ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎట్టకేలకు హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నది. గత నాలుగు సంవత్సరాలుగా తరలించకుండా అపడానికి ప్రధాన కారణం అక్కడ సరైన భవనాలు లేకపోవడమే. కానీ ఈరోజు అకస్మాత్తుగా విజయవాడలో భవనాలు ఉద్భవించాయి. ప్రభుత్వం తాత్కాలికంగా గానీ, శాశ్వత ప్రాతిపదికపైన గానీ హైకోర్టు కోసం కొత్తగా భవనాలు నిర్మించలేదు. ఇందుకోసం నాలుగు సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించని అనువైన భవనాలు ఒక్కసారిగా లభ్యమైనాయి. జూన్, జులై కల్లా హైకోర్టు బదిలీ పక్రియ పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్నది కూడా.
దీనికి ప్రధాన కారణం–హైకోర్టు విభజనాంశం నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అవసరంగా మారింది. 2019 లోపల హైకోర్టు తరలి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. ఈ తరుణంలోనే రాయలసీమ మేల్కొనవలసి ఉంది. ఇప్పటికైనా అక్కడి నాయకత్వం కదలి హైకోర్టును సీమలో ఏర్పాటు చేయవలసిన సహేతుకమైన కోరికను వినిపించకపోతే భవి ష్యత్తు తరాలవారు క్షమించరు. ఈ అంశాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక్కసారి ఇందుకు సంబంధించిన చారిత్రక నేప«థ్యాన్ని పరిశీలించాలి.
‘శ్రీబాగ్’ స్ఫూర్తి ఏమైనట్టు?
1920లో జరిగిన నాగ్‌పూర్ కాంగ్రెస్ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనితోనే మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్ర ఆశలు చిగురించాయి. వెంటనే పరస్పర అపోహలు, అపనమ్మకాలు బయటపడ్డాయి కూడా. అంతవరకు చారిత్రకంగా ఒక ప్రత్యేక గుర్తింపు గలిగిన తాము, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రరాష్ట్రంలో అల్ప సంఖ్యాకులుగా మిగిలిపోతామన్న అపనమ్మకం రాయలసీమ ప్రాంతీయులలో చోటు చేసుకున్నది. ఈ అపనమ్మకాలను రూపుమాపటానికి 16 నవంబర్ 1937న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం ‘శ్రీబాగ్’(మద్రాస్)లో కోస్తా, రాయలసీమ పెద్దలు సమావేశమై ఒక ఒప్పం దానికి వచ్చారు. ఈ ఒప్పందం మీద రాయలసీమ తరఫున కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, సుబ్బరామిరెడ్డి, పప్పూరి రామాచార్యులు సంతకాలు చేశారు.
భోగరాజు పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య తదితరులు కోస్తా ఆం్ర«ధ తరఫున సంతకాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమలో రాజధాని, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. అంతేకాదు, ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటిస్తూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. దాదాపు ఎనభై సంవత్సరాల తరువాత 2014లో శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కార్యకలాపాలను, సంస్థలను వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించాలనే సూచించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాము సూచించిన రీతిలో ఏర్పాటుచేయలేదని సీమ వాసులు మద్రాస్ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండటానికి 1926 నాటికే మొగ్గు చూపిన సంగతిని విస్మరించలేం.
రాజధాని ఏర్పాటు– కొన్ని సత్యాలు
ఈ చారిత్రక నేపథ్యంలో 1953లో పొట్టి శ్రీరాములు బలిదానం తరువాత జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రాజధాని విషయంలో ముందుగానే ఒక అంగీకారానికి రావాలని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రకాశం పంతులుకు సూచించారు కూడా. నెహ్రూ నుంచి ఈ రకమైన సూచన వెలువడడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం నెహ్రూకు ఇష్టంలేదు. ప్రప్రథమంగా ఆయన అంగీకరించిన భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న వైవిధ్యంతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఉన్న విభేదాల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని వీరు అంత సులభంగా పరిష్కరించుకోలేరని ఆయనకు పరిపూర్ణమైన నమ్మకం.
ఒకవేళ నాయకులు రాజ ధాని ఏర్పాటు గురించి ఏకాభిప్రాయానికి రాలేకపోతే భాషాప్రయుక్తరాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అవరోధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం మద్రాసులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవనయాత్ర’లో ఆనాటి పరిణామాలను తెన్నేటి విశ్వనాథం కన్నులకు కట్టినట్టు పొందుపరిచారు (ప్రకాశం ఆత్మకథ చివరి భాగాలను తెన్నేటి విశ్వనా«థం పూర్తి చేశారు). మద్రాసులో ప్రకాశం ఏర్పాటు చేసిన సమావేశంలో కృషక్ పార్టీ నుంచి గౌతు లచ్చన్న, కమ్యూనిస్టు పార్టీ నుంచి నాగిరెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిని చేయాలన్న తన ప్రతిపాదనను తెన్నేటి విశ్వనాథం ప్రకాశం సూచనతోనే విరమించుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు.
గుంటూరు, విజయవాడ ప్రాంతం కోసం కమ్యూనిస్టులు పట్టుబట్టారు. తిరుపతిలో రాజధానిని ఏర్పాటు చేయాలనీ, లేకపోతే చిత్తూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలో ఉండిపోయే ప్రమాదం ఉందనీ గౌతు లచ్చన్న గట్టిగా అభిప్రాయపడ్డారు. కడపలోని భవనాల ఫోటోలు చూపి, కడప కోటిరెడ్డి కడపను రాజధానిని చేయాలని పట్టుబట్టారు. రాష్ట్ర ఏర్పాటులో ప్ర«ధాన భూమికను పోషిస్తున్నందువల్ల ఏ ప్రాంతాన్ని అందుకు ప్రతిపాదించ వద్దని నీలం సంజీవరెడ్డిని ముందుగానే ప్రకాశం కోరారు. అన్నిటికీ మించి రాయలసీమ ప్రజాప్రతినిధులందరూ ఒక పిటిషన్ రాసి సంతకాలు చేసి తమ దగ్గర పెట్టుకున్నారు. దాని సారాంశం ఏమిటంటే; రాజధాని రాయలసీమలో పెట్టకపోతే తమ ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రంలోనే ఉంచాలని.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని ప్రకాశం పంతులు గారికి వదిలేస్తూ అఖిలపక్షం తీర్మానించింది. ఆయన వారందర్నీ మధ్యాహ్నం 03.00 గంటలకు సమావేశమవుదామని చెప్పి, ఆ వేళకు తిరిగి సమావేశం కాగానే గౌతు లచ్చన్నను కాగితం, కలం తీసుకొని కర్నూలు పేరు రాయమని ఆదేశించారు. ఇట్లా ఆనాడు కర్నూలు రాజధానిగా నిర్ణయమైంది. ఆ నిర్ణయం జరుగకపోతే రాయలసీమ ప్రజాప్రతినిధులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గుతారని ప్రకాశం గారికి తెలుసు. రాజధాని సమస్య చాలా జటిలమని తెలిసే నెహ్రూ మొదట ఆ అంశం తేల్చుకోవాలని ఆంధ్ర నాయకులకు సూచించారు.
వాస్తవానికి రాయలసీమ వాసులు మద్రాసు రాష్ట్రంలో ఉండటానికే మొగ్గు చూపినట్టయితే భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు పునాది లేకుండా పోతుంది. అది తెలిసిన ప్రకాశం దార్శనికతతో నిర్ణయం తీసుకొని స్వతంత్ర భారతంలో ఆంధ్రరాష్ట్రం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించడానికి అవకాశం కల్పించారు. తరువాత గుంటూరులో హైకోర్టు ఏర్పాటయింది. ఇప్పుడు అమరావతికి వద్దాం. ఆ నగర నిర్మాణం ఏ రకంగా జరిగిందో పరిశీలిద్దాం. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేయడానికి తగిన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది.
కానీ ఈ కమిటీ సూచనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ జరిగిపోయింది. ఇంత చరిత్ర కలిగిన అంశాన్ని, చాలా తేలికగా, వ్యూహాత్మక సర్దుబాట్లతో, చర్చ కూడా లేకుండా ప్రస్తుత రాజకీయ నాయకత్వం అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్య వల్ల కోస్తా ప్రాంతానికి కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఒక వర్గ స్థిరాస్తి, వాణిజ్య ప్రయోజనాలకు కొమ్ముకాసే విధంగా ఈ రాజధాని నిర్మాణం సాగుతున్నది.
అదే మంచి సంప్రదాయం
మన దేశంలోనే ఇతర రాష్ట్రాలను పరిశీలించండి! అక్కడ కూడా రాజధాని, హైకోర్టు వేర్వేరు ప్రాంతాలలోనే కనిపిస్తాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల వారు ఇలా రాజధానినీ, హైకోర్టునూ వేర్వేరు ప్రాంతాలలో నిర్మించుకున్న వాస్తవాన్ని గమనిస్తాం. భారతదేశ సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలోని కొన్ని సంస్థానాలను విలీనం చేయగా ఏర్పడినదే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ నేపథ్యాన్ని బట్టే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగానే ప్రాంతాల మధ్య సరైన అవగాహన కోసం రాజధానిని భోపాల్ నగరంలోను, హైకోర్టును జబల్‌పూర్‌లోను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రానికి రాజధాని లక్నో. కాగా హైకోర్టును అలహాబాద్‌లో ఉంచారు.
ఉత్తరాంచల్ రాష్ట్రంలో రాజధాని డెహ్రాడూన్‌లో, హైకోర్టు నైనిటాల్‌లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజధాని నయా రాయ్‌పూర్‌లో, హైకోర్టు బిలాస్‌పూర్‌లోను ఉన్నాయి. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలయాళ భాష మాట్లాడే ప్రాంతాలు, ట్రావెన్కోర్ సంస్థానం విలీనం చేయగా ఏర్పడినదే కేరళ. ఈ చిన్న రాష్ట్రానికి రాజధాని తిరువనంతపురంలోను, హైకోర్టు కొచ్చిలోను ఉన్నాయి. సంస్థానాల ఏకీకరణ ద్వారా ఏర్పడిన రాజస్తాన్‌లో కూడా రాజధాని జైపూర్‌లో, హైకోర్టు జోధ్‌పూర్‌లోను ఉన్నాయి. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు తమ రాజధానులను ఎక్కడ ఏర్పాటు చేయాలో చాలాకాలం చర్చించాయి. గుజరాత్, ఒడిశాలకు రాజధానులు గాంధీనగర్, భువనేశ్వర్. వాటి హైకోర్టులు అహమ్మదాబాదు, కటక్‌లలో ఉన్నాయి.
ఇటువంటి చారిత్రక సత్యాలను విస్మరించి సంకుచిత దృష్టితో తీసుకోనే నిర్ణయాలు రాష్ట్ర ప్రజల మధ్య అగాధాలు సృష్టిస్తాయి. తరతరాలకు సరి పోయే తలనొప్పులను సృష్టించి పెడతాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం కేవలం ఆ ప్రాంతపు అంశం కాదు. ఇది వారి న్యాయబద్ధమైన హక్కు. రాజధాని కోసం కర్నూలును ఎంపిక చేసినప్పుడు, సహజంగానే గుంటూరుకు హైకోర్టు వచ్చింది. ఇందుకోసం ఎవరూ ప్రత్యేకంగా గళం విప్పవలసిన అవసరం రాలేదు కూడా. ఈనాడు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసుకోవడమనేది ఒక ప్రాంతీయపరమైన అంశంగానో, కోస్తా ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్న ధోరణిలోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. సహజమైన, న్యాయబద్ధమైన (ఆ్చట్ఛఛీ ౌn ఉ్ఞuజ్టీy ఊ్చజీటn్ఛటట) నిర్ణయంగానే స్వాగతించాలి. నాయకులలో ఇటువంటి దార్శనికత లోపిస్తే భవిష్యత్తంతా సమస్యలతో నిండిపోతుంది.
వ్యాసకర్త మాజీ ఐఏఎస్ అధికారి, ఐవైఆర్ కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment