లాక్‌డౌన్‌ దేశగతిని మార్చేనా? | Mihir Swaroop Sharma Writes Guest Column About Lockdown In India | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ దేశగతిని మార్చేనా?

Published Fri, Mar 27 2020 12:28 AM | Last Updated on Fri, Mar 27 2020 12:31 AM

Mihir Swaroop Sharma Writes Guest Column About Lockdown In India - Sakshi

‘మూడు వారాలపాటు దేశంలో ఏం జరుగుతోంది అనే విషయం మర్చిపోండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌ డౌన్‌ ప్రసంగంలో చెప్పారు. కరోనా వైరస్‌ నిరోధానికి సంబంధించి తనముందున్న అవకాశాల్లో లాక్‌ డౌన్‌ తప్ప మరొకటి ఏదీ లేదని మోదీ భావించవచ్చు. పైగా మోదీ సహజలక్షణం ఏమిటంటే వీలైనంత పెద్ద లక్ష్యాలను విధించుకుంటారు. దాదాపు 21 రోజుల పాటు దేశంలోని 130 కోట్లమందిని గృహనిర్బంధంలో ఉంచడం అన్నిటికంటే అతిపెద్ద లక్ష్యం. దేశ ప్రజలపై మొదలెట్టిన ఈ భారీ క్రీడ విజయవంతం అవుతుందా కాదా అనేది పక్కనపెడదాం. ఈ మూడువారాల స్వీయ నిర్బంధం తర్వాత ఆవిర్భవించే భారతదేశం ఇక ఎన్నటికీ వెనక్కు పోలేనంతగా మారిపోయి ఉంటుంది.

ప్రధాని నరేంద్రమోదీ 2016లో టీవీ ప్రసంగం చేస్తూ రాత్రికి రాత్రే భారత కరెన్సీని పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉపసంహరిస్తున్నట్లు సంచలనాత్మక ప్రకటన చేసినప్పటినుంచి ఆయన చేస్తూ వచ్చిన అలాంటి ప్రసంగాలు దిగ్భ్రాంతికరమైన సంచలనాలకు దారితీశాయి. ఈ మంగళవారం జాతినుద్దేశించి నరేంద్రమోదీ ఇచ్చిన సందేశం ఊహించిన దానికంటే కఠినంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారతదేశంలోని 130 కోట్లమంది ఇళ్లలోనే ఉంటారు: ‘21 రోజులపాటు దేశంలో ఏం జరుగుతోంది అనే విషయం మర్చిపోండి’.

సమకాలీన ప్రపంచంలో అత్యద్భుత విజయాలు సాధించిన రాజకీయనాయకులలో మోదీ ఒకరు. ఓటర్ల హృదయాలను, మనస్సులను ఎలా గెల్చుకోవాలో కచ్చితంగా అర్థం చేసుకోవడంలో ఆయన తన సమర్థతను పదే పదే ప్రదర్శించారు. అయితే భారతీయులపై మోదీకి ఉన్న పట్టును సైతం ప్రస్తుత కరోనా మహమ్మారి పరీక్షకు గురి చేస్తోంది. గత ఆదివారం దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ప్రకటించాలని, కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్మికులకు కృతజ్ఞత తెలుపుతూ, సాయంత్రం 5 గంటలు కాగానే తమ తమ ఇళ్ల బాల్కనీల నుంచి ప్రజలు చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రధాని పిలుపు ప్రహసనంగా మారింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండిపోవాలి అని ప్రధాని పిలుపునిస్తే ఆదివారం సాయంత్రం ప్రజలు కొన్నిచోట్ల వీధుల్లోకి వచ్చి జనతా కర్ఫ్యూని అభినందిస్తూ ప్రదర్శనలు చేశారు. అందుకే మంగళవారం జాతినుద్దేశించి మోదీ మరోసారి చేసిన ప్రసంగంలో, సామాజిక దూరం పాటించకపోతే వచ్చే పెనుప్రమాదం గురించి నొక్కి చెప్పారు. ‘వచ్చే 21 రోజుల్లో ఇంటినుంచి బయటకు అడుగుపెట్టండి చాలు, ఈ దేశం 21 సంవత్సరాలు వెనక్కు వెళ్లడం మీరు తప్పకుండా చూస్తారు’.

ఒక రకంగా చూస్తే మోదీ కఠిన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. విస్తృతస్థాయిలో కరోనా వైరస్‌ పరీక్షలకు సంసిద్ధం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నప్పటికీ, దేశంలో బాగా ప్రపంచీకరణకు గురైన ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విస్తరించడం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రప్రభుత్వాలు వరుసగా కర్ఫ్యూలు, లాక్‌ డౌన్‌లు విధించడం మొదలెట్టేశాయి. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ టీవీల్లో ప్రసంగించే సమయానికి దేశంలోని రాష్ట్రాలన్నీ కీలకమైన ఆంక్షలను విధించేశాయి. కానీ దీర్ఘకాలం లాక్‌ డౌన్‌లు అంటే స్వీయ నిర్బంధాలను విధించడం అన్నిచోట్లా అమలుకావడం కష్టం. భారతదేశంలో బతికిబట్టకట్టడానికి చాలామంది పౌరులు ప్రతి రోజూ పనిచేయడం తప్పని పరిస్థితుల్లో ఇలాంటివారికి చాలా తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. ఇలాంటివారిని ఎక్కువకాలం మీరు ఇంటికి పరిమితం చేయలేరు. మూడు వారాల లాక్‌ డౌన్‌ అంటే ప్రజలు ఆమోదించే పరిమితిని ఇప్పుడే విధించేశారన్నమాటే. కానీ మళ్లీ మళ్లీ దీన్ని పొడిగించలేరు. కాబట్టి మనముందున్న ప్రశ్న ఏమిటంటే, కరోనాకు వ్యతిరేకంగా భారత్‌ మరీ ముందుగా లేక ఆలస్యంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిందా అనేదే.

ఈ రెండింటిలో రెండోదే సరైందని చెప్పాలేమో.. ప్రభుత్వం విస్తృత స్థాయిలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు చాలా ఆలస్యంగా పావులు కదుపుతోంది. విదేశాలనుంచి వస్తున్న ప్రయాణికులకు, పర్యాటకులకు స్వీయ నిర్బంధం విధించడంలో కూడా భారీ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైరస్‌ బారిన పడిన వారితోపాటు దాని లక్షణాలు పొడçసూపుతున్న వారిలో కూడా కరోనా వైరస్‌ ఎలా విస్తరిస్తోందో అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఇంకా ముందే వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మరింత క్రియాశీలకంగా చర్యలు చేపట్టి ఉండాల్సింది. ఈ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సమర్థంగా వ్యవహరిం చాయి. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రమైన కేరళను చూడండి. సినిమా థియేటర్లలో కూర్చున్న వారితో సహా వైరస్‌ ప్రభావం బారిన పడటానికి అవకాశమున్న ప్రతి ఒక్కరినీ కేరళలోని వామపక్ష ప్రభుత్వం మ్యాప్‌ చేసిపడేసింది. 

కానీ రాష్ట్రాల అనుభవంతో పోల్చి చూస్తే మన కేంద్రప్రభుత్వం అతి విశ్వాసంతో ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. దీన్ని ఫిబ్రవరి నెలలోనే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు స్పష్టంగా ప్రకటించారు. కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం హామీ ఇవ్వడం అంటే, ‘టైటానిక్‌ ఎన్నటికీ మునిగిపోదు కాబట్టి ఓడలోని ప్రయాణికులు ఎవ్వరూ భయాందోళనలకు గురికావద్దని ఆ ఓడ కెప్టెన్‌ ప్రయాణానికి ముందు హామీ ఇచ్చిన చందంగా ఉంద’ని ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించారు. అయితే మానవ చరిత్రలో శాంతికాలంలో సముద్రంపై జరిగిన భయంకరమైన విధ్వం సాల్లో ఒకటైన టైటానిక్‌ మునక ఘటనతో కరోనా వైరస్‌ ఉదంతాన్ని పోల్చకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రి ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మన ప్రభుత్వాలు తామేం చేస్తున్నామన్న ఎరుకతో ఉంటున్నాయని మనం భావిస్తాం. కానీ కేంద్ర అమాత్యులవంటి వారు స్వయంగా దీనిపట్ల స్పందిస్తున్న తీరు చూశాక కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతున్నంతగా చేతల్లో చూపలేదని ఆందోళన కలుగుతోంది.

మూడేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం ఒక విషయంలో చేసిన నిర్వాకం మనం మర్చిపోయి ఉంటే, ప్రస్తుతం కరోనా వైరస్‌ నిరోధంపై కేంద్రం స్పందన పట్ల మనందరం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లం. దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దును ప్రకటిస్తూ 2016 చివరలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆ సంచలనాత్మక ప్రసంగం తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పెద్దనోట్ల రద్దు భావన వెనుక ఎన్ని ప్రయోజనాలైనా ఉండవచ్చు గాక.. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పతనం మనకు ఒక వాస్తవాన్ని స్పష్టంగా చాటింది. కేంద్రప్రభుత్వ రాజకీయ సమర్థతతో పోలిస్తే దాని సంస్థాగతపరమైన పోటీతత్వం కొరగానిదిగా ఉందని నాటి అనుభవం మనకు తేల్చి చెప్పింది. 

పెద్దనోట్ల రద్దు ప్రకటన ఆరునెలలు దేశాన్ని కల్లోలంలోకి నెట్టివేసింది. ఆ తర్వాత కేంద్రం కొత్తదైన పరోక్ష పన్నుల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఇది కూడా అస్తవ్యస్తమైన పథకరచనతో, చెత్తగా అమలు చేయడం ద్వారా తేలిపోయింది. మోదీ ప్రకటనలు, ఆయన తీసుకుం టున్న నిర్ణయాలు అనేవి అవి వ్యక్తం చేస్తున్న ఆకాంక్షల బట్టి చూస్తే వీరోచితంగా కనిపించవచ్చు. కానీ భారతీయ రాజ్యవ్యవస్థ బోలుతనం, పసలేని ప్రభుత్వ యంత్రాంగం వాస్తవ పరిస్థితి మోదీ నిర్ణయాలన్నింటినీ శరవేగంగా పట్టాలు తప్పించేస్తున్నాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తిని పర్యవేక్షించడంలో ప్రభుత్వం ప్రదర్శించే సామర్థ్యంపై మాత్రమే తాజా లాక్‌డౌన్‌ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ 21 రోజుల్లో దేశంలోని విశాల ప్రజారాశులకు నిత్యావసర సేవలను అందించడంపై మాత్రమే భారత సామర్థ్యత మనగలుగుతుంది. ఎందుకంటే నిత్యావసర సేవలపైనే కోట్లాది భారతీయుల మనుగడ ఆధారపడి ఉంది. జీవికకోసం రాష్ట్రాలు దాటి వలసపోయే మన దేశ వలస కార్మికులు ఒకే గదిలో 12 మందికిపైగా నివసిస్తుంటారు. మరి ఇలాంటి స్వీయ నిర్బంధ ప్రకటన అనేది ప్రభుత్వానికి మునుపెన్నడూ లేనివిధంగా ప్రశ్నలు సంధిస్తోంది.

వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని ఎదుర్కొని ఇలాంటి కోట్లమంది ప్రజ లను వారివారి స్వస్థలాలకు పంపించగలరా? ఇలా ఇరుకైన స్థలాల్లో కిక్కిరిసిపోయి ఉండే జనాల పరిస్థితులు వైరస్‌ వ్యాప్తికి ఆలవాలంగా మారిపోవని మీరు నమ్ముతున్నారా? అంతకు మించి, రోజు కూలీలపై మాత్రమే ఆధారపడుతున్న  భారతీయ శ్రామిక వర్గంలోని మెజారిటీ ప్రజలకు ఈ మూడువారాల కాలంలో తినడానికి తిండయినా దొరుకుతుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఏతావాతా తేలేదేమిటంటే, ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రభుత్వం తన ప్రజలకోసం అడుగులు ముందుకేయాల్సి ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు వైరస్‌ కట్టడి విషయంలో ఇప్పటికీ మెరుగ్గానే ఉండవచ్చు. అయితే ప్రత్యేకించి ఈశాన్యభారత్‌లో నిరుపేద, అధిక జనసాంద్రతతో కూడిన రాష్ట్లాల ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్దగా సాధించేది ఏమీ ఉండదనే చెప్పాలి.

కరోనా వైరస్‌ నిరోధానికి సంబంధించి తనముందున్న అవకాశాల్లో లాక్‌ డౌన్‌ తప్ప మరొకటి ఏదీ లేదని ప్రధాని మోదీ భావించవచ్చు. పైగా ప్రధాని సహజలక్షణం ఏమిటంటే వీలైనంత పెద్ద లక్ష్యాలను ఆయన విధించుకుంటారు. దాదాపు 21 రోజుల పాటు దేశం లోని 130 కోట్లమందిని గృహనిర్బంధంలో ఉంచడమనేది అన్నిటికంటే అతిపెద్ద లక్ష్యం. దేశప్రజలపై మొదలెట్టిన ఈ భారీ క్రీడ విజయవంతం అవుతుందా కాదా అనేది పక్కనపెడదాం. ఈ మూడువారాల స్వీయ నిర్బంధం తర్వాత ఆవిర్భవించే భారతదేశం ఇక ఎన్నటికీ వెనక్కు పోలేనంతగా మారిపోయి ఉంటుంది.


వ్యాసకర్త : మిహిర్‌ స్వరూప్‌ శర్మ
రీసెర్చ్‌ స్కాలర్, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement