయాన్ని సహించలేని తత్వం, అణిగిమణిగి ఉండలేని వ్యక్తిత్వం కావడంతో పరిణామాలను తట్టుకోలేకపోయాడు. ఫిబ్రవరి 15 వ తేదీన పటాన్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయం ఎదుట తనకు తాను నిప్పంటించుకొని ఆ మంటల్లో కాలిపోయాడు. మరునాడు తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటనపై దళితులు మూడు రోజుల పాటు చేసిన ఆందోళన ప్రభుత్వాన్ని కదిలించింది.

దళితుల ఆగ్రహావేశాలకు నిదర్శనం
ఎవరీ భానూ భాయి వంకార్‌? ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు? ప్రభుత్వోద్యోగిగా ఉండి రిటైర్‌ అయిన వ్యక్తికి వచ్చిన కష్టమేమిటి అన్న సందేహం రావచ్చు. భానూ భాయి వంకార్‌ నిబద్ధత కలిగిన దళిత నాయకుడు. దళిత్‌ అధికార్‌ మంచ్‌ కార్యకర్త. ఉద్యోగ విరమణానంతరం తన సమయాన్ని పూర్తిగా ఉద్యమం కోసం వెచ్చిస్తున్నారు. ఆయన మెహసేనా జిల్లా ఉంజా పట్టణానికి చెందినవాడు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో దళితులకు ఎక్కడ సమస్య ఎదురైనా మొదట గుర్తొచ్చేది ఆయనే. అందులో భాగంగానే పటాన్‌ జిల్లా సిమి బ్లాక్‌ దుడ్క గ్రామానికి చెందిన దళితులు కొంతకాలంగా భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

దుడ్క గ్రామానికి చెందిన హేమ, రమా చమార్‌లతో సహా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి వినతిపత్రాన్ని సమర్పించారు భాను. దుడ్క దళితులకు భూమి కేటాయించకపోతే ‘అగ్నిస్నానం’ చేస్తానని హెచ్చరించారు. కానీ ముఖ్యమంత్రి సహా ఎవరూ పట్టించుకోలేదు. ఫిబ్రవరి 7వ తేదీన పటాన్‌ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం ఇస్తూ, దుడ్క గ్రామ దళితుల భూమి సమస్యను పరిష్కరించని పక్షంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకుపాల్పడతానని వెల్లడించారు. అయినా ఎటువంటి స్పందనా లేదు. దీంతో కుంగిపోయిన భానూ భాయి ఆవేదనతో అన్నంత పనీ చేశారు. 62 ఏళ్ల వృద్ధుడి జీవితంలోని ఈ విషాదాంతాన్ని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు.

ఫిబ్రవరి 17వ తేదీన నవసర్జన్‌ ట్రస్ట్‌ అహ్మదాబాద్‌లో తలపెట్టిన సమావేశానికి వెళ్లిన నాకు భానూ భాయి వంకార్‌ ఆత్మ బలిదానం గురించి తెలిసింది. గాంధీనగర్‌లోని ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళ్లాను. వందలాది మంది కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు ధర్ణా చేస్తున్నారు. గుజరా™Œ లోని దళితుల భూమి సమస్యను పరిష్కరించాలని, భానూభాయి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, దుడ్క గ్రామ దళితుల భూమి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆ డిమాండ్లు అంగీకరించేవరకు భానూ భాయి మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తెగేసి చెప్పారు రైతులు.

ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆ మరుసటిరోజు గుజరాత్‌ అంతటా రాస్తారోకోలు జరిగాయి. గుజరాత్‌లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనస¿¶ కు ఎన్నికైన జిగ్నేష్‌ మేవాని సహా వందలాది మందిని ప్రభుత్వం అదుపులోనికి తీసుకుంది. ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశమున్నదని గ్రహించిన ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించింది. చివరకు ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం భానూ భాయి అంత్యక్రియలు నిర్వహించారు.

భానూ భాయి బలిదానం గుజరాత్‌ దళితుల్లో దాగున్న ఆగ్రహావేశాలను చాటిచెప్పింది. మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం అక్కడి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా చెప్పుకున్నారు. నిజానికి భానూ భాయి తన భూమి కోసం ఆత్మహత్యకు పాల్పడలేదు. అన్ని వనరులూ ఉండి, తరతరాలుగా భూమికి దూరంగా ఉండిపోయిన దళితుల పక్షాన నిలబడ్డారు. విఫలయత్నాలు మిగిల్చిన నిస్సహాయ స్థితిలో ఆత్మబలిదానం చేసుకున్నారు.

కొన్నేళ్లుగా గుజరాత్‌ దళితులు వెలివేతకు గురవుతున్నారు. భూవసతికి ప్రభుత్వాలు వారిని దూరంగా ఉంచాయి. భూసంస్కరణలు అంతగా ప్రయోజనం చేకూర్చలేదు. స్వాతంత్య్రానికి పూర్వం గుజరాత్‌లో దళితులు చేస్తున్న సేవలకు కొంత భూమిని కేటాయించేవారు. వాటిని పస్యత, వెతియ, ఇనామి పేర్లతో పిలిచేవారు. క్రమంగా ఆ భూములను స్థానిక ఆధిపత్య కులాలు స్వాధీనం చేసుకున్నాయి.

భూ సంస్కరణల వలన దళిత, ఆదివాసీలకు 37 లక్షల 50 వేల ఎకరాలు పంచినట్టు ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఇందులో మూడోవంతు మాత్రమే ఈ వర్గాలకు చేరింది. ఉదాహరణకు సురేంద్రనగర్‌ జిల్లా లెక్కలను పరిశీలిస్తే 251 గ్రామాల్లో కేవలం ఆరువేల ఎకరాలు దళితుల అధీనంలో ఉన్నాయి. తమకు అందిన పట్టా కాగితాలతో దళితులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా న్యాయం దక్కలేదు.

దళితులకు దక్కని భూములు
గ్రామాల్లో ఆధిపత్య కులాలు పాటిదార్, బనియా, బ్రాహ్మణ కులాలు దళితుల పేరు మీద ఉన్న భూములను తమ స్వాధీనంలోనే పెట్టుకున్నాయి. మంత్రులను, అధికారులను ప్రభావితం చేయడం వల్ల దళితుల భూమి వారికి చెందకుండా పోయిందని కూడా నవసర్జన్‌ ట్రస్ట్‌ సర్వేలో వెల్లడైంది. అహ్మదాబాద్‌ జిల్లా, దొల్కా తాలూకా, సరోడా గ్రామానికి చెందిన 185 మంది భూమిలేని దళిత కుటుంబాలకు 2006లో వ్యవసాయ భూమి పరిమితి చట్టం ప్రకారం 222 బిగాల భూమిని కేటాయించారు. అది కాగితాలకే పరిమితమైంది.

పదేళ్ల నుంచి ఈ గ్రామ దళితులు ఈ భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ దాని జాడేలేదు. రాష్ట్రీయ దళిత్‌ అధికార్‌ మంచ్‌ ఆందోళన వల్ల ఈ గ్రామంలోని భూమి సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దళితులకు భూమి కావాలనే నినాదం మీద అక్కడ చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో జరిగిన విధంగానే గుజరాత్‌లో కూడా స్వాతంత్య్రానంతరం 1952లో అమలులోనికి వచ్చిన సౌరాష్ట్ర భూసంస్కరణల చట్టం ప్రకారం దాదాపు 12 లక్షల ఎకరాలను గ్రామాల్లో ఆధిపత్య కులమైన పాటిదార్లకు కట్టబెట్టారు. దానితో పాటిదార్లు ఆ భూమి ద్వారా వ్యవసాయంలో అనేక ప్రయోజనాలు పొంది, ఈ రోజు వ్యాపార వర్గంగా ఎదిగారు.

మరికొన్ని చోట్ల దళితుల భూమిని కాజేయడానికి వారిని గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. ఇది దేశంలో ఎక్కడాలేని దౌర్జన్య చర్య. దాదాపు 112 గ్రామాల్లో ఇదే పరిస్థితి. బెదిరించి, భయపెట్టి, చివరకు గ్రామబహిష్కరణ ద్వారా 69 గ్రామాల ప్రజలను తరిమికొట్టారు. మరో 43 గ్రామాల దళితులు బెదిరింపులకు భయపడి పారిపోయారు. దాదాపు 21 జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్న విషయం మానవ హక్కుల సంఘాలకు అందిన వివరాలను బట్టి తెలుస్తున్నది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇలాంటి అత్యాచారాలకు లెక్కేలేదు. కానీ ఎక్కడా రికార్డు కూడా కావు. గుజరాత్‌ ఉత్తర ప్రాంతమైన సౌరాష్ట్రలో దళిత మహిళలకు రక్షణ లేదు. స్త్రీలను బహిరంగంగానే చెరపట్టే దుర్మార్గాలు ఆ ప్రాంతంలోని జునాగఢ్‌ జిల్లాలో సాగుతున్నాయి. ఇది వింటే గుజరాత్‌ అభివృద్ధి మంత్రం మాయాజాలం మాటున కొట్టుకుపోతోన్న అరాచకాలు అర్థం అవుతాయి.

విద్య దగ్గరా వివక్షే
గుజరాత్‌ అభివృద్ధి నమూనాను ప్రభుత్వాలు హద్దులు దాటి ప్రచారం చేశాయి. దాని అసలు స్వరూపం అనేకసార్లు బహిర్గతమైంది. అక్కడి దళితుల్లో ఇసుమంతైనా అభివృద్ధి లేదు. ఒక్క భూముల విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో వారు నిలువుదోపిడీకి గురవుతున్నారు. విద్యాలయాల్లో అంతులేని వివక్ష. దళిత విద్యార్థులను వెనుకవరుసలో కూర్చోబెడుతున్న దారుణాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇటీవలే ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. భానూ భాయి వంకార్‌ భూమికోసం జరిపిన పోరాట ప్రాంతమైన సెమి తాలూకాలో సహపూర్‌ గ్రామంలో వందమంది దళిత విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి తరగతిలో మొదటి వరుస దళితేతర విద్యార్థులకు వదిలిపెట్టాలి. నీటి కుండలను, పాత్రలను దళిత విద్యార్థినీ విద్యార్థులు తాకకూడదు.

దళితేతర విద్యార్థులు గానీ, ఉపాధ్యాయులుగానీ వచ్చేవరకు వేచి ఉండాలి. అందుకు భిన్నంగా జరిగితే పరిణామాలెలా ఉంటాయో దళిత విద్యార్థులకు తెలుసు. గుజరాత్‌లో దళితులపై భౌతికదాడులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. దేశంలోని 26 రాష్ట్రాల్లో దళితుల అత్యాచారాల జాబితాలో గుజరాత్‌ మొదటి నుంచి ఐదవ స్థానాన్ని ఆక్రమించడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.

అయితే చాలా కేసులు నమోదు చేసుకోవడానికి అధికారులు అంగీకరించని వాస్తవాన్ని మాజీ శాసనసభ్యులు సిద్ధార్థ్‌ చెప్పారు. ఊనాలో జరిగిన గోరక్షకుల దాడిలాంటివి ప్రతిచోటా జరుగుతున్నా వెలుగులోకి వచ్చేవి అతికొద్ది మాత్రమేని ఆయన వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో చాలా వాటిలో నిందితులకు శిక్షలు కూడా పడవని ఆ రోజు ధర్ణాలో పాల్గొన్న వక్తలు స్పష్టం చేశారు.

గత ఇరవై సంవత్సరాల బీజేపీ పాలనలో దళితులు మరింత అభద్రతా భావంలో మునిగిపోయారు. ఆధిపత్య కులాల దాడులను, అత్యాచారాలను కొన్ని రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. కానీ గుజరాత్‌లో మంత్రులు, అధికారులు ఆధిపత్య కులాలకు వంతపాడుతున్నారు. దానికి తోడు గోసంరక్షణ పేరుతో ప్రతి గ్రామంలో దళితులను, ముస్లింలను నేరస్తులుగా చూస్తున్న పరిస్థితి.

రెండో వైపు సంక్షేమ కార్యక్రమాల అమలు గానీ, అభివృద్ధిలో భాగస్వామ్యంగానీ రెండూ దళితులకు లేవు. దళితుల కోసం కేటాయిస్తున్న నిధులకు చట్టబద్ధత లేదు. పైగా వనరులన్నీ కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వాలు తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయనే భావన దళితుల్లో పేరుకుపోయింది.

వీటికి పరాకాష్ట భానూ భాయి బలిదానం. తర్వాత ప్రభుత్వాలు దళితుల డిమాండ్లను అంగీకరించినట్టు కనిపిస్తున్నప్పటికీ, దళితుల్లో మాత్రం విశ్వాసం కలగడంలేదు. గుజరాత్‌ దళితులకు కరువౌతోన్న రక్షణ, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, అక్కడ అమలులో ఉన్న సామాజిక అంతరాలూ అంతిమంగా ప్రజల చైతన్యానికీ, తెగింపుకీ, తిరుగుబాటుకీ దారితీస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు - 97055 66213   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement