ఎన్టీయే కూటమి ఎంపీ సీట్ల సంఖ్య తగ్గనున్నట్లు ఓపీనియన్ పోల్స్ చెబుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీకే వస్తాయని, పైగా కేంద్ర ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నప్పటికీ మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, చరిష్మా చెక్కుచెదరలేదని జనాభిప్రాయం. కాంగ్రెస్ సొంతంగా, మిత్రపక్షాల దన్నుతో అధికారం చేపట్టే పరిస్థితీ కనబడలేదు. ఈ రెండు కూటములకు భిన్నంగా ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చే పరిస్థితి కూడా లేదు. ప్రజల నాడి వ్యక్తిగతంగా మోదీ వైపే మొగ్గు చూపుతున్న ఈ నేపథ్యంలో మోదీ తిరిగి ప్రధాని కాగల అవకాశం ఒక్క మాయావతి ద్వారానే సాధ్యం. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. పైగా, తొలిసారి ఓటు వేయబోతున్న పదమూడు కోట్లమంది యువ ఓటర్లు మోదీకి పెట్టని కోటలాగా ఉన్నారు.
జర్నలిస్టులు ఎన్నికల ఫలితాలను అంచనా వేసినప్పుడు సాధారణంగా ఆ అంచనాలు తప్పుతుంటాయనేది అందరూ ఆమోదించే వాస్తవమే. పైగా పాత్రికేయులందరూ ఒకేవిధమైన అభిప్రాయం వెల్లడించినప్పుడు కచ్చితంగా దానికి వ్యతిరేక ఫలితాలు రావడం తప్పనిసరిగా జరుగుతుంటుంది. ఒపీనియన్ పోల్స్ కూడా ప్రమాదకరమైనవే కానీ, మన జర్నలిస్టుల కంటే అవి మెరుగైనవేనని చెప్పాలి. అయితే ఒపీనియన్ పోల్స్ కూడా ఒకే రకమైన ఫలితంపై ఆమోదం తెలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఇది పలు ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్న వారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, దేశంలో హంగ్ పార్లమెంట్ తప్పదనీ, బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచినా, బీజేపీ సాధించే స్థానాల్లో సగం మాత్రమే సాధిస్తుందని, దీంతో మళ్లీ నిజమైన సంకీర్ణ ప్రభుత్వం తప్పదని ఒపీనియన్ పోల్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండిపోదు. అయినప్పటికీ, మనం కొన్ని ముఖ్యమైన ధోరణులను పసిగట్టగలం. ఆ పోల్స్ నుంచి విస్తృత స్థాయి నిర్ధారణలను జాగ్రత్తగా చేయగలం.
1. కొట్టొచ్చినట్లు కనిపించే సూచిక ఏదంటే, 2014లో సాధించిన మెజారిటీ బీజేపీకి రానప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ప్రజాదరణ నేటికీ చెక్కుచెదరలేదు. పైగా 2014లో బీజేపీ సాధించిన 31 శాతం ఓట్లతో పోలిస్తే ఇప్పుడు ఒక్క శాతం మాత్రమే తగ్గిపోనున్నట్లు ఇండియా టుడే పోల్ సర్వే సూచిస్తోంది. ఇది నిజంగానే గుర్తించదగిన విషయం. మోదీ ఒరిజినల్ ఓటర్లలో గణనీయంగానే అసంతృప్తి ఉంటున్నప్పటికీ, 1996 తర్వాత పుట్టి, లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓట్లు వేయబోతున్న 13 కోట్లమంది ఓటర్లు మోదీపై వ్యక్తం చేస్తున్న తిరుగులేని ఆరాధన ద్వారా ఆ అసంతృప్తిని పూరించుకోవచ్చు.
మోదీపట్ల అసంతృప్తి చెందుతున్న ఆయన అసలైన ఓటర్లకు, ఈ సరికొత్త ఓటర్లకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఈ కొత్త ఓటర్లు జాబ్ మార్కెట్‌లో ఉద్యోగాలు పొందని స్థితికి ఇంకా వెళ్లలేదు. ఈ 13 కోట్ల మంది ఓటర్లు మోదీ శక్తి, ప్రజాకర్షణ పట్ల ఇప్పటికీ మంత్రముగ్ధులవుతూనే ఉన్నారు. అలాగే స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి మోదీ పథకాలతో పాటు, అవినీతిపై యుద్ధం, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరుగుతుండటం వంటి అంశాలపై జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని వీరు విశ్వసిస్తూనే ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రచార కథనాలు కానీ, లేదా నిరుద్యోగుల తీవ్ర నిరాశా నిస్పృహలు కానీ వీరి దృష్టిలో ఇప్పటికీ పడటం లేదు.
2. 2017 జనవరిలో పెద్దనోట్ల రద్దు తర్వాత మోదీని శిఖరస్థాయిలో నిలి పిన పోల్ సర్వే తర్వాత నిర్వహించిన పోల్ సర్వే నంబర్లను పోల్చి చూసినట్లయితే బీజేపీ పట్ల సానుకూలత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగానే అర్థమవుతుంది. క్రమక్రమంగా అది క్షీణిస్తూ గత రెండేళ్లలో మూడింట ఒక భాగం సీట్లను బీజేపీ కోల్పోతున్నట్లు వ్యక్తమైంది. ఇలాగే కొనసాగితే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య మరో 25 నుంచి 40 స్థానాల వరకు క్షీణించిపోతుందని తార్కికంగానే అంచనా వేయవచ్చు. మరి ఈ పరిణామాన్ని నరేంద్రమోదీ అడ్డుకుని పార్టీకి మళ్లీ పూర్వ వైభవంవైపు తీసుకుపోగలరా? భారతీయ ప్రజాభిప్రాయాన్ని దాని వైవిధ్యత, సంక్లిష్టతల సమేతంగా దర్శించినట్లయితే, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని బోధపడుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రక్రియ మొదట్లో కాస్త నిదానంగానే సాగవచ్చు కానీ, ఒక్కసారి అది తన లక్ష్యం వైపు ప్రయాణించిందంటే దాని గమ్యాన్ని ఎవరూ మార్చలేరు. దాన్ని వెనక్కు మళ్లించడం దాదాపు అసాధ్యమే అవుతుంది. నరేంద్రమోదీకి ఈ విషయం బాగా తెలుసు కూడా.
పొంచి ఉన్న ప్రమాదం పొడసూపుతోంది కాబట్టే, మోదీ శిబిరం మౌలికమైన, నమ్మశక్యం కాని స్థాయిలో ప్రజాకర్షక చర్యలకు సన్నద్ధమవుతోంది. అగ్రకులాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు, అన్ని ప్రైవేట్ సంస్థల్లో కోటాల నుంచి మొదలుకుని అవినీతిపరులు, పలుకుబడి గలవారిపై చివరి క్షణంలో సీబీఐ దాడులకు రంగం సిద్ధం చేయడం వీటిలో కొన్ని మాత్రమే. వచ్చేవారం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్‌లో మరికొన్ని తాయిలాలు ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వచ్చాయంటే ప్రభుత్వ అవకాశాలకు తెరపడినట్లేనని నరేంద్రమోదీ, అమిత్ షాలకు తెలుసు. రూపొందుతున్న ప్రజాభిప్రాయం అనే ఈ నిర్నిరోధక శక్తి గమనాన్ని వచ్చే 100 రోజుల కాలంలో వీరిద్దరూ మార్చగలిగినట్లయితే అది అసాధారణ విజయమే అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని దూకుడుతనంతో కూడిన మౌలిక ప్రకటనలు తప్పకుండా వస్తాయి. బీజేపీ రక్షణ పంక్తి ఏదంటే ఏమాత్రం చెక్కుచెదరని ఆలోచనలతో కూడిన 13 కోట్లమంది తొలిసారి ఓటేయబోతున్న ఓటర్లు మాత్రమే.
3. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగిలిన దేశమంతటా బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీ ఈసారి 45 నుంచి 55 ఎంపీ స్థానాలను కోల్పోతున్నట్లు పలు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తగి లిన ఎదురుదెబ్బలను చూస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఈసారి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం కాకున్నా, బీజేపీ ఇక్కడ సాధించే స్థానాల విషయంలో ఊగిసలాట తప్పదనిపిస్తోంది. ఉత్తర భారతంలో బీజేపీకి కలిగే నష్టాల్లో కొన్నింటిని తూర్పు, ఈశాన్య భారత్‌లో పూడ్చుకోవచ్చన్నది తీసిపారేయలేం. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీని మెజారిటీకి దూరం చేసే బలమైన కారణాల్లో ఒకటి కాబోతోంది. ఈ పరిణామాన్ని వెనక్కు తిప్పే యుక్తిని బీజేపీ కనుగొనగలదా?
4. మరోవైపున కాంగ్రెస్ పార్టీ పునరుత్థానం చెందుతోంది. దాని పునాదిపై ఈ పార్టీ సాధించే శాతాన్ని పోలిస్తే, బీజేపీ పొందనున్న నష్టాల కంటే పెను లాభం కాంగ్రెస్‌కి సిద్ధించనుంది. తేడా ఏమిటంటే, కాంగ్రెస్ పునాది బలహీనంగా ఉంది. కాబట్టే దాని బలం 200 శాతం మేరకు పెరిగినప్పటికీ అది కాంగ్రెస్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 140 స్థానాలలోపే తీసుకురానుంది. ప్రస్తుత ఒపీనియన్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 100 సీట్లు మాత్రమే రానున్నాయి. నరేంద్రమోదీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చలేరని భావించినప్పటికీ, కాంగ్రెస్ పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తుందని చెప్పలేం. మోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పెట్టుకునే ఉత్తమమైన ఆశాభావం ఏదంటే ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినటువంటి దేశం నడిగడ్డలోని మూడు కీలక రాష్ట్రాల్లో వీలైనన్ని ఎంపీ సీట్లను అధికంగా సాధించడమే. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అది సాధించాల్సిన ప్రధాన సంఖ్య 150. తను సాధించే మొత్తం సీట్లను ఈ స్థాయికి పెంచుకోవడం లేదా నరేంద్రమోదీకి వచ్చే స్థానాలను అంతకన్నా తగ్గించడం. ఇవి రెండూ కాకుండా మూడో మార్గం ఏదంటే యూపీఏ శిబిరాన్ని మరింతగా విçస్తృతపర్చి, మరిన్ని ప్రాంతీయ లేక కుల ప్రాతిపదికన ఉన్న పార్టీలను తనవైపు ఆకర్షించడమే. అయితే ఈ పరిస్థితుల్లో ఈ మూడు అంశాలు కూడా అసంభావ్యమే అనిపిస్తుంది. కానీ భారత రాజకీయాల్లో మోదీ చుట్టూ తిరిగే ఏక ధ్రువం లాంటి స్థితికి బదులుగా ప్రధాని పదవికి దగ్గరయ్యేందుకు రెండో ధ్రువం మళ్లీ వెనక్కు వచ్చిన పరిస్థితి కనబడుతోంది.
5. గతవారం ‘జాతిహితం’లో మనం ప్రస్తుత భారత రాజకీయాల్లో ఒకటి, రెండు ఫ్రంట్‌లనే కాకుండా ఏర్పడనున్న మూడు, నాలుగు, ఐదో ఫ్రంట్‌లను గురించి కూడా చర్చించుకున్నాం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటితో పొత్తులేని పార్టీలకు, వాటి నేతలకు 150 పార్లమెంటు స్థానాలు వచ్చాయంటే గొప్ప రాజీమార్గంలో తామే ప్రధానిగా ఉండాలనే ఆశాభావం చాలామందికి కలిగే అవకాశం కూడా ఉంది కానీ ఇది అంత సాధ్యమైన పని కాకపోవచ్చు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకీ సొంతంగా 50 కాదు కదా 40 ఎంపీ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలూ 272 మ్యాజిక్ సంఖ్యను చేరుకోలేకపోయినప్పుడు మాత్రమే ఇతర పార్టీల మధ్య అలాంటి భారీ బేరసారాలకు తావు ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవలి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపించడం లేదు.
అంతిమ పొత్తులు మీరు ఎవరితో పొత్తు కలుపుతారు లేక ఎవరితో పొత్తుకు సిద్ధం కారు అనే అంశంపైనే ఆధారపడి ఉంటాయి. వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ ఎన్నటికీ ఎన్డీయేతో కలవబోవని మనందరికీ తెలుసు. అలాగే అకాలీలు, శివసేన ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీఏలో భాగం కావు. ఈ పరిస్థితుల్లో గతంలో మొండివైఖరి లేకుండా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించినవారిని చూద్దాం. మమతా బెనర్జీ గతంలో రెండు కూటముల్లోనూ ఉండేవారు. కానీ పశ్చిమబెంగాల్లో ఆమె ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఆధిక్యత వల్ల ఆమె ఎన్డీయే వైపు వెళ్లలేరు.
6. ఇప్పుడు ఇక మాయావతి దగ్గరకు వద్దాం. మోదీ రెండో దఫా అధికారంలోకి రాలేకపోయినట్లయితే మన రాజకీయాల్లో విశిష్టమైన అధికారం చలాయిస్తున్న మాయావతే అందుకు ప్రధాన కారణం అవుతారు. ఆమె గతంలో బీజేపీతో సంతోషంగా గడిపారు. లెఫ్ట్, రైట్ వాదాల మధ్య ఆమె పూర్తిగా భావజాలేతర స్థానంలో ఉన్నారు. మనువాద వ్యతిరేకతే ఆమె ఏకైక భావజాలం అయితే, ఎన్డీయే, యూపీఏ రెండూ ఆమె దృష్టిలో సమానంగా దుష్టశక్తులవుతాయి. అయితే ఆ విషాన్ని ఆమె ఈ రెండింటిలో ఏ పాత్రలోనుంచి అయినా స్వీకరించగలరు. తాము రెండో దఫా అధికారంలోకి రావాలంటే కీలకమైన కార్డు మాయావతి ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉందని మోదీ, షాలకు స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు లేక ఆ తర్వాత తమ ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో, బెదిరించో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ వెన్నులో గొడ్డలి దిగే పరిస్ధితిని ఊహించలేం కానీ అలాంటి పరిస్థితి సంభవించదని మీరు ఎన్నడూ తోసిపుచ్చలేరు. ముగించాలంటే, మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, వోట్ బ్యాంక్ చెక్కుచెదరలేదు కానీ ప్రజాభిప్రాయం మాత్రం ప్రతికూలంగా ఉంది. యూపీలో ఏర్బడిన ఘటబంధన్ మోదీ రెండో దఫా పాలనకు ప్రమాదకారిగా మారుతోంది. కాంగ్రెస్ పురోగమిస్తోంది కానీ అధికారంలోకి వచ్చేంతగా కాదు. 15 లేక అంతకు ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించే ఏ పార్టీ అయినా ఇప్పుడు కింగ్ మేకర్ కాగలదు. కానీ అవి ఎన్నడూ కింగ్ కాలేవు. ఈ పార్టీలకు నూరు స్థానాలు వచ్చిన పక్షంలో అవి ఏ విజేతవైపుకైనా మళ్లవచ్చు. ప్రత్యేకించి మాయావతిని నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
- శేఖర్ గుప్తా
ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
జనం నాడి ఏం చెబుతోంది?
Published Sun, Jan 27 2019 12:42 AM | Last Updated on Sun, Jan 27 2019 6:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment