ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది.
‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు.
నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్‌ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా?
నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది.
చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు.
Comments
Please login to add a commentAdd a comment