ఎన్నో ముడులు విప్పిన మోదీ | Raghunandan Rao Article On Narendra Modi | Sakshi
Sakshi News home page

ఎన్నో ముడులు విప్పిన మోదీ

Published Sat, May 30 2020 12:44 AM | Last Updated on Sat, May 30 2020 12:44 AM

Raghunandan Rao Article On Narendra Modi - Sakshi

ఒక స్వయంసేవక్‌గా, కర్తవ్యనిష్ఠా గరిష్ఠుడై గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అవినీతి రహిత సుపరిపాలనలో తన ముద్ర వేసి, ప్రతి అడుగూ దేశ ప్రజలవైపు, ప్రతి రక్తపుబొట్టూ దేశం కోసం, తన ప్రతిక్షణం భారతమాతకు అంకితం చేస్తూ ఆసేతుహిమాచలం ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు నరేంద్రమోదీ. తన మొదటి ఐదేళ్ల పాలనాకాలంలో విదేశాలను విస్తృతంగా పర్యటించి ఇజ్రాయెల్‌ మొదలుకొని నేపాల్‌ వరకు అన్నిదేశాల అధికారగణంలో తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకొని భారత్‌పట్ల అపారమైన గౌరవాన్ని పెంచారు. సౌదీ రాజు తనను సాదరంగా ఆహ్వానిస్తే, డొనాల్డ్‌ ట్రంప్‌ చెట్టపట్టాలేసుకొని మోదీని చూపించి అమెరికాలో ఓట్లడుగుతున్నారు. చైనా అధ్యక్షుడిని సబర్మతీ అరుగుమీద, మహాబలిపురం రాళ్లమధ్య నిలబెట్టి ‘సాగరఘోష’ వినిపించారు.  

‘రామమందిరం నిర్మిద్దాం’ అని గోడలపై రాసినవారు, కర సేవలో తమ కుటుంబాలను వదిలిపెట్టి పాల్గొన్నవారు తమ కల కళ్లముందే సాక్షాత్కరిస్తుందని ఊహించలేదు. కొన్ని కుటుంబాలు ఈ లక్ష్యాల కోసం ఎన్నో త్యాగాలు చేయడం, సర్వం కోల్పోవడం వాళ్లలో చీకటిని, నిరాశను మిగిల్చింది. అయితే ఆ చీకటిలో దివ్వెలా మోదీ సృష్టించిన వెలుగు ఎందరి జీవితాలకో సాంత్వన కలిగించింది. 2019లో రెండవసారి మోదీ గెలుపొందడంతో అయోధ్య సమస్య పరిష్కారం నల్లేరుపై నడకలా సాగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుక్షణంలోనే ప్రారంభమైంది కశ్మీరు సమస్య. అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రధాని నెహ్రూ ఆర్టికల్‌ 370 రాజ్యాంగంలో చొప్పిం చారు. అది తాత్కాలికమే అయినా ఓటు బ్యాంకు రాజకీయాలతో దానిని గత 70 ఏళ్లుగా పొడిగిస్తూ వచ్చింది కాంగ్రెసు నాయకత్వం. మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక సమస్యకు కారణమైన 370, 35ఎలను పార్లమెంటు సవరణతో ఒక్కరోజులో రద్దుచేశారు. అంతకుముందు 60 ఏళ్లపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ నాయకత్వం కశ్మీర్‌ సమస్యను చూడ్డానికి సైతం ధైర్యం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడితే మోదీ తన చొరవతో సమస్యను చాకచక్యంగా పరిష్కరించారు.  

భారతదేశంలో స్వాతంత్య్రం నుండి నలుగుతున్న మరో సమస్య ట్రిపుల్‌ తలాక్‌. ఒకపక్క హిందువులలో భార్యకు విడాకులివ్వాలంటే భర్త ఎంతో ఆలోచించాలి. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాలి. అప్పటికీ కోర్టు భార్యాభర్తల మధ్య సయోధ్య కోసం స్వయంగా ఇద్దరికీ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తుంది. అయినప్పటికీ వారు విడాకులే కోరుకుంటే, వారిద్దరికీ విడాకులే సుఖాన్నిస్తాయని కోర్టు భావిస్తే అప్పుడు వారికి విడాకులు మంజూరవుతాయి. అందుకే హిందూ మహిళలు భారతీయ సమాజంలో ఎంతో భద్రతగా జీవించగలుగుతున్నారు. ఇటువంటి భద్రత భారతీయ సమాజంలోనే జీవిస్తున్న ముస్లిం మహిళలకు కరువైంది. భర్త మూడు సార్లు ‘తలాక్‌’ చెపితే ఇక ఆమెకి విడాకులు మంజూరయినట్లే. దీంతో నానాటికీ ముస్లిం మహిళలు ఒంటరి అయిపోతున్నారు. రాజీవ్‌ గాంధీ హయాంలో జరిగిన షాబానో అనే ముస్లిం మహిళ సంఘటనే దీనికి ఉదాహరణ. మోదీ తన మొదటి హయాంలోనే ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతికి స్వస్తి చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. ‘ది ముస్లిం ఉమన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌) బిల్‌ 2017’ డిసెంబర్‌ 28న లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ రాజ్యసభలో వీగిపోయింది. మోదీ 2019లో తన ఎన్నికల మేనిఫెస్టోలో ట్రిపుల్‌ తలాక్‌ పరిష్కారం అంశాన్నీ చేర్చి, భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాంతో 2019 జూలై 31న ట్రిపుల్‌ తలాక్‌కు తలాక్‌ చెప్పే బిల్లు రెండు సభల్లోనూ సునాయాసంగా ఆమోదం పొందింది.  

స్వాతంత్య్రం అనంతరం భారత్‌ నుండి విడిపోయిన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మిగిలిపోయిన హిందువులు ఎన్నో నరకయాతనలు అనుభవిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాల, తోటి ప్రజల ఆదరణ నోచుకోలేక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మతం మారండి లేదా చావండి అంటూ నిరంతరం బాధించే అక్కడి మత నాయకుల ఒత్తిడులను భరించలేక, ఇటు తమ హిందూ దేశమైన భారత్‌కి రాలేక, వచ్చినా ఇక్కడ ఆదరించే నాయకులు లేక నానా అగచాట్లూ పడుతున్నారు. ఇటువంటి పై మూడు దేశాలలో కోట్ల మంది ఉన్నారు. వారిలో సుమారు 6 కోట్ల మంది వరకు ఇక్కడికి శరణార్థి శిబిరాలలో భయంభయంగా జీవిస్తున్నారు. ఇటువంటి హిందూ శరణార్థులకు భార తీయ పౌరసత్వం కల్పించడం మోదీ తన కర్తవ్యంగా భావించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదంతో సవరించారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి ఇక్కడి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని రాజకీయ పక్షాలు సీఏఏ చట్టంతో ఇక్కడి ముస్లింలు పౌరసత్వం కోల్పోనున్నారనే తప్పుడు ప్రచారం చేశారు. దేశంలో అశాంతి రగిలించాలనుకున్నారు. అయితే ప్రభుత్వంలోని పెద్దలు ఇది భారతీయ పౌరులకు సంబంధించిన అంశం కాదని, ఈ చట్టంతో ఇక్కడి పౌరుల పౌరసత్వానికి ఎటువంటి నష్టమూ సంభవించదు అని స్పష్టం చేయడంతో ప్రజలు అర్థం చేసుకుని సహకరించారు. సమస్త భారతీయుల క్షేమం, సంక్షేమం, అవినీతి రహిత, సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఎన్నికైన మోదీ కేవలం తనకున్న చాతుర్యం, ధైర్యంతోనే భారతదేశానికి ఇన్ని విజయాలు చేకూర్చగలిగారు. ఇది 130 కోట్ల మంది భారతీయులకూ స్పష్టంగా తెలుసు.

వ్యాసకర్త : యం.రఘునందన్‌రావు.తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement