
జాతిహితం
అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింస జరగకపోయి నట్టయితే ఆ నేరానికి శిక్ష పడ్డవారికి బెయిల్ మంజూరు చేయవచ్చా? బాధితురాలి అభ్యంత రకర జీవన శైలి దృష్ట్యా నేరస్తులకు సడలింపులు ఇవ్వవచ్చా? లైంగిక, జీవన శైలిపరమైన ఎంపికల పట్ల మరింత సున్నితంగా ఉండాలని మాత్రమే సూచిస్తున్నాను. 1988 నాటి ‘అక్యూస్డ్’ చిత్రంలో దోషి తరçఫు సాక్షి... బాధితురాలు తిరుగుబోతు కాబట్టి అత్యాచారం చేస్తే తప్పేమిటి? అంటూ చేసిన వాదన చెల్లలేదు. 2017లో కూడా అది చెల్లడానికి వీల్లేదు.
వయసులో ఉన్న ఆడపిల్ల బాయ్‌ఫ్రెండ్‌తో కలసి అర్థరాత్రి పూట సినిమా చూడటానికి ఎందుకు వెళ్లినట్టు? అది కూడా టైట్ జీన్స్, టీ–షర్టు ధరించి మరీ వెళ్లింది. ఇది, వారిద్దరి మధ్యా ఉన్నది అక్రమ సంబంధమని సూచిం చడం లేదా? అసలు ఆమె తన తల్లిదండ్రులకు, కళాశాలలో చెప్పకుండా వెళ్లడమేంటి? పైగా ఆమె తండ్రి, ఓ కారునీ, దాన్ని నడపడానికి ఓ డ్రైవర్‌నీ ఏర్పాటు చేయగల ధనవంతుడూ కాదు కదా? ఆమెకు లేదా ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ట్యాక్సీకి కాకున్నా ఓ ఆటోకు బాడుగ చెల్లించడానికి సైతం డబ్బులు లేనప్పుడు ఎందుకు వెళ్లాలి? ఇంతకూ ఆమె, ఆమె బాయ్‌ఫ్రెండ్ రాత్రి పూట ఎందుకు ఒంటరిగా సంచరించాలి? అక్రమంగా తిప్పుతున్న ఓ బస్సులో ఆరుగురు జులాయి యువకులు తప్ప మరెవరూ లేరని కనిపిస్తున్నా, అందులో ఎక్కించుకు పొమ్మని ఎందుకు దేబిరించాలి? సామూహిక అత్యాచారం జరగక తప్పదని అంత స్పష్టంగా కనిపిస్తుండగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఈ పరిస్థితిలో పొంచి ఉన్న ప్రమాదాలు ఎలాంటివో ఆ ఇద్దరిలో ఒకరైనా ఎందుకు గమనించలేదు? ఇది ఎలాంటి నిర్లక్ష్యపూరిత మైన, దుస్సాహసికమైన, బాధ్యతారహితమైన ప్రవర్తన? సలహా, సహా యాల కోసం మీరు మీ తల్లిదండ్రులను ఎందుకు పిలవలేదు?
అహింసాయుత అత్యాచారం మేలు కాదా?
బస్సులో ఉన్న ఆ మగాళ్లు ఆ ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడటం, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను చావగొట్టడం తప్పే. కానీ, యవ్వన ఉద్వేగాలతో ఉన్మ త్తులై ఉన్న ఆ దుష్టులు అలాంటి దురాగతానికి పాల్పడే దుస్థితి ఏర్పడేలా మీరు వాళ్లను ఎందుకు రెచ్చగొట్టినట్టు? పోనీ వాళ్లు అలా రెచ్చి పోయిన ప్పుడు, ఆ తర్వాత ఆసారాం బాబా ప్రవచించిన సూత్రాన్ని అనుసరించి వారిని సోద రులుగా సంబోధిస్తూ, వాళ్ల చేతులకు రాఖీలు కడతానని ఎందుకు వేడు కోలేదు? అదీ పని చేయలేదనుకున్నా, ఉన్న ప్రమాదాలను గమనించి, పరి స్థితులకు అనుగుణంగా ఎందుకు నడుచుకోలేదు? అలాచేస్తే నీకా హింసా, చావూ తప్పేవి. నీకు ఎలాగూ ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. మీ మధ్య లైంగిక సంబంధాలు ఉండే ఉంటాయి (లేదా మన క్రిమినల్ లాయర్లు చెప్పేట్టు అలవాటుపడీ ఉంటారు). ఇక ఇందులో అంత పెద్ద విషయం ఏముంది, ఎందుకు అంత ప్రమాదకరంగా ప్రతిఘటించినట్టు?
ఈ దరిద్రగొట్టు కుర్రాళ్లు మూర్ఖులు. నిన్ను చంపకపోయి ఉంటే, వాళ్ల పట్ల మరింత కనికరం చూపడానికి అర్హులయ్యేవారు, శిక్ష అమలును సైతం తాత్కాలికంగా నిలిపి వేసి ఉండేవారు కావచ్చు. అప్పుడిక, అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింస ఈ కేసులో ఉండి ఉండేదే కాదుగదా! అప్పుడది కేవలం మరో అహింసాయుతమైన అత్యాచారం అయి ఉండేది. కుటుంబాల లోపల, డేట్స్‌లో (ప్రేమికులు కలు సుకునే సందర్భంగా), మత్తులో ఉండగా తదితర విధాలుగా సాగే 85 శాతం అత్యాచారాల్లాంటిదే ఇదీ అయ్యేది. కొద్ది రోజుల కౌన్సెలింగ్ (మానసిక పరమైన సలహా, సహాయాలు) తర్వాత... ఆ కుర్రాళ్లు ఇప్పుడు బుద్ధిమం తుల్లా సాధారణ జీవితాలను గడుపుతుండేవారు కూడా కావచ్చు. కోర్టులు సైతం పెద్ద మనసుతో ప్రాధాన్యాన్ని ఇచ్చి మరీ ఇలాంటి కౌన్సెలింగ్‌ను అందించి, వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశిస్తున్నాయి కూడా.
మన ముందున్నది ఒక విధమైన విషాదం కావడంలో ఆశ్చర్యమేం లేదు. ఎనిమిది మంది, వారి కుటుంబాల జీవితాలు అంధకార బంధురమై పోతున్నాయి. ఒక విలువైన యువ ప్రాణం ఇప్పటికే పోయింది, మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు, మరొకరు శారీరకమైన గాయాలు, ఉద్వేగపరమైన విషాదాల నుంచి కోలుకోవాల్సి ఉంటుంది. మరో నలుగురిని ఉరితీస్తారు. ఈ యువతీయువకులు... బాధితురాలు లేదా అత్యాచారానికి పాల్పడిన వాళ్లు తమను, తమ కుటుంబాలను కూడా అంతేలేని దుస్థితిలోకి ఎలా ఈడ్చారనేది కూడా అంతే ఆందోళనకరమైనది. దేశాన్నంతటినీ కుదిపేసిన ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం, హత్యను దృష్టిలో ఉంచుకుని నేనిలా రాస్తుండటాన్ని చూసి మీరు నాపై పిచ్చి కోపంతో ఉండి ఉండాలి. అదే జరిగితే, చిర్రెత్తించే ఈ ఎత్తుగడ ఉద్దేశం అదే. అది నెరవేరినట్టే.
ఇంకా ఇవే కొలబద్దలా?
ఇక మనం మన దృష్టిని హరియాణాలోని సోనేపట్‌లో జరిగిన ఓ ఘటనపైకి మళ్లిద్దాం. దేశ రాజధానికి ఉత్తర పొలిమేరల్లో, నిర్భయ/జ్యోతి కేసు జరిగిన రెండేళ్లకు ఇది జరిగింది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థిని, తన బాయ్‌ఫ్రెండ్ (కళాశాల సహచరుడు), అతని మిత్రులు తనను బ్లాక్‌మెయిల్ చేసి తనపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డారని, కనీసం ఒకసారైనా తను సామూహిక అత్యాచార పరిస్థితికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కుర్రాడు తనకు ఇంటర్నెట్ ద్వారా తన నగ్న చిత్రాలను పంపి, తనను బతిమిలాడి తన నగ్న చిత్రాలను పంపేలా చేశా డని, ఆ తర్వాత వాటిని క్యాంపస్‌లోను, ఆమె తల్లిదండ్రులకు బహిర్గతం చేస్తానని బెదిరించాడని ఆమె చెప్పింది. ఆమె 164 సీఆర్‌పీసీ కింద మెజిస్ట్రేట్ ముందు ప్రకటనగా నమోదు చేసి మరీ ఈ ఆరోపణలను చేసింది. నిర్భయ అనంతర కాలపు కఠినమైన కొత్త అత్యాచార చట్టం పేర్కొన్న క్రమానికి అనుగుణంగానే ఈ కేసులో బ్లాక్‌మెయిల్, అత్యాచారం, బలవంతంగా మద్యం తాగేలా, మాదకద్రవ్యాలు (బహుశా మార్జువానా పొగ కావచ్చు) సేవించేలా చేయడం ఉన్నాయి.
ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వారూ ఉన్నత వర్గాల వారే కాబట్టి అత్యుత్తమ న్యాయవాదులను పెట్టుకున్నారు. పోటా పోటీగా వాదనలు సాగాయి. ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి ఆ యువతి చేసిన ఆరోపణ లను ఆంగీకరించారు. అత్యాచారం, బ్లాక్‌మెయిల్, ఐటీ చట్టం ఉల్లంఘన తదితర నేరాలకు గానూ 20 ఏళ్ల జైలు శిక్ష సహా పలు శిక్షలను విధించారు. నేరస్తులు ఆ తీర్పుపై అప్పీలుకు పంజాబ్ హరియాణా హైకోర్టుకు వెళ్లారు. ఆ అప్పీలు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది. ఇలాంటి క్రిమినల్ కేసుల అప్పీళ్లను విచారణకు చేపట్టేప్పటికి చాలానే సమయం పడుతుంది. ఉదాహరణకు, ఆరుషి హత్య కేసులో నేరుస్తులైన ఆమె తల్లి దండ్రులు చేసుకున్న అప్పీలు 2013 నుంచి అలహాబాద్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
అయితే, గత వారం పంజాబ్ హరియాణా హైకోర్టు ధర్మాసనం ఆ అత్యాచారం/బ్లాక్‌మెయిల్ కేసులో శిక్షపడ్డవారి శిక్షలను తాత్కాలికంగా నిలి పివేసి, వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సడలింపు సమంజసమన డానికి తగిన చెప్పుకోదగ్గ లక్షణాలు ఈ కేసులో ఉన్నాయని అది పేర్కొంది. ఈ ఆదేశాల్లో తాము చేప్పేది ఏదీ కేసు బాగోగులను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది అనుకోండి. అప్పీలు క్రమానికి సమయం పడుతుంది కాబట్టి, ఈలోగా ఆ కుర్రాళ్లు కోర్టు అనుమతితో బయటకు పోయి తమ జీవితాలను పునర్నిర్మించుకోడాన్ని, వాళ్లు తమ విద్యాభ్యాసాన్ని (విదేశాల్లోనైనా సరే) కొనసాగించడాన్ని అనుమతించడం సమంజసం. ఆ కుర్రాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, దాని పురోగతిని ఎప్పటికప్పడు తమకు నివేదించమని ధర్మాసనం ఢిల్లీ ఎయిమ్స్ వైద్య విద్యా సంస్థను అభ్యర్థించింది. కుర్రాళ్లు మారడానికి సహాయం అందించాలని వారి తల్లిదండ్రులను కూడా కోరింది.
బాధితుల పట్ల కాస్త సున్నితత్వం చూపలేరా?
న్యాయమూర్తుల ఆదేశాలను ప్రశ్నించడం నా ఉద్దేశం కానే కాదు. ఫిర్యాదు దారు నేపథ్యాన్ని, ప్రవర్తనను, నేరస్తులతో ఆమె సంబంధాల చరిత్రను ఈ కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్లు పరిగణనలోకి తీసుకుని ఉంటారు. అప్పీలు పై తీర్పు కోసం మనం వేచి ఉండాలి. గౌరవనీయులైన న్యాయ మూర్తుల 12 పేజీల తీర్పులోని దిగువ పేరాలు నా వాదనకు సందర్భోచి తమైనవని భావించి ఇస్తున్నాను.
1. బాధితురాలు ముగ్గురు దోషులతోనూ కొంతకాలం పాటూ లైంగిక సంబంధం కలిగి ఉన్నా, ఏ దశలోనూ ఆమె కళాశాల అధికారులకు లేదా తల్లి దండ్రులకు లేదా మిత్రులకు తన మానసిక స్థితిని గురించి ఫిర్యాదు చేయ లేదని ఆమె ఫిర్యాదును బట్టి తెలుస్తోంది.
2. తన హాస్టల్ గదిని తనిఖీ చేసి వార్డెన్ కండోమ్స్‌ను కనుగొన్నారని, ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదని బాధితురాలు క్రాస్ ఎగ్జామినేషన్‌లో అంగీరించింది. తనకు ‘క్లాసిక్ ’ సిగరెట్లు తాగే అలవాటుందని, అయితే మాదకద్రవ్యాలను మాత్రం తనంతట తానుగా వాడలేదని తెలిపింది. తాను కాల్చినది ‘జాయింట్’ అనేదని కూడా చెప్పింది.
3. పతనావస్థలోని యువత మానసిక స్థితి మాదక ద్రవ్యాలను, మద్యాన్ని, అక్రమసంబంధాలను, విచ్చలవిడి ప్రపంచాన్ని పెంచిపోషిస్తోందని క్రాస్ ఎగ్జా మినేషన్ ప్రక్రియ స్పష్టం చేసింది.
4. ఈ యువతీయువకులు... బాధితురాలు లేదా అత్యాచారానికి పాల్ప డిన వాళ్లు తమను, తమ కుటుంబాలను కూడా అంతులేని దుస్థితిలోకి ఎలా ఈడ్చారనేది కూడా అంతే అందోళనకరమైనది.
5. బాధితురాలికి తన స్నేహితులు, పరిచయస్తులతో సంబంధాలు,లైంగిక సంబంధాలలో దుస్సాహసికత, ప్రయోగాత్మకత ఉన్నాయనే ప్రత్యా మ్నాయ కథనాన్ని కూడా ఆమె సాక్ష్యం అందిస్తున్నది. అది, శిక్ష తాత్కాలిక నిలిపివేత కోసం దోషులు పెట్టుకున్న అభ్యర్థనను అనుకూలంగా పరిగణన లోకి తీసుకోవాల్సిన తప్పనిసరి కారణాలను అందిస్తోంది. ప్రత్యేకించి నేర స్తులు యువకులు, అత్యాచారానికి ముందు లేదా దానితో పాటూ ఉండే అతి హేయమైన హింసకు పాల్పడినట్టు బాధితురాలి కథనం తెలపడం లేదు.
ఈ ఆదేశాల్లోని కొన్ని పేరాల నుంచి లభించిన ప్రేరణతో నా వ్యాసంలో మొదట ఉన్న ఇటాలిక్స్‌లోని వాక్యాలను రాశాను. నా వాదన ఏమిటో సుస్ప ష్టంగా తెలుస్తూనే ఉంది. న్యాయమూర్తుల తర్కాన్ని నేను ప్రశ్నించడం లేదని మరోసారి మనవి చేస్తున్నాను. యుక్త వయస్కుల లైంగికపరమైన, జీవన శైలి పరమైన ఎంపికల పట్ల మనం మరింత ఎక్కువ సున్నితంగా ఉండాలని, అర్థం చేసుకోవాలని మాత్రమే నేను సూచిస్తున్నాను. 1988 నాటి జోడీ ఫోస్టర్ క్లాసిక్ చిత్రం ‘అక్యూస్డ్’లో దోషి తరఫు సాక్షి ఒకామె... బాధితురాలు తిరుగు బోతు కాబట్టి ఆమెను అత్యాచారం చేస్తే తప్పేమిటి? అని ప్రశ్నిస్తుంది. ఆ సినిమాలో ఆది సమంజసంగా చెల్లలేదు. 2017లో కూడా చెల్లడానికి వీల్లేదు.
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
శేఖర్ గుప్తా