ప్రతీకాత్మక చిత్రం
పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజు లేదు. ఈ పరిస్థితి ఏ ఒక్క రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. భారతదేశం యావత్తు రోజుకు పదుల సంఖ్యలో ఈ ఘటనలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాల మేరకు 2014లో దేశవ్యాప్తంగా 89,423 ఘటనలు చోటు చేసుకుంటే పిల్లలపై ఈ అత్యాచారాలు 2015–94,172కి పెరిగాయి. ఇక 2016లో ఈ సంఖ్య 1,06,958కి చేరుకోగా 2017లో రెండు లక్షలు దాటిందని అంచనాలు వేస్తున్నారు.
దేశం వెలుపలా, దేశం లోపలా కేంద్ర ప్రభు త్వం అత్యంత విమర్శకు గురైన కథువా ఘటనకు కంటితుడుపు చర్యగా ప్రజల ముందు కోర్టుల ముందు తామూ ఏదో చేశామని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అదరా బాదరాగా సవరించి పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష వేసేలా చట్టాన్ని సవరించి చేతులు దులుపుకున్నారు. దీంట్లోనూ బాధిత బాలికల వయసు 12 ఏళ్లలోపు ఉంటేనే నిందితుడికి ఉరిశిక్ష అని పేర్కొన్నారు. 12 ఏళ్ల పైబడిన బాధితుల మాట ఏంటి? ఇక బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతి కాలంలో నాలుగున్నర లక్షల అత్యాచార ఘటనలు జరిగాయి. ఇందులో ఎంతమందిని ఉరితీయగలరు.
కేవలం శిక్షల ద్వారా నేరాలు తగ్గుతాయనుకుంటే నిర్భయ చట్టం ద్వారా నేరాలు తగ్గాయా? పిల్లలపై జరిగిన అత్యాచారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నాయనడానికి ఏపీలో గుంటూరులోని దాచేపల్లిలో ఓ పసిపాపపై అత్యాచారం జరిగితే, నింది తుడు సుబ్బయ్య ఏపీ ప్రతిపక్ష నాయకుడితో ఉన్న ఫొటోను చూపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న పాలక పక్షానికి నిందితుణ్ణి పట్టుకుని శిక్షించడం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపన లేకపోవడం చూసి అసహ్యం కలుగుతోంది.నేరాలు జరిగాక శిక్షలు వేస్తామనడం కంటే నేరాలు జరగకుండా చూడటానికి ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే పిల్లలను కొంతమేరకైనా రక్షించుకోగలం కానీ కేవలం రాజకీయ కోణంలో చూస్తే పిల్లలు అత్యంత అన్యాయానికి గురౌతారు.
అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242
Comments
Please login to add a commentAdd a comment