నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలన దేశ ప్రజలకు ఓ చేదు అనుభవం. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నడూ లేని విధంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ప్రజల ముందుకు రావడం, ప్రతిపక్ష పార్టీలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి నోటీసులు అందించడం వంటి పరిణామాలు గమనిస్తే.. మోదీ పాలనలో ఈ దేశం ఏ దిశగా పయనిస్తున్నదో అర్థం అవుతుంది. ముఖ్యంగా, రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం నీరుగారుస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆవేదన కలిగించక మానదు.
రాజకీయాలలో పోలికలు అనివార్యం. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 5వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా దేశంలో వివిధ రంగాలలో కనిపించిన ప్రగతిని, గత ప్రభుత్వాలు సాధించిన విజయాలతో బేరీజు వేయడం అనివార్యం. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే.. 1991లో దేశ ప్రధానిగా పి.వి.నరసింహారావు పదవీబాధ్యతలు చేపట్టేనాటికి, దేశంలో ఆర్థికంగా, సామాజికంగా దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న వాస్తవం అందరికీ తెలుసు. తన 5 ఏళ్ల పదవీకాలంలో పీవీ దేశాన్ని కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేర్చడం భారతదేశ చరిత్రలో ఓ విశిష్ట అధ్యాయం. అలాగే.. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంపై సంక్షోభ ప్రభావం పడకుండా సురక్షితంగా కాపాడగలిగింది. దేశాన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకు ఏవిధంగా తెచ్చారో చెప్పుకోవడానికే ఈ రెండు ఉదాహరణలు..
ఇందుకు పూర్తి విరుద్ధంగా 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టినపుడు దేశంలో ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మరో పార్టీ మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగే స్థానాలు బీజేపీకి లభించాయి. అలాగే, అంతర్జాతీయ ముడి చమురు ధరలు అధ:పాతాళానికి చేరాయి. దానివల్ల విదేశీ మారకద్రవ్యం నిల్వలు పెరగడానికి ఆస్కారం కలిగింది. మరోవైపు చైనాకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటు సాధిస్తూ ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన దశ అది. ఈ సానుకూలతలు అధికారం చేపట్టగానే నరేంద్రమోదీకి స్వాగతం పలికాయి. ఆర్థికరంగంతోపాటు అన్ని రంగాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలిగిన అద్భుత అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నరేంద్రమోదీ వాటిని సద్వినియోగం చేసుకోకపోవడమే ఓ పెద్ద విషాదం. తప్పుడు నిర్ణయాలు, పనికిమాలిన సాహసాలతో.. మోదీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఫలితంగానే.. స్వయంకృతాపరాధంతో ప్రభుత్వంలోని చివరి సంవత్సరంలో ఇంటాబయటా అనేక సమస్యలతో నరేంద్రమోదీ, అమిత్‌షాల ద్వయం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నెరవేర్చని ప్రధానహామీలు
ఎన్నికల ముందు నరేంద్రమోదీ ‘అవినీతి’ని తమ ప్రధాన ఎన్నికల ఎజెండా చేసుకొని లబ్ధి పొందారు. యూపీఏ హయాంలో ఎన్నో స్కామ్‌లు జరిగాయని, లక్షల కోట్ల నల్లధనం విదేశాలకు తరలిపోయిందని ప్రచారం చేసిన మోదీ చట్టాలను సవరించి స్విస్ బ్యాంకుల్లో పోగుపడిన నల్లధనాన్ని 100 రోజుల్లోనే వెనక్కు తెప్పించి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని వాగ్దానం చేశారు. 100 రోజులు కాదు కదా.. నాలుగేళ్లు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. ఎందుకు నెరవేర్చలేదో మోదీ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. మోదీ పాలనలో అసలు బ్యాంకింగ్ వ్యవస్థపైనే ప్రజలు క్రమంగా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు ఎంతో బలిష్టంగా కనిపించిన భారత బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అప్పులు తీసుకొని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మోహుల్‌చోక్సీ వంటి నిందితులు విదేశాలకు పారిపోయి.. ‘చేతనైతే పట్టుకోండి చూద్దాం’ అన్నట్లు సవాల్ విసురుతుంటే.. ప్రభుత్వం నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తోంది. ప్రస్తుతం నగదు కొరతతో ఏటిఎంలు మూతపడగా.. సామాన్య ప్రజలు, రైతులు తాము దాచుకొన్న సొమ్మును ‘విత్‌డ్రా’ చేసుకోలేని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
నల్లధనాన్ని అరికట్టడానికి, మరికొన్ని ప్రయోజనాలు సాధించడానికంటూ.. ప్రధాని మోదీ తీసుకొన్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా, ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 100 మందికి పైగా అభాగ్యులు ఎటీఎం క్యూలలో నిల్చొని, బ్యాంకుల వద్ద పడిగాపులు పడి ప్రాణాలు విడిచారు. నోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలను దెబ్బ తీసింది. దేశవ్యాప్తంగా, అసంఘటిత రంగంలో, ఇతర చిన్న మధ్యతరహా పారిశ్రామిక రంగాల్లో 15 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. చిన్న వ్యాపారస్థులు చితికిపోయారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత సమాజంలో అలజడి, భయాందోళనలు రేకెత్తాయి. నెలరోజుల్లో అంతా సర్దుకొంటుందని మోదీ చెప్పిన మాట ఆచరణలో సాధ్యం కాలేదు. పెద్దనోట్ల రద్దు తర్వాత.. దొంగ నోట్ల సమస్య సమసిపోతుందని, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని, 6 నెలల్లో సమాజం యావత్తు ‘నగదు రహితం’ గా రూపాంతరం చెందుతుందని మోదీ, అరుణ్‌జైట్లీలు నమ్మకం చెప్పిన మాటలు.. గాలికి పేలాలపిండి కొట్టుకుపోయిన చందం అయ్యాయి.
నోట్లరద్దు తర్వాత ప్రజలకు ఎదురైన చేదు అనుభవం ‘జీఎస్టీ’. కాంగ్రెస్‌తో సహా దేశంలో ఎవ్వరూ జీఎస్టీని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కానీ, తప్పుల తడకగా, ముందు వెనుకా ఆలోచించకుండా జీఎస్టీని ప్రజలపై రుద్దారు. ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో ప్రవేశపెట్టిన ‘జీఎస్టీ’ ని అత్యంత సంక్లిష్టంగా మార్చారు. పైగా, సమాఖ్య సహకార స్ఫూర్తిని కాలరాసేవిధంగా జీఎస్టీ పరిధి బయట అనేక సెస్సులు విధించారు.
ప్రభుత్వ పనితీరును కొలమానంగా నిలిచే అంశాల్లో ఎగుమతుల రంగం కీలకమైనది. 2013–14లో భారతదేశం చేసిన ఎగుమతుల విలువ 314 బిలియన్ డాలర్లు. రెండేళ్లు గడిచేసరికే, అంటే 2016–17 నాటికల్లా ఎగుమతుల్లో 13% క్షీణత నమోదై ఆదాయం 276 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయింది. యూపీఏ పదేళ్ల పాలనలో ఎగుమతుల్లో 400% వృద్ధిని సాధించగా.. మోదీ ప్రభుత్వం దిగుమతుల్లో మాత్రమే నిలకడైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఆర్థిక రంగానికి ఈ పరిణామాలు శరాఘాతం వంటివి. ఎన్డీఏ చెప్పుకొంటున్న 7% ఆర్థికాభివృద్ధి రేటు అన్నది పాత విధానంలో లెక్కిస్తే 5% మాత్రమే.
సంక్షేమరంగంలో సంక్షోభం
ఎన్డీఏ ప్రవేశపెట్టిన వరుస బడ్జెట్‌లను పరిశీలించినట్లయితే.. షెడ్యూల్ కులాలు, తరగతులు మైనార్టీలు, మహిళల సంక్షేమానికి కేటాయింపులు బాగా తగ్గాయి. ప్రభుత్వ సంక్షేమ పపథకాలు లబ్ధిదారులకు పాదర్శకంగా అందడానికి గత యుపిఏ ప్రభుత్వం ‘ఆధార్’ కార్డును ప్రవేశపెట్టగా.. ఇపుడు అదే ఆధార్‌ను నియంత్రణ సాధనంగా ఉపయోగిస్తూ.. నిరుపేదలకు ఆధార్ లింక్ లేదనే నెపంతో.. వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల్ని దూరం చేయడం గమనార్హం! యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామన్న హామీ నిరవేరలేదు. ప్రస్థుతం, ఒక అంచనా ప్రకారం ప్రతిరోజూ 30,000 మంది యువత జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంటే.. కేవలం 450 మందికి మాత్రమే లభిస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని గట్టెక్కించి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న హామీ ఆచరణలో ఘోరంగా విఫలమైంది. జాతీయ సర్వేల గణాంకాల ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు 50% మేర పెరిగాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కనీస మద్ధతు ధరలను స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు పెంచవలసి ఉండగా.. గత 4 ఏళ్లల్లో సగటున 7% మాత్రమే పెంచారు. యుపిఏ 10ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం 40% మేర పెరిగింది. ఎంతో ఘనంగా చెప్పుకొన్న ప్రధాని బీమా యోజన, కృషి సంచాయి పథకం వంటివి రైతులకు ఏ మాత్రం మేలు చేయలేకపోతున్నాయి.
ఇరుగుపొరుగు దేశాలతో దిగజారుతున్న సంబంధాలు
భారతదేశం స్వయంగా వలసవాద ఇక్కట్లను, ఆర్థిక వనరుల దోపిడిని, జాతివివక్షను ఎదుర్కొన్న ఫలితంగా ఆ అనుభవాల నుంచి ఆదర్శాలు, వాస్తవాల కలబోతగా పండిట్ నెహ్రూ భారతదేశం విదేశాంగ విధానానికి బలమైన పునాదులు వేశారు. అందుకే పండిట్ నెహ్రూ మొదలుకొని వాజ్‌పేయి వరకూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ప్రధానిగా ఉన్నా.. భారతదేశ విదేశాంగ విధానంలో పెద్దగా మార్పు లేకుండా సాగింది. అయితే, మోదీ అధికారం చేపట్టాక అనుసరిస్తున్న విదేశాంగ విధానికి దారితెన్నూ లేకుండా పోయింది. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సంబంధాలు బలహీనపడ్డాయి. పాకిస్థాన్, చైనాలతోనే కాక.. సామాజికంగా, సాంస్కృతికంగా, చరిత్రాత్మకంగా బలమైన సంబంధాలు కలిగిన నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతోగల సంబంధాలు కూడా సమస్యాత్మకంగా మారడం చూస్తున్నాం.
గత 4 ఏళ్లల్లో దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు బాలికలు, మహిళలపై అత్యాచార ఘటనలపై అంతర్జాతీయ సమాజంలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌లో జరుగుతున్న సంఘటనలను ఉదహరిస్తూ.. కథనాలు, సంపాదకీయాలు రాస్తున్నాయి.
అదేవిధంగా సమతుల్యతతో రాష్ట్రాలకు న్యాయంగా అందించవలసిన పన్నులవాటా పంపిణీని అస్తవ్యస్తం చేసిన కారణంగానే.. దక్షిణాది రాష్ట్రాలు తమకు జరిగిన అన్యాయంపై ఏకత్రాటిపై వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నాయి. రాజకీయ అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్రమోదీ కొన్ని రాష్ట్రాలకు పెద్దఎత్తున ఆర్థిక ప్యాకేజీలు అందించి.. మిగతావాటిని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన బిల్లు ప్రకారం ఇవ్వాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక తరగతి హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీ మాట తప్పడం, మౌనంగా ఉండటం, రాష్ట్రంలో సాగుతున్న ప్రజా ఉద్యమాలను విస్మరించడాన్ని తెలుగు ప్రజలు సహించరు.
నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలన దేశ ప్రజలకు ఓ చేదు అనుభవం. స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థలో కూడా స్తబ్దత నెలకొనడం, నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నడూ లేని విధంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ప్రజల ముందుకు రావడం, ప్రతిపక్ష పార్టీలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి నోటీసులు అందించడం వంటి పరిణామాలు గమనిస్తే.. మోదీ పాలనలో ఈ దేశం ఏ దిశగా పయనిస్తున్నదో అర్థం అవుతుంది. ముఖ్యంగా, రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న తీరు ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన కలిగించక మానదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా ఈ దేశ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. అటువంటి సమయం మళ్లీ ఆసన్నమైంది.
- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ
ఫోన్: 81069 15555
Comments
Please login to add a commentAdd a comment