‘తెలంగాణ నడువలో అతనొక తెగువైన నడక’ | Nandini Sidda Reddy Role In Telangana Literature | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 10 2018 1:16 AM | Last Updated on Wed, Oct 10 2018 1:16 AM

Nandini Sidda Reddy Role In Telangana Literature - Sakshi

ఒకరకంగా కాలానికి పట్టిన అద్దం కవిత్వం అంటారు. ఆయా కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబించే కవిత్వంతో ఓ పార్శ్వం నుంచి చరిత్రను లిఖిస్తూ వెళ్తారు కవులు. అందుకేనేమో సాహిత్యం విస్తృతార్థంలో చరిత్రే అంటారు. ఈ మాటను రుజువుపరి చేదిగా ఉంటుంది నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగుదశాబ్దా  లకు పైబడిన కాలంలో ఆయన వెలువరించిన వచన కవిత్వం తెలుగునాట సగటు మనిషి బతుకు ఎలా సాగుతోందో ఇట్టే బోధపరుస్తుంది. ఆయన వెలువరించిన ఏ పుస్తకం, ఏ శీర్షిక, ఏ కవిత, అందులో ఏ చిన్న ఖండిక తీసుకున్నా... మనిషి జీవితపు ఏదో పార్శ్వం మనకు తగులుతూనే ఉంటుంది. ఒకింత మెత్తగా, ఒకింత గరుకుగా! ఓసారి మిట్టమధ్యాహ్నపు సూరీ డంత వేడిగా, ఇంకోసారి కార్తీకమాసపు తొలిపొద్దు కిరణాలంత వెచ్చగా, ఇంకా ఒకోసారి రివ్వున వీచే శీతగాలిలా, మరోమారు డిసెంబరు చివరిపాదం నడిరాతిరి ఎముకల్ని కొరికేంత చలిగా తగులుతుంటుంది. ఏం రాసినా... మనిషి, ఆతని జీవితం, ఊరు, రైతు, పంటపొలాలు, ధాన్యం, మార్కెట్లు, రాజ్యం–రాక్ష సత్వం, సర్కార్లు, వారి వ్యవస్థలు, అందులోని మనుషులు,  ఆర్తి–ఆరాటాలు, అణచివేత–పోరాటాలు... ఇలా ఎంతసేపూ ఆయన మనసు వీటిచుట్టే తిరగాడుతుంది. బహిర్‌–అంతర్‌ సంఘర్షణల ఆనవాళ్లు పట్టిస్తూనే ఉంటుంది. మట్టి పొరల నుంచి మెలమెల్లగా లేచే భావనలు.. ఓ దశలో సరిహద్దులన ధిగమించి ఆకాశమంత ఎత్తెదిగి ఆరుస్తాయి.

వాస్తవికత, హేతు బద్ధత ప్రధానంగా కనిపించే తన కవిత్వంలో అడుగడుగునా నిజం– నిజాయితీ, ఆరళ్లు–పోరాటాలు, కలలు–కడగండ్లు తగు లుతూనే ఉంటాయి. ఆయనే చెప్పినట్టు ఒకసారి అక్షరమై, ఇంకోమారు నదిౖయె, మరొకమారు తీగై, వెన్నెలై, కన్నీరై... ఇలా సాగిపోతూనే ఉంటాడు తప్ప కవి ఎక్కడా నిలిచిపోడు. ‘కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక’ అని తనకు తాను నిర్వచించుకొని మరీ కర్తవ్యదీక్షతో సాగుతాడు. కృత్రిమ విల యాలకు, కాళ్లకింద కర్కశంగా సామాన్యుని నలిపే రాజ్యపు అంగాల దాష్టీకాలకు బాధ పడతాడే తప్ప భయపడడు. ‘... కవిత్వం ఊట మీద లాఠీ వేలాడుతూంది’ అంటూనే ‘... మరింత  గట్టిగా నిర్భయంగా కలలు కన్నంత స్వేచ్ఛగా కవిత్వం రాయాల్సి ఉంది’ అనడమే పంథా ప్రకటన!

స్థానిక మాండలిక భాషా పదాలు అతికించినట్టు కాకుండా అలవోకగా సిధా రెడ్డి కవితాఝరిలో ఒదిగిపోతాయి. ఇచ్చంత్రం, పడావు, అంజుమన్‌ బ్యాంకు, బుగులు, మనాది వంటి మాటలు అస్తిత్వపు బలమైన జాడలు గానే కాక నిండైన అభివ్యక్తికి పాదుల్లా నిలుస్తాయి. అర్ర, మాసిక, అచ్చుకట్టు, దస్కత్, అల్కుపిడచ, గీర, నువద్దె, నిగురాన్, తండ్లాట వంటి పదాలు, తనకు తెలుసు కనుక కవి వాడుతున్నట్టు కాకుండా అక్కడ అదే సరిపోయే పదం అనిపించేంత సహజంగా ఒదిగిపోవడ మొక భాషాసౌరభం! బలమైన భావా లకు అతికే పదాలతో బంధ మల్లడం వల్లే కవిత్వం మాటల కూర్పు దశ దాటి... దృశ్యమానమయింది.  ఉన్నపళంగా ఊరు ఖాళీ చేయ(వలసి రావ)డం... ఎంత దయనీయమో! కళ్లకు కట్టి నట్టు, గుండె లోతుల్లో చేయూడ్చి దేవినట్టు ‘ఉసురు’ కవితలో చెబుతాడు. అది పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు నీట మునిగే ఊరు ఖాళీ చేయడమైనా, పూట గడవక పొట్టకూటి కోసం వల సవెళ్లడమైనా, పిల్లలకు నక్సలైట్‌ ముద్రేసే పోలీసు వేధింపుల్ని తట్టుకోలేకైనా... కారణమేదైనా బలవంతంగా ఊరిడిచి వెళ్లాల్సి వస్తే! ఎవరికైనా ఎలా ఉంటుందో చెబుతూ, ‘‘ఇల్లు ఖాళీ చేసి నంత సునాయాసంగా జీవితం ఖాళీ చేయలేం! ఇల్లు ఖాళీ చేసినంత సుతారంగా ఊరు కూడా ఖాళీ చేయలేం!... అన్నీ అయి తలచిక్కులు తీసిన అమ్మఒడి ఖాళీ చేయడమంటే సన్నటి గునపంతో గుండెను తవ్వుతు న్నట్టుంటది. నేరమూ ఉండదు, నెత్తురూ మిగలదు’’ ఎంత గొప్ప భావుకత!

కష్టాలను, కన్నీళ్లను అంత సహ జంగా, గుండెకు తాకేలా చెబుతాడన్న మాటే గాని ఎక్కడా మనోధైర్యాన్ని జార నీయకపోవడం సిధారెడ్డి ప్రత్యేకత. భవి ష్యత్తును ఆశావహంగా చూపుతాడు. అవ సరమైతే తప్పని తరుణోపాయాల సంకే తాలిస్తాడు. అందులో ఓ హెచ్చరికా తొంగి చూస్తుంది. ‘‘నాకు నిశ్శబ్దం నిశ్శ బ్దం కాదు మౌనంగా ఉన్న కంచు! నిస్పృహ నిస్పృహ కాదు పొదుగులో ఉన్న గుడ్డు’’ అనడం, భవిష్యత్తుపై భరో సాయే! ‘గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంద’నేది హెచ్చరిక. రాజ్యం గ్రహించాల్సిన ప్రాపంచిక సత్యాలూ ఉన్నాయనే భావాల్నీ దాచుకోకపోవడం విశేషం! ‘‘ఎంత అద్భుతమైన గంధపు చెక్కయినా సరే, మండితే ఎర్రటి నిప్పే అవుతుంది’’ అన్నది అసాధారణ అభివ్యక్తి. వీరుడు వింటి నారి సంధించడాన్ని గొప్పగా సమర్థిస్తాడు. ‘చీకటితో యుద్ధానికి వెళ్లిన కొడుకు రాత్రికి రాత్రి బూడిదయిన కలల జలతారు.. తల్లడిల్లుతున్న తల్లికి ఎవరు జవాబుదారీ? .. జరి గింది హత్యో? కాదో? విచ్చుకున్న తురాయిపూలు చెబు తాయి.. తలపండిన కొంగలు మాత్రం తపోభంగాల కథలే మళ్లీ మళ్లీ వల్లిస్తాయి... స్వప్నం గాలానికి చిక్కిన చేపయినపుడు, విశ్వాసం కంపించిన భూమయినపుడు, విషాదమే మోయాల్సి వస్తే తప్పేదేముంది? తల్లడిల్లేతల్లి శపించక చేసేదేముంది? ... విజయం కోసం వింటిని సంధించక వీరునికి దారేముంది?’అని ప్రశ్నవుతాడు. మారుమూల పల్లె నుంచి పట్నం మీదుగా నగరా నికి సాగిన జ్ఞానతృష్ణ సిధారెడ్డి. రాజధాని నగరంలో, మేటి విశ్వ విద్యాలయపు వినువీధుల్లో భాషను, దానికి మించి భావాలను పరిపుష్టం చేసుకుని పల్లెకు వెనుదిరిగిన భూమిపుత్రుడాతడు. ఒకే పుటుక పుట్టిన మనుషుల మధ్య అంతరాలను జీర్ణించు కోలేక, చలించి కవితైనాడు. సాహితీవంతెన కట్టేందుకు యత్నిం చాడు. దశాబ్దాల కిందటే, ‘విపణి వీధి వేయి కోరల రాకాసి, విపణి వీధి నూరు బారల ఉరితాడు’ అన్నాడు. కనబడకుండానే కవిత్వమంతటా తొంగి చూస్తాడు తానే ఒక ప్రశ్నై!

పలు పుస్తకాలుగా విస్తరించిన నందిని సిధారెడ్డి కవిత్వాన్ని సూత్రబద్ధం చేసే అంశం మనిషి ఆర్తి. మనిషి మనుగడ, ఒడి దొడుకులు, ఆశ–నిరాశలు, ఊరు–ఊరుమ్మడి బతుకులు.. ఇదే పూలదండలో ఒదిగిన దారం! పచ్చి నిజాలే ముడిసరుకు. కఠోర వాస్తవాలే వస్తువు. గొంతెత్తడం సాహితీ ధర్మం! ఎక్కడా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల జాడే ఉండదు. ‘సరదా పడటానికి ఒక్కరోజు చీకటి కాదు సర్దుకుపోవడానికి ఒక్కనాటి చావు కాదు..’ అని జీవితాన్ని నెమరేస్తాడు. అలా అని నిరాశ చెందడు. తనకు తన కలలే వస్తాయంటూ ‘నేల నిద్ర లేచినట్టు అలుకుబోనం చేసి మొలక చల్లినట్టు అవి మొలచి సేనై ఊగి నట్టు’ ఆశావహ దృక్పథాన్ని కలగంటాడు. తెలంగాణ ఏర్పడ టానికి ఒకటిన్నర దశాబ్దాల ముందరే ‘నాగేటి చాల్లల్ల నా తెలం గాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలం గాణ’ అని గొంతెత్తి పాడిన పాట సిధారెడ్డి. ‘శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ స్వధర్మే నిధనమ్‌ శ్రేయః..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు సిధారెడ్డి స్వధర్మాన్ని నిష్టతో, కవిత్వమే ఊపిరిగా ఆచరించారు. ‘మనది కాని జీవితంలో మన మేమీ రాయలేము’(తలవంచని గీతం) అంటాడు. తన మట్టిని, తన నేలను, తన గాలిని, తన సేలను... ఇలా అన్నీ తనవే వస్తు వుగా కవిత్వం అల్లిన యోగి. తానే చెప్పినట్టు ఆయన, ఆయన కవిత్వం ‘‘అలల రెప్పల కింద కలలు దాచుకున్న కడలి’’

(రేపటినుంచి నగరంలో ‘డా‘‘ నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం’ రెండు రోజుల జాతీయ సదస్సు సందర్భంగా)
– సవ్యసాచి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement