
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
మూడో ఫ్రంట్ తన నాయకత్వంలోనే ఏర్పడుతుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 17 మంది లోక్‌సభ సభ్యులను మాత్రమే కలిగి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా? అంతకుమించి మమత గడచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక శిబిరంలో కొత్తగా ప్రవేశిస్తున్నవారు. ఇవన్నీ ఎలా ఉన్నా, ఒక అపనమ్మకం ఇక్కడ ప్రధానాంశమవుతోంది.
బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నం గురించి గడచిన ఆదివారం ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ మిత్రురాలి దగ్గర ప్రస్తావించాను. అందుకు ఆమె స్పందన ఏమిటంటే, అందులో పెద్ద విశేషం ఏముంది అనే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అధికార నిలయం ఢిల్లీ. అక్కడ ఉంటూ ఆ పార్టీ విజయ పరంపరను, వైభవాన్ని సమీపంగా చూస్తున్నవారికి 1,500 కిలోమీటర్లకు అవతల ఎక్కడో జరుగుతున్న ఒక ప్రయత్నం పెద్ద ప్రాధాన్యం కలిగినదిగా కనిపించదని నాకు అర్థమైంది. అంతకు మించి ఆ ముందురోజే, అంటే గడచిన శనివారమే ఈశాన్య భారతంలో బీజేపీ విజయఢంకా మోగిం చిన సంఘటన జరిగింది. ఆ వారాంతానికల్లా దేశంలో బీజేపీ అధికారంలో లేదా, సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల సంఖ్య 19 నుంచి 22కు చేరుకుంది.
కానీ ఇదే పరిణామాన్ని దక్షిణ భారతదేశం కోణం నుంచి చూడండి. ఇక్కడ బీజేపీ కర్ణాటకలో తగినంత బలం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉప పాత్రను పోషిస్తోంది. కానీ ఢిల్లీ ఈ సువిశాల దేశాన్ని అన్ని విధాలుగా విజేతగా నిలిచిన ఒక పాలకుడి దృక్కోణం నుంచి చూస్తుంది. కానీ దక్షిణ భారతంలోనే కాకుండా, మిగిలిన భారతదేశంలోని చాలా రాష్ట్రాలు కూడా అసమ సంబంధాల సమీకరణలతోనే ఢిల్లీని చూస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి క్రోధ భావనలోనే ఉన్నారు. ఎక్కువ అధికారాలు కేంద్రం గుప్పిటలోనే ఉన్నాయని ఆయన ఆరోపణ. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇచ్చిన స్వేచ్ఛ పరిమితమంటారాయన.
మండిపడుతున్న రాష్ట్రాలు
కేటాయించవలసిన నిధుల కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని తొందరపెడుతున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం మేరకు ఇస్తామన్న నిధులు ఇవ్వమంటూ ఆ రాష్ట్రం ఢిల్లీ ముందు దేహీ అనవలసి రావడం గురించి ఆగ్రహంతో కూడా ఉంది. కావేరీ జలాల పంపిణీ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనందుకు తమిళనాడు కేంద్రం మీద మండిపడుతున్నది. తమ తమ రాష్ట్రాల జనాభాను బట్టి రిజర్వేషన్ కోటాను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టాలని తెలంగాణ కోరుతున్నది.
కలకత్తా మెట్రోరైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు నిధులు సహా, పశ్చిమ బెంగాల్‌కు ఇవ్వవలసిన చాలా నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆ రాష్ట్ర నాయకత్వం ఆరోపణ. కేసీఆర్ యోచిస్తున్న సరికొత్త సహకార సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి పరిమిత అధికారాలు ఉండాలి. రాష్ట్రాలకు అత్యధికంగా అధికారాలు ఇవ్వాలి. అంటే కేసీఆర్ ఊహిస్తున్న నమూనాలో భారత్ అంటే, భారత సంయుక్త రాష్ట్రాలు అవుతుంది. కేసీఆర్ వ్యూహంలో ఆసక్తి కలిగించే విషయం ఒకటి ఉంది. 2014కు ముందు నరేంద్ర మోదీ వ్యక్త పరిచిన అభిప్రాయాల జాడలే అందులో కనిపిస్తాయి.
అప్పుడు మోదీ కేంద్రాన్ని విమర్శించినట్టే ఇప్పుడు కేసీఆర్ కూడా కేంద్రం మీద ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం రాష్ట్రాల మీద స్వారీ చేస్తున్నదని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విమర్శించారు. కేసీఆర్ కూడా కేంద్రం రాష్ట్రాలను తోలుబొమ్మల మాదిరిగా ఆడించాలని చూస్తున్నదని ఆరోపించారు. నాడు యూపీఏ ప్రభుత్వం చట్టాలు చేయడం మినహా, వాటి అమలులో క్రియ శూన్యమని గుజరాత్ నుంచి మోదీ ఘోషించారు.
విదేశ వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రత, జాతీయ రహదారులు మినహాయించి మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలను కేంద్రం వదులుకోవాలని కేసీఆర్ చెబుతున్నారు. దేశంలోని ఆరులక్షల గ్రామాలలో రోడ్ల నిర్మాణం గురించి ఢిల్లీలో ఉండే ప్రధానికి సంబంధం ఏమిటని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలోని హేతుబద్ధత ఏమిటని కూడా అడుగుతున్నారు.
ఇలాంటి పాలనా పరమైన సంస్కరణల గురించి తేనెతుట్టను కదపడానికి కేసీఆర్ వెనుక అజ్ఞాతంగా ఉన్న కారణాలు ఏమిటి? ఇదే ఇప్పుడు ఆయనను మిగిలిన అసంతృప్త ముఖ్యమంత్రుల దృష్టిలో పడేటట్టు చేసి, కేంద్రం పట్ల ఒక ప్రెషర్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి కారణమవుతున్నది. అయితే ఇలాంటి కూడిక వెనుక అంచనాలకు అందని కొన్ని లెక్కలు ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ రెండువందల స్థానాలకు మించి సాధించలేకపోతే, కాంగ్రెస్ కూడా మూడంకెలలో స్థానాలను గెలుచుకోలేకుంటే మూడో ఫ్రంట్‌కే అనివార్యంగా అధికార యోగం పడుతుందన్నదే ఆ లెక్క. నిజం చెప్పాలంటే ఇది 1996–98 నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం వంటిదే.
ప్రాంతీయ పార్టీల నేతలు తక్కువ తిన్నారా?
కానీ అసమతౌల్యం అనే ఒక్క నినాదంతోనే కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఒక తాటి మీదకు తీసుకురాగలరా? ప్రాంతీయ పార్టీల అధినేతలు ఏకమై కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది, మరింత ప్రాతినిధ్యం కలిగిన ప్రభుత్వం ఏర్పడడమనేది వారు తమ తమ స్వాతిశయాలను వీడినప్పుడే సాధ్యపడుతుంది. ఒకే వ్యక్తికి ప్రయోజనం చేకూరడమనే ఫలశ్రుతి లేనపుడే అది వీలవుతుంది.
వాస్తవం ఏమిటంటే చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు బంధుప్రీతితో పాటు తమ తమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చాలా పరిమితంగా అనుమతించేవారే. అలాగే అలాంటి కలయిక చాలా అస్థిరత్వంతో కూడి ఉంటుందని గత అనుభవాలు వెల్లడిస్తున్నాయి. దీనితో కార్పొరేట్ ఇండియాకు బొత్తిగా పొసగని సంగతి కూడా గత అనుభవమే. బాగా గుర్తుంచుకోవలసిన ఇంకొక అంశం ఏదంటే, ఈ మూడో ఫ్రంట్ ప్రభుత్వ ఆలోచన వాస్తవరూపం దాల్చాలన్నా కూడా అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీ మద్దతు అనివార్యం.
ఈ వాస్తవాల మాటేమిటి?
అప్పుడు మళ్లీ నాయకత్వ సమస్య తలెత్తుతుంది. రాబోయే మూడో ఫ్రంట్ తన నాయకత్వంలోనే ఏర్పడుతుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 17 మంది లోక్‌సభ సభ్యులను మాత్రమే కలిగి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతారా? అంతకుమించి మమత గడచిన నాలుగేళ్లుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక శిబిరంలో కొత్తగా ప్రవేశిస్తున్నవారు. ఇవన్నీ ఎలా ఉన్నా, ఒక అపనమ్మకం ఇక్కడ ప్రధానాంశమవుతోంది. తాను బీజేపీ తయారుచేసి ఇచ్చిన స్క్రిప్ట్‌కు అనుగుణంగా నడవడం లేదన్న సంగతిని కేసీఆర్ నమ్మేటట్టు చేయగలగాలి. కాంగ్రెస్, మూడో ఫ్రంట్‌గా విపక్షం చీలిపోవడం కంటే మోదీ, అమిత్‌షాలను సంతోషపరిచే అంశం మరొకటి ఏదీ ఉండదు. కానీ వచ్చే సంవత్సరం వేసవిలో తగినన్ని స్థానాలు దక్కకపోతే, కేసీఆర్ వంటి స్వతంత్ర పార్టీ సేనానితో ఒప్పందం చేసుకోవడమే మోదీకి సులభమవుతుందని కాంగ్రెస్ నమ్మకం. మరొక వాస్తవం కూడా ఉంది.
తెలంగాణలోని వాస్తవిక పరిస్థితులే కేసీఆర్ వేయబోయే అడుగును ప్రధానంగా శాసిస్తాయి. ఎన్నికలు జరగడానికి ఇంకొక సంవత్సరం సమ యం ఉండగా తాను మరొక స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్టు అంతా అనుకునేటట్టు కేసీఆర్ చేశారు. తెలంగాణలో ఉన్న రైతు సమస్య, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకుండా, ఆయన మొన్న శనివారం నుంచి జాతీయ స్థాయికి చేరడం గురించి చెబుతున్నారు. 2014లో ఉపయోగించిన తెలంగాణ సెంటిమెంట్ ఈ ప్రయాణంలో ఉపకరిస్తుందని ఆయన భావన.
మోదీ ఇప్పుడు ఎందుకు చేదయ్యారు?
ఇతర ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలు తెలుసుకోగోరే మరొక అంశం కూడా ఉంది. మోదీ గురించి అంత కటువుగా కేసీఆర్ మాట్లాడడానికి, తీవ్ర వ్యతిరేకిగా మారిపోవడానికి వెనుక ఉన్న ప్రబలమైన కారణం ఏమిటి? ఇది వారు తెలుసుకోవాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. 2016 నవం బర్ నుంచి కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన తొలి ఎన్డీయేతర ముఖ్యమంత్రి ఆయనే.
వస్తుసేవల చట్టాన్ని కూడా కేసీఆర్ సమర్థించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఆఖరికి అప్పుడు ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌ను కేసీఆర్ కలుసుకోలేదు కూడా. ఇప్పుడు మాత్రం కేసీఆర్ కేంద్రం పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న తన ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించలేదు. హైకోర్టు విభజన జరగలేదు.
కొత్త సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని బదలీ చేయలేదు. ప్రాజెక్టులకు నిధులు రావడం లేదు. అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలన్న ప్రతిపాదనకు అనుమతి రాలేదు. పైగా నియోజకవర్గాలు పెరుగుతాయన్న ఆశతో ఇతర పార్టీల నుంచి సభ్యులను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారికి స్థానాలు కేటాయించడం ఒక సమస్య. ఇవన్నీ ఆయన కేంద్రం పట్ల ఆగ్రహంగా ఉండడానికి వెనుక కారణాలు.
వేచి చూడవలసిందే
కేంద్రం ఢిల్లీ, ముంబై పరిధిని మించి ఆలోచించడం లేదని ఇటీవల కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.టి. రామారావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల విషయంలో దక్షిణ భారతానికి మొండి చేయి చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే సేద్యపు రంగంలో సంక్షోభానికి మోదీయే కారకుడని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కానీ అది తెలం గాణ సహా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్య.
కాబట్టి రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే మూడో స్థానం పొందిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇలాంటి విమర్శ చేయడం గురించి ఆయన ప్రత్యర్థులు ఎదురుదాడులకు దిగుతారు. ఢిల్లీ వైపు చూపు అనే అంశం విషయంలో ఆయన అనుభవాన్ని కూడా నెమరు వేసుకోవాలి. ఆయన కంటే ముందు ఇద్దరు– ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబునాయుడు ఆ ప్రయత్నంలో నవ్వుల పాలయ్యారు. నేషనల్ ఫ్రంట్ రాజకీయాలలో ఎన్‌టిఆర్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డీఏలతో చంద్రబాబు నడిచారు. ఇవన్నీ ఎలా ఉన్నా, కేసీఆర్ ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడడం మంచిది. 2001లో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు ఎద్దేవా చేసినవారు ఉన్నారు. కొన్ని ఎగుడు దిగుళ్లు ఉన్నా ఆయన విజయం సాధించారు. కాబట్టి పూర్తిగా నిరాశావాదంలోకి పోకుండా ఆయన ప్రయత్నం ఎంతవరకు సాగుతుందో పరిశీలించాలి.
టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు