ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో చేసిన ప్రసంగంలో దత్తోపంత్ తెంగడిని గురునానక్, మహాత్మాగాంధీలతో సమస్థాయినిచ్చి ప్రస్తావించారు. తెంగడి ఎవరో కాదు. వాజ్‌పేయి ఆరేళ్ల పదవీకాలంలో ఆయన ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన బలమైన ఆరెస్సెస్ నేత. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తెంగడి నాడే ధ్వజమెత్తారు. కానీ నేడు నరేంద్రమోదీ వాజ్‌పేయి కంటే మించిన వేగంతో ప్రైవేటీకరణకు, పీఎస్‌యూల వేగంవైపుగా అడుగులేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉంది. తెంగడి వారసుడిగా స్వదేశీని బలంగా ప్రస్తావిస్తున్న భాగవత్.. మోదీతో తలపడతారా అన్నది ప్రశ్నార్థకమే.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత, సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆరెస్సెస్ విజయదశమి ఉత్సవాల్లో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగానికి సాధారణంగానే ప్రాచుర్యం ఉంటుంది. కానీ బీజేపీ రెండో దఫా కూడా భారీ మెజారిటీ సాధించి అధికారంలో ఉంటున్నప్పుడు ఆయన చేసే ప్రసంగానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆరెస్సెస్ కీలక వ్యవహారాలుగా భావిస్తున్నవాటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నప్పుడు ఆయన ప్రసంగానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్యలో రామమందిరం వీటిలో కొన్ని. దశాబ్దకాలంగా ఆరెస్సెస్ అధినేతగా ఉంటున్న మోహన్ భాగవత్ మూకదాడుల సమస్య, హిందూ ఎవరు అనే ప్రశ్నకు నిర్వచనం ఇవ్వడం, భారతీయుడు ఎవరు వంటి అంశాలను తడిమినందున ఈ సంవత్సరం విజయ దశమి ప్రసంగంతో మరింతగా వార్తల్లోకి ఎక్కారు. వీటిపై ఆయన వాదనలు వివాదాస్పదమైనవి, అందుకే అవి మరీ ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ఒక ముఖ్య అంశంపై ఆయన సుదీర్ఘంగా నొక్కి చెప్పిన అంశం మరుగున పడిపోయింది.
ఆయన చేసిన ఆ 63 నిమిషాల ప్రసంగంలోని కొన్ని భాగాలను మీరు విన్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన ప్రసంగ వీడియోలోని తొలి నిమిషం, తర్వాత 28 నుంచి 42 నిమిషాల వరకు గల ప్రసంగ పాఠంలో తనదైన ఆర్థిక తత్వశాస్త్రాన్ని మీరు చూడవచ్చు. వీడియో ప్రారంభ క్షణాల్లోనే కీలకమైన అంశం ఉంది. ఇద్దరు ప్రముఖ, సుప్రసిద్ధ భారతీయుల వార్షికోత్సవాలను పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అవి గురునానక్ 550 జయంతి, మహాత్మాగాంధీ 150వ జయంతి. ఆరెస్సెస్–బీజేపీ వ్యవస్థకు అవతల ఉన్నవారికి లేదా భారత రాజకీయాలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ అనుసరిస్తూ ఉన్నవారికి భాగవత్ పేర్కొన్న మూడో ప్రముఖ వ్యక్తి అయిన దత్తోపంత్ తెంగడి గురించి తెలుసంటే నేను నమ్మలేను. దత్తోపంత్ శత జయంతి త్వరలో అంటే నవంబర్ 10న ప్రారంభమవుతుందని భాగవత్ పేర్కొన్నారు. ఈ పేరు పెద్దగా పరిచితమైన పేరు కాదు. పైగా గురు నానక్, గాంధీల తరహా లీగ్‌లో ఆయన లేరు. కానీ ఈ ఇద్దరి పక్కన ఆయన్ను ప్రస్తావించాల్సినంత ప్రాముఖ్యత మాత్రం ఆయనకుంది. ఆ వీడియోలో ఆ 14 నిమిషాల్లోని రెండో భాగాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఆయన ప్రస్తావన అప్రాధాన్యమైనది కాదని, మాటవరుసకు చెప్పింది కాదని అర్థమవుతుంది. నాగ్‌పూర్‌కు ఏమంత దూరంలో లేని వార్ధాలో 1920లో జన్మించిన తెంగడి ఆధునిక (స్వాతంత్య్రానంతర) ఆరెస్సెస్ వ్యవస్థాపక నిర్మాతల్లో ఒకరు. ఆరెస్సెస్ రెండు రాజకీయ అవతారాలైన భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ రెండింటి భావజాలానికి కూడా ఆయనను ప్రతినిధిగా చెప్పవచ్చు. అర్థశాస్త్రం ఆయనకు ఇష్టమైన అంశం. ప్రత్యేకించి భారత్ తన ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచి వేసిన గత 30 ఏళ్లలో మరే ఇతర దృక్పథాల కంటే ఆయన ఆలోచనాధారే ఆరెస్సెస్ ఆర్థిక ప్రపంచ దృక్పథాన్ని నిర్వచించింది. తెంగడి, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ప్రయాణించారు. ఇద్దరూ కలిసి 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్‌ని భోపాల్‌లో నెలకొల్పారు. కానీ, వాజ్‌పేయి ఆరేళ్ల పాలనలో వీరిరువురు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, దిగుమతి సుంకాల తగ్గింపు, ఎఫ్‌డీఐలకు తలుపులు తెరవడం వంటి అంశాల్లో వాజ్‌పేయి తీసుకున్న ప్రతినిర్ణయాన్నీ తెంగడి వ్యతిరేకించారు.
ఒక దశలో ఆయన యశ్వంత్ సిన్హాను మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ ఇదే సిన్హా తర్వాత ఆర్థిక మంత్రిగా సంస్కరణలను ముందుకు తీసుకుపోయారు. తెంగడి డిమాండును వాజ్‌పేయి సంవత్సరం పాటు ప్రతిఘటించారు కానీ తర్వాత వెనక్కు తగ్గారు. ఆరెస్సెస్‌లో తెంగడికి చాలా బలం ఉండేది. ఆయ నకు అరుణ్ శౌరీ అంటే కూడా గిట్టేది కాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో పాత సోషలిస్టు ఆలోచనలను ఎత్తిపట్టినప్పుడు తెంగడి నిజంగానే పండగ చేసుకున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా అమ్మదలిచినప్పుడు పార్లమెంటరీ ఆమోదం పొందాలని సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది. వాజ్‌పేయి ప్రభుత్వం రెండు అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను పక్కన పెట్టినప్పుడే ఇది జరిగిందని మనం గుర్తించాలి. తెంగడిది ఒంటరి వాణి కాదు. ఆయన తొలి బిడ్డ అయిన భారతీయ మజ్జూర్ సంఘ్ వాజ్‌పేయి సంస్కరణల శకాన్ని వామపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్‌టీయూసీ కంటే గట్టిగా నిరసించింది. ఈలోగా ఆయన మరోరెండు శక్తివంతమైన ప్రెషర్ గ్రూప్‌లను ఏర్పర్చారు. ఒకటి, 1979లో రైతుల కోసం స్థాపించిన భారతీయ కిసాన్ సంగ్. మరొకటి 1991లో స్థాపించిన స్వదేశీ జాగరణ్ మంచ్. ఈ సంస్థ ఇవాళ మనకు బాగా పరిచయమే. 1991 అంటేనే నాటిప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు ప్రారంభించిన సంవత్సరం అని గుర్తుండే ఉంటుంది. వెనువెంటనే స్వదేశీ జాగరణ్ మంచ్ డంకెల్ డ్రాఫ్ట్‌తో మొదలైన వాణిజ్య ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ స్వరాన్ని నిర్మించడం మొదలెట్టింది. వాజ్‌పేయి హయాం ముగిసేనాటికి ఇరువురి సంబంధాలు స్పష్టంగా దిగజారిపోయాయి. ఏదైనా కొత్త భావనను ప్రస్తావించదల్చినప్పుడల్లా, వాజ్‌పేయి ఇప్పుడు తెంగడిని ఆపేదెవరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. అంత తీవ్రమైన పోరు కొనసాగినప్పటికీ వాజ్‌పేయి బీటీ పత్తి విత్తనాలకు అనుమతి మంజూరు చేశేసారు. 2004లో ఇరువురి మధ్య పోరాటం ముగిసింది. ఆ ఏడు మే నెలలో వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. అక్టోబర్ 14న తెంగడి కన్ను మూశారు. బహుశా వామపక్షాల నియంత్రణలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రయివేటీకరణను తుంగలో తొక్కుతుందని, తాను కోరుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందన్న విశ్వా సంతోటే తెంగడి నిష్క్రమించి ఉంటారు.
ఆర్థిక వ్యవస్థపై భాగవత్ 14 నిమిషాల వార్షిక ప్రసంగం గురించి ఇప్పుడు కాస్త మెరుగుగానే అర్థం చేసుకోగలం కూడా. భాగవత్ ప్రసంగం సారాంశం ఇంది. ఆర్థిక సంక్షోభం ఉంది కానీ దానికి మరీ ఎక్కువ విలువ ఇవ్వవద్దు. వృద్ధికి జీడీపీనే కొలబద్ద కాదు. అవినీతిపై కొరడా ఝళిపించండి కానీ అమాయకులను బలి చేయవద్దు. మనం స్వదేశీని నమ్ముతాం. అలాగని మనం ప్రపంచం నుంచి వేరుగా ఉండలేం. వాణిజ్యం గ్లోబల్ కావచ్చు కానీ మనం తయారు చేయలేని, మనకు అవసరమైన సరుకులను మాత్రమే కొనాలి. భారతీయ గోజాతి నుంచి వృద్ధి చేసిన బ్రెజిల్ హైబ్రిడ్ గోవు వీర్యాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? స్వదేశీ వీర్యాన్నే ఉపయోగించండి. ఇదీ భగవతి ప్రసంగ సారం. తర్వాత ఆయన ఎగుమతులు మంచివని, దిగుమతులు చెడ్డవని కూడా మాట్లాడారు. భాగవత్ మాట్లాడిన మాటల సారాంశం మొత్తంగా ప్రామాణికమైన తెంగడినమిక్స్ (తెంగడి ప్రతిపాదించిన ఆర్థిక శాస్త్రం)లో భాగమే. 2008 తర్వాత తీవ్రస్థాయిలో కొనసాగుతున్న భారతీయ ఆర్థిక పతనంతో మోదీ ప్రభుత్వం సాగిస్తున్న సమరాలు, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, చేసిన వాగ్దానాలతో భాగవత్ ప్రసంగం విభేదిం చింది. మోదీ ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానించింది. ప్రత్యేకించి అమెరికాతో పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. వాణిజ్య ఒప్పందాలు, పీఎస్‌యూల అమ్మకాలను స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. కానీ, ప్రతి రంగంలోనూ మోదీ ప్రభుత్వం భాగవత్ ప్రసంగానికి వ్యతిరేక దశలోనే చర్యలు తీసుకుంది. వాజ్‌పేయికి నవ్వు తెప్పించి ఉండేది, తెంగడికి కోపం తెప్పించి ఉండేది ఇదే కదా. వాజ్‌పేయి 2003లో చేయలేకపోయిన దాన్ని మోదీ ఇప్పుడు సులభంగా చేస్తూ అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్‌ను అమ్మకానికి పెట్టేశారు. స్వదేశీ ఆర్థికశాస్త్రాన్ని అంత వివరంగా ముందుకు తీసుకురావడం ద్వారా భాగవత్ కేంద్రప్రభుత్వంతో తలపడటానికి ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పలేం. వాజ్‌పేయి, మోదీ మధ్య అధికారానికి సంబంధించిన వ్యత్యాసాల రీత్యా ఇది సాధ్యపడదేమో కానీ అసాధ్యం కాకపోవచ్చు కూడా. మన ఆశ ఏమిటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉందన్నదే.
శేఖర్‌గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
సంక్షోభాల పరిష్కర్త ఎక్కడ?
Published Sat, Oct 12 2019 3:01 AM | Last Updated on Sat, Oct 12 2019 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment