కోరెగావ్‌  ఓ శౌర్య ప్రతీక | ramesh patange write article on koregaon memorial pillar | Sakshi
Sakshi News home page

కోరెగావ్‌  ఓ శౌర్య ప్రతీక

Published Thu, Jan 25 2018 1:13 AM | Last Updated on Thu, Jan 25 2018 1:13 AM

ramesh patange write article on koregaon memorial pillar - Sakshi

సందర్భం
మహర్‌ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి శౌర్యం దేదీప్యమానంగా వెలిగింది. కశ్మీర్‌పై పాక్‌ దండయాత్రను వీరోచితంగా అడ్డుకున్న చరిత్ర వీరిది. కానీ దాన్ని సమాజంలో చీలికలకు ఉపయోగించుకోవడం కూడనిపని.

రెండువందల సంవత్సరాల క్రితం పూనాకు 40 కి.మీ.ల దూరంలో భీమానది ఒడ్డున ఆంగ్లేయుల సైన్యానికి, పీష్వా సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది.  1818 సం‘‘లో కోరేగావ్‌ వద్ద జరిగిన యుద్ధంవల్ల మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పరాజితం అయింది.  ఆనాటి ఆంగ్లసైన్యంలో ‘మహర్‌’లు గణనీయంగా ఉన్నారు.  ఆ యుద్ధంలో చనిపోయిన మహర్‌ సైనికులను స్మరిస్తూ అంబేడ్కర్‌ అనుయాయులు గత అనేక సంవత్సరాలుగా శౌర్యదినంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శౌర్యదినాన్ని నిర్వహించడానికి వేలాదిమంది అంబేడ్కర్‌ అనుయాయులు కోరేగావ్‌ వద్దగల స్మారకం వద్ద కలుస్తుంటారు. ఈ ఉత్సవాలను ఇంతకాలం మిగిలిన సమాజం పెద్దగా పట్టించుకోలేదు. జనవరి 2వ తేదీన నిర్వహించిన ప్రదర్శనపై రాళ్ళురువ్వటం, 3వ తారీఖున నిర్వహించిన బంద్‌తో జరిగిన దుర్ఘటనలవల్ల కోరేగావ్‌ చరిత్ర మహారాష్ట్రలోని ఇంటింటికీ తెలిసింది. 

మహర్‌ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి పరాక్రమం దేదీప్యమానంగా వెలిగింది.  1947లో పాకిస్తాన్‌ కశ్మీర్‌పై దండయాత్ర చేసినపుడు డా‘‘బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సలహా మేరకు పాకిస్తాన్‌ దురాక్రమణను ఎదుర్కొనడానికి మహర్‌ బెటాలి యన్‌ని పంపారు. అక్కడ మహర్‌ సైనికులు చేసిన వీరోచిత యుద్ధం స్వర్ణాక్షరాలతో రాయగలిగిన చరిత్ర. భారత సేనాపతి, తదితర ఉన్నత అధికారులు, ‘‘హిందూ సైన్యంలో మహర్‌ సైనికులు అత్యంత శ్రేష్ఠవీరులు’’ అని బహిరంగంగా అనేకసార్లు కొనియాడారు. 1947 డిసెం బర్‌ 24న ఝాంగర్‌ వద్ద భీషణ సంగ్రామం జరిగింది. మహర్‌ సైనికుల వద్ద గల తుపాకులలో గుండ్లు అయిపోయాయి. అయినా మహర్‌ సైనికులు ముష్ఠి యుద్ధంతోనే పాక్‌ సైన్యం ఆక్రమణను విజయవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత మహర్‌ సైనికులలో ఒకరిని ‘మహావీరచక్ర,’ మరొక 5 మందిని ‘వీరచక్ర’ లతో సన్మానించారు. డిసెంబర్‌ 24ని మహర్లు, మొత్తం భారత సమాజం నిజమైన శౌర్యదినోత్సవంగా జరుపుకోవాలి.  

ప్రకాశ్‌ అంబేడ్కర్, వామపక్ష భావజాల మేధావులకు 24 డిసెంబర్‌ని శౌర్యదినంగా నిర్వహించటం ఇష్టం ఉండదు. పీష్వాలు జన్మతః బ్రాహ్మణులు. కానీ వీరు స్వయంగా రాజులు కాదు, శివాజీ అనుయాయులకు ప్రతినిధులుగా వారు యుద్ధం చేశారు. పీష్వాల పరాజ యమంటే మరాఠా మహాసామ్రాజ్యపు పతనమే. ఇంత సరళమైన విషయాన్ని ‘బ్రాహ్మణ పరాజయం’గా పేర్కొనడం వామపక్ష చరిత్రకారుల ప్రత్యేకత. జనవరి 2న కోరేగావ్‌ ప్రదర్శనపై రాళ్లురువ్విన సంఘటనలు, దాడులు అత్యంత ఖండనీయం. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మహారాష్ట్ర 3 రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ ప్రారంభమైన పదిగంటలకే ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బంద్‌ను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రభుత్వ బస్సులపై, ప్రైవేటు వాహనాలపై నీలం జెండాలతో ఉద్యమకారులు రాళ్లు రువ్వారు, దాడులు చేశారు. పలువురు అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదుపు తప్పిన ఉద్యమ కారుల వ్యవహారశైలి కారణంగా సామాన్య మహారాష్ట్ర ప్రజానీకంలో ఒక అసంతృప్తి ఏర్పడింది. 

డా‘‘ బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ బంధుభావనకు (సోదర భావనకు) అత్యంత ప్రముఖస్థానం ఇచ్చారు. ‘బంధుభావం అంటే మానవత్వం, ధర్మానికి మరోపేరు’ అని వారు పేర్కొన్నారు. పౌరులందరిలో బంధుభావన అనుభూతిని కలిగించాలి. భారతీయులమందరమూ మన మొక్కటే, మనమందరం సమానులం అనే భావన ఆలోచనలో, ఆచరణలో వ్యక్తం కావాలి, ఇది అత్యంత కష్టమైన పనే అని పేర్కొన్నారు.  ఈ అనుభూతిని, సమరసతను నిర్మాణం చేయటంకోసం వివిధ వర్గాల ప్రజలమధ్య సద్భావన కోసం గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ బంద్‌ కారణంగా ప్రకాశ్‌ అంబేడ్కర్‌వంటి కొద్దిమంది అంబేడ్కర్‌వాదులకు రాజకీయ లబ్ధి లభించవచ్చునేమో, సాధారణ అంబేడ్కర్‌ వాదులకు ఈ సంఘటనలు మింగుడుపడని ఘటనలుగా మిగిలిపోయాయి. 

అంబేడ్కర్‌ అనుయాయులకు మిగిలిన సమాజం మధ్య అగాధాన్ని ఇవి మరింతగా పెంచాయి. ఒకనాడు మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పేరుగా మార్చే ప్రతిపాదన పెద్ద వివాదం లేవదీసింది. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది.  సామాజిక సమరసతా మంచ్‌ కార్యకర్తగా ‘‘డా‘‘అంబేడ్కర్‌ జాతీయ నాయకుడు, ఒక కులనాయకుడు కాదు’’ అంటూ మహా రాష్ట్ర సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలిసి నచ్చచెప్పి, మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ అంబేడ్కర్‌ మరాఠా విశ్వవిద్యాలయంగా ప్రజలం దరి ఏకాభిప్రాయంతో మార్పుచేయించిన ఘటనలో నేను ఒక కార్యకర్తగా పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటన. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ వంటి కొద్దిమంది నాయకుల ధోరణివల్ల నేడు మహా రాష్ట్ర సమాజం రెండుముక్కలైంది. దీనికి ఎవరు బాధ్యులు?  ఫడ్నవిస్, మోదీ, భాగవత్‌లను కొత్త పీష్వా లుగా బ్రాహ్మణ ద్వేషంతో దూషించటం ప్రకాష్‌ అంబేడ్కర్‌ తదితర నాయకులకు ఆనందం కలిగి ఉండవచ్చును. కానీ ఈ దుర్ఘటన సందర్భంగా ఏర్పడిన పరిణామాలపై వీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

- రమేష్‌ పతంగే
వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త,
ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement