విశ్లేషణ
హిందూ మతాచారాల చట్రంలో ఇరుక్కున్న స్త్రీకి హిందూ కోడ్ బిల్లు ద్వారా రాజ్యాంగ పరమైన రక్షణను కల్పించాలని అంబేడ్కర్ భావించారు.‡రాజేంద్రప్రసాద్, వల్లభ్‌భాయ్ పటేల్ తదితరులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మతతత్వ, సాంప్రదాయక వాదులు ఆయన కు హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి ముద్రలు వేశారు. దీంతో పార్లమెంటులో ఆ బిల్లు రెండుసార్లు విఫలమైంది. అయినా అప్పట్లో తీవ్ర స్థాయిలో జరిగిన చర్చలు తర్వాతి కాలంలో స్త్రీ పురుష సమానత్వం దిశగా మేధోవర్గాల పోలరైజేషన్‌కు దారితీశాయి.
‘‘మహిళా పురోగమనం స్థాయితోనే నేను సమాజ పురోగమనాన్ని కొలుస్తాను’’ – డా: బి. ఆర్. అంబేడ్కర్
స్త్రీల విషయంలో అంబేడ్కర్ ఏం ఆలోచనలు చేశారు, వాటిని ఎలా ఆచరణ రూపంలోకి తీసుకువచ్చారు, వాటివల్ల మానవ సమూహానికి, ముఖ్యంగా స్త్రీలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి అన్న ప్రశ్నలకు శిఖరాయమాన సమాధానం,‘హిందూ కోడ్ బిల్’. పీడితుల పట్ల అంబేడ్కర్‌కి ఉన్న శ్రద్ధ, నిబద్ధత, పట్టుదల, క్రాంతదర్శనత్వాలకూ, న్యాయశాస్త్ర పరిజ్ఞానానికీ హిందూ కోడ్ బిల్ గొప్ప ఉదాహరణ. ఈ ప్రతిపాదనకి ముందు ఆయన భారత సమాజంలో స్త్రీల స్థితిగతులపై విస్తృతమైన అధ్యయనం చేశారు. అంబేడ్కర్ జీవితంలోనే కాదు, భారతీయ స్త్రీల ప్రస్థానంలోనే గొప్ప ప్రతిపా దనగా పరిగణించదగిన ఈ బిల్లు పూర్వాపరాలు, స్త్రీల సమస్య మూలాలను అన్వేషించడానికి అంబేడ్కర్ చేసిన కృషి ఆసక్తికరం.
మనుస్మృతే అణచివేతకు మూలం
ఏ కులంలోనైనా దాని పరిరక్షణ జరిగేది స్త్రీల ద్వారానే అన్నది అంబేడ్కర్ మౌలిక ప్రతిపాదన. కులాన్ని నిలబెట్టడానికి స్త్రీల మీద విపరీతమైన నియం త్రణ అమలవుతుంది. స్త్రీ సమస్య మూలాలు కులంలో ఉన్నపుడు, కుల నిర్మాణం పటిష్టంగా ఉన్నంత కాలం స్త్రీల సమస్యలు తీరవు. కుల వ్యవస్థ కొనసాగింపునకు ముఖ్యకారణం వివాహవ్యవస్థ. భారతీయ సమాజాల్లో పెళ్లిళ్లు సాధారణంగా ఒకే కులంలో, తరచుగా దగ్గరి సంబంధాల్లో జరుగు తాయి. భర్త మరణించినపుడు స్త్రీ మరో వివాహం చేసుకోవడానికి వేరే కులాన్ని ఎంచుకుంటే కులసంకరం కావడంతో పాటు భర్తద్వారా సంక్రమించే ఆస్తి వేరే కులానికి బదిలీ అవుతుంది. అందుచేతనే సతీ సహగమనం, పాతి వ్రత్యం, తప్పనిసరి వైధవ్యం స్త్రీలు పాటించవలసి వచ్చింది. తమ కులం, తమ ఆస్తి పోకుండా ఉండటానికి స్త్రీల నిష్పత్తి పురుషులతో సమానంగా ఉండాలి. అట్లా ఉండటం కోసం వ్యవస్థ స్త్రీలకి విధించిన అమానవీయ ఆచా రాలు పోవాలని అంబేడ్కర్ గుర్తించారు. పితృస్వామిక వ్యవస్థలో పురుషుడే నిర్ణయాధికారి కనుక ఏ నియమం రూపొందినా అది పురుషుడి ప్రయోజనా లకు అనుగుణంగానే ఉంటుంది. కులాన్ని రక్షించడం కోసం స్త్రీలకు కఠిన నిబంధనలు అమలుచేసిన వ్యవస్థ పురుషుడికి ఎటువంటి నియమావళిని ప్రకటించలేదు. స్త్రీ పురుష నిష్పత్తిని సమానంగా ఉంచడం కోసమే ఇవన్నీ చేసినపుడు, అందులో పురుషుడు భాగస్వామి కాకుండా ఎలా ఉంటాడని ప్రశ్నించాడు అంబేడ్కర్.
స్త్రీల అణచివేతకి మనుస్మృతి ప్రధాన కారణమని, స్త్రీలు, దళితులు, బానిసలను మనుస్మృతి హీనంగా చూసిందని, అంటరానితనాన్ని, హక్కుల రాహిత్యాన్ని, స్వేచ్ఛారాహిత్యాన్ని, నిర్ణయాధికారం లేకపోవడాన్ని బలవం తంగా అంటగట్టిందని ఆయన నిరూపిస్తారు. స్త్రీలని శూద్రుల కన్నా మృదు వుగా ఏ మాత్రం చూడలేదని, వారిని ఒకే గాటన కట్టిందని చెప్తారు. మను స్మృతిని క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే స్త్రీల జీవితాల్లో రావలసిన మార్పుల కోసం చేపట్టవలసిన సంస్కరణలకి, వాటి చట్టబద్ధతకి కృషి చేశారు. అయితే ఈ అధ్యయనంలో తులనాత్మకతకి ప్రాధాన్యతని ఇచ్చారు. మనువు నిర్ణ యించిన స్త్రీల హోదాకు, అంతకు మునుపటి సమాజాల్లో స్త్రీల హోదాకు మధ్యనున్న వ్యత్యాసాలను అంబేడ్కర్ వివరంగా చర్చించారు. వివాహం, ఆస్తి, సంతానం మొదలైన విషయాల్లో మనువు కంటే పూర్వకాలానికి చెందిన కౌటిల్యుడు పురోగామి దృక్పథంతో ఉన్నాడంటూ అనేక ఉదాహరణలు ఇచ్చారు.
మనువులా ద్వంద్వ న్యాయవిధానం పాటించక స్త్రీతో సమానంగా పురుషుడు కూడా నియమాలు పాటించడం, అతిక్రమణకు శిక్షార్హుడు కావడం కనబడుతుంది. స్త్రీల వైవాహికహక్కులు, ఆర్థికస్వాతంత్య్రం, న్యాయపరమైన హక్కులను విపులంగా చర్చించిన కౌటిల్యుని అర్థశాస్త్రం మనుధర్మ శాస్త్రం కన్నా ఎంత మెరుగ్గా ఉందో చాలాచోట్ల చర్చించారు. అంబేడ్కర్ అభి ప్రాయాల ప్రకారం,‘బౌద్ధాన్ని పాటించగలిగే నిబద్ధత, క్రమశిక్షణ స్త్రీలకి మాత్రమే ఉందని బుద్ధుని విశ్వాసం’. బౌద్ధాన్ని అర్థం చేసుకోలేని కొందరు భిక్షువులు స్త్రీ వ్యతిరేకులుగా వ ూరారు. స్త్రీల సౌందర్యం పురుషులను వ్యామోహంలోకి నెడుతుందని బుద్ధుడు భావిస్తే, అత్యంత సౌందర్యవతి అయిన ఆమ్రపాలి సేవలను తీసుకునేవారే కాదంటారు అంబేడ్కర్.
జెండర్–కులం–వర్గం సంబంధం
జెండర్, కులం, వర్గాల మధ్యనున్న సంక్లిష్ట సంబంధాన్ని చర్చించిన భారతీయ తత్వవేత్తల్లో అంబేడ్కర్ ఒకరు. దళితులు, మహిళలు ఒకేరకంగా బాధితులైతే స్త్రీల మధ్య ఉన్న కుల అంతరాల సంగతి ఏమిటి అన్న ప్రశ్న సహజం. ‘కులం దడి కట్టుకున్న వర్గం’ అన్నది అంబేడ్కర్ ప్రసిద్ధ వాక్యం. కుల వర్గసంబంధాలను నిర్వచిస్తూ – ఒకే కులానికి చెందినవారి మధ్య వర్గ అం తరాలు ఉన్నట్లే, ఒకే వర్గానికి చెందిన వారిమధ్య కుల అంతరాలు కూడా ఉంటాయన్నారు. దీన్ని జెండర్‌కు కూడా అన్వయించుకోవచ్చు. ఒకే జెండర్లో కుల వర్గ అంతరాలు కూడా ఉంటాƇ ుు. ఆ అంశం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఆయన దృష్టిలో నిచ్చెనమెట్ల సమాజపు అంతరాలలో దళిత స్త్రీలు అదనపు బాధితులు. మహిళల్ని కులాన్ని నిలిపే వాహికలుగా వాడుకున్నంత కాలం కులం పోదు, స్త్రీ సమస్యలూ తీరవు. వర్ణాంతర కులాంతర మతాంతర వివాహాలు దీనికి విరుగుడుగా ప్రతిపా దించారు. న్యాయవాది అయిన అంబేడ్కర్ స్త్రీల హక్కుల రంగంలో వేసిన ముద్ర అసామాన్యం. ఒక హక్కు చుట్టూ దాన్ని భంగపరిచే శక్తులు ఎన్ను న్నాయో ఆయనకి చాలా ఎరుక. హిందూ కోడ్ బిల్లు రూపొందించడానికి ముందు స్త్రీ ఎటువంటి వివక్షకి గురవుతుందో తెలుసుకోవడా నికి చాలా కస రత్తు చేశారు. ఆస్తిహక్కు విషయంలో భార్యకు జరిగే అన్యాయానికి ఉదాహ రణగా అంబేడ్కర్ ఒక విషయం చెప్పారు.
సాధారణ న్యాయంలో భార్యాభర్త ఒకే యూనిట్. పెళ్లవగానే భార్య ఆస్తి, భర్త ఆస్తిలో కలసిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఆస్తి పూర్తిగా అతనికే చెందుతుంది. భర్త భార్యతో ఒప్పందానికి వచ్చి కొంత భాగాన్ని ఆమెకి ఇవ్వడానికి కూడా వీలులేదు. ఎందుకంటే వారిద్దరి ఉనికి ఒకటే. ‘ఆమె ప్రత్యేక, లేదా పూర్తి ఉపయోగం కోసం’ అన్న మాటల్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చేర్చి వివాహిత స్త్రీకి ఆస్తిని ఇచ్చినట్లయితేనే ఆ ఆస్తిపై భర్త నియంత్రణ తొలగుతుంది. అయితే భర్త, భార్యని ప్రోత్సహించో లొంగదీసో ఆమె ఆస్తిని మార్పిడి చేయిస్తాడన్న భయంతో ‘సదరు చర్యని నిరోధించ డానికి’ అన్న వాక్యాన్ని వివాహ ఖరారు నామాల్లో చేర్చడం జరిగింది. దీని వల్ల స్త్రీ తన ఆస్తిని అనుభవించగలదే కానీ దాన్ని అమ్మడానికి, అన్యాక్రాంతం చేయడానికి హక్కు లేదు. ఇలాంటి అతి సూక్ష్మమైన విషయాలని కూడా జల్లెడ పట్టి ఆయన హిందూ కోడ్ బిల్లుని రూపొందించారు. మహిళా శ్రామిక సంక్షేమ నిధి, మహిళా శ్రామిక రక్షణ చట్టం, మహిళలకు ప్రసూతిపరమైన సదుపాయాల బిల్లు, పని ప్రదేశాల్లో జీతం చెల్లింపుల్లో లింగవివక్షను అరికట్టే న్యాయ సూత్రం, గనుల్లో తవ్వకాలు సాగించే మహిళల క్షేమం కోసం రూపొం దించిన బిల్లులాంటి అనేక బిల్లులు, న్యాయసూత్రాలను ఆయన తన జీవిత కాలంలోనే వెలుగులోకి తెచ్చారు.
నెరవేరని కల ‘హిందూ కోడ్ బిల్లు’
నాలుగేళ్ల అధ్యయన సారాంశంగా 1947 ఏప్రిల్ 11న హిందూ కోడ్ బిల్లుని అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు ముందు ప్రవేశపెట్టారు. స్త్రీల ఆస్తి హక్కు, కుమార్తెలకి ఆస్తిలో భాగం, వితంతువులకి సం పూర్ణహక్కులు, సాంప్రదా యక వివాహాల్లో విడాకుల హక్కు, మోనోగమీకి స్త్రీ పురుషులిద్దరూ బద్ధులు కావడం వంటివాటి మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బొంబాయి వంటి నగరాల్లో తప్ప బెంగాల్, మద్రాసు, పాట్నా, లాహోర్, అలహాబాద్, నాగ్‌పూర్ వంటి చోట్ల మెజారిటీ ప్రజలు బిల్లుపట్ల వ్యతిరేకతని చూపారు. రాజ్యాంగ నిర్మాణసభలో రెండుసార్లు ఈ బిల్లు ఆమోదాన్ని పొందలేక పోయింది. హిందూ మతాచారాల చట్రంలో ఇరుక్కున్న స్త్రీకి హిందూ కోడ్ బిల్లు ద్వారా రాజ్యాంగబద్ధమైన రక్షణని ఇవ్వాలనుకున్న అంబేడ్కర్ కల నెర వేరలేదు.
న్యాయశాఖా మంత్రిగా అంబేడ్కర్ 1951 ఫిబ్రవరి 5 న హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్‌లో (అప్పటి లెజిస్లేటివ్ అసెంబ్లీ) ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందనందుకు బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు. రాజేంద్రప్రసాద్, వల్లభ్‌భాయ్ పటేల్ వంటివారు బిల్లుని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. సాంప్రదాయక మతతత్వ సంస్థలు, సాంప్రదాయకవా దులు ఆయనపై హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి అని ముద్రలు వేశారు. బిల్లుని నాలుగేళ్లు నానబెట్టి, చివరికి ఒక తంతుగా వివాహం, విడాకులకి సంబంధించిన నాలుగు క్లాజులను మాత్రం అంగీకరిద్దామని నెహ్రూ అనడం తనని కలిచివేసిందని ఆయన తన రాజీనామా లేఖలో చెప్పారు. చివరికి దానికీ సిద్ధపడ్డానని చెపుతూ ‘‘మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్క భాగాన్నయినా దక్కించుకో’’ అనే సూక్తిని పేర్కొన్నారు.
ఆ తర్వాత, తీవ్ర వ్యతిరేకత రావడం కారణాన మొత్తం బిల్లునే వదు లుకోవాలని నెహ్రూ చెప్పడం తనను దిగ్భ్రాంతిలో ముంచిందన్నారు. ఈ క్రమంలో తను అనుభవించిన మానసిక చిత్రహింసను కూడా ప్రస్తావిం చారు. వాగ్దానాలకి, ఆచరణలకి మధ్యనున్న దూరాన్ని ప్రశ్నిస్తూ తన రాజీనా మాతో ఎవరికి సంబంధం ఉన్నా లేకపోయినా తన అంతరంగపు సత్యానికి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. బిల్లు విఫలం అయినప్పటికీ జాతీయ కాంగ్రెస్‌లోనూ బైటా తీవ్రస్థాయిలో జరిగిన చర్చల వల్ల తదనంతర కాలంలో చాలా మేలు జరిగింది. స్త్రీ పురుష సమానత్వం దిశగా మేధోవర్గాల పోలరై జేషన్ జరిగింది. ఆచరణశీలి అంబేడ్కర్‌కు, ఇప్పటి అస్తిత్వ ఉద్యమాలకు మధ్య అధిగమించవలసిన అంతరం ఒకటుంది. ఆయన తను ప్రాతినిధ్యం వహించిన పీడితకులాల గురించి ఆలోచనలు చేసి, వారి ఎదుగుదలకు పునా దులు తీసి, ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి నిర్మాణం కోసం పాటుబడ్డారు. అందుకు అవసరమైన చట్ట బద్ధ మార్పుల కోసం కృషి చేశారు. రాజ్యాంగ రచన, న్యాయవ్యవస్థలో మార్పులు, దేశ ఆర్థికవిధానం లాంటి ఉమ్మడి అంశాలమీద తనదైన ముద్ర వేశారు. కనుకనే అయన జాతి మొత్తానికి నాయకునిగా నిలిచిపోయారు.
డా. కేఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త కథ, నవలా రచయిత్రి, కార్యదర్శి ప్రరవే (ఏపీ)
ఈ–మెయిల్ : malleswari.kn2008@gmail.com
Comments
Please login to add a commentAdd a comment