
విద్యార్థులు రాణించాలంటే స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించగలిగే వాతావరణం పాఠశాలల్లో రావాలి. సందేహాలను ధైర్యంగా చెప్పి నివృత్తి చేసుకోగల చొరవను విద్యార్థులలో కల్పించే బాధ్యత టీచర్లదే! కానీ కార్పొరేట్ విద్యావిధానంలో టీచర్లు మరబొమ్మల్లా, రోబోలుగా మారిపోయారు. ఎక్కువ మార్కులు సాధించగలిగేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దడమే కర్తవ్యంగా భావిస్తున్నారు. అది వారి తప్పు కాదు. మన విద్యావిధానంలోని లోపంతో టీచర్లపై పనిభారం, ఒత్తిడి పెరిగాయి. దానినే విద్యార్థుల మీదకు బదలాయిస్తున్నారు.
దేశానికీ, కుటుంబానికీ ఆశాజ్యోతులుగా నిలవాల్సిన భావి భారతపౌరులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడడం తెలుగు రాష్ట్రాలలో అంతకంతకూ పెరిగిపోతున్నది. విద్యావనంలో నేల రాలుతున్న పసిమొగ్గల సంఖ్య ఏయేటి కాయేడు పెరుగుతూ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్ని నిరూపిస్తున్నది. ఈ అక్టోబర్ ఒక్క మాసంలోనే పదుల సంఖ్యలో కార్పొరేట్ కళాశాలల విద్యాకుసుమాలు నేల రాలిపోయాయి. ఈ పరిణామం పౌర సమాజాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నది. ఈ అవాంఛనీయ ధోరణి గురించి పత్రికలు సంపాదకీయాలు రాశాయి. చానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. విద్యావేత్తలతో, మానసిక నిపుణులతో గంటల కొద్దీ చర్చా గోష్టులు జరిపాయి. అయితే ఏం జరిగింది? ఏం ఒరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఆత్మహత్యల పరంపరను నిరోధించడానికీ, విద్యార్థులలో మనో నిబ్బరం నింపడానికీ తీసుకొన్న చర్యలేమిటి? అని ప్రశ్నించుకుంటే నిర్దిష్టమైన జవాబులు దొరకవు. ఒక విధంగా ప్రభుత్వాల స్పందన నామమాత్రమని, ఇంకా చెప్పాలంటే పూజ్యమనే చెప్పాలి.
విద్యార్థుల ఆత్మహత్యలు కొత్త విషాదమేమీ కాదు. జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో గంటకో విద్యార్థి వంతున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నమోదు కాని దుర్ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకొంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్‌లను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎం.పి.సి., బై.పి.సి. అభ్యసించే విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఇది ప్రభుత్వాలకు తెలుసు. ఈ రెండు కోర్సులను, ఎంట్రెన్స్‌లకు అనుగుణంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలే బోధిస్తాయని గట్టి నమ్మకం. ఈ కళాశాలలకు చెందిన విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి మరొక వాస్తవం. దీనిని కూడా ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించాయి. కానీ ఈ పరిస్థితిని మార్చడానికి గతంలో నియమించిన నీరదారెడ్డి కమిటీ, చక్రపాణి కమిటీ అందించిన నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ కమిటీలు కార్పొరేట్ విద్యాసంస్థలలోని స్థితిగతుల మీద విచారణ జరిపాయి. ఆత్మహత్యల వెనుక కారణాలను వివరిస్తూ, కార్పొరేట్ కళాశాలలు విరామం లేకుండా నిర్వహించే తరగతులూ, పరీక్షలూ విద్యార్థులపై ఎంత తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయో వెల్లడించాయి. వాటి అమానవీయ చర్యలకు ముగుతాడు వేయడానికి ఇంకొన్ని కమిటీలు కూడా విలువైన సూచనలు చేసిన మాట నిజం. ఇవి ఇచ్చిన సిఫార్సులు కొన్ని పరిమితులకు లోబడినవే! అయినా వీటిని పూర్తిగా అమలు చేస్తే కొన్ని ప్రయోజనాలైనా ఉంటాయి. ఆత్మహత్యలు తగ్గుతాయి. కాని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయకుండా కార్పొరేట్ కాలేజీ లను నియంత్రించే చర్యలు చేపట్టడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒనగూడుతాయా? అన్నదే ప్రశ్న.
ప్రపంచంలో ఏం జరుగుతోంది?
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భారతదేశ ర్యాంకింగ్ మెరుగుపడిం దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరపడిపోతున్నాయి. కానీ కీలకమైన విద్య, వైద్య రంగాలలో మన స్ధానం ఎక్కడ? అభివృద్ధి చెందిన దేశాలలో విద్యావ్యవస్థ ఎలా ఉంది? అందులోని మంచిని మనం స్వీకరించగలమా? అన్న ఆలోచనలు మన పాలకులు చేయరు. పెట్టుబడులను ఆకర్షించే పని పేరుతో ప్రత్యేక విమానాలలో మందీమార్బలంతో దేశదేశాలకు పాలకులు వెళుతున్నారు. కానీ సింగపూర్, ఫిన్‌లాండ్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలలో అమలు జరుగుతున్న అద్భుత విద్యావ్యవస్థను, ఉన్నత విద్యా ప్రమాణాలను అధ్యయనం చేయడానికి ఎందుకు వెళ్ళరు? కనీసం నిపుణుల బృందాలను ఎందుకు పంపించరు? ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పడానికి విద్యపై పెడుతున్న ఖర్చులో మన దేశానిది 63వ స్థానం. యువతకు సామర్థ్యం ఉంది కనుకనే అంతర్జాతీయ ప్రతిభా పాటవాలు కలిగిన 118 దేశాల జాబితాలో భారత్ 92 వ స్థానంలో అయినా నిలిచింది. అంతర్జాతీయ ప్రతిభా పాటవాలు గలిగిన టీచర్లను దీర్ఘకాలం పాటు ఇక్కడ పనిచేయించుకోలేకపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సింగపూర్, జపాన్ వంటి దేశాలలో భారతీయ విద్యావేత్తలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారన్నది కఠోర వాస్తవం!
ప్రాథమిక స్ధాయిలోనే పునాది
విద్యావ్యవస్ధలో సమూల మార్పు పునాది స్థాయి నుంచే పడాలి. ‘విద్యలో సమానత్వం’ అనే విధానంతో ఫిన్‌లాండ్ చేపట్టిన సమూల మార్పులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డే కేర్ సెంటర్లు (పసిపిల్లల పగటిపూట సంరక్షణ కేంద్రాలు), నర్సరీ మొదలుకొని 9 సంవత్సరాల పాటు విద్యార్థులకు పూర్తి సబ్సిడీ భోజనంతో పాటు చదువును కూడా ప్రభుత్వమే అంది స్తోంది. చదువంటే ఉల్లాసమైన ప్రక్రియగా పిల్లలు భావించే విధంగా క్లాస్ టీచింగ్‌ను వినూత్నంగా రూపొందించుకున్నారు. టీచర్లకు అత్యధిక గౌరవం, జీతభత్యాలు ఇచ్చే దేశాల్లో సింగపూర్, ఫిన్‌లాండ్ ముందు వరుసలో ఉన్నాయి. భావిపౌరులను తీర్చిదిద్దుతున్నామన్న స్పృహ, చిత్తశుద్ధి అక్కడి టీచర్లలో కనపడుతుంది. ఫలితంగానే విద్యా సూచికల్లో (ఎడ్యుకేషన్ ఇండెక్స్), యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ ఇండెక్స్‌లలో సింగపూర్, ఫిన్‌లాండ్, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, హాంకాంగ్‌లు ముందు వరసల్లో నిలుస్తున్నాయి.
విద్యను ప్రోత్సహించే తీరిదేనా?
సమూల మార్పులు చేపట్టాలంటే విద్యా సంస్థలకు తగినన్ని ‘నిధులు’ కావాలి. కేంద్ర, రాష్ట్రాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లలో ఏటా 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించినట్లయితే ఆశిస్తున్న మార్పులూ, ఫలితాలూ క్రమేపీ సాధించడానికి వెసులుబాటు కలుగుతుంది. కానీ, ఏటేటా బడ్జెట్ పరిమాణం పెరుగుతున్నట్లు కనిపించినప్పటికీ వార్షిక బడ్జెట్లలో కేటాయింపులు 14% మించడంలేదు. మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బల్లలు, భవన సముదాయాలు, ఆటస్థలాలు వంటివి లేని పాఠశాలలే ఇక్కడ అత్యధికం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేని కారణంగానే ఆర్థికంగా భారమే అయినా, తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో 29 జారీ చేసి 5,000 పాఠశాలలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇదే నిర్లక్ష్య విధానం ప్రభుత్వ స్కూళ్ల పట్ల మరి కొంతకాలం కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవడానికి మరెంతో కాలం పట్టదు. ఆ పరిస్థితి దాపురిస్తే పేదవారి విద్యావకాశాలు గగనకుసుమాలే!
పదవ తరగతి వరకు కింద పడుతూ మీద పడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలన్న ఆశతో కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పాఠాలు నూరిపోస్తున్నారు. కేవలం విద్యా సంస్థల మధ్య నెలకొన్న స్వార్ధపూరిత ఆధిపత్య పోటీ కారణంగా, విద్యార్థులను సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప పిల్లల బాగోగుల కోసం కాదనేది నగ్నసత్యం. పిల్లల ఉన్నత ర్యాంకులే అందరి లక్ష్యం. ఈ క్రమంలో పాఠాలు బట్టీ వేయించడమే పరమార్థంగా ఎంచుకున్నారు. విద్యార్థికి పాఠం అర్థ మైందా, లేదా అన్నది కాదు. వివిధ నేప«థ్యాల నుంచి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో పదవ తరగతి వరకు చదువుకొని ఇంటర్‌లో ఇంగ్లిష్ మాధ్యమంలోకి వచ్చే సరికి గందరగోళానికి గురవుతున్నారు. వారి సమస్యను పరిష్కరించేవారు, సబ్జెక్టును అర్థమయ్యేలా బోధించేవారు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి రోజూ నిర్వహిస్తున్న పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకొనే విద్యార్థులందరినీ వేరే ప్రత్యేక సెక్షన్లకు మార్చే పద్ధతి కొందరు విద్యార్థులను ఆత్మన్యూనతా భావానికి గురిచేసి, ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఫలితంగానే మరణమే శరణ్యమనే స్ధితికి దిగజారుతున్నారు.
ఈ సంస్కృతి మారాలి
విద్యార్థులు రాణించాలంటే, సృజన పెంపొందాలంటే వారికి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించగలిగే వాతావరణం పాఠశాలల్లో రావాలి. సందేహాలను ధైర్యంగా చెప్పి నివృత్తి చేసుకోగల చొరవను విద్యార్థులలో కల్పించే బాధ్యత టీచర్లదే! కానీ కార్పొరేట్ విద్యావిధానంలో టీచర్లు మరబొమ్మల్లా, రోబోలుగా మారిపోయారు. ఎక్కువ మార్కులు సాధించగలిగేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నారు. అది వారి తప్పు కూడా కాదు. మన విద్యావిధానంలోని లోపంతో టీచర్లపై పనిభారం, ఒత్తిడి పెరిగాయి. దానినే విద్యార్థుల మీదకు బదలాయిస్తున్నారు. పిల్లలతో ఇష్టం లేని కోర్సులను చేయించడం తల్లిదండ్రుల తప్పు. తమ ఇష్టాలను పిల్లలపై రుద్దే తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు రావాలి. హైదరాబాద్ బండ్లగూడ లోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఓ తండ్రి తన కూతుర్ని హాస్టల్ రూమ్‌లో దింపి, ఫీజు కడుతున్న సమయంలోనే హాస్టల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థుల ఆత్మహత్యలకు వేర్వేరు కారణాలు, పేర్లు ఉండవచ్చు. కానీ, అవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు, తల్లిదండ్రుల అవగాహనా లోపం వల్లనే. విద్యావ్యవస్థలు సమూల మార్పుల్ని ప్రాథమిక స్థాయి నుంచి చేపట్టకుండా అసలు రుగ్మత ఎక్కడుందో గ్రహించకుండా, గ్రహించినట్లు నటించినా సమస్య పరి ష్కారం కాదు. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత, సాంకేతిక విద్యావ్యవస్థల వరకు ప్రక్షాళన జరగాలి. అభివృద్ధి చెందిన దేశాలలోని ఆకాశహర్మ్యాలను చూసొచ్చి, వాటిని ఇక్కడ కూడా నిర్మించి ప్రపంచస్థాయి రాజధానులను మరిపించాలని తహతహలాడటంతోనే సమాజం ముందుకు సాగిపోదు. విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి దేశాలలో అమలు జరుగుతున్న మంచి విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయగలిగితేనే, విద్యలో సమానత్వం సాధించగలిగితేనే విద్యార్థులలోని న్యూనతా భావాలను అరికట్టగలం, అవాంఛనీయ సంఘటనలకు పరిష్కారం చూపగలం.
- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్ : 99890 24579