ద్వంద్వ ప్రమాణాలకు హద్దే లేదా? | Sridhar Reddy Ravula article on double route policies | Sakshi
Sakshi News home page

ద్వంద్వ ప్రమాణాలకు హద్దే లేదా?

Published Fri, Dec 29 2017 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Sridhar Reddy Ravula article on double route policies - Sakshi

దేశ హితానికి ఆటంకంగా నిలుస్తున్న 2జి స్పెక్ట్రమ్, దాణా కుంభకోణం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు ఇంత ద్వంద్వ ప్రమాణాలతో వ్యవçహరించడం ఆశ్చర్యకరం. ఈ వైఖరి దేశ ప్రయోజనాలకు భంగకరం.

గుజరాత్‌ ఎన్నికల సమయం నుంచి దేశంలో భారతీయ జనతా పార్టీపైనా, నరేంద్ర మోదీ పైన జరుగుతున్న విష ప్రచారం, తీవ్ర విమర్శలు, అదే సమయంలో దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఒక వర్గం మీడియా, స్వయం ప్రకటిత మేధావులు, విమర్శకులు వ్యక్త్తం చేస్తున్న అభిప్రాయాల పరంపర, విశ్లేషణా చతురత చూస్తుంటే విస్మయం కలుగుతోంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో వాగ్బాణాలు మొదలుకొని, లాలూ ప్రసాద్‌పై నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు వరకు, కాదేదీ బురద జల్లడానికి అనర్హం అన్న విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల, సంస్థల వ్యవహారశైలి.. సమకాలీన రాజకీయాల్లో ఇష్టంలేని వారి పట్ల వ్యవహరించే వికృత, విశృంఖల విన్యాసాలను కళ్ళకు కడుతుంది.

2జి స్పెక్ట్రమ్‌ కేసులో పాటియాలా హౌస్‌ కోర్టు తీర్పు కచ్చితంగా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ పని తీరును తప్పు పట్టే విధంగానే ఉన్నది. దేశ ఖజానాకు ఇంచుమించు లక్షన్నర కోట్లకు పైగా నష్టం కలిగించిన వ్యవహారాన్ని పకడ్బందీగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించగలిగేలా నేరాన్ని రుజువు చేయలేకపోవడం నిజంగానే భారత ప్రజల్ని నిరాశపరిచింది. కోర్టు తీర్పు రాగానే  రాజా, కనిమొళి కంటే ఎక్కువగా సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు, కుంభకోణాల విషయంలో ఎంత ఆత్మన్యూనతా భావనలో ఉన్నారో చెప్పకనే చెపుతుంది. ఇది ట్రయిల్‌ కోర్టు తీర్పు మాత్రమే, ఇంకా న్యాయ వ్యవస్థలో మరిన్ని మెట్లు ఉన్నాయనే విషయాన్ని సావకాశంగా మర్చిపోవడం వారి అల్ప సంతోషానికి నిదర్శనం.

కుంభకోణమే లేకపోతే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు 122 లైసెన్సులు రద్దు చేసిందెందుకు అనే విషయంపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత  సదరు వనరులను వేలం వేస్తే దేశ ఖజానాకు లక్షన్నర కోట్లకు పైగా నిధులు సమకూరిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. మోదీపై విష ప్రచార బాధ్యతలు మోసే వారికి ఆయనపై ప్రేమ ఉండే అవకాశం లేదు కానీ, కనీసం దేశం పైనైనా ప్రేమ ఉండకపోవడం విచారకరం. ఎందుకంటే స్పష్టంగా అనేక లోటుపాట్లు, ఆర్థిక అవకతవకలు ఉన్నా.. సాక్ష్యాధారాలతో నిరూపించలేక పోయారు అనే ఒకే ఒక కారణం చేత అసలు కుంభకోణమే లేదన్నట్లు ప్రచారం చేయడం దేశానికి నష్టం కలిగించే విషయమే. కుంభకోణం జరిగిందీ, బీజేపీ ఇతర పక్షాలు దాన్ని వెలుగులోకి తెస్తే కేసు పెట్టిందీ, చార్జ్‌ షీట్‌ వేసింది కాంగ్రెస్‌ హయాంలో. కేసును నీరు గార్చాలని ప్రయత్నం జరిగింది కాంగ్రెస్‌ ద్వారా, కానీ తీర్పు వెలువడిన తర్వాత నిందించేది మోదీ ప్రభుత్వాన్ని,.. ఇదెక్కడి తర్కమో అర్థం కాదు.

సీబీఐని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అపవాదులు వేస్తున్న కొందరు నాయకులు లాలూపై కోర్టు తీర్పు వెలువడగానే స్వరం మార్చి కొత్త రాగాలాపన మొదలు పెట్టారు. డీఎంకే నాయకులపై కేసు తీర్పు విషయంలో ఒకవైపు సంబరాలు చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించిన పెద్దలకు, లాలూ ప్రసాద్‌ కేసు తీర్పు మాత్రం మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిగా కనపడుతుంది. డీఎంకేకి ఒక న్యాయం, లాలూకు ఒకన్యాయమా అంటున్నారు. అసలు లాలూ పరిపాలనంతా కుంభకోణాల నిలయం అని తెలిసి, కోర్టులు తప్పు పట్టిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాలకోసం ఆయన అవినీతిని మోస్తున్నది కాంగ్రెస్‌. అసలు దేశంలోని న్యాయ వ్యవస్థనంతా మోదీనే నడిపిస్తున్నట్లు, ప్రతి తీర్పూ మోదీ కనుసన్నల్లోనే వస్తున్నట్లు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలనే వాళ్ళను ఏమనాలి?

ఇక గుజరాత్‌ ఎన్నికల ఫలితాల విషయానికొస్తే మోదీ ప్రభ తగ్గిందని చౌకబారు ప్రచారం చేసే వారికి కొదువలేదు. ఓట్ల శాతం పెరిగింది కదా, బీజేపీకి కాంగ్రెస్‌కు తేడా పెద్దగా ఏం తగ్గలేదు కదా అంటే జవాబుండదు. లేని కుంభకోణాల గురించి ఎంత అరచి గీపెట్టినా గుజరాత్‌ ప్రజలు పట్టించుకోలేదు. హిమాచల్‌ప్రదేశ్‌ ఫలితాల గురించి మాట్లాడాల్సొస్తే, అక్కడ కాంగ్రెస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, ఐదేళ్ల తర్వాత అది సహజమంటారు. మరి బీజేపీ ఇరవై రెండేళ్ల పాలన తర్వాత ఆ మాత్రం సీట్లు తగ్గడం కూడా సహజమే అన్న లాజిక్‌ మాత్రం అసహజంగా మర్చిపోతారు. గజినీ వారసులు కదా.

గుజరాత్‌లో కులాల కుంపట్లు రాజేసింది కాంగ్రెస్‌. మోదీ  గుడికి వెళ్తే మతోన్మాదం అన్న కుహనా సెక్యులర్‌ వాదులందరికి రాహుల్‌ గుజరాత్‌లో ఎన్ని గుళ్ళు తిరిగారో, ఎన్ని పూజలు చేసారో, తెలిసే ఉంటుందనుకుంటాను. ఇరవై రెండేళ్ల పాలన తర్వాత కూడా గుజరాత్‌ ప్రజలకు మోదీ పట్ల చెక్కు చెదరని విశ్వాసాన్ని చూసైనా ఆత్మశోధన చేసుకోవాల్సిన కాంగ్రెస్‌ పార్టీ , సదరు వర్గాలు ఆ ప్రయత్నం చేయక పోగా విష ప్రచార పరంపరకు మరింత పదును పెడుతున్నారనేది పై విషయాలను పరిశీలిస్తే అవగతమవుతుంది . ఇప్పటికైనా ఈ నిత్య విమర్శనాకారులు సంకుచిత ప్రచారాలను మానుకొని జాతి హితం కోసం నిర్మాణాత్మక పద్ధతుల్లో వ్యవహరిస్తే అందరికీ మంచిది.

శ్రీధర్‌ రెడ్డి రావుల
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి–తెలంగాణ,
ఈ–మెయిల్‌ : mail2rsrr@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement