
ఇటీవల ప్రముఖ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ఆయన జీవన సహచరి లక్ష్మీపార్వతి చేసిన తాజా రచన ‘తెలుగుతేజం’ పుస్తకం చదివితే ఎన్టీఆర్ నిజంగానే లక్ష్మీస్ ఎన్టీఆరే అనిపించకమానదు. 1980ల ప్రథమార్థం నుంచి ఎన్టీఆర్ రాజకీయ జీవిత విశేషాలతోపాటు 1994–96 మధ్య రెండేళ్లపాటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ప్రతి పరిణామాన్ని తన ప్రత్యక్ష అనుభవంతో రచయిత్రి వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 80ల మొదట్లో ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి’... 90ల మధ్యలో ‘నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపడ్డ’ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని, ఆయన మలి జీవితాన్ని తడిమిన తాజా పుస్తకం ‘తెలుగుతేజం’. ఇది ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్రే కాదు, సొంత అల్లుడి చేతిలో భంగపడి, మధ్యయుగ రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని అంతఃపుర కుట్రలకు బలైన ఒక కుటుంబ పెద్ద దయనీయ చరమాంకానికి సంబంధించిన చరిత్ర అని చెబితేనే న్యాయంగా ఉంటుంది.
ఎన్టీఆర్ తన చరమ జీవితంలో ఎంచుకున్న ఒక చాయిస్ వెనకాల ఏం జరిగిందో, తదనంతర పరిణామాలు తన మరణానికి కూడా ఎలా కారణమయ్యాయో తెలుసుకోవడానికి మంచి వనరుగా నిలుస్తుంది ‘తెలుగుతేజం’ పుస్తకం. 70 ఏళ్ల వయస్సులో ఆహారం, తదితర అవసరాలతోపాటు రాజ కీయ జీవితంలో రోజూ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లకు కాస్త పరిష్కారంగా లక్ష్మీపార్వతిని తన జీవితంలోకి ఆహ్వానించారు రామారావు. పేద కుటుంబం నుంచి వచ్చిన, జీవితంలో అన్ని దెబ్బలూ తిన్న మహిళకు ఆశ్రయం ఇవ్వడంకాదు... తన జీవితంలో సరిసమాన స్థాయిని ఇచ్చి నిలిపాడాయన. ఇది తాను అప్పుడే పాటించిన కొత్త విలువ కానేకాదు. తన చివరి కుమార్తె మొదటి వివాహం భగ్నమైతే, ఆమె జీవితం మోడు కాకూడదని మరో వివాహం చేసి మరీ సాంప్రదాయాలకు భిన్న మార్గం పట్టారు ఎన్టీఆర్.
స్త్రీలపై సాగుతున్న భూస్వామ్య భావజాలాన్ని, అంతస్తుల తారతమ్యాన్ని లక్ష్మీపార్వతి రూపంలో ఎన్టీఆర్ బద్దలు కొట్టడమే ఒక అపురూపమైన సంగతి. ఒక పాలకుడు తన వర్గ అభిజాత్యాన్ని కూడా పక్కనపెట్టి ఒక సామాన్య స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించడం ఒక సాంస్కృతిక పరివర్తనతో సమానం. ఇది కందుకూరి వీరేశలింగం నుంచి తెలుగు సమాజంలో వీస్తూ వచ్చిన కొత్త భావాలకు సూచిక. కానీ ఎన్టీఆర్‌ని ‘దైవసమానుడి’గా భావించి సేవ చేసిన లక్ష్మిపై ఆయన కుటుంబ రూపంలోని ఫ్యూడల్ అహంభావం జమిలిగా దాడి చేయడం బాధాకరం. అందుకే ఎన్టీఆర్‌తో తన అనుబంధానికి చెందిన అపురూప క్షణాలను పూసగుచ్చినట్లు రచయిత్రి తెలుగుతేజం పుస్తకంలో పొందుపర్చారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంతోపాటు వ్యక్తిగత జీవితంలో చివరి రెండేళ్లలో జరిగిన విపత్కర పరిణామాలను గుదిగుచ్చిన ఈ పుస్తకం ఎన్టీఆర్ అభిమానులకు, ప్రజలకు కూడా పఠనీయ గ్రంథమే.
ప్రతులకు : ‘తెలుగు తేజం’ పేజీలు: 430, వెల: రూ. 350, ప్రచురణ: ఉన్నం బ్రదర్స్ పబ్లికేషన్స్, మొబైల్ : 98497 06140. విశాలాంధ్ర, నవచేతన, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్‌లు. – కె. రాజశేఖరరాజు
Comments
Please login to add a commentAdd a comment