ఈ బంధం వరమా, శాపమా? | Ramachandramurthi Article On Chandrababu Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఈ బంధం వరమా, శాపమా?

Published Sun, Nov 11 2018 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Ramachandramurthi Article On Chandrababu Rahul Gandhi - Sakshi

స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా, అరవై ఆరు సంవత్సరాల కిందట ప్రప్రథమంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్య వ్యవస్థ క్రమంగా బలపడవలసింది. కానీ కృశించిపోతున్నది. రాజ్యాంగస్ఫూర్తి అడు గంటుతోంది. సంప్రదాయాలూ, మర్యాదలూ మంటగలుస్తున్నాయి. ఎన్నికలు ఒక ప్రహసనంగా, ధనబలం, కులబలం, కండబలం ప్రదర్శించే అమానవీయ సందర్భంగా తయారైనాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం తగ్గిపోతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చెలాయిస్తున్న పార్టీలే రాజ్యాంగాన్ని ఖాతరు చేయడం లేదు. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను తుంగలో తొక్కుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అధికార పార్టీలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. శబరిమలై ఉదంతం ఇందుకు తాజా ఉదా హరణ. నైతికవర్తనం, విలువలు పాటించడం చేతగానితనంగా పరిగణిస్తు న్నారు.

అడ్డదారులు తొక్కేవారూ, విలువలకు పాతరేసేవారూ, అక్రమంగా నిధులు స్వాహా చేసేవారూ మహానాయకులుగా చలామణి అవుతున్నారు. వారికి రాజకీయం గులామై వంగి వంగి సలాం చేస్తున్నది. రాజకీయం అంటే ఎన్నికలలో డబ్బు విపరీతంగా ఖర్చు చేసి గెలుపొందడం, అధికారం హస్తగతం చేసుకున్న అనంతరం అంతకు కొన్ని రెట్లు డబ్బు సంపాదించడం అన్నది సరి కొత్త సిద్ధాంతమై కూర్చున్నది. అందుకే ఎన్నికలలో పోటే చేసేందుకు విపరీ   తమైన వెంపర్లాట. టిక్కెట్ల కోసం పోరాడుతున్నది ఎవరు? టిక్కెట్లు ఇస్తున్నది ఎవరికి? అభ్యర్థులలో మహిళలు ఎందరు? సేవాభావం త్రికరణశుద్ధిగా  కలిగిన వారెందరు? మచ్చలేనివారెందరు? మేధావులెందరు?

టిక్కెట్ల కోసం పాట్లు
హైదరాబాద్‌లో, ఢిల్లీలో  కాంగ్రెస్, టీడీపీ నాయకులూ, కార్యకర్తలూ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోసం, టిక్కెట్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. తమ పేరు అభ్యర్థుల జాబితాలో లేనందుకు నిరసన ప్రకటిస్తున్నారు. ‘ఫలానావారికి టిక్కెట్టు ఇస్తే ఓడించి తీరుతాం’ అంటూ హెచ్చరిస్తున్నారు. నకిరేకెల్‌లో పోటీ చేయడానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సుధాకర్‌కి టిక్కెట్టు ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తామని కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులే బాహాటంగానే చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో తమ మిత్రుడు చిరుమర్తి లింగయ్యకు టిక్కెట్టు దక్కకపోతే తానూ, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఎన్నికలలో పోటీ చేయబోమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢంకాబజాయించి ప్రకటించారు.

నకిరేకల్, ఖానాపూర్, ఉప్పల్‌ నియోజక వర్గాలలో పోటీ చేసే అవకాశం కోరుతున్న ఆశావహుల నినాదాలతో తెలంగాణ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయమైన గాంధీభవన్‌ శనివారం దద్దరిల్లిపోయింది. ఒకానొక అనుచరుడు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు చెబుతున్నారు.  టిక్కెట్లు పంపిణీ చేసే తరుణంలో ఆవేశకావేశాలు పోటెత్తడం కొత్త కాదు. కోమటిరెడ్డి సోదరులు వీరంగం వేయడం వింత కాదు. టీడీపీ అభ్యర్ధిత్వం ఆశిస్తున్న నాయకుడే స్వయంగా ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవనంలో నిరసనదీక్ష చేపట్టారు.  ఇంతవరకూ లేని కొత్త ధోరణి తెలంగాణలో కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి శాసనసభ ఎన్నికలలో 35 ఏళ్ళుగా జరగని ఒకానొక పరిణామం జరుగుతోంది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన టీడీపీ అదే పార్టీతో భుజం కలిపి తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో యోధులను మోహరించింది. టీడీపీతో కలిస్తే తప్పేమిటంటూ జానారెడ్డి వంటి నాయకులు ప్రశ్నించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా గుర్తింపు ప్రసాదించిన పార్టీ టీడీపీ. ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో అత్యధిక శాఖలను నిర్వహించిన మంత్రిగా జానారెడ్డి సాధించిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరుమీదే ఉన్నది.

కాంగ్రెస్‌లోనే పుట్టి ఆ పార్టీలోనే కట్టుగా కొనసాగుతున్నవారికీ, టీడీపీతోనే రాజకీయ అరంగేట్రం చేసి అదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికీ కాంగ్రెస్‌–టీడీపీ మైత్రి జీర్ణం కాదు. పచ్చి అవకాశవాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల రంగ ప్రవేశం చేసే వరకూ కాంగ్రెస్, తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), సీపీఐల కూటమికి విజయావకాశాలు కొద్దోగొప్పో పెరుగుతున్నట్టు కనిపించాయి. ముందస్తు ఎన్నికలకు సాహసిం చడం, 105 మంది అభ్యర్థులను ఏకబిగిన ప్రకటించడం, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎంఎల్‌ఏలు ఎవరో తెలిసి కూడా వారికే టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారని భావించినవారు లేకపోలేదు. చంద్రబాబు రాహుల్‌గాంధీతో  కరచాలనం చేసిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలోని తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి భయపడవలసిన అవసరం లేదని సంకేతాలు అందాయి.

టీఆర్‌ఎస్‌ చేతికి ఆయుధం
మొన్నటిlవరకూ ఎన్నికల ప్రచారంలో ఎవరిపైన దాడి చేయాలన్న విషయంలో స్పష్టత లేని టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి చంద్రబాబు ప్రవేశం మంచి అవకాశం ప్రసాదించింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎంత విమర్శించినా ప్రజలకు ఆవేశం రాదు. తెలంగాణ  కల సాకారం కావడంలో కాంగ్రెస్‌ పాత్ర నిశ్చయంగా ఉన్నదనే విషయం ప్రజలకు తెలుసు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌పైన ఆరోపణలు చేయడానికి ఆయన ఎన్నడూ అధికారంలో ఉన్న వ్యక్తి కాదు. అధికార రాజకీయాలు నెరపిన అనుభవం ఉన్న మనిషి కాదు. అక్రమంగా ఆర్జించాడని కానీ, బంధుప్రీతి ప్రదర్శించాడని  కానీ ఆయనపైన ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2009 తర్వాత కోదండరామ్‌ పోషించిన పాత్ర విస్మరించదగినది కాదు.

కాంగ్రెస్‌ కూటమిలో చేరినందుకు ఆయనను విమర్శించినా ప్రజలు పెద్దగా స్వీకరించరు. కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగా ప్రజలు భావించడం లేదు. గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్‌సింగ్‌ కాలేడంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డిని ఎద్దేవా చేసినా ప్రజలు అంతగా ఆమోదించలేదు. ప్రత్య ర్థులపై శరసంధానం చేయడం సర్వసాధారణం. కానీ వాగ్యుద్ధంలో గెలు పొందాలంటే మాటల ఈటెలు లక్ష్యాన్ని ఛేదించాలి. విమర్శ సమంజసంగా, హేతుబద్ధంగా ఉండాలి. చంద్రబాబు రాకతో టీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధం లభించింది. టీడీపీ టిక్కెట్టుపైన కానీ టీజేఎస్‌ టిక్కెట్టుపైన కానీ పోటీ చేసి గెలిచేవారు ఆ పార్టీలలోనే  కొనసాగుతారన్న భరోసా లేదు. నేషనల్‌ డెమొ క్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)కి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి పార్టీ ఫిరా యింపుల విషయంలో పట్టింపులేదు.

ఇందుకు అభ్యంతరం చెబుతూ మాట్లాడిన ఒకే ఒక అగ్రనాయకుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాజ్యసభ అధ్యక్షుడుగా జేడీ(యు) తిరుగుబాటు దారులపైన వేటు వేశారు. అంతే  కానీ చంద్రబాబు 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేయడాన్నీ, వారిలో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి గౌరవించడాన్నీ ఆక్షేపించలేదు. ఫిరాయింపులను ప్రోత్స హించిన అనైతిక రాజకీయ నాయకుడంటూ చంద్రబాబును కేసీఆర్‌ సైతం దుయ్యపట్టలేరు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు తగులుతున్నారంటూ ఆరో పించవచ్చు. చంద్రబాబు అంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను పరిరక్షించింది లేదు. రాష్ట్రాన్నీ, రాష్ట్ర ప్రజల సమస్యలనూ పట్టించుకోకుండా నాలుగున్నర సంవత్స రాల పాటు అమరావతిని ప్రపంచంలోని అయిదు మహానగరాలలో ఒకటిగా నిర్మించాలన్న ఆకాంక్షతో డిజైన్ల పేరుతో సింగపూర్, జపాన్, బ్రిటన్‌ తదితర దేశాల చుట్టూ తిరిగారు. ఇంతవరకూ డిజైన్లు ఖరారు కాలేదు.

ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఇంతవరకూ నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణం తాత్కాలికమేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరువు జిల్లాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంద్రంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అంచనాలు పెంచడం, నామినేషన్‌పైన కాంట్రాక్టులు ఇవ్వడం నిరాఘాటంగా సాగిపోతోంది. ఒక వేళ టెండర్‌ పిలిచినా తాము పనులు అప్పగించదల్చుకున్న వారికి సరిపోయే అర్హతలను టెండర్‌ నోటీసులో పేర్కొనడం పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పౌరసమాజం ప్రశ్నించకపోవడంతో టీడీపీ ఇష్టా రాజ్యం సాగుతోంది. ఆరోగ్యం, విద్య ప్రైవేటు శక్తుల కబంధ హస్తాలలో విలవిల లాడుతున్నాయి. పుణ్యభూమి కమిటీల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ లావాదేవీలు మామూలైపోయినాయి. పని కంటే ప్రచారానికి ప్రాధాన్యం అధికం. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమని అడగడంతో ఎన్‌డీఏతో తెగతెం పులు చేసుకున్నారు.

ఇంట గెలవకుండా రచ్చకు...
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించే ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టే బాధ్యత తనంతట తానే నెత్తికెత్తుకున్నారు. ఇంట గెలవకుండా రచ్చ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పేరుకుపోతున్న సమస్యలను పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ప్రత్యేక విమానంలో బెంగళూరు, చెన్నై నగరాలను సందర్శించడం, కాంగ్రెస్‌ కూటమిలో ఎప్పటి నుంచో ఉన్నవారిని తాను అదే కూటమిలోకి కొత్తగా ఆహ్వానించడం విశేషం. స్టాలిన్‌ నాయకత్వంలోని డిఎంకె 2004 నుంచీ యూపీఏలో భాగస్వామి. పద్నా లుగు సంవత్సరాలుగా కలసి పని చేస్తున్న పార్టీల మధ్య సయోధ్య కుదుర్చుతు న్నట్టు కనిపించడం జాతీయ స్థాయిలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికే. 

ఇదే పరిణామ క్రమంలో రాహుల్‌ ప్రత్యేక దూతగా రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ అమ రావతిలో చంద్రబాబును కలుసుకున్నారు. వారిద్దరూ ఏమి చర్చించుకున్నారో ఊహించుకోవచ్చు. టీడీపీ అధినేత దగ్గర నిధులు దండిగా ఉన్నాయనీ, రాహుల్‌ దగ్గర నిండుకున్నాయనీ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధి కారంలో ఉన్న రాష్ట్రాలే రెండున్నర. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమ రేంద్రసింగ్‌ ముక్కుసూటి మనిషి. నిధుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. కర్ణాటకలో మిశ్రమ ప్రభుత్వం. మిజోరం బుల్లి రాష్ట్రం. ఏఐసీసీ కార్యాలయం నిర్వహణ కూడా భారంగా మారిన పరిస్థితి. నేటి రాజకీయంలో నిధులు ఉన్నవారే నాధులు కనుక టీడీపీ అధినేతది పైచేయి అవుతున్నది. అందుకే  తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలలో చంద్రబాబు దిశానిర్దేశం పాటిం చాలని రాహుల్‌గాంధీ అనుకున్నట్టున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవడం కంటే, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పుంజు కోవడం కంటే జాతీయ స్థాయిలో యూపీఏను నిలబెట్టడానికి రాహుల్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిర్ణయిస్తే నష్టం జరుగుతుందని కొందరు కాంగ్రెస్‌ నాయకులు చెప్పినా రాహుల్‌ పెడచెవిన పెట్టినట్టు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాహుల్‌ని కలవటం, గెహ్లాట్‌ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం, రాహుల్‌ కూడా త్వరలోనే అమరావతి సందర్శించాలని నిర్ణయించుకోవడం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అంశాలు. తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్న టీడీపీతో కాంగ్రెస్‌ అంటకాగుతున్నదని ప్రభావవంతంగా ప్రచారం చేయగలిగితే ఎన్నికల సంగ్రామంలో టీఆర్‌ఎస్‌ గెలుపు సులువు.

ఎన్నికల ప్రచా రంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ కావాలో లేక చంద్రబాబు చెప్పుచేతలలో ఉండే కాంగ్రెస్‌ నాయకుడు కావాలో తేల్చుకోవాలని ప్రజలను టీఆర్‌ఎస్‌ నాయ కులు అడుగుతున్నారు. ఢిల్లీ గులాములూ, అమరావతి అనుచరులూ పాలకు లైతే పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఏమి అవుతాయో ఊహించుకోమని చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు అడ్డుతగులుతున్నారంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రాసిన పందొమ్మిది అంశాల లేఖకు జవాబు చెప్పడం కష్టం. కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు పోరాటంగా తెలంగాణ ఎన్నికలను అభివర్ణించి ప్రజలను ఒప్పించగలిగితే టీఆర్‌ఎస్‌ విజయం తథ్యం. టీడీపీతో పొత్తు కాంగ్రె స్‌కు ఎంత లాభిస్తుందో చెప్పడం కష్టం. టీఆర్‌ఎస్‌కు మాత్రం దండిగా లాభిస్తుం దనేది స్పష్టం.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement